తంత్ర విద్యల వల్ల నిజంగా ఉపయోగం ఉందా??

 

తంత్ర విద్యలు అనగానే ఎక్కువ మంది ప్రతికూలమైనదిగా చూడడం మనం చూస్తూ ఉంటాము. కాని ఈ తంత్ర విద్యల వల్ల మచి కూడా చేయవచ్చునని, ఇది మరో రకమైన శాస్త్రమని సద్గురు చెబుతున్నారు.

భారతదేశంలో ఆధునాతనమైన అనేక తంత్ర విద్యలున్నాయి. ఒక వ్యక్తి ఫోటో చూసి వాళ్ళ జీవితాలని బాగుచేసే వాళ్ళూ, నాశనం చేసే వాళ్ళూ ఉన్నారు. ఆ వ్యక్తికి అతి తక్కువ సమయంలో వ్యాధిని సంక్రమింపజేస్తారు. ఈ విద్యలు అభ్యసించేవాళ్ళు ఆరోగ్యాన్ని కూడా కుదుటపరచగలరు గాని, దురదృష్టవశాత్తూ, ఎక్కువ మంది దానిని భిన్నంగా వాడడానికే వినియోగిస్తారు. ప్రతికూల కార్యక్రమాలకి ఈ విద్యను వినియోగించడంలోనే మంచి గిరాకీ ఉండడం ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా, అది ఆరోగ్యానికి వినియోగిస్తున్నారా, అనారోగ్యాన్ని కలిగించడానికి వినియోగిస్తున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. తన స్వంత లాభం కోసం ఈ పరిజ్ఞానాన్ని వినియోగించడం ఉచితమైనది కాదు.

మత్స్యేంద్ర నాథ్ శిష్యుడు గోరఖ్ నాథ్

యోగా సంప్రదాయంలో గోరఖ్ నాథ్ యోగి గురించి చెప్పుకునే కథలతో నిండి ఉంది. కొందరు అతను 11వ శతాబ్దం వాడని అంటారు గాని చాలా కథలు అతను అంతకు ముందు వాడని సూచిస్తుంటాయి. అతను మత్స్యేంద్ర నాథ్ శిష్యుడు. ఆయన కూడా పేరుపొందిన గొప్ప యోగి. మత్స్యేంద్ర నాథ్  యోగి ఎంతగా గౌరవింపబడేవారంటే, ఆయన్ని సాక్షాత్తూ ఆదియోగి శివుడి  అపర అవతారంగా కీర్తిస్తారు. ప్రచారంలో ఉన్న కథలు ఆయన 600 సంవత్సరాలు జీవించినట్టుగా చెబుతాయి. వాటిని విన్నది విన్నట్టుగా స్వీకరించే అవసరం లేదు, అలా అని కట్టు కథలని కొట్టిపారెయవలసిన పని కూడా లేదు. అప్పటి జీవన ప్రమాణాలతో పోల్చినపుడు ఆయన ఎక్కువ కాలం జీవించాడని, ఆయన్ని అమితమైన గౌరవంతో చూసేవారని మనం గ్రహించగలగాలి.

అతనిలోని జ్వాల అజ్ఞాన పొరలను దహించడం వల్ల గోరఖ్ నాథ్ కి అకస్మాత్తుగా చెప్పలేనంత శక్తి వచ్చింది.

గోరఖ్ నాథ్ అతని శిష్యుడిగా చేరి గురువు గారిని భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. గోరఖ్ నాథ్ అంతా శక్తిమయమై ప్రజ్వరిల్లుతూ ఉండేవాడు. మత్స్యేంద్రనాథ్ అతనిలో చాలా అగ్ని తేజస్సు ఉంది గాని కావలసిన నియంత్రణ లేదని గ్రహించాడు. నిప్పు ఎప్పుడూ దొరికినవాటిని తనలో ఇముడ్చుకుంటూ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అతనిలోని జ్వాల అజ్ఞాన పొరలను దహించడం వల్ల గోరఖ్ నాథ్ కి అకస్మాత్తుగా చెప్పలేనంత శక్తి వచ్చింది. మత్స్యేంద్ర నాథ్ ఇది గ్రహించి, అతను తనకంటే చాలా ముందు ఉన్నాడని అర్థం చేసుకుని, అతనితో, "నువ్వు 14 సంవత్సరాల పాటు నాకు దూరంగా ఉండు. నా దరిదాపుల్లో ఉండవద్దు. నానుండి చాలా శక్తిని గ్రహిస్తున్నావు," అన్నాడు.

పాపం గోరఖ్ నాథ్ కి ఇది చాలా కష్టమైన పని. మత్స్యేంద్ర నాథ్ "నువ్వు ప్రాణ త్యాగం చెయ్యి" అని ఆదేశిస్తే చేసి ఉండేవాడేమో. "వెళ్ళిపో" అన్న మాట అతను భరించలేకపోయాడు. కానీ, అది తన ప్రాణ ప్రదమైన గురువు ఆజ్ఞ కనుక ధిక్కరించలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాల పాటు రోజులూ గంటలూ లెక్కపెట్టుకుంటూ తను వెనుతిరిగి వెళ్ళే రోజుకోసం ఎదురుచూస్తూ గడిపాడు. సమయం రాగానే పరిగెత్తుకుంటూ గురువు దగ్గరికి వచ్చాడు. అతను వచ్చేసరికి మత్స్యేంద్ర నాథ్ ఉన్న గుహని ఒక శిష్యుడు కాపలా కాస్తూ కనిపించేడు. గోరఖ్ నాథ్  "నేను నా గురువు గారిని చూడాలి," అన్నాడు. గుహకి కాపలాగా ఉన్న యోగి, "నాకు అటువంటి ఆదేశాలు లేవు. కనుక నువ్వు నిరీక్షించాలి," అన్నాడు.

గోరఖ్ నాథ్ కి కోపంవచ్చింది. "మూర్ఖుడా! నేను 14 సంవత్సరాల పాటు నిరీక్షించాను. నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చేవో నాకు తెలియదు. నిన్న కాక మొన్నవచ్చి ఉంటావేమో. నన్ను నిలువరించడానికి నీకెంత ధైర్యం?" అన్నాడు. అతన్ని పక్కకి త్రోసి లోపలికి వెళ్ళాడు. లోపల మత్స్యేంద్ర నాథ్ లేడు. గోరక్ నాథ్ బయటకి వచ్చి అక్కడ పడున్న శిషుణ్ణి కుదిపి," గురువుగారెక్కడ ఉన్నారు? నేను ఆయన్ని చూడాలి." అన్నాడు. "ఆయన ఎక్కడున్నారో చెప్పడానికి నాకు ఆదేశం లేదు,"అని శిష్యుడన్నాడు.

దాన్ని దురుపయోగం చెయ్యడం వల్ల దానికి ఆ అపఖ్యాతి వచ్చింది.

గోరఖ్ నాథ్ నిలవలేకపోయాడు. అతని నిగూఢశక్తిని ఉపయోగించి శిష్యుడి మనసులో వెతికి, మత్స్యేంద్ర నాథ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు.  అతను ఆ దిక్కులో ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు. అతని కోసం సగం దూరంలో గురువు నిరీక్షిస్తున్నాడు. మత్స్యేంద్ర నాథ్ ఇలా అన్నాడు, "నిన్ను 14 సంవత్సరాల పాటు  బహిష్కరించడానికి కారణం నువ్వు తంత్ర విద్యలు ఉపయోగించడం పై మక్కువ చూపించడం.  నువ్వు ఆధ్యాత్మిక ప్రక్రియ మీద దృష్టి పెట్టడం మాని, ఈ తంత్ర విద్య ఇచ్చే  శక్తికి మురిసిపోవడం ప్రారంభించావు.  నువ్వు తిరిగి వచ్చిన తర్వాత, మొట్టమొదటిగా చేసిన పని మరొక శిష్యుడి మనసులోకి జొరబడడానికి ఆ విద్యని ఉపయోగించడం. కనుక నీకు మరో 14 ఏళ్ళు బహిష్కరణ విధిస్తున్నాను. పో!" అని అతన్ని మరో 14 ఏళ్ళు పంపించేశాడు.

గోరఖ్ నాథ్ ఈ నిషేధింపబడినటువంటి (మరొకరి మనసులో) పరిధుల్లో ప్రవేశించడం, మత్స్యేంద్ర నాథ్ ఆగ్రహించి పంపించడం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అదే సమయంలో గోరఖ్ నాథ్ మత్స్యేంద్ర నాథ్ గొప్ప శిష్యుల్లో ఒకడిగా పరివర్తన చెందడం జరిగింది. యోగ సంప్రదాయంలో ఈ తంత్ర విద్యలను ప్రయోగించడాన్ని ఎప్పుడూ సమర్ధించరు. వాటినెప్పుడూ గౌరవంతో చూసేవారు కాదు. అది జీవితాన్ని తప్పుగా ఉపయోగించుకోవడం క్రిందా, నిషిద్ధ ప్రదేశాల్లోకి వెళ్ళినట్టుగా జమకట్టేవారు. డబ్బు మీద, అధికారం మీద వ్యామోహం వదులుకోలేని వారే వాటిని సాధన చేస్తూ ఉండేవారు.

అదే సమయంలో, తంత్ర  విద్య ఎన్నడూ ప్రతికూలమైనది కాదు. దాన్ని దురుపయోగం చెయ్యడం వల్ల దానికి ఆ అపఖ్యాతి వచ్చింది. తంత్ర  విద్య ముఖ్యంగా ఒక సాంకేతికత. ఏ శాస్త్రం గాని, సాంకేతిక నైపుణ్యం గాని దానంతట అది చెడ్డది కాదు. మనం ఒక సాంకేతికతని ప్రజల్ని చంపడానికో, హింసించడానికో వాడితే, కొంత కాలం గడిచిన తర్వాత, "ఇక చాలు. ఈ పనికిమాలిన సాంకేతికత" అని దాన్ని అందరూ దూషిస్తారు. సరిగ్గా తంత్ర విద్యలో జరిగింది అదే. తమ స్వంత లాభానికి చాలా మంది ఈ విద్యల్ని దురుపయోగం చేశారు. అందుకని, ఆధ్యాత్మిక మార్గంలో, తంత్ర విద్యలు నిషేధించబడ్డాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు