సంపాదనకే జీవితాన్ని బలి చేయాలా ?

 

సద్గురు తన చిన్నతనంలోని విశేషాలు మనతో పంచుకుంటున్నారు. సంపాదించడం, బ్రతుకుతెరువు కోసం మన జీవితాన్నే బలిచేసుకోవాల్సిన పని లేదనీ, అది మన జీవితంలో ఓ చిన్న భాగం మాత్రమేనని మనకు వివరిస్తున్నారు.

నా జీవితకాలంలో  బ్రతుకుతెరువు గురించి ఎన్నడూ ఆలోచించలేదు.  మా నాన్నగారు, "ఈ కుర్రాడికి బొత్తిగా భయం లేదు. వీడు ఎలా బ్రతుకుతాడో?" అని బుర్ర బద్దలు కొట్టుకునే వారు. నాకు ఆశ్చర్యం వేస్తుండేది. "భయం ఎవ్వరికైనా సమస్య. కానీ, భయం లేకపోవడం ఇప్పుడు సమస్య" అని. ఆ రోజుల్లో ఉండే సంప్రదాయాన్ని బట్టి మా నాన్నగారు వైద్యుడు కాబట్టి నేను కూడా వైద్యుడు కావాలని కోరుకునేవారు. నా పదో ఏట ఆయనకి స్పష్టంగా చెప్పాను, "నేను ఏదైనా అవుతాను గాని, డాక్టర్ని మాత్రం అవదలుచుకోలేదు. నా జీవితంలో ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యను. అంతవరకు వస్తే, అడవిలోకి పోయి తినడానికి ఏ కందమూలమో తవ్వుకునైనా తిని బ్రతుకుతాను గాని, ఉద్యోగప్రయత్నం చెయ్యను," అని.  ఆయన , "ఏం? ఉద్యోగంతో నీకు వచ్చిన సమస్య ఏమిటి?" అని నన్ను అడిగారు. "నేను మేజాబల్ల వెనక కూచుని బ్రతుకుతెరువుకోసం జీవించలేను. అవసరమైతే అడవిలోకి పోయి బ్రతుకుతాను. నాకు అడవిలో ఎలా బ్రతకాలో తెలుసు," అన్నాను. నేను అప్పటికే అడవిలో జీవించడం అలవాటు చేసుకున్నాను.  నేను తేనె త్రాగాను, చెదపురుగులు తిన్నాను. ఇదీ అదీ అనకుండా తిని కాలక్షేపం చేసాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను జీవించడానికి సరిపడినంత వెతుక్కోడానికి అడవి ఇంకా మిగులుందన్న విశ్వాసం ఉంది. కారణం తెలీదుగాని, ఎక్కడో పనిచెయ్యడానికి నా మనసు సుతరామూ అంగీకరించేదికాదు.

దురదృష్టవశాత్తూ మానవాళి అంతా  తన తెలివితేటలనీ, శక్తియుక్తుల్నీ కేవలం జీవించడానికి, సంపాదించడం కోసం వెచ్చిస్తోంది. మానవ మేధస్సు అంతా నిర్వీర్యం అయేలా చెయ్యబడుతోంది.

మన మెదడు పరిమాణంతో పోల్చినపుడు మిలియనులో ఒక వంతు ఉన్న చీమ, దాని ఆహారాన్ని అది సంపాదించుకోగలుగుతోంది. అలాంటప్పుడు అంత పెద్ద మెదడున్న మనిషికి ఏమిటి సమస్య? బ్రతుకడానికి ఏదో ఒకటి సంపాదించుకోవడం మనిషి చైతన్యంలో అతి స్వల్ప విషయం. దురదృష్టవశాత్తూ, మానవాళి అంతా తన తెలివితేటలనీ, శక్తియుక్తుల్నీ కేవలం జీవించడానికి, సంపాదించడం కోసం వెచ్చిస్తోంది. మానవ మేధస్సు అంతా నిర్వీర్యం అయ్యేలా చెయ్యబడుతోంది. దానికి ఒకే ఒక్క కారణం,"బ్రతుకుతెరువు సంపాదించుకోవడం ఎలా?" అన్న ఒక్క ఆలోచనే.

అలాగని, మీరు బ్రతుకు తెరువుకి ప్రయత్నించవద్దనడం లేదు. అదే పూర్తిగా మన చైతన్యాన్నంతటినీ ఆక్రమించుకోనక్కరలేదని నా ఉద్దేశ్యం. మీరు కేవలం సంపాదించి..సంపాదించి..సంపాదించి, సంపాదించడానికే జీవిస్తే, మీకు చివరకి మిగిలేది అస్థికలశమే. కాకపోతే బాగా ఖరీదైనది దొరకొచ్చు.

మీరు మీ శరీరాన్నీ, మనసునీ, మీ శక్తినీ సరిగ్గా నిర్వహించగలిగితే, రోజుకి 4 గంటలు పనిచేస్తూ, మర్యాదగా జీవించడానికి సరిపడినంత సంపాదించుకోగలరు.

మీరు మీ శరీరాన్నీ, మనసునీ, మీ శక్తినీ సరిగ్గా నిర్వహించగలిగితే, రోజుకి 4 గంటలు పనిచేస్తూ, మర్యాదగా జీవించడానికి సరిపడినంత సంపాదించుకోగలరు.  మీరు ఎప్పుడూ మీ జీవితంలో సాధించగలిగిన గొప్పది ఏది అని ఆలోచిస్తూ ఉండాలి. మా నాన్నగారు నేను బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నానని అనుకునే వారు. కానీ, నేను బాధ్యతారహితంగా లేను. నేను జీవితాన్ని శోధిస్తున్నాను. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవలనుకున్నాను ఇంకా నాకిష్టమైన పనులు చేసుకుంటూ పోతున్నాను. నేను ఎక్కడ కూర్చున్నా, అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండేది. దాన్ని కేవలం కాలక్షేపంకోసం కాకుండా, సమయం అంతా వెచ్చించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండేవాడిని.

ప్రేమాశీస్సులతో,
సద్గురు