సద్గురు: ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం, 8,00,000 మంది ఆత్మహత్యకు చేసుకుంటున్నారు. ఇది హత్యలు, యుద్ధ మరణాల మొత్తం కంటే ఎక్కువ. అంటే, ప్రతీ నలభై సెకన్లకు ఒకరు తమ ప్రాణాన్ని తామే తీసుకుంటున్నారు. మీకు తెలిసిన వారు ఇలా చనిపోయినప్పుడు లేదా మన సంఘంలో ప్రముఖులైన వారెవరైనా చనిపోయినప్పుడు మాత్రమే అందరూ దీన్ని పట్టించుకుంటారు.

ఆత్మహత్య తలంపు కలగడానికి కారణాలేంటి?

ఒక మనిషి ఎందుకు తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు? కొందరు వారి జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. కానీ చాలామంది వారి మానసిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.

మన భౌతిక, మానసిక పరిస్థితులను ఎలా నిర్వహించుకోవాలో తెలియజేసే విధంగా ఏఒక్క అంశాన్నీ మన విద్యావ్యవస్థలో పొందుపరచలేదు. ఎక్కువ మందికి, తమ మేధస్సుని ఎలా నిర్వహించుకోవాలో తెలియదు. మీకు ప్రస్తుతం ఉన్న మెదడులో సగం మెదడు మాత్రమే ఉండివుంటే, మీకు మానసిక సమస్యలు ఉండేవికావు. ఇప్పుడు మీకు ఒక స్థాయి మేధస్సు ఉంది కానీ, మీ శ్రేయస్సుకోసం, మీ మేధస్సును ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షణ పొందడం గానీ, మీ తెలివితేటలను మీ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకోవాలో నేర్పే సామాజిక పరిస్థితులలో మీరు జీవించడంగానీ జరుగలేదు. అందుకే, మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. దీని నుండి బయటపడే మార్గమే లేదు అన్నంతగా పరిస్థితి నిస్సహాయంగా కనబడుతోంది. ఇది ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి తీస్తుంది.

స్వాభావికంగానే ఆనందంగా ఉండేట్లుగా, అందరికీ చిన్నప్పటినుంచీ నేర్పే సరైన విధానం ఏమైనా ఉన్నట్లయితే, ఈ ఆత్మహత్యలను సులువుగా అరికట్టగలం. స్వాభావికంగానే ఆనందంగా ఉన్నట్లయితే ఎవరైనా తమ జీవితాన్ని తామే ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా నిరాశ నిస్పృహలతో ఎందుకు ఉంటారు?

నిరాశనిస్పృహల నుండి బయటపడడం

‘నిరాశనిస్పృహలు’ అనే పదం కేవలం వైద్యసంబంధమైనది మాత్రమే కాదు. ఈ రోజు మీ జీవితంలో ఏవైనా రెండు సంఘటనలు మీరనుకున్నట్టు జరగకపోయినా, మీరు కొంత నిరాశనిస్పృహలకు లోనవుతారు. జనాభాలో అధికశాతం మంది, తమ జీవితంలో నెలకొన్న పరిస్థితు వల్ల ఏదో ఒక సందర్భంలో నిరాశనిస్పృహలకు గురిఅవుతారు అనుకుంటాను. కానీ, వారికి వారు సర్దిచెప్పుకుని, కొద్ది గంటల వ్యవధిలోనే వారు అందులో నుండి తేరుకుంటారు. ఏదైనా స్ఫూర్తిని ద్వారానో, దేశం పట్ల గానీ, ఎవరి పట్లైనా ఉన్న ప్రేమవల్ల గానీ, లేదా వాళ్ళు విలువైనదిగా భావించే మరొకదాని వల్ల గానీ, వాళ్ళు తమంత తాముగా అందులోనుండి బయటపడతారు. మీకు మీరుగా సర్దిచెప్పుకుని గానీ, లేదా మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చెప్పడం వల్ల, దీనినుండి బయటపడేట్లుగా వారు మీతో మాట్లాడడం గానీ జరుగుతుంది; ఇలా ఏదీ కాకపోతే మీరు నిపుణుల సహాయం తీసుకుంటారు.

నిరాశనిస్పృహల నుండి బయటపడే మార్గం లేకపోతే, ఒక సైకాలజిస్టు మీ ఎదురుగా కూర్చుని మీతో గంటలు గంటలు ఎందుకు మాట్లాడతారు? అందులో నుండి మిమ్మల్ని బయటపడేయగలమని వాళ్ళకి బాగా తెలుసు. అలాకాకపోతే, రసాయనిక పరమైన చికిత్స అందుబాటులోనే ఉంది. రసాయనికత విషయాన్ని ప్రస్తావనకు తెచ్చినప్పుడు, ఈ మానవ శరీర వ్యవస్థ భూమిపై ఉన్న అతి సంక్లిష్ట మైన రసాయన కర్మాగారం. ఈ రసాయన కర్మాగారాన్ని మీరు గొప్పగా నిర్వహిస్తున్నారా లేక ఘోరంగా నిర్వహిస్తున్నారా అనేదే ప్రశ్న. యోగా అంటే, మీ సొంత రసాయన కర్మాగారాన్ని మీరు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించుకోగలరని అర్థం.

యోగా ద్వారా ఆత్మహత్యలను అరికట్టడం

లక్షలాది మంది యోగా వల్ల ప్రయోజనం పొందారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అది పనిచేస్తోంది అని తెలియడానికి సరిపడా అనుభవపూర్వక సమాచారం మా వద్ద ఉంది. కానీ, ప్రస్తుతం రక్త నమూనాలు కూడా అధ్యయనం చేయబడుతున్నాయి. ఇంకా యోగ సాధనల ద్వారా జన్యు సంబంధమైన మార్పులు కూడా వస్తున్నట్లు మాకు స్పష్టంగా తెలుస్తోంది.

సరైన సాధనలను చేయడం ద్వారా మానసిక రుగ్మతలను నివారించడమే కాకుండా, సరైన విధానంలో చేయడం ద్వారా మీరు అందులోనుండి పూర్తిగా బయటపడగలరని ఇది స్పష్టం చేస్తోంది. ఉన్న సమస్యల్లా, ఎవరైనా మానసికంగా నిరాశనిస్పృహలకు గురైనప్పుడు, వాళ్ళచే సాధన చేయించడం ఒక పెద్ద సవాలు. ప్రతిరోజూ వాళ్ళు సాధన చేసేలా వాళ్లకు తగిన మద్దతునిస్తూ, అంకితభావంతో పనిచేసే వాళ్ళు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ సాధనల ద్వారా మానసిక సమస్యలనుండి బయటపడిన వేలాదిమందిని నేను మీకు చూపించగలను. ఎందుకంటే మేము సరైన వాతావరణం కల్పిస్తాము. ప్రతి ఇంట్లో ఇది జరిగేలా చేయడం సాధ్యపడకపోవచ్చు. ఉన్న సవాలేమంటే, దీన్ని ఆచరణలో పెట్టడం. ఎంతలేదన్నా కొన్ని తీవ్రమైన మానసిక సమస్యలు ఉండే కేసులు ఉంటాయి. మేము అటువంటి కేసులను కూడా చూశాము. ఇంకా వారికి సూచించిన ఔషద మోతాదును చాలావరకు తగ్గించగలిగాము.

ప్రేమాశీస్సులతో,

సద్గురు