మా అమ్మగారు మాతో ఎప్పుడూ "మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అనో, ఇలాంటి అర్ధం వచ్చే మాటలో ఎప్పుడూ చెప్పలేదు. తను ఉన్నది మాకోసమే అని మేము ఎప్పుడూ అనుకునేవాళ్ళం. మేము ఆవిడకు అన్నిటికన్నా ముఖ్యమైన వాళ్ళం అన్న విషయం చాలా ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉండేది. ఇవిడ మమ్మల్ని ప్రేమిస్తోంది, మమ్మల్ని చూసుకుంటూ ఉంది, ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఆమె జీవితమంతా మేమే, ఆవిడ జీవితంలో విలువైనదంతా మేమే. మాకు ఆ విధమైన రక్షణ కవచం ఇచ్చారు. మా జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది, ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పినట్టు ఇంట్లో ఆవిడ ప్రతిదీ స్వయంగా తన చేతితో చేసేది. అది వంట కావచ్చు, కుట్లు అల్లికలు, ఏవైనా సరే ఆవిడ పనితనం ఇల్లంతా ఉండేది. ఏమీ మాట్లాడకుండానే ఆవిడ స్పర్శ మాకు అన్నిట్లో తెలిసేది.

మేము ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు, ప్రతీ దిండు గలీబు మీద ఎదో ఒక ఎంబ్రాయిడరీ చేసేవారు. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాము అనుకోండి, అక్కడ తెల్లటి గలీబు ఉందనుకోండి, "అయ్యో ఇలాంటి దిండు మీద పిల్లలు ఎలా పడుకుంటారు" అని ఐదు నిముషాల్లోపు ఎదో ఒక చిలుకనో లేక మరేదైనా కుట్టేసేవారు. నాకు ఆ చిలుకలు ఎంత గుర్తో, ఎందుకంటే నేను ఆ పచ్చటి చిలుకల్ని చూస్తూ అలా నిద్రపోయేవాడిని. ఒక్కోసారి ఆవిడ ఐదు రెక్కలు ఉన్న పూలను కుట్టేవారు, అప్పుడు ఆంకర్ కంపనీ వారి దారాలు అనేవారు, అవి దొరికేవి . అవి ఎలా వస్తాయంటే, ఒక పక్క గులాబీ రంగు వచ్చిందనుకోండి, ఇంకో పక్క కొద్దిగా ఎరుపు రంగుగా వస్తుందనమాట. ఇప్పుడు కూడా అలాంటివి దొరుకుతూనే ఉండవచ్చు, కాకపోతే నేను చూసి చాలా రోజులైంది. అలాంటివాటితో ఆవిడ పూలు కుట్టేవారు. ఆ పూలని అలా చూస్తూ నిద్ర పోయేవాడిని. అప్పుడు నాకు నాలుగు ఐదు ఏళ్ల వయస్సు ఉండి ఉండవచు.

నా లోని వేరే అంశం అనేది వేరే విషయం, కాని వ్యక్తిగా నేనెవరు అన్నదాని మీద ఆవిడ ప్రభావం ఎంతో ఉంది.

సాధారణంగా అవి గులాబి లేక ఎరుపు రంగుతో ఉండేవి. ఒక మూడు రెక్కలు గులాబీ రంగుతో, ఇంకో రెండు ఎరుపు రంగుతో ఉండేవి. నేను "ఇవెందుకిలా ఉన్నాయి, ఈ రెండు ఎర్రగా, ఈ మూడు గులాబీతో ఎలా వచ్చాయి" అని ఆలోచిస్తూ అలా పడుకునేవాడిని. ఈ చిన్ని చిన్ని విషయాలు ఎంతో విలువనిస్తాయి. ఆవిడ వంట మమ్మల్ని అం దరినీ దాసులని  చేసేసింది. మమ్మల్ని ఎక్కడైనా పెళ్ళికో, పార్టి కో తీసుకెళ్ళినాసరే, అక్కడ తిన్నట్టుగా నటించి, ఇంటికొచ్చి హాయిగా కడుపునిండా తినేవాళ్ళం. ఎందుకంటే, మా అమ్మ వంటకి సాటిలేదు. అంత బాగా వంట చేసేవారు. ఇదేదో ప్రేమగా ఉన్న సంబంధం అని చెప్పలేం, ఇది ఎలాంటి సంబంధమంటే, ఆవిడ లేకుండా మేము మా జీవితాన్ని ఉహించలేము, అంతే. ఆవిడ ఎప్పుడూ మాకు అందుబాటులో ఉండేవారు, మా కోసం ఆవిడ అందుబాటులో లేకపోవడం అన్నది ఎప్పుడూ లేదు. ఈ రోజుల్లో ఆర్ధిక కారణాల వల్ల కొంతమంది స్త్రీలు కూడా బయటికి వెళ్లి ఉద్యోగం చేయవలసి వస్తుంది. వాటి గురించి నేను ఎంచడం లేదు.

కాని ఒక పిల్లవాడు ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరూ లేకుండా తనంతట తాను తాళం తీసుకొని, అక్కడ చల్లారిపోయిన ఆహరం తినడం, ఇది పాశ్చాత్య దేశాలలో చాలా చోట్ల ఇలానే జరుగుతుంది. ఇప్పుడు భారత దేశంలో కూడా నగరాల్లో ఇలానే జరుగుతోంది. మీరు అలా పిల్లవాడు ఇంటికి రాగానే ఆ బ్యాగ్ అందుకొని, ఎం జరిగింది అని కనుక్కొని, లోపలికి షూస్ తో పరిగెత్తబోతూ ఉంటే, పట్టుకొని ఆపి, ఆ షూస్ తీసేయడం. ఇలాంటివి చిన్న విషయాలు కాదు. ఇవి మీ జీవితాన్ని పరిణమింప చేసేటువంటి  విషయాలు. నా లోని వేరే అంశం అనేది వేరే విషయం, కాని వ్యక్తిగా నేనెవరు అన్నదానిమీద ఆవిడ ప్రభావం ఎంతో ఉంది. ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగానే నా మీద ఎంతో ప్రభావం చూపించింది. మా నాన్నగారు ఎప్పుడూ ఎన్నో విషయాలు చెప్తూ, ఇలా ఇలా ఉండాలి, అలా ఉండాలి లేకపోతే అలా అయిపోతావ్ అంటూ ఏవేవో చెప్పేవారు. కాని ఇవేవి నా మనసుకు హత్తుకోలేదు, కాని మా అమ్మ ఇలాంటివేవి మాట్లాడకుండానే నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించింది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు