సద్గురు: మనిషికి తనలో ఉన్న ఒకరకమైన అసంపూర్ణతా భావనల వల్ల అంతర్గత అవసరాలు కూడా బాగా పెరిగాయి. తమలో పరిపూర్ణత్వపు అనుభవం కోసం మనుషులు బాంధవ్యాలు ఏర్పరుచుకొంటున్నారు. మీకు ప్రియమైన వారితో మంచి బంధం ఉంటే, మీరు సంపూర్ణత భావనను అనుభవిస్తారు. అది లేనట్లయితే మీరు అసంపూర్ణత భావనను అనుభవిస్తారు. ఎందుకిలా ఉంటుంది?? ఎందుకంటే, ఈ జీవం, జీవంలోని ఈ భాగం(మనం) స్వతహాగానే పరిపూర్ణ అస్తిత్వం కలది. ఎందుకు ఇది అపరిపూర్ణతను అనుభవిస్తోంది? ఎందుకు మరొక ప్రాణితో భాగస్వామ్యం చేసుకొని తను తృప్తి చెందడానికి ప్రయత్నిస్తోంది ?.

దీనికి ప్రాధమికమైన కారణమేమంటే, మనం ఈ జీవం లోతును, దాని పార్శ్వాలనూ పూర్తిగా అన్వేషించలేదు. భాంధవ్యాల క్లిష్ట ప్రక్రియ పాత్ర కూడా ఈ మూల కారణానికి తోడయింది. ఆశించడం, ఆశించడం, ఆశించడం ఇంకా ఇంకా ఆశించడం .. చాలమంది సృష్టించుకున్న ఈ ఆశలు ఎటువంటివంటే, ప్రపంచంలో వీటిని తీర్చగల వ్యక్తే ఉండడు.

సంబంధాలు నిలపెట్టుకొనే ప్రక్రియలో మొట్టమొదట ఆశించింది నెరవేర్చడం సర్వ సాధారణం. కానీ మనం జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ, ఈ కోరికలు పలు రకాలుగా మారవచ్చు. మనుషుల్లో ఈ ఆశలనేవి మారుతుండడం వల్ల, అవి స్థిరంగా ఉండవు, ఉండలేవు. ఒక వ్యక్తి తన జీవితమంతా ఒకే విధమైన కోరికలతో నిలకడగా ఉండవచ్చు; మరొక వ్యక్తి ఆశించేవి తన దృష్టి, అనుభవాల మార్పుల వలన మారుతూ ఉండవచ్చు. ఇప్పుడు బాంధవ్యాలు ఒక పెద్ద సంఘర్షణగా మారాయి. ప్రపంచం అంతటిలో కన్నా ఇంటి నాలుగు గోడల మధ్యే ఎక్కువ సంఘర్షణలు జరుగుతున్నాయి. విషయమేమంటే బాంబులు పేలడం లేదు కాబట్టి మీరు వినలేరు. వాళ్ళు ఒకరితో ఒకరు మౌనంగా దెబ్బలాడుకోవడం చేస్తున్నారేమో. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనుషులు ఆశించేవి మారుతున్నాయి కానీ, వారు అదే వేగంతో మారడం లేదు.

ప్రాధమికంగా, మనం సంబంధాలు ఎందుకు కోరుకుంటున్నాము ? ఎందుకంటే, మీకు జీవితంలో ఏ విధమైన సంబంధాలు లేకపోతే మీరు కుంగిపోతారు. కాబట్టి, ముఖ్యంగా మీరు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి సంబంధాలను కోరుకుంటున్నారన్నమాట. లేదా వేరే మాటలో చెప్పాలంటే మీరు మీ సంతోషానికి మూలంగా ఇంకొకరిని వాడుతున్నారన్నమాట.

మీరు, మీ సహజ స్వభావంతోనే ఆనందంగా ఉంటే, సంబంధాలు మీ ఆనందాన్ని వెలి బుచ్చడానికి సాధనాలు అవుతాయి కానీ, ఆనందాన్ని అపేక్షించడానికి కాదు. మీరు సంబంధాలు ఏర్పరుచుకొనేది సంతోషాన్ని కోరుతూ, ఇతరులనుండి సంతోషాన్ని పిండుకోవాలనుకుంటే, ఆ వ్యక్తి మీ నుండి సంతోషం పిండుకోవాలని చూస్తే, కొంత కాలం తర్వాత ఇది బాధాకరమైన సంబంధం అవుతుంది. మొదట్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎంతోకొంత ఆశించినవి నెరవేరుతుంటాయి కాబట్టి. కానీ మీరే స్వయంగా ఆనందభరితులై, మీ సంతోషాన్ని వ్యక్త పరచడానికి బంధాలు ఏర్పరుచుకొంటే, మీ గురించి ఎవరూ ఫిర్యాదు చేయరు ఎందుకంటే, మీరు ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు కానీ మరొక వ్యక్తి నుండి ఆనందం ఆశించడం లేదు.

కాబట్టి మీ జీవితం మీ ఆనందాన్ని వ్యక్తపరిచేదిగా అయ్యుండి, ఆనందాన్ని అన్వషించేది కాకుండా ఉంటే, అప్పుడు సంబంధాలు సహజంగానే అద్భుతంగా ఉంటాయి. మీరు లక్షలాది సంబంధాలు కలిగి ఉండవచ్చు, వాటిని చక్కగా కొనసాగించవచ్చు. ఇంకొకరు ఆశించేవి నెరవేర్చాలన్న సర్కస్ ఉండనే ఉండదు, ఎందుకంటే మీరు ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే వారు మీతో ఉండాలని కోరుకుంటారు కదా.

ప్రేమాశీస్సులతో,

సద్గురు