ప్రశ్న: సద్గురూ, నేను విడాకులు తీసుకున్నాను. నాకు ఆరేళ్ల కొడుకున్నాడు. అప్పుడప్పుడూ నన్ను ఏదో శూన్యం ఆవరించినట్లుంటుంది. ప్రేమ కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇంట్లో మా అబ్బాయి తండ్రి వంటి వ్యక్తి లేకపోవడం గురించి మాటిమాటికీ అడుగుతూ ఉంటాడు. నిజంగా నేను గందరగోళంలో ఉన్నాను... దయచేసి నాకు సలహా ఇవ్వండి.

సద్గురు: ముందు పిల్లల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుత ప్రపంచంలో పెళ్లికాగానే పిల్లలు యాంత్రికంగా పుట్టరు. ఒకప్పుడిలా ఉండేదికాదు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడుతూనే ఉండేవారు. ప్రస్తుతం ఇది యాంత్రికం కాదు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం పిల్లల్ని కనవచ్చు. మీకు పిల్లకాని, పిల్లవాడుకాని పుడితే ఆ తర్వాత అది ఇరవ్యయేళ్ల ప్రాజెక్టు అని గుర్తు పెట్టుకొండి. మీ పిల్లలు మరీ సమర్థులు అయితే 15, 16 ఏళ్ల ప్రాజెక్టు. అందువల్ల బిడ్డను కనాలని నిశ్చయించుకోగానే అది కనీసం పదిహేనేళ్ల ప్రాజెక్టు అని తెలుసుకోండి. మీకటువంటి నిబద్ధత లేకపోతే ఇందులోకి దిగకండి. అది అవసరం లేదు. ఏ పిల్లవాడూ వచ్చి మీ గర్భద్వారం మీద ‘నన్ను కనండి’ అని తలుపు కొట్టడం లేదు. మీరు మీ శిశువుకు ఇటువంటి సమర్థననివ్వలేక పోయినట్లయితే మీరు పిల్లల్ని కనే ఈ కార్యక్రమానికి పూనుకోకండి.

మీరు తెంచుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మీ పిల్లవాడికి అన్ని విధాలా తల్లీగా, తండ్రిగా కూడా కావడానికి సిద్ధపడాలి.

ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లవాడి సమస్య పరిష్కారమవుతుందనుకుంటే అది తప్పుడు ఆలోచనే. పరిష్కారం కాదని నేనను, కావచ్చు కూడా. కాని ఆలోచించండి, “పిల్లవాడి అసలు తండ్రి వల్ల పరిష్కారం కాలేదు. మరొకర్ని తీసికొని వస్తే అంతా సవ్యమవుతుంది” అన్నది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఇటువంటి సందర్భాల్లో 10% మాత్రమే సఫలమవుతాయి. 90% సందర్భాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారాలకంటే సమస్యలే ఎక్కువవుతాయి. మీ వివాహ బంధాన్ని ఎందుకు తెంచుకున్నారు అని నేను మిమ్మల్ని అడగను, అది మీ ఇష్టం. మీరు తెంచుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మీ పిల్లవాడికి అన్ని విధాలా తల్లీగా, తండ్రిగా కూడా కావడానికి సిద్ధపడాలి. కాని మీరు ఏదో మరోదానికోసం తపన పడుతూ ఉంటే, మీ బిడ్డ కూడా అలాగే తపన పడతాడు. దయచేసి మీరు మీ పిల్లల్ని అలా పెంచకండి. ఎవరో లేనివారి కోసం ఎదురుచూసేంత నిస్సహాయులుగా వాళ్లను తయారుచేయకండి.

మీ పిల్లవాడికి ఎనిమిదేళ్ళు. ఎనిమిదేళ్ల పిల్లవాడు మీతో ఎంత సమయం గడపాలని కోరుకుంటాడు? దాదాపు శూన్యం. వాడి పనుల్లో వాడు బిజీగా ఉంటాడు – ఎప్పుడూ మీ కొంగుపట్టుకొని వేలాడేట్టు మీరు వాణ్ణి తయారుచేయకపోతే, వాడి పనుల్లో మునిగి ఉంటాడు. జీవితం స్వభావమది - పిల్లలకు వాళ్ల పనులు వాళ్లకుంటాయి. వాళ్లు తమకు తాము హాని చేసుకోకుండా మీరొక కన్నువేసి ఉంచాలంతే. వాళ్లన్ని పనులూ మీతో కలిసే చేయవలసిన అవసరం లేదు.

సరే, మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే – అది మీ ఇష్టం. ఇది మీరు చేసుకోవలసిన ఎంపిక. దాన్ని పిల్లవాడి మీద మోపకండి. పిల్లాడికి మీరుకాని, తండ్రికాని అవసరం లేనంత సమర్ధవంతంగా తన విషయం తాను చూసుకోగలిగేటట్లు పెంచండి.. మీ సమర్థన, పోషణ మాత్రమే వాడిక్కావాలి. మీరేం చేసినా, దానికేదో ఫలితం ఉంటుంది. మీరు మళ్లీ పెళ్లి చేసుకోకపోతే ఒక రకమైన ఫలితం, చేసుకుంటే మరోరకమైన ఫలితం ఉంటాయి – ఇది మీరు ఇప్పటికే అనుభవించారు కూడా, మీరు దీన్ని అంతకంటే మెరుగ్గా నిర్వహించగలగాలి – అవునో కాదో మనం చెప్పలేం. రెండింటికీ వాటివాటి ఫలితాలుంటాయి. ఆ ఫలితాలు తప్పనిసరిగా సుఖమిస్తాయో, ఇవ్వవో చెప్పలేం. వాటిని మీరెలా నిర్వహించుకుంటారన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది. మీరీ ఫలితాన్ని సంతోషంగా నిర్వహించుకోగలిగితే, అది మీ శ్రమకు తగ్గ ఫలం ఇస్తుంది. లేకపోతే మిగిలేది కేవలం శ్రమ మాత్రమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు