ఇప్పుడు నాతోపాటు కైలాస పర్వతయాత్రలో ఉన్న వాళ్లలో చాలా మంది, అసలు తామొక తీర్థయాత్రకు వెళతామని కలలో కూడా అనుకొని ఉండరు. అసలు నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు తీర్థయాత్ర చేయవలసిన అవసరం వస్తుందని అనుకోలేదు; కాని ఇదుగో ఇప్పుడిది పదమూడోసారి. ఈ యాత్ర పూర్తి చేసికొని వచ్చిన ప్రతిసారీ ‘‘చాలు. ఇక ఈ పర్వత యాత్రలు చాలు’’ అనుకుంటాను. కాని మళ్లీ రెండు నెలలు తిరిగేలోపలే తరువాతి యాత్రకు ప్రణాళిక వేస్తూ ఉంటాం. నేనెన్నో శక్తిమంతమైన ప్రదేశాలు సందర్శించాను, ఎందరో అసాధారణ వ్యక్తులను కలుసుకున్నాను, శక్తిని వెదజల్లే ప్రదేశాలను చూశాను. కాని కైలాస పర్వత ప్రాంతంలాగా శక్తిని ప్రకంపించే మరో ప్రాంతాన్ని ఇప్పటివరకు చూడలేదు. అందుకే ఇక్కడికి మళ్లీ మళ్లీ వస్తుంటాను. ఒక విధంగా కైలాస పర్వతం ఒక  వ్యసనం అనవచ్చు.

కాని మీరొక తీర్థయాత్రికులైతే మీరు ఈ బాహ్య యాత్రని ఒక అంతరంగ యాత్రగా మార్చుకుంటారు

దీన్ని మనం తీర్థయాత్ర అని ఎందుకంటున్నాం? ఇదొక వినోద యాత్రకాని, పర్వతారోహణ కాని ఎందుకు కాదు. మీరొక యాత్రికులయితే ఈ పర్వతమార్గాన్ని మరికొంత అరగదీస్తారు. కాని మీరొక తీర్థయాత్రికులైతే మీరు ఈ బాహ్య యాత్రని ఒక అంతరంగ యాత్రగా మార్చుకుంటారు. మీరు కొండదారిని అరగదీయదలచుకున్నారా? మీలోపల ఉన్న మరొక దానిని అరగదీయదలచుకున్నారా? మీరు తీసుకోవలసిన నిర్ణయం ఇది. తీర్థయాత్ర అనేది మిమ్మల్ని మీకు మీరున్న విధం కన్నా కొంచెం తక్కువగా చూపిస్తుంది. మీరు మిమ్మల్ని శూన్యంగా మార్చుకోగలిగితే, మీరు కేవలం ప్రాణమున్న ఒక జీవిగా కేవలం శ్వాస తీసుకుంటారు. అది మరీ కష్టమైన పని అయితే కనీసం మీరు మిమ్మల్ని ఏమిగా భావించుకుంటున్నారో దాన్ని కొంచెం తగ్గించుకో గలిగినా చాలు. తీర్థయాత్ర చేసే పద్ధతి అది.

మరి ఇది మీరు ఇంట్లోనే ఎందుకు చేయలేరు? అవును, చేయవచ్చు, కాని మీరు చేయలేదు. అందుకే మనం ఇక్కడున్నాం. మీలో మీరు కరుడు గట్టిన విధంగా ఉన్నట్లయితే మీ అంతరంగంలోకి మళ్లడానికి యాత్ర మంచి పద్ధతి - మీ సరిహద్దులను ఛేదించడానికి మంచి పద్ధతి. మీకు జీవితంగా తెలిసిన ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుంది. మీ శరీరమే మీ భౌతిక హద్దు; కాని మీ మనస్సు, భావోద్వేగాలు, శక్తి అన్నిటికీ హద్దులున్నాయి. హద్దుని మీరు చేధించగానే ఇక హద్దులుండవు. కైలాస పర్వత యాత్ర ఇటువంటిది - మీరు అపరిమితంగా మారే అవకాశం.

మీరు సమస్యతో చక్కగా వ్యవహరిస్తే పరిష్కారం లభిస్తుంది. కాని ప్రజలకు ఇది అర్థం కాదు. వాళ్లకు మీరు ఇచ్చే ప్రతి పరిష్కారాన్ని సమస్యగా మార్చుకోవడం అలవాటు.

మీరు అపరిమితంగా ఎలా మారగలరు? స్వేచ్ఛ అంటే పక్షిలా యథేచ్ఛగా ఆకాశంలో విహరించడమని ప్రజలు అనుకుంటారు. నేను దీనినే ఉదాహరణగా ఉపయోగిస్తాను. మీరు ఎగరాలనుకుంటే మీకు ఆకాశంపై నియంత్రణ అవసరం లేదు. మిమ్మల్ని కిందికి లాగే దాని విషయం మీరు చూసుకోవాలి. అంటే గురుత్వాకర్షణతో వ్యవహరించాలి. అదే విధంగా మీకు స్వేచ్ఛ కావాలంటే మిమ్మల్ని కట్టి ఉంచే బంధనల విషయం చూసుకోవాలి. స్వేచ్ఛ అనేది మిమ్మల్ని బంధించే దాని నుండి విముక్తి. మీరు సమస్యతో చక్కగా వ్యవహరిస్తే పరిష్కారం లభిస్తుంది. కాని ప్రజలకు ఇది అర్థం కాదు. వాళ్లకు మీరు ఇచ్చే ప్రతి పరిష్కారాన్ని సమస్యగా మార్చుకోవడం అలవాటు.

కనీసం ప్రపంచంలోని ఈ భాగంలో, నూరు కోట్లమందికి కైలాస పర్వతయాత్ర ఒక స్వప్నం. తీర్థయాత్రను ఒక సమస్యగా మార్చుకోకండి. ఏమైనా కానీయండి, దాన్ని సమస్యగా చూడకండి - అది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. ‘సమస్య’ అనేది మీరు దేనికైనా తగిలించే లేబుల్ మాత్రమే. జీవితం జరుగుతుంది, అంతే. మీరు ప్రతిదాన్ని కూడా మీ జీవితానుభవం మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా మీకు మీరు చిక్కుముడుల్లో ఇరికించుకోవచ్చు. ఒకదాన్ని సమస్యగా పిలవడం మీ జీవితానుభవాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడదు. జీవిత పరిస్థితులను మీరు నాలాగా అనుభూతి చెందాలని కోరుకుంటాను. నేను దేన్నీ ఒక సమస్యగా చూడను. నాతో సహా ప్రతిదాన్నీ మెరుగుపరచడమెలాగా అని చూస్తాను. ఈ విధంగా ఉండడంలో మీ జీవితమే ఒక తీర్థయాత్రగా మారుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు