సింహస్త కుంభమేళా - ఉజ్జయినీ మహాకాళేశ్వర
ఈ స్పాట్ లో సద్గురు శివుని మహాకాళ పార్శ్వం గురించి; సమయం, భౌతిక ఉనికి, అంతరిక్షం యొక్క పరస్పర సంబంధం గురించి చెబుతూ అలాగే అంతిమ విముక్తికి మహాకాళుడు ఇంకా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం ఎలా సహాయపడతాయో వివరిస్తున్నారు.
ఉజ్జయినీ నగరంలో సింహస్థ కుంభమేళా మొదలైయ్యింది. మహాకాళేశ్వరునికి ఈ కుంభమేళాకి అవినాభవ సంబంధముంది. శివుని పరమ భక్తుడైన చంద్రసేన మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తోంది. చంద్రసేనుడి పరిపాలనలో ఇప్పటి ఉజ్జయినీ ని అవంతికా నగరమనేవారు. అవంతిక జ్ఞానానికీ, భక్తికీ ఆధ్యాత్మికతకూ కేంద్రంగా వర్ధిల్లింది. ఇది మరో కాశీ నగరంలా ఉండేది. ఎప్పటిలాగే ఆనాటి సమాజంలో కూడా విషకీటకాలకు ఇది రుచించలేదు.ఆ రాజ్యాన్నీ, అపురూపమైన దాని సంస్కృతినీ, నాశనం చేయాలన్న దురుద్దేశంతో దానిపై దండెత్తారు.
సాధారణంగా ఓ మహారాజు కార్యకలాపాలు ఏంటంటే, తన రాజ్య పరిపాలనా విధిని పాటించడం, ప్రజల సంక్షేమాన్నికనిబెట్టుకుని ఉండటం, రాజ్య సంరక్షణా, కొత్త రాజ్యాలను ఆక్రమించడం ఇలాంటివి . అయితే చంద్రసేనుడు మాత్రం భూమిపన్నులు వంటి వాటి మీద రాబట్టిన ఆదాయాన్నంతా, జ్ఞాన విస్తరణకీ, ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రసరణకీ ఉపయోగించేవాడు. ఇలా చేయడంతో, సహజంగా ఓ అద్భుతమైన సైన్యం ఏర్పాటు చేసుకో లేకపోయాడు. ఇటువంటి సైన్యంతో యుద్ధానికి దిగితే ఓటమి తధ్యం! అందుకే ఆయన ఆ పరమ శివుడినే ప్రార్ధించాడు. అప్పుడా శివుడు మహాకాళుడి రూపంలో ప్రత్యక్షమై, ఆయన శత్రుసైన్యాన్ని దిగమింగేసాడు. ఇలా చంద్రసేనుడికి ఆపద తప్పించి, ఇక నిరాటంకంగా అయన పనిని కొనసాగించుకునేలా చేసాడా శివుడు.
ఏదైతే అన్నిటికీ ఆధారభుతమో, ఏదైతే ఏ ఒక్కటీ కాదో దాన్నే ‘శివ’ అంటారు, శివుని ఈ కోణమే మహాకాళుడు. ‘కాల’ అంటే, సమయం...అంధకారం...లేదా శూన్యం. ఈ మూడిటినీ ఒక్క పదంలోనే కుదించి ఇలా చెప్పారు. ప్రస్తుతం మీ అనుభవం, సమయానికున్న భౌతిక స్థాయికి మాత్రమే పరిమితమైనది. భౌతిక స్థాయిలో ఇది వృత్తాల్లో తిరుగుతూ కనిపిస్తుంది. ఒక పరమాణువు మొదలుకుని మహా విశ్వం వరకూ, అన్నీ వృత్తాల్లానే తిరుగుతూ ఉంటాయి. ఈ భూమండలం చేసే ఒక పరిభ్రమణాన్నిమనం ఒక ‘రోజు’ అని అంటాం. చంద్రుడు భూమి చుట్టూ చేసే ఒక్క ప్రదక్షణాన్నిఒక ‘నెల’ అని అంటాం. అదే, భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు ఒక ‘సంవత్సరం’ అని అంటాం. అలాగే నిద్రాహారాలూ, మెలకువగా ఉన్న సమయాలూ, మీ జీర్ణ వ్యవస్థ ఇంకా ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఈ వృత్తాల్ని అనుసరిస్తూ ఉంటాయి. ఈ వృత్తాలే లేకపోతే, భౌతికత అనేది ఉండదు..అప్పుడు మీరు సమయాన్ని అనుభూతి చెందలేరు. కాలానికి.. లేదా..సమయానికి ఉండే ఓ పార్శ్వం..భౌతికత ద్వారా అభివ్యతీకరణమవడం
మనకి కనిపించే ఈ భౌతిక ప్రపంచానికంతా కూడా ఉనికిలేని ఓ మహత్తర శూన్య స్థలం ఆధారభూతమై ఉంది, దీన్నే ఆంగ్లంలో మనం ‘space’ అని అంటాం. ఈ కోణాన్నే,ఇక్కడ మనం ‘కాల’ లేదా చీకటి అని అంటున్నాం. ఈ ఖాళీ స్థలం-empty space-చిమ్మ చీకటి కాబట్టి దీన్ని darkness, లేదా అంధకారం అని అంటాం.మీరొకవేళ వెలుతురుని చూడాలనుకుంటే, దాని మూలాన్నైనా చూడాలి లేదా వెలుతురిని ప్రతిబింబించే వస్తువునైనా చూడాలి. ఉదాహరణకి సూర్యుని నుండి వచ్చే కాంతిని చంద్రుడు ప్రతిబింబిస్తాడు, ఈ మధ్యలో ఉన్నదంతా చీకటే. సూర్యరశ్మి దీనిగుండా ప్రవహిస్తోంది కాబట్టే అది చంద్రుడిపై పడుతోంది, ఇలా జరగకపోతే మనం దాన్ని చూడలేము. మీ కంటికి కనిపించనిదంతా మీకు చీకటిగానే గోచరిస్తుంది. అందుకే ఈ (space)శూన్య స్థలాన్ని ‘కాల’ అని ‘darkness’ (చీకటి) అని అంటాం.
ఇవన్నీ ఒకటే గనుక ఈ చీకటినీ, కాలాన్నీ, స్థానాన్ని వర్ణించడానికి ఒకే పదాన్ని వాడుతున్నాం. ‘కాలం’ అనేది ఉండబట్టే ఈ space లో ఉండే రెండు పాయింట్లని, వాటి మధ్యనున్న దూరాన్నీమీ అనుభూతిలోకి తీసుకుని రాగలుగుతున్నారు. అంతేగానీ, దూరంవలన మాత్రం కాదు., ‘కాలం’ వల్లనే దూరాన్నీ, space ని మీ అనుభూతిలోకి తీసుకునివచ్చే అవకాశముంది. ఒక వేళ ఈ కాలమే గనక లేకపోతే, మిగిలేది ఒక్క పాయింటే, అయితే అస్తిత్వంలో దీని ఉనికి ఉండదు. రెండు భిన్న ధ్రువాల మధ్యనే దేని ఉనికైనా సాధ్యమౌతుంది. కాలం లేకపోతే space ఉండదు, ఈ రెండు భిన్న ధ్రువాలూ లేకపోతే ఇక దేని ఉనికీ ఉండదు.
భౌతికత అనేది కేవలం ఈ ఆవృతాల వల్లనే సాధ్యమౌతుంది. ఓ ఆధ్యాత్మిక పిపాసి కోరుకునేది ఈ వృత్తాల నుండి బైటపడటమే, దీని నుండి విముక్తి పొంది పరమోన్నతమైన ముక్తిని చేరుకోవడమే!అంటే ఈ భౌతిక తత్వాన్ని అధిగమించి, జీవన వలయాల పరిభ్రమణాన్ని అధిరోహించడమే అతను కోరుకుంటాడు. అంటే తన నిబంధనలను అధిగమించాలని అభిలషిస్తాడు. ఇంకా చెప్పాలంటే నిబంధనలనుండి సంపూర్ణ ఎరుకవైపే సాగేదే ఈ ప్రయాణం
ఒక్కసారి మీ నిబంధనలనుండి సంపూర్ణ ఎరుకవైపు కదలడం మొదలుపెడితే , మిమ్మల్ని కేవలం భౌతికతకు పరిమితం చేసే ‘కాలచక్రం’ నుండి ... ఈ భౌతికాన్ని అధిగమించిన కాలాన్ని మీ అనుభూతిలోకి తీసుకుని రాగలరు. ఇంకో మాటలో చెప్పాలంటే, కాలాన్ని మీరు ‘మహాకాళుని’ గా అనుభూతి చెందుతారు. ఈ ‘మహాకాళుని’ వడిలోనే సృష్టి సంభవిస్తుంది . అనంతమైన బ్రహ్మాండాలు కూడా ఈ అనంత శూన్యంలో ఇసుక రేణువులుగా అగుపిస్తాయి. ఈ శూన్యమే ‘మహాకాళడు’
ఈ విశాల విశ్వంలో 90% పైగా ఉన్నది శూన్యమే. పరిమితమైన ‘ఇసుక రేణువుల’ లాంటి సృష్టి తునకలలో మునిగి తేలుతున్న మీరు సమయాన్ని ఓ వలయంగానే అనుభూతి చెందుతారు. దీన్నే ‘సంసారం’ అని అంటాము. ఈ సంసారాన్ని అధిగమిస్తే మీరు ‘వైరాగ్యు’లౌతారు. అంటే మీరు స్ఫటికంలా పారదర్శకమౌతారు. మీ నిబంధనలనుండీ, ఈ జీవన్వలయం నుండీ విముక్తులౌతారు. ఈ జీవన వలయాలనుండి విముక్తులైనప్పుడు ‘ముక్తి’ని పొందుతారు.. ఇదే పరమోన్నతమైన ముక్తి . ఈ మహాకళుని తత్వం ఎటువంటిదంటే, ఆయన సన్నిధిలో సర్వం లయమైపోతుంది.
ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో అటువంటివారికి ‘మహాకాళ' తత్త్వం అత్యంత ప్రాముఖ్యమైనది. ఉజ్జయినీ లోని మహాకాళేశ్వరాలయంలో ఉన్న లింగం అత్యద్భుతమైనది .అది మిమ్మల్ని మీ మూలాలనుండి కుదిపేస్తుంది. మిమ్మల్ని ఎలాగైనా కరిగించేయలన్నదే,దాని ముఖ్యోద్దేశ్యం! ఈశా యోగా కేంద్రంలోనున్న ధ్యానలింగంలో కూడా ఈ అంశం దాగి ఉంది కానీ కోరుకున్న వారికే అది లభ్యమౌతుంది. మహాకాళేశ్వర లింగం అత్యంత శక్తిమంతమైనది , దీనిలోని విపరీత ఆకర్షణ శక్తిని తట్టుకోవడానికి తగినంత సాధనతో శరీరాన్ని సిద్ధం చేసుకోవడం ఏంతో అవసరం.
ఈ మహాకాళేశ్వర లింగానికి నిత్యం స్మశాన వాటిక నుండి వచ్చే భస్మం తోనే అభిషేకం చేయడం అవసరం. ఆయనకది అత్యంత ప్రీతిపాత్రమైనది. దురద్రుష్ట వశాత్తూ ఎవరో కార్యకర్తలు దీనిని ఖండించడం వలన ఇప్పుడు పిడకలను కాల్చిన బూడిదతో అభిషేకం చేస్తున్నారు. మన పాత సాంప్రదాయాన్ని పునఃస్థాపించాలి , ఎందుకంటే ఇది కేవలం సంస్కృతికి సంబంధించిన విషయం కాదు., దీని వెనుక ఓ విజ్ఞానముంది. నిజానికి , అనుభవపూర్వకంగా చూస్తే, స్మశాన వాటిక నుండి వచ్చిన భాస్మానికి మిగితా వాటితో చేసే భాస్మాభిషేకానికీ ఎంతో తేడా ఉంది
ఈ ప్రక్రియను పునఃస్థాపించి దాన్ని కొనసాగించడం ఎంతో అవసరం, ఈ మహాకాళేశ్వర సన్నిధి ఎంత మహిమాన్వేతమైనదంటే, దీని పరిధిలోకి వచ్చినదేదైనా లయమైపోవలసిందే! సమస్తం బూదిడైపోవలసిందే!భౌతిక బంధాలనుండి విముక్తులౌతారు . శాస్వతమైన ముక్తికై మిమ్మల్ని ప్రోద్బలిస్తుంది. ఇదే ప్రక్రియ సున్నితంగా జరగాలంటే ధ్యానలింగమే మార్గం. కానీ మీకు బలమైన పోటు కావాలని అనుకుంటే మహాకాళేశ్వరుడే శరణ్యం !ఈశా సంస్థ నుండి ఓ ప్రత్యేక ట్రైన్ ద్వారా తమిళనాడు నుండి వేయిమంది యాత్రికులని/ సాధకులని సింహస్థ కుంభమేళ కు తీసుకుని వెళుతున్నాం . ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారిలోని ఓ భాగాన్నైనా మహాకాళేశ్వరునిలో లయం చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష , ఆశీస్సులూ!