సెల్ఫ్ డౌట్ ను అధిగమించడం ఎలా?
ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా సద్గురును మనిషి ఎదుగుతున్నపుడు వచ్చే సెల్ఫ్ డౌట్ ను ఎలా అధిగమించాలో అడుగుతున్నారు.

రెజీనా: నేను ఎదిగేటప్పుడు, నా మనసులో నా గురించీ నా సామర్ధ్యం గురించీ చాలా ప్రశ్నలు ఉండేవి. ఈ సెల్ఫ్ డౌట్ అనేది కచ్చితంగా ఒక సమస్యే, నేను ఇంకా చాలా మంది పిల్లలు దీనిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సెల్ఫ్ డౌట్ని, ముఖ్యంగా యువత ఎలా అధిగామించాలో చెప్పండి.
సద్గురు: నమస్కారం రెజీనా! మీమీద మీకు నమ్మకం లేకపోతే మంచిదే. అందరూ మీకు “మిమ్మల్ని మీరు నమ్మండి “ అని చెబుతున్నారని నాకు తెలుసు. నేనేమంటానంటే, “డౌట్ యువర్సెల్ఫ్” అని. మీ జీవితంలో మంచి, చెడు ఏది జరిగినా, దీనికి కారణం నేనేనేమో అని చూసుకోండి. అది మీరు కాకపోతే, అప్పుడు ఎదుటి వాళ్ళను చూద్దాం. కొంతమంది confidence ఉన్న మూర్ఖులు అందరిని తోస్కుంటూ ముందుకెళ్తున్నారు. డౌట్ మీలో ఒక వెవేకాన్ని తెస్తుంది, అప్పుడు మీరు ఈ భూమి మీద ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటారు.
ఎదుగుదలలో వేదన!
మనం ఎదుగుతున్నాం అంటే, ఆ ఎదుగుదలకి ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. అవి శారీరక, మానసిక, భావోద్వేగ ఎదుగుదలలే కాకుండా ఇంకెన్నో రకాలు ఉన్నాయ్. ఎక్కువసార్లు, మనం ఎదుగుదలని శారీరకం (భౌతికం) గానే కొలుస్తాం, దాని తర్వాత మానసికంగా కొలుస్తాం. మన జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మాత్రమే జీవితంలోని ఇతర పార్శ్వాలను మనం గుర్తిస్తాం. మన భావోద్వేగ ఎదుగుదల, సామర్ధ్యం ఇంకా మన పరిపూర్ణ ఎదుగుదల అనేవి జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కున్నప్పుడే బయటికి వస్తాయి. జీవితంలో చోటుచేసుకొనే వివిధ సంఘటనలకు వారి ప్రతిస్పందన చూసి వారికే ఆశ్చర్యం వేస్తుంది.
శారీరక, మానసిక ఎదుగుదలల విషయానికొస్తే, శరీరం చాలా స్థూలమైనది (కనిపిస్తుంది), అది ఒక గమనంతో ముందుకు ఎదుగుతుంది. కానీ మానసిక ఎదుగుదల అనేది కంటికి కనిపించదు, అది సరళంగా, చురుగ్గా, అస్పష్టంగా జరుగుతుంది. అంటే అది శారీరిక ఎదుగుదల కంటే ముందే జరిగిపోవాలి. మనిషిలో ఎదుగుదల సమస్యలు ఎందుకంటే, మానసిక ఎదుగుదల శారీరిక ఎదుగుదలకంటే ఒక అడుగు ముందు ఉండడం లేదు.
అందుకే, ఎప్పుడూ జరుగుతున్న విషయాలు ఇప్పటికే కొన్ని కోట్ల మందికి జరిగినవే అయినా, అది ఇప్పుడే ఈ ప్రపంచంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది కొంతమందికి. వాళ్ళకది ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, వారి మానసిక ఎదుగుదల శారీరిక ఎదుగుదలకంటే వెనుకబడి ఉండటం వల్ల.
ఈ సమాజంలో, ప్రతి బిడ్డా శారీరికంగా కన్నా మానసికంగా ఒక అడుగు ముందు ఎదిగేలా ఉండాలి పరిస్థితులు. మనం ఇదొక్కట్టి చేస్తే చాలు. అప్పుడు యుక్త వయస్సులో అయినా, మధ్య వయస్సులో అయినా వృద్దాప్యం లో అయినా, మీరు ఎటువంటి పరిస్థితినైనా సులువుగా ఎదుర్కొనడం మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్నచిన్న విషయాలకు, ఉపద్రవాలకు, గాబరా పడటం ఉండదు మీ జీవితంలో.
ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే పసివారికి డైపర్ సమస్య, యువతకి హార్మోన్ల సమస్య, మధ్య వయస్కులకు అప్పుడు వచ్చే సంక్షోభం, ఇక వృద్దాప్య యాతనలు ఉండనే ఉన్నాయి. ఏ దశలో ప్రజలు బాధపడట్లేదో నాకు చెప్పండి. జీవితం ఒక సమస్య కాదు, అదొక ప్రక్రియ. దానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేదే ప్రశ్న.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.
