ప్రశ్న: నమస్కారం సద్గురూ, ఇన్ని రోజుల సాధన తరువాత కూడా నాకు  స్వీట్స్ తినాలనే కోరిక కలుగుతుంది. నేను వాటిని తినేటప్పుడు, నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నాను! ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది క్రమంగా తగ్గి పోతుందా?


ఆ.., ఇంకా స్వీటు తినాలనిపిస్తుందని ఒప్పుకుంటున్నారు!

మనము చేస్తున్న వివిధ రకాల యోగా ద్వారా ప్రాధమికంగా మనలోని జీవ రసాయనాల కూర్పును మార్చటానికి ప్రయత్నిస్తున్నాము. మీరు ఒక రసాయనిక మిశ్రమం (సూప్); అది అద్భుతమైన మిశ్రమమా లేక పనికిమాలిన మిశ్రమమా అన్నదే ప్రశ్న!  ప్రతి రోజు ఈ మిశ్రమం  కాలముతో పాటు తనని తాను మార్చుకుంటూ ఉంటుంది. చంద్రుడి యొక్క స్థానం వలన, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వలన, ఇంకా మీ జీవితంలో జరుగుతున్నసంఘటనల వలన ఇది మారుతూ ఉంటుంది. వీటన్నిటి వలన మీలోని మిశ్రమం యొక్క రసాయనతత్వం మారుతూ ఉంటుంది. ఈ క్షణము మీరు ఒక అద్భుత మిశ్రమంగా, మరు క్షణం మీరు ఒక దుష్ట మిశ్రమంగా, లేదా భయానుభూతిని కలిగించే మిశ్రమంగా ఉంటారు. ఇంకో క్షణంలో మీరు ఒక ఆనందభరిత మిశ్రమంగా ఉంటారు.

మీరు నమ్మేది ఎలా? ఒకటి మీకది అర్ధవంతంగా అయినా అనిపించాలి లేదా రెండొవది మీకు అది మీకు పనిచేసినప్పుడు. 

ఈ మిశ్రమం యొక్క ధోరణులు ఏవైనా కావచ్చు. వాటికి జన్యు పరమైన లేక కర్మ పరమైన మూలం ఉండవచ్చు, లేదా ఆ మిఠాయి చాలా రుచిగా ఉండి ఉండవచ్చు! ఈ జన్యు పరమైన లేక కర్మపరమైన మూలాలు మన వ్యవస్థలో ఒక రసాయనాన్ని తయారు చేస్తాయి. ఆ రసాయనం బలంగా మారితే, అది ఆ వ్యక్తిలో ఓ నిర్భందతను సృష్టిస్తుంది. మనము చేసే వివిధ రకాల యోగా, ముఖ్యంగా హఠ యోగా, క్రియల ముఖ్య ఉద్దేశం మన వ్యవస్థలో దానికై అదే తియ్యగా ఉండే రసాయనికతను తయారు చేయటమే. అప్పుడు మనం పరమానందభరితులం అవుతాము. అప్పుడు మనం ఊరికే కూర్చుని ఉన్నా, మనలో ఎంత తీయదనం ఉంటుందంటే, మనం ఇక వేరే  స్వీట్స్ గురించి ఆలోచించనే ఆలోచించం.

మనం అనుభూతి చెందే ప్రతీది మనలో మనము ఇప్పుడు ఎలా ఉన్నాము అనేదాన్ని బట్టే ఉంటుంది! మీరు నీటిలో చేయి పెడితే అవి చల్లగా అనిపిస్తే,  మీ శరీరపు ఉష్ణోగ్రత  ఆ నీటి  ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉందన్నమాట. ఒకవేళ మీ శరీరం చల్లగా ఉంటే, అదే నీరు వెచ్చగా అనిపిస్తుంది. స్వీట్ విషయంలో కూడా అంతే! మీలో మీరు చాలా తియ్యగా ఉంటే, స్వీట్ మీద ఆకర్షణ తగ్గుతుంది. నేను ఇక్కడ స్వీట్ అనే పదాన్ని రెండు రకాలుగా వాడుతున్నాను - కేవలం తియ్యదనాన్ని సూచించడం కోసమే కాకుండా, ఆహ్లాదకరమైన దాన్ని సూచించడం కోసం కూడా వాడుతున్నాను. మీకు తెలిసిన అత్యంత ఆహ్లదకరమైనది మీరే అన్నంత ఆహ్లాదకరంగా మీరు మారితే, అప్పుడు మిగతావన్నీ పర్వాలేదు. మీరు వాటిని వదులుకోనవసరం లేదు. వాటి పట్ల ఉండే నిర్బంధ కోరిక దానికదే తగ్గుతుంది.

నిర్బంధమైన కోరిక ఏదైనా తిండి గురించి కావచ్చు, లేక ఒక ప్రత్యేక కార్యకలాపం గురించి కావచ్చు, లేక మనుషుల గురించి కూడా కావచ్చు  – అది దేని గురించి అనేది విషయం కాదు. అది నైతికత గురించా, లేక మంచీ-చెడుల గురించా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న, స్వేచ్ఛ-నిర్బంధత్వాలకు, బానిసత్వం-విముక్తులకు సంబంధించినది.  మీరే ఏ పనైనా నిర్భందంగా చేస్తున్నారంటే,  మీరు దానికి బానిస అయ్యారన్నమాట. ఒక మనిషిగా మన జీవితంలో ఏది జరుగుతున్నా, అది స్పృహతో జరగాలి. మీరు ఈ రోజు స్పృహతో స్వీట్ తినాలనుకుని తింటే, అది మీ ఎంపిక అవుతుంది. కానీ మీలోనిదేదో మిమల్ని బలవంతంగా స్వీట్ తినమని ముందుకు నెడుతుంటే, దాని గురించి మనము కొంచం ఆలోచించాలి. స్వీట్ గురించి కాదు, మన గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు సమస్య స్వీట్ గురించి కాదు, సమస్య ఏమిటంటే “మీలో ఇప్పుడు బలవంతంగా మీతో ఓ పని చేయించే మిశ్రమం ఉంది .అది ఇప్పుడు స్థిరంగా లేదు”. మీరు ఒక నిర్బంధ చర్యను చేస్తున్నప్పుడు, దాని పట్ల మీరు స్పృహతో ఉండండి. అలాగే  మీ సాధనను కొనసాగించండి. అప్పుడు ఆ నిర్బంధ కోరిక దానికదే సర్దుకుంటుంది.

మీరు మీ స్వీట్ల సమస్య గురించి అతిగా ఆలోచిస్తే, అది ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది. ఉదాహరణకు, మీరు “నేను కోతుల గురించి ఆలోచించకూడదు” అని అనుకుంటే, మీ మనస్సులోకి కేవలం కోతులే వస్తాయి!

అందుకని మీరు స్వీట్స్ తినకుండా ఉండడానికి విపరీతంగా ప్రయత్నించకండి, దానిని ఒక పెద్ద సమస్యలా చూడకoడి. మీరు ఒకవేళ తింటే, పర్వాలేదు. ఒకటి మాత్రం గట్టిగా నిర్ణయించుకోండి – రెండు భోజనాల మధ్యలో ఏమీ తినవద్దని నిర్ణయించుకోండి. మీ భోజనం సమయంలో అందరి ముందు తింటున్నప్పుడు మీకు ఎంత కావాలో అంత తినండి. సమస్య అంతా మిగతా సమయాల్లో, ఒంటరిగా తినటం వల్లే.  మీ వద్ద తినుబండారాలేమి లేకుండా చూసుకోండి. అప్పుడు మీ నిర్భంద కోరిక క్రమంగా తగ్గిపోతుంది.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు