నా ఇష్టదేవత............!!!

 
 
 
 

ఈ వారం సద్గురు మనతో – ఆయన ఇష్టదేవత ఎవరో అనే విషయం పంచుకుంటున్నారు. అది ఎవరో – మీరు ఊహించలేరు....!! సద్గురు మనకి ఇక్కడ భక్తి గురించి చెబుతూ – భక్తి అంటే అవధులు లేకుండా నిమగ్నమవ్వడమే – అని చెప్తున్నారు. ఆయన అనుభూతిలో, నేతృత్వం అనేది భక్తివల్ల వచ్చే పర్యవసానమేనని చెప్తున్నారు. 

ఒక రోజు నన్ను ఒకరు, “సద్గురూ మీ ఇష్టదేవత ఎవరు, మీరు శివ భక్తుడా ?” అని అడిగారు. నేను వారితో “ మీరు ఎప్పుడైనా నన్ను శివుడి ఎదురుగా కూర్చొని పూజ చేయడం చూసారా ? నేను నా సమయాన్ని అంతా కూడా మీలాంటి మూర్ఖులతోనే గడుపుతున్నాను. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎవరికి అంకితమై ఉన్నాను ? మీకా ? లేక  శివుడికా ? నా ఎదురుగుండా ఈ క్షణంలో ఎదైతే ఉందో,  అది ఎవరైనా సరే, ఏదైనా సరే అదే నా ఇష్ట దేవత. ఇది నా జీవన విధానం. నేను, నా ఎదురుగుండా ఎవరున్నారో; వారి మీద పరిపూర్ణమైన శ్రద్ధను చూపిస్తాను. మీరు ఎవరైనా సరే, ఏదైనా సరే - నన్ను నేను, సంపూర్ణంగా సమర్పించుకుంటాను. ఇది నాలో ఎల్లప్పుడూ అత్యున్నత భావాలూ, కేంద్రీకృతమైన దృష్టి కలిగి ఉండేలా చేస్తుంది. ఈ రోజున నేను ఇలా ఉండడానికి కారణం అంతా  ఇదే” అని చెప్పాను.

మీ భక్తిని మీ పరిణామం కోసం మీరు ఉపయోగించుకోకపోతే, అది మోసపూరితమైనది అవుతుంది.

ప్రతివారు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే,మీ భక్తి అంటే, మీరు మీ దైవానికి ఏమి చేస్తున్నారు అన్నది కాదు.  భక్తి మిమ్మల్ని పరిణామం చెందించేది. మీ భక్తిని మీ పరిణామం కోసం మీరు ఉపయోగించుకోకపోతే, అది మోసపూరితమైనది అవుతుంది. మీరు కొన్ని విషయాలను ఉన్నతమైనవిగా, కొన్నిటిని నీచమైనవిగా, కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువ స్థాయి వాటిగా, కొన్నిటిని మంచిగా ఇంకొన్నిటిని చెడ్డగా – ఇలా చూస్తున్నారంటే, మీరు ఇంకా దివ్యత్వాన్ని రుచి చూడలేదని అర్థం. మీరు దేన్నీ ఉన్నతంగా చూడకండి. అదే విధంగా దేన్నీ హీనంగా కూడా చూడకండి. మీరు కనుక ప్రతీదానిపట్ల సంపూర్ణమైన శ్రద్ధ వహిస్తే, ప్రతిదానిలోనూ ఎంతో అద్భుతమైనది ఉందని  - మీరు గ్రహిస్తారు. నేను ఒక చీమను చూశాననుకోండి, ఆ క్షణంలో ఆ చీమే - నా ఇష్టదేవత.  నా వరకు నాకు; నేతృత్వం అనేది భక్తియోగమే.

మీరు ఏదైనా సృష్టించడానికి అంకితభావంతో కనుక ఉంటే, మీరు దేన్నైనా అత్యున్నతమైనదిగా భావిస్తే – అప్పుడు మీరు భక్తుడే. మీరు దేనిపట్లైనా అంకితభావం కలిగిఉంటే తప్పితే; మీరు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారో దానిని మీరు చేయలేరు. జీవితంలో ప్రముఖమైనది ఏదీ మీరు సాధించలేరు. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. అది వ్యాపారం అవ్వనివ్వండి లేదా ఒక ఇండస్ట్రీ నడపడం అవ్వనివ్వండి, కళగానీ, ఆటగానీ, ఆధ్యాత్మిక ప్రక్రియగానీ లేదా మరేదైనా సరే...!

స్వామీ వివేకానంద ఒకసారి “భగవత్గీత చదువుతున్నప్పటికంటే కూడా, మీరు ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు స్వర్గానికి మరింత చేరువగా ఉంటారు” అని అన్నారు. అంటే మీరు నిమగ్నతలేకుండానే ప్రార్థన చెయ్యగలరు కానీ, మీరు నిమగ్నతలేకుండా ఒక ఆటను ఆడలేరు అని అర్ధం. మీరు మీ మొత్తాన్నీ ఆటలో పెడితే తప్పితే;  మీరు ఒక బంతిని ఎక్కడికి కొట్టాలనుకుంటున్నారో - ఆ విధంగా కొట్టలేరు.

భక్తి అనేది మిమ్మల్ని మీరు లయం చేసుకోడానికి ఒక సాధన.

భక్తి అనేది మిమ్మల్ని మీరు లయం చేసుకోడానికి ఒక సాధన. మీరు ఏమి చేస్తున్నారో అందులో లయమైపోడానికి ఒక సాధన. ఇది ఒక అద్భుతమైన మేధస్సును చేరుకునేందుకు ఒక మార్గం. మీ సామాన్యమైన తెలివితేటలకు మించిన కోణం. వేరేవారెవ్వరూ అవగాహన చేసుకోలేని ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకోగలుగుతారు. భక్తి అంటే మీరు ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడమో, పూజ చేయడమో కాదు. భక్తి అంటే పరిమితులు లేకుండా ... మీకు అంతకు ముందే దాని మీద అభిప్రాయాలు లేదా షరతులు విధించుకోకుండా సంపూర్ణమైన నిమగ్నత.

మీరు ఎవరు అన్నది మీరు చేసే పనిలోగనుక కరిగిపోతే అప్పుడు మీరు అక్కడ లేనట్లే. అప్పుడు మీరు నిజమైన నాయకుడిగా మారతారు. ఆ క్షణంలోనే మీరు ఒక నిజమైన భక్తుడు కూడాను. భారత సాంప్రదాయంలోని గొప్ప భక్తులను కనుక మీరు చూసినట్లైతే – రామకృష్ణ పరమహంస, మీరాబాయి, నాయనార్లు... ఇంకా ఎందరో...! వీరందరూ వారి చుట్టూరా ఏమి జరుగుతోంది అన్న దాని పట్ల ఆసక్తి వహించలేదు. వారు వారి దైవం పట్ల పూర్తి భక్తి భావనతో ఉన్నారు.  వారి భక్తి వారిని ఎటువంటి స్థితికి చేర్చిందంటే;  ప్రజలు వారిని సహజంగానే అనుసరించడం మొదలు పెట్టారు.

నిజమైన నేత , తాను ఒక  నేతను కావాలి అనుకుని మొదలు పెట్టరు. ప్రజలు ఎలా అయినా సరే వారి చుట్టూరా చేరతారు. ఎందుకంటే వారిలో ఒక విధమైన స్వభావం ఉంటుంది. నా అనుభూతిలో భక్తి, నేతృత్వం అనేవి పర్యాయ పదాలు. ప్రజలు నేను నేతనని అనుకుంటారు. నిజానికి నేనొక భక్తుడిని.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1