కేవలం ఇల్లాలు కాదు..!!

ఈ ఆర్టికల్ ‘ప్రేమ-జీవితం’ అన్న విషయంపై జుహీచావ్లా - సద్గురుల మధ్య సంభాషణలో నుండి గ్రహించబడినది.
 
Not Just a Housewife
 
 
 

జుహీచావ్లా: ఈ రోజుల్లో మన ఆధునిక సమాజంలోని మహిళలెందరో బయటికి వచ్చి, అనేక రకాల వృత్తులను చేపడుతున్నారు. వృత్తి లేదా ఉద్యోగం  చేస్తూ, తమ ఇంటిని నిర్వహిస్తూ, ఆర్థికంగా స్వతంత్రులుగా ఉన్న మహిళల గురించి మీ అభిప్రాయమేమిటి?

సద్గురు:  ప్రతి స్త్రీ కూడా తాను ఒక వ్యక్తిగా ఏమి చేయాలని కోరుకుంటే అది  చేయాలి. అదేదో సమాజంలో ఒక ధోరణిగానో లేకపోతే ప్రపంచంలో అదొక్కటే చేయదగిన పనిగానో చిత్రించకూడదు. ఒక స్త్రీ ఇద్దరు పిల్లల్ని కని వారిని పెంచి పెద్దచేయాలనుకుంటే అది ఆమెను రోజంతా పనితో తీరిక లేకుండా చేస్తుంది. ఆమె బయటికి వెళ్లి ఉద్యోగం చేయకోడదని నేననటం లేదు. ఒక వ్యక్తిగా ఆమె ఏమి కోరుకుంటే అది చేయవచ్చు. ఆ స్వేచ్ఛ ఆమెకుంది. కానీ ఇద్దరు పిల్లలుండడమంటే కేవలం పునరుత్పత్తి కాదు. మీరు తరువాతి తరాన్ని తయారు చేస్తున్నారు. రేపటి ప్రపంచం ఎలా ఉంటుందన్నది నేటి తరం తల్లుల స్వభావమే నిర్ణయిస్తుంది.

ఇద్దరు ముగ్గురు  జీవితాలను పెంచి పోషించడంలోని ప్రాధాన్యాన్ని వాళ్లు గుర్తిస్తున్నట్లు నాకనిపించడం లేదు.

‘‘మీరేం చేస్తున్నారు?’’ అని నేను మహిళలను అడిగినప్పుడు, చాలామంది ‘‘ఏమీలేదు, నేను ఇల్లాలిని మాత్రమే’’ అని చెప్తుంటారు. ‘‘నేను కేవలం ఇల్లాలినే అని మీరెందుకు చెప్తారు?’’ అని అడుగుతాను నేను. ఇద్దరు, ముగ్గురి జీవితాలను పెంచి పోషించడంలోని ప్రాధాన్యాన్ని వాళ్లు గుర్తిస్తున్నట్లు నాకనిపించడం లేదు. అది చాలా ముఖ్యమైన పని. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ వంటి మాటలెప్పుడూ మా అమ్మ నాతో అనలేదు. కాని ఆమె జీవించిన పద్ధతి ఎలాంటిదంటే ఆమె మమ్మల్ని ప్రేమించిందా, లేదా అన్న ఆలోచనే మాకెప్పుడూ రాలేదు. ఆమె జీవితమంతా మాకే అంకితమైపోయింది కాబట్టే అటువంటి ప్రశ్న ఎప్పుడూ తలెత్తలేదు. ఆమె మాకోసమే జీవించిందని మాకు తెలుసు. ఆ కాలంలో ఆవిడ మాతో లేని  జీవితాన్ని అసలు నేను ఊహించలేను.

నేనేమిటి అన్న విషయంలో మా అమ్మ ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషించలేదు, కాని ఆమె నా చుట్టూ కల్పించిన వాతావరణమే లేకపోతే  నేను ఇప్పుడున్నట్టుగా ఎప్పటికీ ఉండగలిగేవాడిని  కాదు. అటువంటి వాతావరణాన్ని కల్పించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది, ఇదెక్కడో తన పాత్ర పోషిస్తుందని ఆమెకు సంపూర్ణంగా తెలుసు. నా విషయంలో ఆమె చేసిన  అతి ముఖ్యమైన పని ఇది. ఇది ముఖ్యమైన పని కాదని ఎవరైనా ఎందుకనుకుంటున్నారు? మా చిన్నతనంలో మేము దేని గురించీ ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. మాకు కావలసిన ఆధారం ఎప్పుడూ ఉండేట్లు ఆమె చూసింది. మా చుట్టూ ఏం జరుగుతున్నా, దాన్ని పట్టించుకోకుండా మేము కాలం గడిపేయగలిగాం; రోజుల తరబడి కళ్లు మూసుకొని కూర్చునే అవకాశాన్నిది నాకిచ్చింది.

స్త్రీ డబ్బు సంపాదిస్తేనే విలువైన పని చేస్తున్నదనుకోవడం  సరైనది కాదు.

ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఆర్థిక చట్రమే. డబ్బు అంటే మీకు కావలసిన వస్తువులను సమకూర్చుకోవడం. పురుషులు, వారి కుటుంబానికి  కావలసినవి సమకూర్చుకునే పనిచేస్తుంటే స్త్రీలు జీవితంలోని మరింత సుందరమైన అంశాలగురించి మాట్లాడేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా సంపాదనలో పడాలని కోరుకుంటున్నారు. కుటుంబానికి అటువంటి అవసరం ఉంటే మంచిదే, ఆమె అలాగే చేయవచ్చు. కాని ఇది ఆమె చేయవలసిన పనుల్లో సంపాదనే మెరుగైన పని అన్న భావనను స్థిరపరచకండి. ఆమె పాడగలిగితే, సంగీత వాద్యాలు వాయించగలిగితే, వండగలిగితే - లేదా తన పిల్లల్ని ప్రేమిస్తే - ఆమె అందంగా ఓ పువ్వులాగ జీవించగలుగుతుంది - అది చాలు కదా.

స్త్రీ డబ్బు సంపాదిస్తేనే విలువైన పని చేస్తున్నదనుకోవడం సరైనది కాదు. ఆర్థికావసరం ఉంటే, ఆమెకటువంటి కోరిక ఉంటే, ఆమె అలాగే చేయవచ్చు. కాని లోకంలో మనం అటువంటి విలువలు స్థాపించవలసిన అవసరం లేదు. అది సమాజ వికాసం కాదు; జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే జీవనోపాదే ఎక్కువ ముఖ్యమన్న తిరోగమనమైన చర్య అవుతుందది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1