కేవలం అవగాహనే, నిర్ధారణ కాదు...!!!

 
 
 
 

ఈ వారం సద్గురు తను ఒక యువకుడిగా ఉన్నప్పటి సంగతులు కొన్ని పరిచయం చేసారు... ఏ నియమాలకీ కట్టుబడకుండా స్వేచ్చగా విహరించే తన మనస్తత్వం గురించీ, ఎవరూ అనుసరించని మార్గాల్లో వెళుతూ అనుభవం ద్వారానే అన్నిటి గురించి  తెలుసుకోవాలనుకునే తన జిజ్ఞాస గురించీ మనకి చెప్తారు. వాసన చూడగల మన సామర్ధ్యాన్ని ఉపయోగించి ఒక చిన్న సాధన చెయ్యడం సూచిస్తూ, " మీరే సువాసనగా మారినపుడు, ఈ సృష్టిమూలం మీరే అవుతారు." అన్న ఆయన మాటలలోని సత్యాన్ని అనుభూతి చెందేలా చేస్తారు.

బహుశా నాకు అప్పుడు 19 ఏళ్ళ వయసు ఉండి ఉండవచ్చు. అప్పుడు నేను ఇంట్లోంచి పారిపోదామనుకున్నాను. నా మోటరు సైకిలు మీద ఎక్కడికో వెళిపోదామనుకున్నాను. అప్పటికే నేను మన దేశ సరిహద్దుల వరకు చాలా సార్లు వెళ్ళాను. అందువల్ల, సరిహద్దు దాటాలంటే,కొన్ని అనుమతి పత్రాలూ, కొంత డబ్బూ అవసరం ఉంటుందని నాకు తెలుసు. ఒక ఏడాది రెండేళ్ళపాటు ఏదో చిన్న వ్యాపారం చేసి, దానికి సరిపడా డబ్బు సంపాదిస్తే , తర్వాత నాకు ఇష్టమొచ్చినచోట్లకి వెళ్ళవచ్చని అనుకున్నాను.  అదొక కల. ఆ రోజుల్లో కోళ్ళ పెంపకం బాగా వృద్ధిలో ఉంది. నేనుకూడా అదే వృత్తి చేపడదామనుకున్నాను. నలుగురిదగ్గరా అప్పుచేసి, కొంత పొలం కొన్నాను. పట్టభద్రులైన నిరుద్యోగ యువతకి ఉపాధిక్రింద బేంకుల నుండి ఋణం తీసుకుని చాలీ చాలని మదుపుతో నిర్మాణం ప్రారంభించాను.  డైనమైటు ఉపయోగించండం నేర్చుకుని,  నుయ్యితవ్వి నీరు పడేలా చూడగలిగాను. తర్వాత కోళ్ళ ఫారం నిర్మాణం పూర్తిచేసి అన్నీ సమకూర్చుకున్నాను. ఈ పనులన్నీ పూర్తి చేసింది - నేనూ, మరొక కులీ అంతే .

ఈ పనులు చెయ్యడంలో, చాలా సార్లు నా చేతులకు పగుళ్ళుపడి రక్తం కూడా వచ్చేసేది. అయినప్పటికీ, అది నా జీవితంలో చాలా అద్భుతమైన సమయం. ఒకసారి కోళ్ళ ఫారం పూర్తయి అన్నీ సమకూరిన తర్వాత, ఎప్పుడు అన్నీ అమ్మేసి నా మోటరు సైకిలుమీద  వెళిపోయే అవకాశం వస్తుందా అని ఎదురుచూసేవాడిని.  నేను ఉదయం పనంతా పూర్తి చేసుకుంటే,  ఇక తక్కిన రోజంతా నేనొక్కడినే.. అది ఓ మారుమూల ప్రదేశం..అక్కడ ఎంతో అందమైన చెట్లు ఉండేవి. అయితే చెట్టుమిద కూర్చోడం, దగ్గరే ఉన్న చెరువులో లేదా నుయ్యిలో ఈతకొట్టడం చేసేవాడిని. నాకు కనిపించిన ప్రతి దానిమీదా కవిత్వం రాసాను...అది ఒక గడ్డి పరక అయినా, మిడత అయినా మరేదైనా.  నేను కొన్ని వందల కవితలు రాసాను, కొన్ని చదివాను, ఎక్కువసేపు ధ్యానం చేస్తూ గడిపాను. కానీ, నాకు ఈ కోళ్ళఫారంలో నచ్చనిదల్లా ఒక్కటే... అక్కడి కంపు. దానితో, నాకు ఆ చుట్టుపక్కల మల్లెపూలచెట్లు నాటాలని అనుకున్నాను. దానివల్ల అదనపు ఆదాయం కూడా వస్తుందని అనుకున్నాను. ఆ చుట్టుపక్కలే మల్లెపువ్వులనుండి అత్తరు తీసే కర్మాగారాలున్నాయి.  కిలో మల్లెపూలకి వచ్చే ధరను బట్టి, ఎన్నాళ్ళలో నేను అక్కడినుండి వెళ్ళడానికి సరిపడిన లాభం వస్తుందో లెక్కలు కట్టాను.

కొన్ని ఎకరాల్లో మల్లె మొక్కలు నాటాను. అన్నీ పూలు పూయడం ప్రారంభించాయి.  రాత్రి ఆరుబయట కూర్చున్నపుడు వెన్నెట్లో  విరబూసిన మల్లెతీగెలు చూడడం ఒక మరిచిపోలేని అనుభూతి.  మల్లెపూలు నక్షత్రమండలాల్లా మెరిసేవి, తక్కిన చెట్టంతా మధ్యలో ఉన్న చీకటిలో మిళితమయేది.  నేను ఈ దృశ్యాన్ని బాగా అనుభూతి చెందాను. మల్లెపూల వాసన ఒక మత్తులా ఉండేది.  దానితో నేను ఒక్క పూవుని కూడా అమ్మలేకపోయాను.  చుట్టూ మల్లెపూలు ఉండడంతో కోళ్ళఫారానికి నేను ముద్దుగా "మంత్రముగ్ధ ఫారం" అని పిలిచే వాడిని.  నాగుపాములకి మల్లెలంటే ప్రీతి.  నా నాగుపాములతో, నా మల్లెలతో, నా ధ్యానంతో రోజులు హాయిగా గడిచిపోయేవి.  ఒక్కోసారి నా మోటారు సైకిలు సంగతే గుర్తుండేది కాదు. మొదట్లో మల్లెలు వాసనచూడడం ఒక మధురానుభూతిగా ఉండేది.

సువాసనకి ఒక లక్షణం ఉంది. మీరు సువాసనని మీ లోపలకి ఎలా తీసుకోవాలంటే ... ఆ వాసన పువ్వునుండి గాక మీనుండి వస్తున్నట్టుగా ఉండాలి. అలా తీసుకున్నపుడు మీరు ఒక ప్రత్యేకమైన పరిమాణాన్ని అనుభూతి చెందగలరు. వాసన పువ్వుది కాదు. మీ ఇంద్రియాలు ఆ వాసనను సృష్టిస్తాయి. అందరూ దీనిని ఒకే విధంగా అనుభూతి చెందలేరు. ఉదాహరణకి కుక్కకి వాసన చూడడంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. కానీ, అది మల్లెపూవుని వాసనచూస్తే తల పక్కకి తిప్పుకుంటుంది. అదే ఒక మాంసపు ముక్కని వాసనచూస్తే, దానికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.  కనుక ఇక్కడ అందంగా ఉన్నది మల్లెపూవు అన్న వస్తువు కాదు. అందుకనే యోగ సంప్రదాయంలో, బాహ్యవస్తువులకి అంత ప్రాముఖ్యత ఇవ్వము. మనం దృష్టిపెట్టాల్సింది మన అవగాహనకు ఉపకరించే సాధనాల మీదే. మీరు అనుభూతి చెందుతున్న అనుభవానికున్న శ్రేష్ఠతని, విలువని నిర్ణయించేది మీరే. వ్యక్తులు అరుదుగా పరిశోధించే ఇంద్రియజ్ఞానాలలో వాసన ఒకటి. అదే సమయంలో, అన్నిటిలోకీ సరళమైనదీ, పరిమితమైన ప్రమాణం కలిగినదీ కూడా అదే.

ఏ నిర్ధారణలు చెయ్యకుండా, కేవలం ఒక ఇంద్రియానుభూతిని అనుభూతి చెందాలని మీరు అనుకున్నపుడు, ఒక మల్లెపువ్వును వాసనచూడడమనే ప్రక్రియతో మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. దాని లక్ష్యం మల్లెపువ్వు వాసనని ఆనందించడం కాదు. మల్లెపూవు సుగంధాన్ని ఆసరాగా చేసుకుని, వాసన చూడడమనే ఇంద్రియానుభూతిని తెలుసుకోవడం. ఇంద్రియాలు ఎలా అనుభూతికి లోబడతాయో ప్రయోగాత్మకంగా అర్థం చేసుకునే అవకాశమన్నమాట. ఒక విషయాన్ని మంచీ చెడూ, బాగుందీ బాలేదు అన్న ఏ రకమైన నిర్ణయాలూ లేకుండా సమీపించడం. అది ఎలా ఉంటే అలా తీసుకోవడం. చాలా సందర్భాల్లో మీకు కలిగే ఆనందం మీరు అది మంచిదనో, కాదనో, దాని గురించి ముందుగానే మీరు ఏర్పరచుకున్న భావనలవల్లే వస్తుంది. ఏదైనా వస్తువు బాగుంటుంది అని మీరనుకునపుడు మీరు దాన్ని ఆనందంగా అనుభవిస్తారు; అలాగే, ఒక వస్తువు బాగోలేదని నిర్ణయించుకున్నపుడు అది అనుభూతి చెందినపుడు బాధపడతారు.  మీరు దాన్ని ఇలా పరిశీలించవచ్చు:  మల్లెపువ్వుకి వాసన ఉంది. అది మంచో చెడో నిర్ణయించవలసింది మీరు కాదు. కానీ, మీరు దాని సుగంధాన్ని ఆసరా చేసుకుని మీ వాసన చూడగల శక్తిని అనుభూతి చెందగలరు.

మీరు ఈ ప్రయోగం చెయ్యవచ్చు:  మీ ఎడం చేతిలో బొటనవేలుకీ ఉంగరపు వేలుకీ మధ్యన మల్లెపూవు ఉంచుకొండి. ముఖం కొద్దిగా పైకెత్తి కూచుని కళ్ళు మూసుకొండి. మీ కుడిచేతి బొటనవేలితో మీ ముక్కు కుడి రంధ్రాన్ని మూసివేసి ఎడమ రంధ్రంద్వారా మామూలుకంటే 10 శాతం దీర్ఘంగా గాలి పీల్చండి. పువ్వుని మీ ముక్కుకి 6 అంగుళాల దూరంలో ఉంచండి. మీకు వాసనమీద దృష్టి ఉంటే, దాన్ని కొంతదూరంనుండి అనుభూతి చెందగలరు. అవసరం అయితే ముక్కుకి దగ్గరా తీసుకురండి. కేవలం వాసన మాత్రమే చూడండి. మీరు కళ్ళు మూసుకునే ఉండండి. మీ చుట్టుపక్కల వినిపించే శబ్దాలను పట్టించుకోకండి. దానివల్ల మీ వాసనచూడగల శక్తి పెరుగుతుంది. మీ వినికిడి శక్తి, వాసనచూడగలగడం, రుచి చూడగలగడం, చూడడం... మొదలైన వన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చెయ్యబడి ఉన్నాయి... భౌతికంగా కూడా.  ఒక రకమైన ఇంద్రియ జ్ఞానం పెరగాలంటే  మరొకటి తగ్గాలి. మీరు కేవలం వాసన చూడడం మీదనే దృష్టిపెట్టండి... మల్లెపూవు సువాసనమీద కాదు. అది బాగుందా లేదా అన్న ఏ నిర్ణయమూ చెయ్యకండి.

ఇదే సువాసన ధర్మం: మీరు సువాసనలోని సౌందర్యాన్ని తెలుసుకోగలిగితే, మీరు రసికులౌతారు. మీకు సువాసనలోని రసాయన లక్షణాలు తెలిస్తే, మీరు శాస్త్రవేత్త అవుతారు.  మీరు సువాసనలోని పరమానందాన్ని అనుభూతి చెందగలిగితే, మీరు మార్మికులౌతారు.  మీరే సువాసనగా మారినపుడు, ఈ సృష్టిమూలం మీరే అవుతారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు