ఈ వారం సద్గురు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల మీద దృష్టిపెట్టి, మనలో చాలామంది ఎందుకు నిర్ణయాలు తీసుకుంనేందుకు సతమతమౌతారో, అస్తిత్వపు కోణంనుండి చూపిస్తారు. సద్గురు "మీరు ఏమి చేసినప్పటికీ అది మీకు బాధాకరంగా అనిపిస్తోంది. దానికి కారణం ఏమిటంటే, ‘మీరు’కాని వస్తువులతో మిమ్మల్ని మీరు గుర్తించుకోడానికి ప్రయత్నిస్తున్నారు," అంటారు.  దీనితో పాటే ఆయన ఈ మధ్యనే  రాసిన ఒక "జీవి"  అనే కవితను పంపుతూ ... లేని ప్రయాణాన్ని నిలుపుచేయడం ద్వారా, మీరు ఒక "జీవి"గా అవతరించడంలోని బ్రహ్మానందాన్ని తెలుసుకోగలరు అని చెబుతున్నారు.

Sadhguruతమ జీవితాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సలహా ఇమ్మని, ప్రతిరోజూ నా దగ్గరకి చాలామంది వస్తుంటారు. వారు ఆ నిర్ణయం తీసుకోవడానికి సతమతమవుతున్నామని చెప్తూ ఉంటారు. ఇవి ఎలాంటి విషయాలంటే, ఉదాహరణకి... ఏ వృత్తి ఎంచుకోవాలి, పెళ్ళి, పిల్లలు, ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమవడం, లేదా విడాకులు పుచ్చుకోవడానికి ప్రయత్నించాలా అక్కరలేదా ఇంకా మొదలైనవి. మనం జీవితాన్ని అస్తిత్వకోణంలోంచి చూడడానికి ప్రయత్నిద్దాం. మీరు ఒంటరిగా పుట్టారన్నది సత్యం. కానీ, మీరు తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు – అది పెళ్ళిచేసుకుందామని. ఇలాంటి సందర్భంలో, మీరు ముందున్న స్థితికి మరలడమన్నది చాలా సరళమైన నిర్ణయం. కానీ, మీరు చేస్తున్న ప్రతిదానితోనూ మిమ్మల్ని మీరు గుర్తించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మీతో ఉన్న వ్యక్తిని మీరు మీ ఆస్థిగా పరిగణిస్తున్నారు. అందువల్లే మీకు ఏ  నిర్ణయం తీసుకోవాలన్నా కష్టంగా అనిపిస్తుంది. నిజానికి, ఒకవేళ మీరు రేపు ఈ శరీరాన్ని విసర్జించాలనుకున్నా, అదేమంత కష్టమైన నిర్ణయం కాకూడదు. అసలు ‘మీరు’ అన్నది ఉంటే కదా.  మరొకరి చేష్టకి అనుబంధంగా వచ్చిన ఫలితమే, ఇప్పటి మీ ఉనికి.

అందుకే మీరు ‘ఇప్పుడు’ ఉన్నారు.  తిరిగి "అభావస్థితి" కి మరలడం చాలా సామాన్యమైన నిర్ణయం.  జీవితంలో కఠినమైన నిర్ణయాలు అంటూ ఉండవు.  చాలా వస్తువులతో మిమల్ని మీరు గుర్తించుకోవడం వల్లే,  ప్రతి నిర్ణయం మిమ్మల్ని అశాంతికి గురిచేస్తుంది. లేకపోతే, అది విడాకులైనా, మరణమైనా మరొకటైనా కష్టపడి తీసుకోవలసిన నిర్ణయం కాకూడదు. ఒక నిర్ణయం మీకెంతో ముఖ్యమైనది కావచ్చు. కానీ, జీవితంలో అది మరొక మెట్టు, అంతే..! ఎదో ఒకటి జీవితంలో జరగవలసింది జరుగుతుంది. జీవిత పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పక తీసుకోవాల్సిన అవసరం రాక మునుపే, మీరే  సచేతనంగా నిర్ణయాలు  తీసుకోవడం మంచిది .

భారతదేశంలో పెళ్ళిచేసుకోవడం చాలా సులభం. విడాకులు చాలా కష్టం. పాశ్చాత్య దేశాల్లో పెళ్ళి కష్టం, విడాకులు సులభం. రెండూ భిన్నమైన సంస్కృతులు. కానీ, రెండు సమాజాల్లోనూ, ప్రజలకి మౌలికంగా ఒకేరకమైన సమస్య. 

కనుక, నిర్ణయం తీసుకోవడం అనేది కష్టమైన విషయం కాదు. అందులో మీకు కష్టం కలగడానికి కారణం ఏమిటంటే, మీ చుట్టూ ఉండే అనేక వస్తువులతో మీరు ఒక అనుబంధాన్ని పెంచుకుంటారు కాబట్టి. పాశ్చాత్య సమాజాల్లో,  చాలా మందికి పెళ్ళి చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడం ఎంతో కఠిన సమస్య. వాళ్ళు ఒకరితో చాలాకాలం నుండీ జతగా జీవిస్తూ ఉండి ఉండవచ్చుగాని, పెళ్ళికి సంబంధించిన  విషయం వచ్చేసరికి, ఓ నిర్ణయం తీసుకోవడానికి సతమతమౌతారు. దానికి కారణం పెళ్ళి అనగానే, వాళ్ళు అనుబంధం పెంచుకున్న కొన్ని చిన్న చిన్న వస్తువులని కోల్పోవలసి వస్తుంది. అలాగే విడాకుల విషయంలో కూడా అదే సమస్య తలెత్తుతుంది. కాకపొతే, వారికిది అంత తీవ్రమైనది కాకపోవచ్చు. భారతదేశంలో పెళ్ళిచేసుకోవడం చాలా సులభం. విడాకులు చాలా కష్టం. పాశ్చాత్య దేశాల్లో పెళ్ళి కష్టం, విడాకులు సులభం. రెండూ భిన్నమైన సంస్కృతులు. కానీ, రెండు సమాజాల్లోనూ, ప్రజలకి మౌలికంగా ఒకేరకమైన సమస్య. మనుషులకి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కష్టం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే , అది ఏదోవిధంగా మీకు అసంతృప్తి కలిగించి బాధపెడుతుంది. దినంతటికి కారణం, మీరుకాని చాలా విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకోడానికి ప్రయత్నించడమే. అది ఒక ముళ్ళకంచెకి మీరు చిక్కుకున్నట్లుగా ఉంటుంది. ఎటు కదిలినా గాయం అవుతుంది. ముళ్ళు అన్ని దిక్కులా ఉంటాయి కాబట్టి, మీరు స్థిరంగా కదలకుండా ఉండలేరు కాబట్టి, అక్కడ ఏమున్నా దాన్ని భరించవలసిందే. అది మిమ్మల్ని బాధించినప్పటికీ మీరు కదలకుండా ఉండలేరు, ఎదో ఒక వైపు మీరు కదలాల్సిందే.

మరి ఈ ముళ్ళకంచె నుండి బయటపడెదెలా? నిజానికి ఈ ముళ్ళన్నీ ఊహాజనితాలే. మీ జీవితంలో ఆనందం కలిగించవలసిన ఎన్నో పార్శ్వాలు మీ గుర్తింపుల కారణంగా, మీకు ముళ్ళలా అనిపించి, మీ దుఃఖానికి కారణమవుతున్నాయి. మీ భర్త, భార్య,  పిల్లలు, మిత్రులు, మీ కుటుంబం… ఇవన్నీ బహుశా మీరు ఎల్లప్పుడూ కోరుకునే చిన్న సుఖాలు అయి ఉండవచ్చు. కానీ అవి దుఃఖంగా పరిణమించడానికి కారణం ఏమిటంటే, వాటితో మీరు అతిగా మమేకమవడమే. అందుకే జీవితానికి చెందిన ప్రతి ప్రక్రియా మిమల్ని ఏదోవిధంగా బాధిస్తోంది. మీరుకాని అనేక వస్తువులతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ, అదే సమయంలో, మిమ్మల్ని ఏదీ బాధించకూడదని కోరుకుంటున్నారంటే, దానర్థం మీరు జీవన ప్రక్రియ కొనసాగకూడదని కోరుకుంటున్నారన్నమాట. మీ ఆశలకి విఘాతం కలిగించే పరిస్థితిని మీరే కల్పించుకుంటున్నారు. మీరూ, మీ శరీరమూ ఒకటే అన్నపొరపాటు చెయ్యనంతకాలం, మీరు మిమ్మల్ని దేనితోనూ,ఎవరితోనూ గుర్తించుకోరు. ‘ఒకరితో కలిసి ఉండడం’, ‘ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం’…రెండూ వేర్వేరు విషయాలు. ఒకరితో కలిసి ఉండడం ద్వారా మీరు జీవితాన్ని సృష్టిస్తున్నారు. ఒక బంధనాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మీరు ఆ వ్యక్తి మరణాన్ని కోరుకుంటున్నారు.

 

"జీవి"తం

అర్థంలేని ఈ జీవితయానం, 

మిమ్మల్ని ముందుకి కదలమని తోస్తుంటుంది, 

ఆగిపోతే మరణం కాబట్టి. వెళ్ళమనీ, వేళుతూ ఉండమనీ. 

కానీ వెళ్ళడానికి ఏముంది? 

ఉన్నదల్లా నాలోనే ఉంటే. 

కాలమూ, ఈ విశ్వాంతరాళమూ అజ్ఞానకల్పితాలైన ఆభాసలు. 

జీవితపు నీడని జీవితంగా భ్రమింప జేస్తుంది. 

ఆ నీడ పొడవు వెడల్పులు నిర్ణయించడంలోనే, 

మన అజ్ఞానం ఘనీభవిస్తుంది. 

ఎక్కడికెళ్ళాలి? ఎంతదూరం వెళ్ళాలి? అన్నది కాదు ప్రశ్న. 

లేని ప్రయాణాన్ని నిలుపుచెయ్యడం ద్వారానే,

 నువ్వు "జీవి"తం లోని రసానందాన్ని గ్రహించగలవు

ప్రేమాశిస్సులతో,
సద్గురు