వ్యక్తులు, సమాజాలు ఇంకా దేశాలు కూడా సంపాదనే ధ్యేయంగా ఎందుకు ఉన్నాయంటే, వారికి కావాల్సింది వారు ఎంపిక చేసుకునే అదృష్టాన్ని పొందడం కోసం. మానవులకు వారి జీవితంలో అతివిలువైంది దొరికినప్పుడు, ఆ విషయానికి అనుగుణంగా వారు తమ జీవితాన్ని మలుచుకోగలగాలి. మీరు ఒక విషయం ఎంతో ప్రాముఖ్యత కలిగినదని  తెలుసుకున్నప్పుడు, దానికోసం మీరు మీ దిశను మార్చుకోవడం ముఖ్యమే కదా? కానీ దురదృష్టవశాత్తు, చాలా సంపన్న సమాజాలు కూడా తమ జీవనశైలిని ఆ దిశకు మార్చుకోలేని విధంగా తమ జీవితాల్ని గడుపుతున్నారు.

ఒక వ్యక్తి నిజమైన సాధకుడిగా మారకపోవడానికి ఉన్న ఒకే ఒక్క సమస్య వారిలో ఉన్న విముఖతే

తమ జీవన శైలిని తాము కోరుకున్న విధంగా మలుచుకోలేక పోవడం వల్ల,  ఆధ్యాత్మిక అవకాశాలను చాలా వరకు వారు శాశ్వతంగా నాశనం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి నిజమైన సాధకుడిగా మారకపోవడానికి ఉన్న ఒకే ఒక్క సమస్య వారిలో ఉన్న విముఖతే. ప్రతిరోజు, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వారు ముక్తికి ఎంతో దగ్గరగా వస్తారు, కానీ వారికి వారే అడ్డుకట్ట వేసుకుంటారు. ఇందుకు కారణాలు - కొత్త ఇల్లు కొని దానికి చేసిన అప్పును మరో 30 సంవత్సరాలు కట్టాల్సి ఉండడం లాంటివే. ఇలాంటి పోకడలు ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ, కానీ మిగతా దేశాల వారు కూడా ఇందుకు ఎంతో దూరంలో లేరు. ఇక్కడే ఒక వెయ్యి సంవత్సరాలు ఉంటాం అన్నట్టుగా జీవితానికి సంబంధించిన ప్లాన్ లని వేసుకుంటున్నారు.

“ఎప్పటికైనా నేను మరణిస్తాను, ఇక్కడే ఉండడం శాశ్వతం కాదు” అని నిరంతరం ఎరుకతో ఉండడమే గొప్ప స్వేచ్చ.

ఒక వేళ, రేపు ఉదయం మీకు దైవం తారసపడింది అనుకోండి, మీరు చెల్లించాల్సిన  చదువు తాలూకు అప్పు, ఇంటి తాలూకు అప్పు లేదా  45 సంవత్సరాల ఆరోగ్యభీమా ప్లాన్ చెల్లింపులు ఉండటం వల్ల, మీరు దైవం వైపుగా వెళ్లలేరు. ఈ ప్లాన్ అంతా బీమా సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వం ఇలా అందరూ కలిసి ఏర్పరచినవి, మరి మీరేమో దానిని మార్చరు. ఆ సృష్టికర్త మీకోసం చేసిన ప్లాన్ ఒకటే, మీరు సంపూర్ణమైన జీవంగా పరిణితి చెందడం. సృష్టి మూలం మీ జీవితానికి ఏ ప్లాన్ ఉద్దేశించిందో, అదే కదా ముఖ్యం. కానీ మీ జీవితం మొత్తం “నాకేమౌతుందో? నాకేమౌతుందో?” అనే ఒక భయాందోళనలోనే ఉంటే, అలాంటి జీవితం ఓ విషాదం..!. మీరెంత బీమా చేయించినా సరే, రేపు ఉదయమే మీరు మరణించవచ్చు, అటువంటి అవకాశం లేకపోలేదు. “ఎప్పటికైనా నేను మరణిస్తాను, ఇక్కడే ఉండడం శాశ్వతం కాదు” అని నిరంతరం ఎరుకతో ఉండడమే గొప్ప స్వేచ్చ. “నేను జీవిస్తున్న ప్రతి క్షణం నాకు ఎరుకలోనే ఉంటుంది, ఇంకా ఎన్ని క్షణాలు మిగిలి ఉన్నాయో కూడా నాకు తెలుసు - అవి అపరిమితమైనవి కావు, అవి పరిమితమైనవి. నేను కోరేదేంటంటే, మీరు కూడా మీకు ఎంత సమయం ఉందో తెలుసుకోవాలి. మీరు మీకిష్టమైన దానికోసం సమయం  కేటాయించకపోతే  జీవితమంతా అప్పులు తీర్చడంతోనే గడిచిపోతుంది, మీ అప్పుల కంటే ముందే మీ ఆయుష్షు తీరిపోవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు