Sadhguruఏ సమాజంలోనైనా సరే "బాబోయ్ నిప్పు" అని బిగ్గరగా అరిస్తే, అది పెద్ద కలకలం రేకెత్తిస్తుంది. నిప్పు సాధారణంగా ప్రమాదభరితమని అందరూ భావిస్తారు... అది మీరు ఎప్పుడు దాన్ని సరిగ్గా అదుపులో ఉంచలేకపోయినా ప్రమాదం కొనితెస్తుందనడంలో సందేహం లేదు. మనం ఒక సారి నిప్పు లేదా అగ్నిని పంచభూతాలలో ఒక మూలకంగా దాని పరిధుల్ని... అది ఎన్ని రకాలుగా ప్రకటితమౌతుంది, దాన్ని ఎన్నిరకాలుగా వ్యాప్తిచేయవచ్చు, అన్నిటికీ మించి దాన్ని ఏ విధంగా అదుపుచేయవచ్చు అన్నవి గమనిద్దాము. పంచభూతాలలో ఒకటైనప్పటికీ, అగ్ని మానవశరీరంలో అల్ప ప్రమాణంలో ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం అనల్పం. అగ్నిని పరికించినపుడు, దాన్ని ఎన్నో రకాలుగా ప్రాణానికి పర్యాయపదంగా భావించవచ్చు. అసలు మీరు బ్రతికి ఉన్నారా లేదా అని నిర్థారించడానికి మీ శరీరంలో వెచ్చదనం ఇంకా మిగిలి ఉందా లేక మీ శరీరం చల్లబడిపోయిందా అన్నది ముఖ్య సూచిక. ఈ భూమి మీద జీవకోటి అంతా సూర్యుని వేడి వలననే బతుకుతోంది. ఏ యంత్రమైనా పనిచేస్తున్నపుడు ఉత్పత్తి చేసేది వేడే, ఎందుకంటే మౌలికంగా అన్నిటికీ ఇంధనం అగ్నే. ఆ ఇంధనాన్ని మీరు విద్యుత్తనీ, పెట్రోలనీ, కర్రనీ, బొగ్గనీ లేదా ఏదో ఒకపేరుపెట్టి పిలవచ్చు. మౌలికంగా అటు యంతృన్నైనా, ఇటు మీ శరీరాన్నైనా నడిపించేది ఈ అగ్నే.

మీ చిత్తాగ్నిని కూడా అలాగే ప్రజ్వలించకపోతే, మీ వివేకము బలహీనమై, అసమర్థమౌతుంది.

మనలో ఉండే రెండవరకమైన అగ్ని పేరు చితాగ్ని. అది మనసుకీ, దాని పరిధికీ అతీతమైన ప్రమాణంలో ఉంటుంది. "చిత్తం" అంటే  భౌతిక పరిమాణాన్ని అధిగమించడానికి,  మీ మనసులో ఉండే మేధస్సు యొక్క ప్రమాణమే. మీ భౌతిక శరీరాకృతి మీ జన్యు సంబంధమైన, కర్మ సంబంధమైన జ్ఞానము ద్వారా సంక్రమించేది. దానికి విరుద్ధంగా, "చిత్త"మనే మీ మేధో పరిమాణానికి అటువంటి పరిమితులు లేవు. ఈ మేధస్సు అనే అగ్ని అనేక స్థాయిలలో ప్రకటితమవవచ్చు. యుక్తాయుక్త వివేచన మొదటి స్థాయి. మీ శరీరంలో జ్వలించే అనేకరకాలైన అగ్నులని పరీక్షిస్తే, మీ జీర్ణసంబంధమైన అగ్ని సరిగా పనిచేస్తేనే, మీ పునరుత్పత్తి అగ్ని ద్యోతకమౌతుంది. మీరు శరీరాన్ని సరిగా పోషించకపోతే, మీకు పునరుత్పత్తి ఆలోచనలు క్షీణిస్తాయి. మీ చిత్తాగ్నిని కూడా అలాగే ప్రజ్వలించకపోతే, మీ వివేకము బలహీనమై, అసమర్థమౌతుంది. కానీ, మీ చిత్తాగ్నిని బాగా ప్రజ్వలించగలిగితే, అది మీరు సచేతనంగా మేధస్సు యొక్క ఇతర ప్రమాణాలని గ్రహించగలిగిన స్థితిలో లేకున్నప్పటికీ, అది ప్రస్ఫుటంగా ఉంటుంది. మన సంస్కృతిలో ఈ అగ్ని అనే మూలకాన్ని రెండు ముఖాలు కలిగి చాలా పౌరుషంగా ఉండే పొట్టేలు వాహనంగా గలిగిన అగ్నిదేవుడుగా భావిస్తాము. ఈ రెండు ముఖాలూ ఒకటి జీవితాన్ని ప్రసాదించడానికీ, రెండవది జీవితాన్ని హరించడానికీ ప్రతీకలు. మనలో అగ్ని జ్వలించకుండా మనకి ప్రాణం నిలబడదు. కానీ, మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఈ అగ్ని పట్టుతప్పి, అన్నిటినీ హరిస్తుంది. అది మన శరీరాన్ని దహించినపుడు దాన్ని దహనము అంటాము. అదే అగ్నిని మనకి తినడానికి అయోగ్యంగా ఉండేవాటిని ఉడికించి కాల్చి రుచికరంగా, తినడానికి వీలుగా చేసేందుకు వినియోగిస్తున్నాము. అలా అగ్నికి మన శరీరం బయటా, లోపలా ఎన్నో ప్రమాణాలున్నాయి. మన శరీరంలో మండే అగ్నులని ఒకసారి గమనిద్దాము. అందులో ఒకటి జఠరాగ్ని.  'జఠరం' అంటే ఉదరము, పొట్ట లేదా జీర్ణక్రియ. మీరు తింటున్నదాన్నంతటినీ మీ పొట్టలో ఏమాత్రమైనా అగ్నిలేకుండా  దాన్ని జీర్ణం చేసుకోలేరు. ఇక్కడ ఆహారం ఇంధనంగా పనిచేస్తోంది, దాన్ని మీరు విడగొట్టి దానిలో నిబిడీకృతమైన శక్తిని మీ అవసరానికి తగ్గట్టు వెలువరించడానికి. మీ జఠరాగ్నికి ఇంధనం సరిగా సమకూర్చి జాగ్రత్తగా పోషిస్తే, అది పునరుత్పత్తి అగ్నిగా మారుతుంది. ఈ జీర్ణక్రియ, పునరుత్పత్తీ రెండూ జఠరాగ్నిమీద ఆధారపడి ఉన్నాయి.

మీ చితాగ్ని గనుక బాగా తేజోవంతంగా ప్రజ్వలిస్తుంటే, మీకు ఆహారం మీదా, విషయాసక్తితో సహా, ఏ భౌతిక సుఖాలమీదా కోరిక ఉండదు.

శరీరిక హద్దులు స్పష్టమైనవీ, పరిమితమైనవీ. కానీ, "మనసు" కున్న హద్దులు చాలా విశాలమైనవి. ఉదాహరణకి, మీకు ఈ ప్రపంచంలో మరొక ప్రదేశం గురించి కొంత తెలిస్తే, అది మీ మనసు హద్దుల్లో ఉందన్నమాట. మీ జ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ, మీ మనసు సరిహద్దులుకూడా విశాలమవుతుంటాయి. కానీ మీరు భూతాగ్ని, లేదా అగ్ని మూలకపు మౌలిక ప్రమాణాన్ని అవగాహన చేసుకోగలిగితే, మీరు సరిహద్దులులేని వ్యక్తిగా మార్పుచెందుతారు;  కారణం, ఈ సృష్టి అంతా పంచభూతాల విన్యాసంతో నిండి ఉంది. దీనికి అతీతంగా సర్వాగ్ని అని ఒకటి ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, మన అవగాహన పరిధిలోని సృష్టి మొత్తం అంతా 5 శాతానికి మించదు. దాని అర్థం, ఇప్పుడున్న సృష్టి అంతటిగురించీ మీకు పరిపూర్ణంగా తెలుసుననుకుంటే, అది తెలుసుకోవలసినదానిలో 5 శాతంకూడా ఉండదన్నమాట. సర్వాగ్ని ఈ మూలకాల ఉనికి లేనిచోటుని, మనకు తెలిసిన సృష్టిస్వభావం లేనిచోటుని,మరోలా చెప్పాలంటే, అసలు భౌతిక ప్రపంచంలేని చోటుల్ని తాకుతుంది. మీ చితాగ్ని గనుక బాగా తేజోవంతంగా ప్రజ్వలిస్తుంటే, మీకు ఆహారం మీదా, విషయాసక్తితో సహా, ఏ భౌతిక సుఖాలమీదా కోరిక ఉండదు. దురదృష్టవశాత్తూ ఈ ఐహిక సుఖాలమీద  కలిగే విముఖత "పరిత్యాగం " అని తప్పుగా పిలవబడుతోంది, ఇంద్రియాల పరిధిని అధిగమించడం అనాలి.  దాని తర్వాతి ప్రమాణం భూతాగ్ని... ఇది మౌలిక అగ్ని. ఈ మౌలిక అగ్ని ప్రముఖంగా ఉంటే, మీ మనసూ, శరీరమూ చేసే విన్యాసాలు మీకు అర్థవంతంగా కనిపించవు. ఈ శరీరమూ మనసూ చేసే విన్యాసాల నుండి మీ దృష్టి, సృష్టి ప్రక్రియ తెలుసుకునే వైపు ... సృష్టి మూలం వైపు, మరలుతుంది. మీరు జఠరాగ్నిని నియంత్రించగలిగితే మీకు ఆరోగ్యకరమైన, పుష్టిగల దేహం ఉంటుంది.  మీ చిత్తాగ్ని మీ నియంత్రణలో ఉంటే, మీ మనసు మీ అధినమై ఎన్నో పనులు చెయ్యగలుగుతారు. మీరు భూతాగ్నిని వశం చేసుకోగలిగితే, జీవన ప్రక్రియలపై మీకు సాధికారత సిద్ధిస్తుంది.

సాధారణంగా, జీవన ప్రక్రియలపై జిజ్ఞాస కలిగిన యోగి, జఠరాగ్ని, చిత్తాగ్ని, భూతాగ్ని గురించి పట్టించుకోడు. అతని దృష్టి అంతా సర్వాగ్ని మీదే ఉంటుంది. అదే అన్ని అగ్నులలో పరమోత్కృష్టమైనదీ, సునిశితమైనదీ. జఠరాగ్ని స్పష్టంగా కనిపించే అగ్ని. చిత్తాగ్ని అంత స్పష్టం కాకపోయినా ఉందని తెలుస్తుంది. భూతాగ్ని అసలు ఉందని కనిపించదు గాని దాని ఉనికి ఉంటుంది.  సర్వాగ్ని ఊహకి అందదు గాని, అది లేకుండా ఏదీ జరగదు. అన్ని అగ్నులనీ పరివేష్టించి ఉండే మౌలికమైన, సర్వోత్కృష్టమైన  అగ్ని అది. ఈ అగ్ని ఆకాశానికి లేదా ఈధర్  పొర సమీపంగా ఉంటుంది. ఈ ఆకాశము లేదా  ఈధర్  పొర ,  అగ్ని ఉన్నపుడు అందుకో శక్యంగా ఉంటుంది, ముఖ్యంగా కొన్ని రకాల ఇంధనాలు వాడినపుడు ఉత్పన్నమయే అగ్ని వలన. దక్షిణభారతదేశంలో దీపాలు వెలిగించడానికి నువ్వులనూని గాని, నెయ్యిగాని వాడతారు.  ఆ రెండూ లభ్యం కాకపోతే వేరుశనగ నూనె, అదీ దొరకకపోతే, కొబ్బరినూనె వాడతారు. ఈ నూనె ఆధారంగా ప్రజ్వలన చేసే దీపాలకి ఒక లక్షణం ఉంటుంది. ఇతర ఇంధనాలకంటే ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద పొగ బారతాయి. అందుకనే మీరు మంట గమనిస్తున్నపుడు, దాని మధ్యలో చూడకూడదు, అంచుని చుడాలి అప్పుడే  ఈధర్  పొర  మీకు అవగతమౌతుంది.

మీరు ఎప్పుడు అనువైన వాతావరణం సృష్టించాలనుకున్నా, మీరు ముందుగా చెయ్యవలసింది నూనె దీపమో, నెయ్యి దీపమో వెలిగించడం.

ఈ సంస్కృతిలో, మనుషుల జీవితాలకు సంబంధించి ఏ ముఖ్య ఘట్టం జరిగినా అది అగ్ని చుట్టూనే జరుగుతుంది. అగ్ని లేకుండా, ఏ పూజలూ లేవు, ఏ పెళ్ళిళ్ళూ లేవు అసలు ఏ ముఖ్యమైన సంఘటనలూ జరుగవు. అగ్నిని అనేక రూపాలుగా, మార్గాలుగా వినియోగించడం ఈ సంస్కృతిలో స్థిరపడిపోయింది... బలులు ఇచ్చే హోమాలనుండి, హవనముల వరకూ. అగ్ని ఆకాశాన్ని లేదా శూన్యాన్ని చేరువలోకి తెస్తుంది. మనని రూపుదిద్దిన ఐదు మూలభూతాలలోనూ,ఆకాశంఒక్కటే పారదర్శకమైనదీ, అస్థిరమైనదీ. మీ శరీరంలోనూ, నా శరీరంలోనూ ఉన్న భూమి మౌలికంగా ఒక్కటే, కానీ మీశరీరంలో ఉన్నది, నా శరీరంలో ఉన్నది పూర్తిగా భిన్నం. మీలో ఉన్న నీరు, నాలో ఉన్న నీరు కూడా వేరుగానే ఉన్నాయి. ఒక రకంగా, వేర్వేరు పాత్రలలో ఉంచినది ... అని మీరు అనవచ్చు.  కానీ మనం పీల్చే గాలిని అలా వేరుచెయ్యలేము. అది నిరంతరం ఒకదానిలోంచి రెండవదానిలోకి మార్పిడి జరుగుతూ ఉంటుంది. మనం ఏమిటి అని తెలియజేసే అగ్ని అంశ అంతకంటే ఎక్కువగా పాలుపంచుకుంటాము. ఈ ఆకాశాన్ని పరిపూర్ణంగా పంచుకుంటాము. మనందరం ఒకే ఆకాశం (శూన్యం) లో ఉన్నాము. ఈ ఆకాశ అంశని ఏ వాతావరణంలోనైనా అధికం చెయ్యగలిగితే, మనుషుల మధ్య ఒక విధమైన అనుబంధం కలుగుతుంది. అగ్ని చుట్టూ, జతకూడడమూ, సంభాషించుకోడమూ చాలా ఎక్కువగా వృద్ధిని కలిగిస్తాయి. కారణం, ఎక్కడ అగ్ని ఉంటుందో, అక్కడ ఆకాశం ప్రభావం ప్రబలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు అనువైన వాతావరణం సృష్టించాలనుకున్నా, మీరు ముందుగా చెయ్యవలసింది నూనె దీపమో, నెయ్యి దీపమో వెలిగించడం. ఇది భారతీయ జీవన సరళిలో ఒక ముఖ్య భాగం.

అత్యధికమైన ఫలితం రావాలంటే దీపానికి వాడే ఇంధనం ఒక ప్రత్యేకమైనది అయి ఉండాలి. కొవ్వొత్తులకి ఈ రకమైన ప్రభావం ఉండదు, ముఖ్యంగా రసాయనికంగా తయారుచేసిన మైనంతో చేసినవాటికి. ఈ ప్రక్రియలో మీరు ముఖ్యంగా ప్రయత్నిస్తున్నది తనచుట్టూ ఒకరకమైన కాంతివలయాన్ని సృష్టించగల ఒకానొక వస్తువుతో అగ్నిని ప్రజ్వలింపజేయడం.  దానివల్ల ఆకాశం చేరువౌతుంది. ఒక నూనె దీపంతో మీరూ మీ కుటుంబసభ్యులూ లాభంపొందేలా ఒక ఆకాశక్షేత్రాన్ని సృష్టిస్తున్నారు. ఇంట్లో ముఖ్యంగా పసిపిల్లలూ, గర్భిణులూ, రోగులూ,ఉన్నప్పుడూ, మామూలుగా అందరి ఆరోగ్యానికీ ఇంట్లో నూనె దీపం వెలిగించడం ఆవశ్యకం. ఆ అగ్ని మీ ఆరోగ్యానికీ, పుష్టికీ మీలోని జఠరాగ్నిని ప్రజ్వలనం చేయడమే గాక, చిత్తాగ్నిని రగిల్చి ఆకాశాన్ని అందుబాటులోకి తెస్తుంది. మీలోని వివేకజ్ఞానము ప్రజ్వలిస్తూ ఉండడం చాలా ముఖ్యం. ఒక్క భౌతిక అగ్నులే మండుతూ, మీ వివేకము జ్వలించనపుడు జీవితం దుర్భరమై, భయానకంగా రూపుదిద్దుకుంటుంది. జఠరాగ్నీ అత్యధికమై, చిత్తాగ్ని నామమాత్రంగా ఉన్నపుడు, మనుషులు మూర్ఖాతిమూర్ఖమైన పనులు చేస్తుంటారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ద్రవ్యరాశిపరంగా మనశరీరంలో అతి తక్కువభాగం ఉన్నప్పటికీ,  దానికున్న విశేషలక్షణం వలన, ప్రభావరీత్యా ఎంతో ముఖ్యమైనది. మీరు అగ్నిని స్పృశించగల అవకాశం అతి స్వల్పం. అదే సందర్భంలో, అగ్నికి మీరు చాలా సున్నితంగా ,త్వరగా స్పందిస్తారు. వాతావరణంలో సమచారం బట్వాడా అవడానికీ, అందుకోగల సామర్థ్యాన్ని పెంచడానికీ, పరిమితులని అధిగమించడానికీ, సృష్టికి మూలకారణాన్ని మీరు దైవమనో, భగవంతుడనో మీకు ఎలా తోస్తే అలా పిలవబడే మరొక ప్రమాణాన్ని అందుకోడానికీ అగ్ని ఒక సాధనం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు