ఈ వారం సద్గురు - భారతదేశంలో తరిగిపోతున్న నదుల గురించి, వాటికై మనం సరైన చర్యలు తీసుకోకపోతే జరిగే అనర్థాల గురించి  వ్రాస్తున్నారు. మనం నీటిని, మట్టిని, నీటి వనరులను ఎంతగా విధ్వంసం చేస్తున్నామంటే; మరో పదిహేను-ఇరవై సంవత్సరాల్లో ప్రజల దాహాన్ని తీర్చడానికి, వారికి ఆహారం కల్పించడానికి మన దగ్గర ఎటువంటి వనరులు ఉండవని, మనకు ఇక్కడ సద్గురు చెప్తున్నారు.

Sadhguruనదుల గురించి మీరేమనుకుంటున్నారు..? – అని నన్నడిగితే “నదులు మన భారత నాగరికతకు మూలం” అని అంటాను. ఇందు, సట్లెజ్, సరస్వతి నదుల తీర ప్రాంతంలోనే ఉత్తరభారత దేశ నాగరికత అంతా కూడా మొదలైంది.  కృష్ణ, కావేరీ, గోదావరి నదీ ప్రాంతాల్లో దక్షిణభారత నాగరికత మొదలైంది. ఈ నదులూ, ఈ భూమీ మనల్ని వేలకొలదీ సంవత్సరాలు సంరక్షించాయి. ఇప్పుడు, కేవలం ఒక రెండు తరాల్లో, మనం వీటిని ఎడారులుగా మార్చేస్తున్నాము.  మీరు గనక భారతదేశాన్ని తిరిగి చూస్తే, కేవలం కొద్ది భాగాలు మాత్రమే పచ్చగా కనిపిస్తున్నాయి. మిగతాదంతా బంజరు భూమి. మన నదులు ఎంతో నాటకీయంగా తరిగిపోతున్నాయి. ఇదంతా కూడా కొన్ని దశాబ్దాల్లోనే జరుగుతోంది. ఇందు, గంగ ఇప్పుడు అంతరించిపోతున్న మొదటి పది నదుల్లో ఉన్నాయి. ఇదివరకు, నేనొక చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, కావేరీ నది ఎలా ఉండేదో అందులో నలభై శాతం మాత్రమే ఇప్పుడు ఉంది. క్షీప్రాలో నీరు లేకపోవడం వల్ల, క్రిందటి కుంభమేళా ఉజ్జయినిలో జరిగినప్పుడు, వారు నర్మదాలో నీటిని నింపవలసి వచ్చింది. నదులూ, నీటిప్రవాహాలూ – అన్నీ ఎండిపోతున్నాయి. భూమిలోని నీటిమట్టాలు కూడా గత కొద్ది సంవత్సరాల్లో ఎంతో నాటకీయంగా తగ్గిపోయాయి. త్రాగే నీరు కూడా ఎన్నో చోట్ల కరవైపోయింది.

నీటి వనరులు తరిగిపోవడం అన్నది భారతదేశం అంతటా  కూడా జరుగుతున్న ప్రక్రియ అయిపోయింది. మనం ఇందుకు తగిన చర్యలు తీసుకోకపోతే, రాబోయే విపత్తును అరికట్టలేము.

మన దేశంలో ప్రధానంగా రెండు రకాల నదులున్నాయి.  మంచు కరిగి నదులుగా మారేవి లేదా మన అడవుల నుంచి నీరు వచ్చి నిండే నదులు. మనం, మంచువలన నిండే నదుల పరిస్థితి మన చేతుల్లోకి తీసుకోలేము. ఎందుకంటే పెరుగుతున్న ఉష్ణోగ్రత అనేది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. హిమాలయ పర్వతాల్లో ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు, ఇప్పుడు బోసిగా మారిపోయాయి. గోముఖం - ఎక్కడైతే భగీరథి నది మొదలౌతుందో, దాదాపుగా గత మూడు దశాబ్దాలలో అక్కడ ఒక కిలోమీటర్ దూరం వరకు నీరు లేకుండా పోయింది. హిమాలయ పర్వతాల దగ్గర మంచు లేకపోవడం అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నీటి వనరులు తరిగిపోవడం అన్నది భారతదేశం అంతటా  కూడా జరుగుతున్న ప్రక్రియ అయిపోయింది. మనం ఇందుకు తగిన చర్యలు తీసుకోకపోతే, రాబోయే విపత్తును అరికట్టలేము. రాబోయే విపత్తు, మన ఊహకు అందనిదై ఉంటుంది. ఇందుకు ఎన్నో విధానాలు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాలు ఇప్పటికి చేపట్టిన ఒక చర్య ఏమిటంటే - డాములు కట్టడం. ఇది ఎన్నో సార్లు ఒక నదిని ఒక కొలనుగా మార్చేస్తోంది. ఇంకొక చర్య  ఏమిటంటే నదిలో గుంటలు తవ్వి, దానిని రాళ్ళతో నింపడం. అప్పుడు నీరు అందులోకి వెళ్ళి మన బావులు సుసంపన్నం అవుతాయి. కానీ ఇది ఒక విధంగా నదిని చంపేయడమే...! ఇలాంటి ఎన్నో విధానాలు నదులను దోపిడీకి గురి చేస్తున్నాయి కానీ,  వాటిని సంరక్షించడం  లేదు.

సహజంగా పారే నది,  ఒక విభిన్నమైన జీవావరణం కలిగి ఉంటుంది. మన భూమి అంతా కూడా అడవులతో నిండి ఉన్నప్పుడు నదులు, సెలయేర్లు కూడా ఎప్పుడూ నిండుగా పారుతూ ఉండేవి. మన నదులు నిండుగా పారాలంటే,  దాని చుట్టూరా ఉన్న భూమి తడిగా ఉండడం అవసరం. ఈ రోజున మనం భూమినంతా తవ్వేస్తున్నాము. చెట్ల ఆకులు రాలిపోవడం వల్ల, జంతువుల మల-మూత్రాలవల్ల భూమి సుసంపన్నం అవుతూ ఉండేది. ఇప్పుడు చెట్లు పోయాయి,  జంతువులూ చంపివేయబడుతున్నాయి - అందుకని భూమి సుసంపన్నం అవ్వడంలేదు.

అన్నిటిలోకి సరళమైనది, తేలికైనది, ఎంతో బాగా పనిచేసే ఒక చర్య ఏమిటంటే; మనం నీటి మడుగుల చుట్టూరా చెట్లను పెంచడమే...!

మన దేశంలో మనకి ఎడతెగనన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మన రైతులు ఎలాగో ఒకలా 1.3 బిలియన్ ప్రజలకు ఆహారాన్ని అందించే గొప్ప విన్యాసం చేస్తూనే ఉన్నారు. కానీ, ఇది ఎంతో కాలం చేయలేరు. మనం భూమిని, నీటి వనరులని ఎంత ఎక్కువగా నాశనం చేసేస్తున్నామంటే, మరో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల కాలంలో మనం ఈ ప్రజలకి ఆహారాన్ని అందించలేము. వారి దాహాన్ని తీర్చలేము. ఇదేదో వినాశనం గురించి చెప్పే జ్యోస్యం లాంటిది కాదు. ఇందుకు మనకి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మనం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాము – అని చెప్పడానికి  మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నదులను ప్రభావితం చేసే అన్ని అంశాలూ మన చేతుల్లో లేవు. కానీ, మనం తీసుకోగల కొన్ని చర్యలద్వారా, నదులను, వాటి పారుదలను విస్తరించేందుకూ, అలానే వాటివల్ల కొన్ని ఆర్ధిక కార్యకలాపాలనూ చేపట్టేందుకు కూడా సాధ్యం అవుతుంది. అన్నిటిలోకి సరళమైనది, తేలికైనది, ఎంతో బాగా పనిచేసే ఒక చర్య ఏమిటంటే; మనం నీటి మడుగుల చుట్టూరా చెట్లను పెంచడమే...! భారతదేశంలో ఎక్కువ భాగం వ్యవసాయం చేస్తున్నాము. దీనిని మనం అడవిగా మార్చలేము. దీనికి పరిష్కారం ఏమిటంటే మనం భూమిలోని సారం తగ్గించేటటువంటి మొక్కల సాగు నుంచి చెట్ల సాగుకి మారడమే. అది చెయ్యాలంటే మనం దానికి తగిన ఎరుక ఏర్పరచుకొని, కొన్ని విధానాల్లో మార్పులు తీసుకొని రావలసి ఉంది.

వృక్ష సంరక్షణ

ప్రాజెక్టు గ్రీన్ హాండ్స్ ద్వారా మనం ముప్ఫై మిలియన్ మొక్కలను తమిళనాడులో నాటాం. ఒక్కొక్కరుగా చెట్లని నాటడం పరిస్థితిని కొంచెం మెరుగు పరచవచ్చు. కానీ మనకి నిజంగా ఒక పరిష్కారం దొరకాలి అంటే, ప్రభుత్వ స్థాయిలో విధాన పరమైన మార్పు రావాలి. రాజస్థాన్ ప్రభుత్వం, నీటి వనరులవద్ద చెట్లను నాటడంలో అద్భుతమైన పని చేసింది.  ఇది ఇప్పటికే భూగర్భ నీటి స్థాయిని పెంచింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఈ మధ్య కాలంలోనే ఏ రైతులైతే నర్మదా నది దగ్గర చెట్లను పెంచుతున్నారో, ఆ రైతులకు రెండు సంవత్సరాలకు సబ్సిడీ ఇవ్వడం మొదలు పెట్టింది. ఉత్తరాఖండ్ హైకోర్టు గంగా నదిని సజీవమైనదానిగా పేర్కొని, చట్టపరమైన హక్కులనిచ్చి, ప్రభుత్వాన్ని దాన్ని శుభ్రపరచి దాని బాగోగులను చూసుకోవలసినదిగా - ఆదేశించింది. ఇవన్నీ సరైన దిశలో వేస్తున్న మొదటి అడుగులు. మనం, మఖ్యమైన నదులను, వాటి ఉప-నదులను సంరక్షించుకోవాలంటే, జాతీయ స్థాయిలో విధానాలు రావాలి.  మన దేశంలో తగినంత మార్పు రావాలి.

ఈ సమస్యలన్నింటికీ మూల కారణం ఏమిటంటే; 1947 నుంచి ఈ రోజు వరకు కూడా మన జనాభా 330 మిలియన్ల నుంచి 1.3 బిలియన్లకు - కేవలం డెబ్భై సంవత్సరాల్లో పెరిగింది. ప్రశ్న ఏమిటంటే -  మనం ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నామా..?- అన్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం వనరులను వాడే విధానాలను మార్చడం. మనం గనక కొంచెం సున్నితత్వం కలిగి ఉంటే, మనం మానవ జనాభాని అరికట్టవచ్చు. కానీ, మనం మానవ ఆశను ఆధీనంలోనికి తీసుకోలేము.

మనం చెట్టుని ఒక రోజులో కొట్టి పారేయగలము. కానీ ఒక చెట్టుని తిరిగి తయారు చేయాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది.

దీనికి ఒక సరళమైన పరిష్కారం ఏమిటంటే;  మన నదుల దగ్గర మనం పచ్చదనాన్ని సృష్టించగలగడమే.  నేను ఏమి సూచిస్తానంటే - మన పెద్ద నదులన్నింటికీ ఇరుప్రక్కల ఒక కిలోమీటరు దూరం వరకు, వాటి ఉప-నదులకి అర కిలోమీటరు దూరం వరకు పచ్చదనాన్ని మనం తయారు చేయాలి. ఇందుకు కావలసిన విధానాలను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. అడవులను తయారు చెయ్యాలి. ఎక్కడైతే సొంత భూములు ఉంటాయో అక్కడ తోటలను తయారు చెయ్యాలి. ఉద్యానవనాలు, ఆగ్రో-ఫారెస్ట్రీ మీద గణనీయమైన పరిశోధన జరిగింది. ఇందులో, ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం చెట్లను నాటడం ద్వారా మట్టి ఎంతో సుసంపన్నమై మరింత తేమను కలిగి ఉంటుంది. మనకి మట్టిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే, నదులూ, జలపాతాలూ సుభిక్షంగా ఉంటాయి. మనం, నదీ తీరాల్లో జీవించే ప్రజలకు లాభసాటిగా ఉండేటటువంటి ఆలోచనలతో రావాలి. మీరు, పేద రైతులు భూగోళాన్ని కాపాడాలని ఆశించకూడదు. అతను, ఒక జీవనోపాధి సంపాదించుకోవడానికి, ఎంతో కష్టపడుతున్నాడు. ఏ పంట అయితే మట్టిలోని సారాన్ని తగ్గించివేస్తుందో అటువంటి పంటల కంటే మట్టిలోని సారాన్ని పెంచే పంటలు రైతుకి లాభదాయకంగా ఉండాలి.

మనం, మన నదులని ఎలా వాడుకోవాలి అన్న ఆలోచననుంచి, ఎలా సుభిక్షం చెయ్యాలి, ఎలా పునరుత్తేజితం చెయ్యాలి - అన్న ఆలోచనా ధోరణికి మారాలి. దేశంలోని ప్రతి వారికీ కూడా నదులను కాపాడవలసిన ఆవశ్యకత ఎంతగా ఉందో తెలియ పరచాలి. మేము, పదహారు రాష్ట్రాలలో ఒక ర్యాలీని నిర్వహించాలనుకుంటున్నాము. దీని రూట్ కన్యాకుమారితో మొదలయ్యి తమిళనాడునుండి ఉత్తరాఖండ్ కి వెళ్ళి చివరికి ఢిల్లీకి చేరడం. ఈ పదహారు రాష్ట్రాల రాజధానులకి మేము వస్తాము.  అక్కడ ఒక పెద్ద ఈవెంట్ ద్వారా, మన నదులను ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తాము. ఇప్పటివరకు ప్రతి రాష్ట్రము కూడా, వారికి వారే ఒక ప్రత్యేకమైన సృష్టిలాగా ప్రవర్తిస్తున్నారు. కానీ, అన్ని రాష్ట్రాలూ కూడా ఒక్కటిగా చేరి అందరికీ పనికి వచ్చే ఒక విధానానికై కృషి చెయ్యాలి. ఇందుకు కేంద్రం స్పందించడం, ఒక బిల్లు తయారు చేయడం అన్నది కనుక జరిగితే ఇది రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కొంతవరకు పరిష్కరిస్తుంది. ఒకసారి ఇలాంటి విధానాలు ఏర్పాటు చేసిన తరువాత వాటిని అమలు పరచడానికి కొంత సమయం పడుతుంది.

మనం చెట్టుని ఒక రోజులో కొట్టి పారేయగలము. కానీ ఒక చెట్టుని తిరిగి తయారు చేయాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. ఈ సమీకరణం ఎంతో తేలికైనది. నదుల పక్కన చెట్లు ఉండాల్సిందే. మనం గనక పచ్చదనాన్ని సృష్టిస్తే అది నీటిని పెంపొందిస్తుంది. నదులు సుభిక్షమౌతాయి. మనం ఈ రకమైన ఎరుకని దేశంలోని ప్రతివారికి అందించగలిగితే మన అందరికీ ఉపయోగపడే ఒక విధానాన్ని మనం తయారు చేసుకోగలిగి, దానిని మనం అమలు పరచడం మొదలుపెడితే - అది మన దేశ భవిష్యత్తుకి ఎంతో విజయవంతమైన అడుగు అవుతుంది. ఇది రాబోయే తరాలవారికి శ్రేయస్సుని కలిగిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఆంగ్లంలో చదవండి: Saving India's Lifeline - Why Rivers Need Trees