ఒక నాటక ప్రదర్శనలో మూడు వర్గాల మనుషులుంటారు. ఒక వర్గం ప్రేక్షకులు, రెండోవర్గం నటులు, మూడోవర్గం ఈ నాటక ప్రదర్శన జరగడానికి అవకాశం కల్పించే దర్శకుడు, రంగస్థలం అమర్చే సాంకేతిక సిబ్బంది వగైరా. వీళ్లందరిలో, దర్శకుడు నాటకాన్నిఅందరికంటే మెరుగ్గా అర్థం చేసుకొని, తక్కిన వారందరికంటే ఎక్కువగా దానితో లీనమైయ్యే  వాడు. ఎందుకంటే దానికి బీజారోపం చేసినవాడూ, సృష్టించిన వాడూ, ప్రదర్శనకు కారణభూతుడూ అతనే కాబట్టి. నాటకంలో దర్శకుని నిమజ్ఞత అనన్య మైనది. నటులకు తమ పాత్రలు మాత్రమే క్షుణ్ణంగా తెలుస్తాయి – తక్కిన నాటకం విషయం వాళ్లకేమీ తెలియకపోవచ్చు కూడా. ప్రేక్షకులకు నాటకం గురించి అసలు ఏమీ తెలియకపోవచ్చు. కానీ నాటకంలో జరుగుతున్నవన్నీవాళ్లలో భావోద్వేగాలను కలిగిస్తాయి.

నాటకం జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ మోసపోయేవారు ప్రేక్షకులే. ఎందుకంటే చూడడం మొదలు పెట్టిన కాసేపటికి, వాళ్ళు ఆ నాటకం నిజమని నమ్మడం మొదలు పెడతారు. నాటకం వాళ్లని మానసికస్థాయిలో ప్రభావితం చేస్తుంది. వాళ్లు నవ్వుతారు, ఏడుస్తారు, రకరకాలుగా స్పందిస్తారు. నాటకంతో వాళ్లకు ఉన్నసంబంధం అతి తక్కువ, కాని అందులో పూర్తిగా కూరుకుపోయేది వాళ్లే. వాళ్లు నాటకం చూస్తున్నంతసేపూ వాళ్ళు పొందుతున్నభావోద్వేగాల వల్ల, నాటకంలో వాళ్లు పూర్తిగా కూరుకుపోతారు. నటులు ఇవ్వాళ ఒక పాత్ర పోషించవచ్చు, రేపు మరొక పాత్ర పోషించవచ్చు – అందుకని వాళ్లు నాటకంలో నిమగ్నమవుతారు కాని దర్శకుడు అయినంతగా కాదు. మొత్తం నాటకాన్నంతా నడిపే వాడు దర్శకుడే. కానీ నాటకంలోని భావోద్వేగాలు అందరికంటే తక్కువగా ప్రభావితంచేసేది దర్శకుడినే. నాటకమంతా అతనే నడిపిస్తాడు, కానీ అందులోని భావోద్వేగాలు అతనికి ఏమీ అంటవు.

జీవితం కూడా ఒక నాటకమే – మీకు జీవితంలో, ఈ మూడిట్లో ఎంపిక చేసుకునే అవకాశం మీకు ఉంది. మీరు నటులు కావచ్చు. లేకపోతే నాటకంవల్ల ప్రభావితమైపోయే ప్రేక్షకుడూ కావచ్చు. లేకపోతే నాటకాన్ని సృష్టించే దర్శకుడూ కావచ్చు. లేదా మీకంత మంది సిబ్బంది లేకపోతే నటుడూ, దర్శకుడూ, ప్రేక్షకుడూ కూడా మీరే కావచ్చు. కాని మీలో దర్శకుడి పాత్ర చైతన్యవంతంగా ఉంటే మీ నాటకం మీరు కోరుకున్న విధంగా నడుస్తుంది – లేకపోతే అది అంతం లేని, నియంత్రణ తప్పిన నాటకంగా తయారవుతుంది.

మీ లోని ఈ  మానసిక నాటకం మీరనుకున్నట్లే సరిగ్గా నడుస్తూ ఉంటే బయటి పరిస్థితులు కూడా అవే  దారికి వస్తాయి.

మీ బాహ్యప్రపంచంలోని నాటకం విషయానికి వస్తే, మీరు దాన్ని నూరుశాతం నడపలేరు. మీరనుకున్నటు, మీ నాటకం స్ర్కిప్టు ప్రకారం నటించేంత విధేయత ఉన్నవారు మీ చుట్టూ దొరక్కపోవచ్చు. ఎప్పుడైతే మీ వెలుపలి నాటకం(చుట్టూతా పరిస్థితులు) మీరు కోరుకున్నట్లు నడవడం లేదో, అప్పుడు తరువాతి స్థాయినాటకం అయిన– మీ మానసిక నాటకం – నియంత్రణ తప్పడం మొదలౌతుంది. అందుకే మీ మానసిక నాటకానికి మీరే ఏకైక దర్శకులు కావాలి. బయటి నాటకం దాని పద్ధతిలో అది నడుస్తుంది.

మనలో ప్రతి ఒక్కరి విషయంలోనూ మన చుట్టూరా జరిగే  నాటకం జరుగుతూనే ఉంటుంది. అది మొత్తం మనం కోరుకున్నట్లు సాగదు. కాని మీలో మానసికంగా నడుస్తున్న మీ నాటకం మాత్రం నూటికి నూరుశాతం మీరనుకున్నట్లే సాగాలి. మీలోని ఈ  మానసిక నాటకం మీరనుకున్నట్లే సరిగ్గా నడుస్తూ ఉంటే బయటి పరిస్థితులు కూడా అవే దారికి వస్తాయి. అంతా చక్కగా, ఆనందకరంగా సాగుతూ ఉన్నప్పుడే, ఇదంతా నాటకమేననీ, దాన్ని చక్కగా నిర్వహించాలనీ మీరు గ్రహించాలి. లేకపోతే, మీకు మీ స్ర్కిప్టుపై నియంత్రణ తప్పి, మీ జీవితం  ఏదో ఒకచోట ఏదోవిధమైన తప్పుదారి పడుతుంది. అది దుష్ర్పవర్తనగానో, వ్యాధిగానో, మరణంగానో, మరో ఆపదగానో వ్యక్తం అవ్వచ్చు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు