2016 జూన్ 20వ తేదీన ఐక్యరాజ్య సమితిలో సద్గురు చేసిన ప్రసంగంలో, దాని 17 నిర్వహణీయ అభివృద్ధి లక్ష్యాలగురించి చెప్పిన కొన్ని ముఖ్యాంశాలను ఈ వారం మీ ముందు ఉంచుతున్నాము. మేక్స్వెల్ కెన్నెడీతో జరిపిన ముఖాముఖీలో చిరకాలంగా లక్ష్యాలుగా ఉండిపోయిన వీటిని సాధించడంలో యోగా ఎంత ముఖ్యభూమిక నిర్వహిస్తుందో ఆయన తెలిపారు. 

“నిర్వహణీయ అభివృద్ధి లక్ష్యాలు" అని మనం అంటున్నపుడు, మనం మానవజాతి సంక్షేమానికి మనం తక్షణం నివారణ చర్యలు చేపట్టవలసిన పేదరికం, పౌష్టికాహారం, ఆరోగ్యం, స్త్రీల సమస్యలు, పర్యావరణం  మొదలైన 17 విభిన్న సమస్యల గురించి మాటాడుతున్నాం. ఈ ప్రయత్నం ప్రపంచంలో ఎన్నాళ్ళనుండో కొనసాగుతూనే వస్తోంది. మనం ప్రపంచాన్ని మారుద్దామనుకుంటున్నాము గాని, మనం వ్యక్తి స్థాయిలో మనం మనుషుల్ని లక్ష్యంగా తీసుకోవడం లేదు.  ప్రపంచం అన్నది కేవలం ఒక మాట. ప్రపంచం అంటే మీరూ, నేనూ. మనం చూసే దృక్కోణంలో, అనుభూతిలో, ఆలోచనలో, అనుభవంలో, కార్యాచరణలో ఏ మార్పూ లేనంత కాలం మీరు ప్రపంచాన్ని ఎలా మార్చగలరు? మనం బోలెడంత డబ్బులు కేటాయించవచ్చు, పథకాలు ప్రవేశపెట్టవచ్చు, కానీ అవన్నీ పైకివళ్ళినా, కిందకు పడిపోయేవే. మనం ఎక్కువ సంఖ్యలో, మనుషుల్ని మార్చగలిగితే, అప్పుడు నిజమైన మార్పు సాధ్యపడుతుంది. ఇక్కడే యోగా ప్రముఖ భూమిక నిర్వహిస్తుంది. ఈ రోజు ఐక్యరాజ్యసమితి అంతర్జాతియ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.  అది ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు.

మనం పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి మాటాడుతున్నదంతా మానవ శ్రేయస్సు కోసం మనం చేసిన చర్యల ఫలితమే.

ప్రశ్న: మీరు యోగా అంటే ఏమిటో, అది నిర్వహణీయ అభివృద్ధి లక్ష్యాలను (SDGs)సాధించడంలో ఎలా ఉపకరించగలదో కాస్త విశదీకరించగలరా?

మానవ శ్రేయస్సును అన్వేషిస్తూ మనం అన్ని రకాల పనులూ చేస్తున్నాం.  మనం శ్రేయస్సు పై నుండి వస్తుందేమో అని చాలాకాలం ఎదురుచుసాం. ఈ ఎదురుచూడడంలో మానవాళి మతం, కులం, జాతి, ఇలా ఎన్ని రకాలుగా వీలయితే అన్ని రకాలుగా విడిపోవడం జరిగింది. గత 50 సంవత్సరాల్లో ఈ భూతలాన్ని ఎన్నిరకాలుగా వీలయితే అన్ని రకాలుగా ముక్కలుచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. మనం పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి మాటాడుతున్నదంతా మానవ శ్రేయస్సు కోసం మనం చేసిన చర్యల ఫలితమే. గత 100 సంవత్సరాల్లో, ఇప్పటివరకూ జీవించిన పై తరం వాళ్లతో పోలిస్తే, నిర్వివాదంగా మనమే ఎక్కువ సౌకర్యాలతో నిండిన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళం. కానీ, మనిషి అంతః స్వభావాన్ని ఉపకరించే దిశలో ప్రయత్నం చెయ్యకపోవడంతో, ఎవ్వరూ హాయిగా, సంతోషంగా,  ప్రశాంతంగా లేరు.

మీరు ఎప్పుడైతే శాస్త్రీయమైన రీతిలో మానవజాతి శ్రేయస్సుకై ప్రయత్నిస్తారో, అదే యోగా.  యోగా అన్న పదానికి అర్థం "ఐక్యం". అది వ్యక్తికున్న ఎల్లల్ని శాస్త్రీయంగా చెరిపివేసే పద్ధతి. దాని అర్థం, ఈ క్షణంలో మనిద్దరం ఇక్కడ కూర్చున్నాం. మీరూ... నేనూ. అది స్పష్టం.  కానీ, మనిద్దరం పీలుస్తున్నదీ ఒక్కటే గాలి.  మనిద్దరం ఈ మట్టినుండి వచ్చిన వాళ్ళమే.  మీరు "నేను" అని దేని గురించి అయితే మాటాడుతున్నారో అది ఈ భూమినుండి మొలకెత్తినదే.  అది ఎదో ఒక రోజున ఠప్పున రాలిపోతుంది. కానీ, మధ్యనున్న ఈ కాస్త సమయంలోనే, మనం కలుసుకోలేనంతగా విడిపోయాం.

యోగా అంటే, ఈ సరిహద్దుల్ని చెరిపెయ్యడమే. మేధోపరంగానో, విశ్వాసాలకు చెందినదిగానో, సైద్ధాంతపరంగానో ఈ సరిహద్దుల్ని చెరిపెయ్యడం కాదు, ఇది  మీకో సజీవానుభవంగా మారడం. మనుషులు "నేను" అని దేనిగురించి పిలుస్తున్నారో ఆ భావన ఎప్పుడైతే భౌతికమైన హద్దుల్ని దాటి జీవిత సత్యంగా మారుతుందో, ఐక్యరాజ్యసమితి అందుకోవాలని ప్రపంచం ముందుంచిన లక్ష్యాలను అందుకోడం మరింత సుసాధ్యమౌతుంది. ఇప్పుడు, మనం ఒక దిశలో ముందుకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే,  మరికొందరు దానికి వ్యతిరేకదిశలో అంతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం, అది వాళ్లకోసం చేస్తున్న ప్రయత్నమని గ్రహించలేకపోవడమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు