గడచిన పధ్నాలుగు రోజులు ఎంతో అసాధారణంగా గడిచాయి. ముఖ్యంగా మూడేళ్ళ తరువాత తమిళ సంయమ కార్యక్రమం జరిగింది. సంయమ అనేది కేవలం ఒక ప్రోగ్రాం మాత్రమే కాదు. అది ఒక అసాధారణమైన అద్భుతం. దీని విశిష్టతకు అనుకూలంగా మేము దీని రూపకల్పన ఒక ప్రత్యేకమైన విధానంలో చేశాము. మీలో తెలియనివారి కోసం ఇది చెప్తున్నాను. ఈశాలో ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రక్రియల కార్యక్రమాలను మేము ఉచితంగానే అందిస్తాము. భోజనానికి, వసతికి కూడా వారిదగ్గర ఎటువంటి ఛార్జీలు తీసుకోము. మొదలుగా ఉండే కార్యక్రమాల్లోకే మేము ఫీజు తీసుకుంటాము. ఎందుకంటే, అది లేదంటే ప్రజల్లో నిబద్ధత ఉండదు. కానీ, సంయమ అన్నది అపురూపమైనది. ప్రజలు వారి పరిమితులను దాటి నిమగ్నం అవుతారు. ఈ కార్యక్రమం, నేను ప్రత్యక్షంగా లేకుండా జరగడానికి అవకాశం ఉందేమో అని చూస్తున్నాను. కానీ ఇంకా అందులో పూర్తి సాఫల్యతని సాధించలేదు. భవిష్యత్తులో అలా చెయ్యడానికి మేము మార్గాలని చూస్తున్నాము.

సాధారణంగా సంయమ జరుగుతున్నప్పుడు, నేను ఒక్క క్షణం కూడా వారిని విడిచిపెట్టను. ఎప్పుడూ చెయ్యని విధంగా ఈసారి సంయమ జరుగుతున్నప్పుడు నేను గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కు ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. నేను, ఒకరోజుకు ఢిల్లీ వెళ్ళి, ఆ కార్యక్రమాన్ని చూసుకుని మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేశాను. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అనేది ఎకనామిక్ టైమ్స్ వారు జరిపే ఒకానొక కార్యక్రమం. ఇందులో మన ప్రధానమంత్రి, ఆర్ధికశాఖామంత్రి ఇంకా అనేక దేశాల నుంచి ఎంతోమంది నేతలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా పాల్గొంటారు. ఇటువంటి సమ్మిట్లకు వెళ్లడంలోని ప్రాముఖ్యత ఏమిటీ..? ఏవైతే ఖచ్చితంగా ఇన్నాళ్ళూ వ్యాపార సంబంధమైనవై ఉన్నాయో, అవి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక ప్రక్రియ కోసం చూస్తున్నాయి. వ్యాపారవేత్తలూ - ఎవరైతే ఆర్ధిక ఎదుగుదలా, లాభాలను చేసుకోవడం, ధనాన్ని ఆర్జించడం మీదే దృష్టి పెడతారో అలాంటివారు అంతర్ముఖత్వం మీద ఇప్పుడు శ్రద్ధ పెట్టడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు వారికోసం పనిచేస్తున్నవారి అంతర్ముఖ ఎదుగుదల పట్ల కూడా వీరు ఆసక్తి చూపిస్తున్నారు.

 ప్రపంచపు తీరులో ఇది ఒక అసాధారణమైన మలుపు.  రాబోయే కాలం ఆధ్యాత్మిక ప్రక్రియకు ఒక సువర్ణకాలం.  ఇది ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే  విద్యావేత్తలూ, శాస్త్రవేత్తలూ, వ్యాపారవేత్తలూ ఇంకా రాజకీయ నాయకులూ అందరూ కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియను కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా, నేను ఇప్పుడు హార్వర్డ్ అలుమినైలో మాట్లాడబోతున్నాను. హార్వర్డ్ మెడికల్  స్కూల్  లో  ఉన్న డాక్టర్లతో  కూడా  సంభాషించబోతున్నాను. స్టాన్ ఫోర్డ్ మెడికల్ కాలేజీ లో ఏప్రిల్ లో ఇలాంటి కార్యక్రమమే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి వేగం పుంజుకున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే;  వైద్యులూ, సైంటిస్టులూ, బ్రిటిష్ సైన్స్ మ్యూజియం, విశ్వవిద్యాలయాలూ, బిజినెస్ సమ్మిట్లూ ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది ఎంతో గొప్ప ఆవశ్యకత. మొట్టమొదటిసారిగా ప్రపంచం అంతా ఈ విధంగా మారుతోంది.

 మన దేశంలో ఈ విధంగా ఉన్న సమయం ఒకటి ఉండేది. ఇది మళ్ళీ ఇప్పుడు అలా జరుగుతోంది. ప్రతి మానవుడి జీవితంలోనూ ఆధ్యాత్మికత తీసుకు రాగలిగే ఒక ఆవశ్యకత ఉంది. ఇది ఒక బోధనగానో, ఒక నమ్మక వ్యవస్థగానో, ఒక కొత్త సాంప్రదాయంగానో, ఒక కొత్త మతంగానో కాదు - మానవుల అంతర్ముఖ శ్రేయస్సుకు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ, ఒక పద్ధతి, ఒక శాస్త్రబద్ధమైన పద్ధతి .  సమాజంలో అన్నీ వర్గాలవారికీ అందించడానికి ఇదే సమయం. ఇప్పుడు, మన మీద అటువంటి గురుతర బాధ్యత ఉంది. ఈ ఆవశ్యకతను ప్రపంచానికి అందించడానికి, దీనిని మనం ఎంతో సమైక్య భావనతో, ఎంతో స్వచ్ఛంగా అందించవలసిన అవసరం ఉంది.  నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే.. మతాలూ ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియలు అన్నవాటి గురించి ఈ ప్రపంచం అంతటా ఎంతో దుష్ప్రచారం జరిగింది.  ఈరోజున ఇవి ఎలా తయారయ్యాయీ అంటే, మీరు ఏదైనా ఆధ్యాత్మికమైనది అంటే,  అందులో ఏమైనా తప్పు ఉందేమో అని ఆలోచిస్తారు.

మనం ఈ ప్రపంచం అంతటినీ కూడా అంతర్ముఖం చేయగల ఒక ఆవశ్యకత ఉంది.
ఈశా లో  గత ముప్ఫైయారేళ్లుగా మన ప్రయత్నం  ఏమిటంటే మనం ఏది చేసినా ఒక సమగ్ర భావనతో ఎంతో చిత్తశుద్ధితో అందించాలని చూస్తున్నాము. ఈ రోజున ఎన్నో ద్వారాలు తెరుచుకున్నాయి.  ఇది ఈశా గురించో, సద్గురు గురించో కాదు. మనం ఈ ప్రపంచం అంతటినీ కూడా అంతర్ముఖం చేయగల ఒక ఆవశ్యకత ఉంది. మనం ఈ ప్రపంచాన్ని ఎదుగుదలవైపుగా తీసుకు వెళ్ళేందుకు ఇది ఒక్కటే సుస్థిరమైన మార్గం. ఎదుగుదల అన్నది దేనినో సేకరించడంవల్ల వచ్చేది కాదు. ఎవరో ధృఢకాయాన్ని పెంచి తానొక పెద్ద మనిషిని అనుకోవచ్చు. కానీ, మిగతావారందరూ బలహీనులైనప్పుడే అది ప్రత్యేకంగా అనిపిస్తుంది.  మరొకరు ఎంతో ధనాన్నిఆర్జించి తాము పెద్దవాళ్ళమని అనుకుంటారు. కానీ, మిగతా వారందరూ పేదగా ఉన్నప్పుడే దీనికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది.  మరొకరు ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి తానొక పెద్ద మనిషినని అనుకుంటాడు. ఇది మిగతావారందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడే గొప్ప విషయం అవుతుంది.

ఇవన్నీ కూడా పొగుజేసుకోవడమే ఎదుగుదల అన్న అభిప్రాయాన్ని కలుగ  చేస్తున్నాయి. కానీ, అది నిజమైన ఎదుగుదల కాదు. ఇది ఎటువంటిదంటే, మిగతా ఎవ్వరూ ఎడగకూడదు,  మీరు మాత్రమే ఎదగాలి అని ఆశించడం. కానీ ఎదుగుదల అన్నది విశ్వవ్యాప్తంగా ఉండాలనుకుంటే, ఒక మానవుడు ఎన్నో పార్స్వాల్లో ఎదగవలసి ఉంటుంది. అప్పుడు మన ఎదుగుదల అన్నది మనం ఏమి ప్రోగుజేసుకుంటామో అన్న దానిమీద ఆధార పడి ఉండదు. ఈ సృష్టిలో ఏమి ఆవశ్యకత ఉందో దానికి అది మూలం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ పెద్దగా అర్థం కాకపోవచ్చు. కానీ; మనం మన జీవాన్ని పెంపొందించగల విధానం ఒకటి ఉంది. మనం దానిమీదే మన దృష్టిని ఇప్పుడు కేంద్రీకరించాము.  ఈశా లో మనం చేస్తున్న పని అంతా ఇదే..!! ఒక మానవుడిని ఒక చిన్న సృష్టి నుంచి సృష్టికి మూలంగా మలచడం. మీరే సృష్టి మూలంగా ఇక్కడ జీవించగలగడం. ఎందుకంటే; ఈ సృష్టి మూలం మనలో పెట్టుబడి పెట్టింది. ఇది అభివ్యక్తమయ్యేందుకు మన దగ్గర ఎన్నో సజీవ విధానాలు ఉన్నాయి, ప్రక్రియలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు   ఈ ఉద్యమం అంతా దీని గురించే. ఒక విధంగా మానవుడిలోనే, ఈ జీవితంలోని ఆవశ్యకతలు అన్నీ కూడా ఉన్నాయి. అక్కడే మనం దీనిని శోధించాలి.  ఇందుకు వ్యక్తిగత బాధ్యత అన్నది ఎంతో ముఖ్యం. ఇది ప్రజలని నమ్మకాలనుంచి, మతాల నుంచి బాధ్యతవైపుకి నడిపించడం. మీ అందరికీ నా ఆశీర్వచనాలు. మనం ఇది ఇదే తరంలో జరిగేలాగా చూద్దాం. ధన్యవాదాలు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు