రోజురోజుకీ క్షీణించిపోతున్న మన జీవధారాలైన నదుల స్థితి గురించి, మనం వాటికోసం ఒకటి కావాల్సిన ఆవశ్యకతను గురించి సద్గురు వివరిస్తున్నారు..

నదులంటే మీ ఉద్దేశ్యం ఏమిటి?” అని నన్ను ఎవరైనా అడిగితే, అవి మన నాగరికతకి పునాదులని అంటాను. ఇండస్, సట్లెజ్ నదీ తీరంలోనూ, పురాతనమైన సరస్వతీ నదీ తీరంలోనూ హరప్పా- మోహెంజోదారో నాగరికతలు ఆవిర్భవించాయి. దక్షిణాన, కృష్ణా, కావేరి, గోదావరి నదుల ఒడ్డున కూడా నాగరికత వృద్ధి చెందింది. ఈ నదులూ, ఈ నేలా మనల్ని కొన్ని వేల సంవత్సరాలుగా  పోషిస్తున్నాయి. కానీ, కేవలం రెండు తరాల వ్యవధిలో మనం అంతటినీ ఎడారిగా మార్చేస్తున్నాం. కొన్ని దశాబ్దాలలోనే మన నదులు అడుగంటిపోవడం ప్రారంభించాయి. మీరు దేశం అంతా పర్యటించి చూస్తే, ఎక్కడో ఒకటి రెండు చోట్ల పచ్చదనం తప్పితే, తక్కినదంతా ఎండిపోయి కనిపిస్తుంది.

ఈ గోళం మీద కొద్ది కాలంలో అంతరించిపోబోయే నదుల చిట్టాలో గంగ, ఇందస్ నదులున్నాయి. కావేరి 50 సంవత్సరాల క్రిందట ఎలా ఉండేదో అందులో 40శాతం ఉంది. ఈ మధ్యనే ఉజ్జయినిలో జరిగిన కుంభమేళాలో, నర్మదానది నుండి కృత్రిమ ప్రవాహాన్ని సృష్టించి క్షిప్రా నదిలోకి నీరు తోడవలసి వచ్చింది. ఎందుకంటే ఆ నదిలో ఒకచుక్క నీరు లేదు. జీవ నదులు కొన్ని ఋతువులకే పరిమితమైన నదులుగా మారిపోతున్నాయి. చాలా చిన్న నదులూ, సెలయేళ్ళూ ఇప్పటికే అంతరించిపోయాయి. చాలాచోట్ల తాగడానికి కూడా నీరు దొరకడం లేదు.

మనకి ఇప్పుడు కావలసింది సంవత్సరం పొడుగునా నదుల్లోకి నీరు చేరగలగడానికీ, నదులు సంవత్సరం పొడవునా ప్రవహించడానికీ తగిన విస్తృతమైన శాశ్వత పరిష్కారం.

దేశంలో ఇప్పటికే కొన్ని వేల సమస్యలున్నాయి. అయినప్పటికీ, మనం గర్వించగలిగిన గొప్ప విషయం మనరైతులు 130 కోట్ల ప్రజలకీ, కనీసం కొంతమేరకైనా, అన్నం పెట్టగలుగుతున్నారు. కానీ ఇది ఎన్నాళ్ళో కొనసాగదు. మనం నేలనీ, నీటి వనరుల్నీ ఎంత త్వరగా నాశనం చేస్తున్నామంటే, మరొక 15-20 సంవత్సరాల్లో వాళ్లకి తగిన ఆహారం సమకూర్చగలిగే స్థితిలో గాని, వాళ్ల దాహాన్ని తీర్చగలిగేస్థితిలో గాని ఉండము. ఇది ప్రపంచం అంతరించిపోతోందని చెసే భవిష్యవాణి కాదు. మనం అటువంటి పరిస్థితివైపు పయనిస్తున్నామని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి.

మన జీవిత కాలంలోనే మన నదులు కృశించిపోతే, ఈ నేల మీద పుట్టబోయే మన భావితరాలపట్ల మనకు ఏమాత్రం బధ్యతలేదన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నట్టు లెక్క. ప్రజలెప్పుడూ అత్యవసరమైన సమస్యలకు సమాధానాలు కనుక్కోడానికీ, వెనువెంటనే ఇప్పటికే కృశించిపోతున్న నీటివనరుల్ని వాళ్ళ స్వప్రయోజనాలకు ఎలా వినియోగించాలా అని ఆలోచిస్తుంటారు. మనకి ఇప్పుడు కావలసింది సంవత్సరం పొడుగునా నదుల్లోకి నీరు చేరగలగడానికీ, నదులు సంవత్సరం పొడవునా ప్రవహించడానికీ తగిన విస్తృతమైన శాశ్వత పరిష్కారం.

సమస్యకి పరిష్కారం నదీప్రవాహం పొడవునా  కనీసం ఒక కిలోమీటరు దూరం వరకూ రెండుపక్కలా చెట్లు పెంచడం.

నదులలోకి నీరు చేరాలంటే, నదుల చుట్టుపక్కల మట్టి తడిగా ఉండాలి. మన నదులన్నీ చాలవరకు అడవిలోని సెలయేటి నీటివల్ల ప్రవహిస్తున్నాయి. నేలమీద అడవులు సమృద్ధిగా ఉన్నప్పుడు, నేలలోకి నీరు ఇంకి, అది సెలయేళ్ళకీ నదులకీ ప్రవహించేది. అడవులు లేకపోతే కొన్నాళ్ళకి నీరుండదు. సమస్యకి పరిష్కారం నదీప్రవాహం పొడవునా  కనీసం ఒక కిలోమీటరు దూరం వరకూ రెండుపక్కలా చెట్లు పెంచడం.(అదే ఉపనదులైతే 1/2 కిలోమీటరు దూరం).

ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం  స్వయం ప్రతిపత్తి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. అన్నీ కలిసి ముందుకి వచ్చి అందరికీ ఉపయోగకరమైన ఒక కర్యాచరణ పథకాన్ని తయారుచేసుకోవలసిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా ఉంది. దీనికి పరిష్కారం చాలా సరళమైనది. నదులకు సమీపంలో చెట్లుండాలి. మనం మొక్కల్ని పెంచగలిగితే అవి నీరు నిలవచేసుకుంటాయి. దాని వల్ల నదులకి నీరు లభిస్తుంది. నీరు ఒక పదార్థం కాదు. అది జీవాధారము. ప్రాణప్రదాత. మనిషి శరీరంలో 72 శాతం నీరే ఉంది. ఈ భూమి మీద మనకి నదులనబడే నీటిబుగ్గలతో మనకు అవినాభావసంబంధం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుండి నదులు మనల్ని పెంచి పోషిస్తున్నాయి. ఇప్పుడు వాటిని అక్కునజేర్చుకుని వాటికి పునరుజ్జీవనం కల్పించవలసిన తరుణం వచ్చింది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సంపాదకుని వివరణ: సద్గురు ఏ ఏ నగరాలలో ఎప్పుడు ఆగుతారో ఆ కార్యక్రమాన్ని తెలుసుకొనేందుకు, పాల్గొనేందుకు, దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు Rally for Rivers.org దర్శించండి.

 pixabay