రెండో రోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమైన 'ఇన్నర్ ఇంజనీరింగ్' కార్యక్రమం సాయంత్రం 6 వరకూ కొనసాగింది. శుక్రవారం మంత్రులు, అధికారులు మొత్తం ౩౦౦ మంది పాల్గొన్నారు. కల్లెక్టర్లు, మేయర్లూ కూడా భాగస్వాములు అయ్యారు.


ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్

ఈశా ఫౌండేషన్ తమిళనాడులో పచ్చదనం విస్తరణకు చేపడుతున్న చర్యలను సద్గురు వివరించారు. ‘ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్’ పేరిట అక్కడ నిర్వహిస్తున్న మొక్కల పెంపకం, పర్యావరణ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. తమ ఫౌండేషన్ చర్యలతో ఐదేళ్ళలో తమిళనాడులో 7.2 శాతం పచ్చదనం పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే గూగుల్ వివారాల ప్రకారం 11 శాతం పెరిగిందని తెలిపారు. తమ సంస్థ తరపున 13మిలియన్ మొక్కలు లక్ష్యం పెట్టుకుని అమలు చేసిన తీరుని ఆయన వివరించారు. ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటితే కోట్లాది చెట్లు పెరిగి పర్యావరణానికి మేలు చేకూరుతుందన్నారు. పచ్చదనం అభివృద్ధికి కావాల్సింది మానవ సహకారమేనని పేర్కొన్నారు.

ఎపి కొత్త రాజధానికి హరిత శోభ

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ వచ్చే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నదానికి అదనంగా ౩౩శాతం పెంచటానికి ఈశా ఫౌండేషన్ సహకరించాలని కోరారు. కొత్త రాజధాని ప్రాంతంలో పచ్చదనం పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇందుకు సద్గురు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం, ప్రసార మాధ్యమాల సహకారంతో దీన్ని ప్రజా ఉద్యమంగా మారిస్తే తప్పకుండ లక్ష్యం సాధ్యమవుతుందన్నారు.

మొక్కల పెంపకానికి భూమి దానమిచ్చిన ఉన్నతాధికారి

ఈ సందర్భంగా రహదారులు, భవనాల ఉన్నతాధికారి రామచంద్ర రాజు హైదరాబాద్ శివారుల్లోని 50 ఎకరాల సొంత భూమిని నర్సరీల పెంపకానికి ఈశా ఫౌండేషన్‌కి దానమిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలోని 40వేల కిలోమీటర్ల రహదారుల పొడవునా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం కోసం నర్సరీల పెంపకానికి కొత్త రాజధాని సమీపంలోని తన 60 ఎకరాల భూమిని కూడా ఉపయోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు.

గాంధికి నివాళులు

మహాత్మగాంధి వర్ధంతి సందర్భంగా అందరూ 3 నిమిషాలు మౌనం పాటించారు. సద్గురు, చంద్రబాబు మహాత్మగాంధికి నివాళులు అర్పించారు.

నృత్యం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు

‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్’ శిక్షణలో భాగంగా ఆలపించిన పాటలకు అనుగుణంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నృత్యాలు చేశారు. సీ ఎం చంద్రబాబు షుమారు పది నిముషాలు డాన్స్ చేశారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరగంట పాటు తన్మయత్వంతో నృత్యం చేశారు. జాయ్‌ఫుల్ లివింగ్‌లో నృత్యం కూడా ఒక భాగమని సద్గురు వివరించారు.

ఈ రోజు సద్గురు శక్తివంతమైన శాంభవీ మహాముద్రను ఉపదేశించారు.