పృధ్వీ తత్వం...

ఈ స్పాట్ లో సద్గురు, ఐదు మూలకాలలో ఒకటైన భూమి గురించి, దాని ప్రాథమిక ప్రాముఖ్యతను, దాన్ని అనుభవించే అవకాశాల గురించీ, దాన్ని అనుభవించడానికి గల మార్గాల గురించీ, ముఖ్యంగా దానికి అనుకూలమైన రోజుల గురించి ప్రస్తావిస్తున్నారు. "ఇది కేవలం మానవులు మాత్రమే తెలుసుకోగలిగే సామర్ధ్యం అని మీరు గుర్తించగలిగే సమయం ఆసన్నమైంది" అని ఆయన అంటారు.
 
The Element of Earth
 
 
 

పంచభూతాలలో ఒకటిగా నిర్ధిష్టమైన పృధ్వి గురించీ, యోగదృష్టిలో దాని ప్రాముఖ్యత గురించీ, దానిని అనుభవించే అవకాశాలూ, మార్గాల గురించీ, ముఖ్యంగా దానికి అనుకూలమైన రోజుల గురించీ సద్గురు వివరిస్తారు. ఆయన,"భూమి గురించి మీరు తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైనది, ఎందుకంటే కేవలం  మనుషులు మాత్రమే దీనిని తెలుసుకోగలరు కాబట్టి" అంటున్నారు.

యోగ పరిభాషలో "పృధ్వి" అని మనం అంటున్నప్పుడు మనం కేవలం ఈ గ్రహం గురించే మాటాడడం లేదు, మన ఈ శరీరంతో పాటు దీనిని ఆవరించి ఉన్న సకల చరాచర ప్రకృతి తయారిలోని మౌలికమైన పదార్ధాన్ని గురించి మాటాడుతున్నాం. మన శరీరం పృధ్వి(భూమి), ఆప(నీరు), తేజస్సు (నిప్పు), వాయువు (గాలి), ఆకాశముల సమాహారం. ఈ అయిదింటిలో అతి మౌలికమైనదీ, స్థిరమైనదీ కూడా పృధ్వే.

అదే శక్తి వ్యవస్థ గురించి మాటాడేటపుడు, ఈ పృధ్వి "మూలాధార చక్రం" తో ముడిపడి ఉంది. మిగతా నాలుగు భూతాలూ (మూలకాలు), ఈ శరీర ఆకృతీ ఏర్పడడానికి అదే మూలము.  ఈ భూమి మన చుట్టూ ఉన్న భౌతిక పదార్థం రూపంలో కనిపిస్తున్నప్పటికీ, దీని మన జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించడం ఉత్తమం. ఎందుకంటే మనలో అత్యధిక శాతం మంది, తమ శరీరాన్నీ మనసునీ మాత్రమే అనుభూతిచెందగలరు. ఈ భూమి అన్నది ఏమిటో అంతరాంతరాల్లో తెలుసుకుని అనుభూతి చెందడమే యోగా ప్రక్రియలో భాగం.

మీరు ఆహారం తీసుకుంటున్న ప్రతిసారీ, మీరు ఈ భూమిలో ఒక లేశాన్ని కడుపులోకి తీసుకుంటున్నారు.

మీరు ఆహారం తీసుకుంటున్న ప్రతిసారీ, మీరు ఈ భూమిలో ఒక లేశాన్ని కడుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా, మనం బ్రతకడానికి ఈ గ్రహంలో ఒక భాగాన్ని తీసుకుంటున్నాము. అందువల్ల, మనం ఈ భూమిని ఎలా పరిగణిస్తామో, మనశరీరాన్ని కుడా అలా పరిగణిస్తున్నట్లే. అదే విధంగా, మనశరీరాన్ని కుడా ఎలా పరిగణిస్తామో, ఈ భూమిని కుడా అలా పరిగణిస్తున్నట్లే. ఈ భూమి అనే మూలకం మన భౌతిక, మానసిక, భావపరమైన, అధిభౌతిక శ్రేయస్సుకి  ఎటువంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఈ భూమి మనకు తోడ్పడకపోతే, మనం ముందుకి ఒక్క అడుగు కూడా వెయ్యలేము. మీకు శరీరం సహకరించకపోతే, మీకు ఎంత గొప్ప ఆశయాలున్నా మీరు ఏదీ సాధించలేరు. ఇది మీ జీవితంలో ప్రతి విషయాన్నీ ప్రభావితం చేస్తుంది. కేవలం మీరు ఈ భౌతిక పరిమితులకి అతీతంగా ఉండగలిగితే తప్ప.

అయితే, భూమికీ మనకీ సంబంధాన్ని నిర్థారించడం ఎలా? అన్ని జీవరాశులకూ ఈ ప్రకృతిని అర్థంచేసుకునేందుకు ముందుగా నిర్ణయించిన ఒక స్థాయి ఉంది. అవి తమ జీవితాన్ని ఆ స్థాయిలోనే అర్థం చేసుకోగలవు. మనుషులకున్న తెలివితేటలూ, చైతన్యం వాటికి లేకపోవడంవలన జంతువులన్నీ భూమితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటాయి. మనుషుల విషయానికి వస్తే వాళ్ళ అస్తిత్వ స్పృహకంటే, వాళ్ళ మానసిక స్పృహ ప్రబలంగా ఉంటుంది. ఉదాహరణకి, వానపాముకి భూమితో ఉన్న అనుబంధం అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కాని దానికి ఆ స్పృహ చైతన్య పరిధిలోనిది కాదు. మీరు దాన్ని భూమిలోంచి పైకి లాగితే, తిరిగి భూమిలోకి పోడానికి ప్రయత్నిస్తుంది.  మీరు ఒక చేపని నిళ్ళలోంచి బయటకు తీస్తే, అది మళ్ళీ నీటిలోకి పోడానికి ప్రయత్నిస్తుంది. ఇది జీవించడానికి ఆవశ్యకమే కాదు, దాని ఉనికి గురించిన పరిచయం వల్ల కూడా.  ఆ అర్థంలో వాటికి ఆ సంబంధం తెలుసు. కానీ, అదే స్పృహ అవి వాటి ఉనికిలో ఉన్నప్పుడు, అంటే వానపాము నేలమీదా, చేప నీటిలో ఉన్నప్పుడు, అనుభూతి చెందలేవు.

మనుషుల్లో కూడా ఎక్కువ శాతం సరిగ్గా ఇదే స్థితిలో ఉంటారు. పరిణామ క్రమంలో ప్రకృతి మనల్ని తెలివి తేటలలో, చైతన్యంలో భిన్నమైన స్థాయికి తీసుకెళ్ళింది గాని, మనం ఆ పదోన్నతిని అందుకోవడానికి తిరస్కరిస్తున్నాము. నీరూ, గాలీ, నేలా లేకుండా మీరు బ్రతకలేరన్నది స్పష్టం. ఎవరైనా వాటిలో ఏ ఒక్కటి మీ నుండి లాక్కున్నా, మీరు దాన్ని తిరిగిపొందడానికి ఎంతకైనా తెగించి పోరాడతారు. ఆ మేరకి, వానపాముకీ, చేపకీ వాటి వాటి స్థావరాలతో ఉన్న అనుబంధం ఎలా తెలుసునో అలానే మీకూ తెలుసును. కానీ, ఇప్పుడు మీరు కేవలం మనుషులు మాత్రమే అవగాహన చేసుకోగలిగిన రీతిలో తెలుసుకోవాలి.  మీరు మీ లౌకిక ప్రపంచంలో మునిగిపోకుండా ఉంటే, అది తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మంది వాళ్ళ మానసిక ప్రపంచంలో బ్రతుకుతుంటారు, నిజంగా ఈ భూమి మీద బ్రతకరు. వాళ్ళని ఖననం చేసినపుడో, దహనం చేసినప్పుడో మాత్రమే నేలమీదికి వస్తారు. వాళ్ళకి వాళ్ళు బ్రతుకుతున్న వాస్తవ ప్రపంచం కంటే, వాళ్ళ మానసిక ప్రపంచమే ముఖ్యం. అంటే, వాళ్ళ మేధస్సుకి జీవితాన్ని అనుభూతి చెందే పద్ధతిని మెరుగుపరిచే విధంగా శిక్షణ లేకపోవడంతో, వాళ్ళ ఆలోచనలూ, వాళ్ళ భావావేశాలూ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నమాట.

ఆధునిక విద్యాబోధన, నాగరికతల దృష్టి అంతా భౌతిక ప్రపంచంలోని అన్ని వనరుల్నీ, అన్ని జీవరాశుల్నీ మనకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలన్నదానిమీదే. మేధోపరమైన మన ఆధిక్యతనీ, చైతన్యాన్నీ మెరుగుపరుచుకునేందుకు ఏదీ బోధించరు. మన పరిసరాల్లో ప్రతిదాన్నీ ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నాం గాని, మనకి సంక్షేమం మాత్రం లభించలేదు. మీ భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకోడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అవి మెరుగుపడతాయి తప్ప, మీరుగాని, మీ జీవితానుభవం గాని మెరుగుపడదు. మీరు ఊపిరి పీలుస్తున్నపుడు, నాది అని చెప్పుకోగలిగిన మోతాదులో గాలి మీ స్వంతం కాదు. మీరు మీ చుట్టూ ఉన్న పర్యావరణంతో నిత్యం ఇచ్చిపుచ్చుకోకుండా, బ్రతకలేరు. వానపాముకి ఇది తెలుసు. చాలా మంది మనుషులకి ఆ  మేరకు కూడా ఎరుకలేదు.  మనకి మనం ఒక స్థిరమైన పునాది వేసుకోవడానికి ఎంతమాత్రం ప్రయత్నం చెయ్యకపోవడంతో, మన తెలివితేటలూ, మన స్పృహ మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అందుకనే, మన మూలాధారం స్థిరంగా ఉండాలంటే, భూమి అన్న మూలకం చాలా ముఖ్యం.

భూమితో అనుసంధానం చేసుకుని, మూలాధారాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి సులువైన మార్గం ఉత్తికాళ్లతో నడవడం. 

భూమితో అనుసంధానం చేసుకుని, మూలాధారాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి సులువైన మార్గం ఉత్తికాళ్లతో నడవడం.  ముఖ్యంగా "ప్రదోషం" అంటే అమావాస్యకి రెండురోజుల ముందునుండి అమావాస్య వరకూ ఉన్న కాలం, ఈ అనుభవాన్ని పొందడానికి చాలా అనువైన కాలం. ఈ రోజుల్లో, చంద్రుడి ఆకర్షణశక్తి భూమి మీద ఒక మేరకి జడత్వాన్ని కలుగజేస్తుంది, దాని వలన, మీ శరీరమూ దానిలోని శక్తి క్షేత్రాలూ, మిగతా రోజుల కంటే ఆ రోజుల్లో భూమితో ఎక్కువ సంపర్కం కలిగి ఉంటాయి. కారణం ఆ దిశలో మిమ్మల్ని లాగడం వల్లనే. దానికి భిన్నంగా, పౌర్ణమి దినాల్లో, మిమ్మల్ని మీదకి లాగుతుంటుంది, వ్యతిరేకదిశలో. కనుకనే, పౌర్ణమిరోజుల్లో, అమావాస్యరోజుల్లో, శివరాత్రికీ, ప్రదోషానికి వేర్వేరు యోగాభ్యాసాలు ఉన్నాయి.

ప్రతిరోజూ కాకపోయినా, కనీసం ఈ మూడు రోజులూ, అంటే ప్రదోషం నుండి అమావాస్య వరకు, ఒక వేళ ఆరుబయట కుదరకపోతే ఇంట్లోనైనా  ఉత్తికాళ్ళతో నడవడానికి, నేలమీద కూర్చునేందుకు, ముఖ్యంగా మఠం వేసుకుని ( బాసిపీట వేసుకుని) కూచోగలరేమో ప్రయత్నించండి. ఈ రేండూ కూడా గాఢమైన శక్తి సంపర్కాన్ని కలుగజెయ్యడమే గాక, మీరు భూమిలో ఒక భాగమనే అనుభూతిని కలుగజేస్తాయి. పడుకోవడం అటువంటి చైతన్యవంతమైన అనుభూతిని కలుగజెయ్యదు.  నేలతో మనం అనుభూతిపరంగా మమేకమవడానికి మన సంస్కృతిలో చాలా చిట్కాలున్నాయి. ఈ అనుబంధాన్ని అనుభూతిచెందడానికి, కొందరు సంవత్సరంలో కొన్ని రోజుల్లో కొంచెం మట్టిని తింటారు. ముఖ్యంగా చెదపురుగులు పైకి తోడిన మట్టి, లేదా దాన్ని పోలినది. ఈ మూలకాలను ప్రతి నిత్యమూ మీ అనుభూతి లోకి తీసుకువచ్చే అభ్యాసాన్ని "భూతశుద్ధి" ద్వారా బోధించడం జరుగుతుంది.

మీరు తీసుకునే ప్రతి శ్వాసనీ స్పృహతో తీసుకోగలిగితే ఉత్తమోత్తమం. మీరు గాలి పీలుస్తున్నపుడు, ఈ గ్రహంలో ఒక భాగాన్ని శ్వాసిస్తున్నాను అన్న ఎరుకతో ఉండండి. మీరు భోజనం చేస్తున్నపుడు నేను ఈ గ్రహంలో ఒక లేశాన్ని భుజిస్తున్నాను అన్న స్పృహకలిగి ఉండండి. మీరు నీళ్ళు తాగుతున్నపుడు నేను ఈ గ్రహంలో ఒక భాగాన్ని తాగుతున్నాను అన్న స్పృహకలిగి ఉండండి. మీరు మేధోపరంగా ఈ అనుబంధం గురించిన స్పృహ కలిగి ఉండండి, కానీ, సంపర్కాన్ని అనుభూతిచెందడానికి అదొక్కటే చాలదు. నిజమైన అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే, మీ చిటికెనవేలు  మీ శరీరంలో భాగమని ఎలా అనుభూతి చెందుతున్నారో, అలా మీరు భూమిని అనుభూతి చెందగలిగినప్పుడు.

ఉత్తికాళ్ళతో నడవండి, నేలమీద మఠం వేసుకుని కూర్చొండి, భూతశుద్ధి సాధన చెయ్యండి. మీరు తింటున్నా, తాగుతున్నా, ఊపిరి పీలుస్తున్నా, మీరు "ఈ గ్రహంలోని ఒక లేశాన్ని లోపలికి తీసుకుంటున్నా"నన్న ఎరుకతో ఉండండి. మీరు ఏ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నానన్న స్పృహతో చెయ్యండి. మీరు జీవితాన్ని అనుభూతి చెందడంలో ఒక సమగ్రమైన మార్పుని అది తీసుకువస్తుంది.

 

మట్టి

మీరు నడిచే ఈ మట్టి,

మీరు మురికి అని భావించే ఈ మట్టి

ఒక అద్భుతమైన పదార్థం.

అదే ఆకుగా, పువ్వుగా, పండుగా మారుతుంది.

ఇప్పుడు మీరు ప్రాణిగా చూస్తున్న ప్రతి వస్తువూ,

ఒకప్పుడు ఈ పవిత్రమైన మట్టి  

గర్భంలో శాశ్వతంగా పరున్నదే.

అదే కొందరికి జీవనప్రదాత అయితే

మరికొందరికి మురికి, పంకిలం. 

కానీ ప్రాణాన్ని పొదివిపట్టుకునే

శరీరమనే కవచాన్ని సృష్టించడానికి

ఆధారమైన పవిత్ర మూలకం మట్టి.

రైతు నాగలి క్రిందా, కుమ్మరి సారె మీదా

అన్నిటికీ మించి భగవంతుని ఆదేశానుసారం

నడిచే అద్భుతమైన యంత్రం ఈ మట్టి.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు