ప్రశ్న: నమస్కారం, సద్గురూ. ఒక తల్లి గర్భంలో శిశువు రూపుదిద్దుకుంటున్నప్పుడు, చక్రాలు ఎప్పుడు ఇంకా ఎలా వ్యక్తమవ్వడం మొదలు పెడతాయి?

సద్గురు: సుమారుగా, పన్నెండవ వారం వరకూ కేవలం ఒక చక్రం మాత్రమే రూపుదిద్దుకుంటుంది. అది మూలాధార చక్రం. మొదటి 28-30 వారాల్లో, ఆ పిండం ఎదుగుదల తత్వాన్ని బట్టి, మొదటి ఐదు చక్రాలూ - అంటే విశుద్ధి వరకూ పూర్తిగా ఏర్పడతాయి. మిగతా రెండూ, అంటే ఆజ్ఞా, సహస్రార చక్రాలు ప్రతీ మానవుడిలోనూ ఒకే స్థాయిలో ఏర్పడవు. అందుకే, శిశువు జన్మించగానే మన సంస్కృతిలో మొదట చేసే పని శిశువుకి స్నానం చేయించగానే కనుబొమ్మల మధ్యలో కొద్దిగా విభూతి పెట్టేవారు. ఒకవేళ ఆజ్ఞా గనక పూర్తిగా తయారయ్యి ఉండకపోతే, శిశువు ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాలని మన ఉద్దేశ్యం.

ఆజ్ఞా చక్రాన్ని గమనించడం

మీరు, నేను ఇప్పుడు చెప్పినదాని ప్రకారం, ఒక నిర్ధారణకి రావద్దు. కానీ, సుమారుగా 30 నుంచి 35శాతం అప్పుడే జన్మించిన శిశువులకు ఆజ్ఞా పూర్తిగా ఏర్పడదు. సహస్రారం కూడా సహజంగా ఎంతో మందికి ఏర్పడదు. అది మెల్లిగా ఎదుగుతుంది. మీరు కనుక, ఆ శిశువు కనుబొమ్మలు ఎలా తిప్పుతుందో గమనిస్తే, ఆ శిశువుకి ఆజ్ఞా అన్నది తయారయ్యిందా లేదా అన్నది తెలుస్తుంది. సాంప్రదాయపరంగా, ప్రజలు ఆ శిశువు ఒక సాధువు అవ్వగలడా లేదా.. అన్నది చెప్పేవారు. ఒక సాధువు అంటే ఖచ్చితంగా ఒక అడవిలో ఒక చెట్టు కిందికో, ఒక గుహలోకో వెళ్లి కూర్చొనేవాళ్ళు అని అర్ధం కాదు. ఒక సాధువు అంటే ఎవరైతే మిగతావారు చూడలేని విషయాలను ఏదో ఒక విధంగా గ్రహించగలరో, అటువంటి వారని అర్థం. అది ఒక గొప్ప వ్యాపారవేత్త అయినా అవ్వవచ్చు లేదా ఒక నాయకుడైనా అవ్వవచ్చు. ఎవరైతే ఎన్నో విషయాలను మిగతావారికంటే చాలా స్పష్టంగా చూడగలరో, వారు.

తల్లి గర్భంలో ఉన్నప్పుడు "ఆజ్ఞా" ఎదిగిందా లేదా అన్నది తెలుసుకోవడానికి శిశువు జీవితంలో మొదటి మూడు నెలల కాలంలో వీలవుతుంది. ఇది ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది. అంటే, ఎవరికైతే అజ్ఞా అన్నది జన్మించే సమయానికి పూర్తిగా ఏర్పడదో, అది ఇక వారికి జీవితకాలంలో ఏర్పడదని కాదు. వారు దానిమీద సాధన చేస్తే అది ఏర్పడేలా చేసుకోవచ్చు.  కానీ, వీరు మిగతావారికంటే మరి కొంచెం కృషి చేసుకోవలసి ఉంటుంది. మన సాంప్రదాయం ప్రకారం మనం కొన్ని విషయాలను కనుక సరి చూసుకున్నట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిపూర్ణంగా ఎదుగుదల జరిగేలాగా మనం చేసుకోవచ్చు. మన సాంప్రదాయంలో ఇంకా గర్భం దాల్చక ముందరనుంచే స్త్రీ యందు ఈ విధంగా శ్రద్ధ తీసుకునేవారు. ఆవిడ ఎలా ఉండాలీ, ఏమి చెయ్యాలీ అన్నవి. ఆ సమయంలో, ఒకరకమైన ఆలయాలకు  వెళ్ళేవారు, ఒక రకమైన ఆహారం పెట్టేవారు, కొన్ని గ్రంథాలను చదివేవారు, వారు ఎలాంటి పరిసరాల్లో ఉండాలి, ఎవరిని కలవచ్చు, ఎవరిని కలవకూడదు, ఎటువంటి రంగులూ-రూపాలూ వారు చూడవచ్చో, చూడకూడదో - ఇలా ప్రతీ విషయం పట్లా ఎంతో శ్రద్ధ పెట్టేవారు. శిశు జననమైనా మరణమైనా ఈరోజు ఒక పెద్ద వ్యాపారంగా తయారైపోయింది. అందువల్ల, ఇటువంటి విషయాలన్నీ దురదృష్టవశాత్తూ తుడిచిపెట్టుకుపోతున్నాయి.

మనం గర్భిణీ స్త్రీ పట్ల కొన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుంటే శిశువుకు చక్రాలను తల్లి గర్భంలో ఉండగానే పూర్తిగా ఎదిగేటట్లుగా చెయ్యగలం.
ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు ఇంకా గర్భం దాల్చక ముందు నుంచి పురుడు అయ్యేవరకూ చెప్పేవారు. ఇటువంటి అవగాహన ఉన్న మరొక సాంప్రదాయం యూదు (jewish) సాంప్రదాయం. వారు మనకంటే దీనిని మరింత మెరుగ్గానే నిలబెట్టుకున్నారు. భారతీయులు, తమ సాంప్రదాయాన్ని పాశ్చాత్యానికి వదిలేయడంలో ముందుంటారు. అందుకని, మనలో చాలామంది ఇందులో ఎన్నో విషయాలు అసలు చెయ్యడమే లేదు. ఒక శిశువు జన్మించినప్పుడు, మొదటి విషయం ఏమిటంటే వారి కనుగుడ్లు ఎలా కదుపుతున్నారో చూడాలి.  ఇవి కనుక స్థిరంగా ఉంటే, అంటే శిశువు దేనినైనా పరీక్షగా చూడగలుగుతున్నాడా లేదా అన్నది - కొంతమంది శిశువులు పెద్దవారు చూసినట్లుగానే చూడగలరు. మరొక విషయం ఏమిటీ అంటే, శిశువు ఎలా ఏడుస్తున్నాడన్నది. కొంతమంది గ్రాహ్యత కలిగిన వ్యక్తులు ఒక శిశువు జన్మించినప్పుడు మొట్టమొదట ఆ పిల్లవాడు ఏడ్చిన విధానాన్ని బట్టి, వారు ఏమవుతారో చెప్పగలరు. కొంతమంది కొత్త ప్రదేశంలోనికి వచ్చిన అయోమయంలో ఏడుస్తారు, మరికొంతమంది కోపంగా ఏడుస్తారు, కొంతమంది జననం వల్ల చికాకు చెంది ఏడుస్తారు. శిశువులందరూ కూడా భిన్నంగా ఏడవడాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా పురుళ్ళు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని చెప్పగలిగేవారు.

మనం గర్భిణీ స్త్రీ పట్ల కొన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుంటే శిశువుకు చక్రాలను తల్లి గర్భంలో ఉండగానే పూర్తిగా ఎదిగేటట్లుగా చెయ్యగలం. కానీ ఈరోజున మనకి సామాజిక, ఆర్ధిక కలాపాలు ఎంత పెరిగిపోయాయంటే, నిండు గర్భిణీలు కూడా, పని చెయ్యడానికి ఇంకా ఆఫీసుకి వెళ్తున్నారు, ఇంకా పార్టీలు చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ధూమపానం చేస్తున్నారు. అందుకే ఇదంతా పూర్తిగా ప్రకృతికి వదిలివేయబడింది. చక్రాలను ఎదిగేలాగా చెయ్యడంలో, మనం  ఎటువంటి పాత్రా పోషించడం లేదు. కానీ మనం కనుక సరైన విషయాలను చేస్తే, ప్రత్యేకమైన స్వభావాలు జన్మించే శిశువుల్లో ఏర్పడేలా చెయ్యవచ్చు. ఇందులో, ఫలితం అన్నది ఎప్పుడూ నూరు శాతం మీ అధీనంలో ఉండదు. కానీ, మీరు గనుక సరైన విషయాలను పాటిస్తే, కొంత మంచి ఫలితం కలుగుతుంది.

మన తరువాతి తరాన్ని, మనం పెంపొందించాలి

వీటన్నిటి వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, భావితరం మనకన్నా కూడా మెరుగ్గా ఉండేలా చేయడానికే. కానీ, ఇవన్నీ జరగాలన్న శ్రద్ధ, నిబద్ధత ఈరోజుల్లో లేవు. దురదృష్టవశాత్తూ, మన జీవితాలే మనకి  ముఖ్యం. ఈ మధ్యలో,  నేను ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ కోసం ఒక కన్సల్టెంట్ ని మేము నియమించడం జరిగింది.  ఆవిడ ఏంతో సన్నగా చిన్నగా ఉన్న ఒక స్త్రీ. ఆవిడ నిండు గర్భిణీ. ఆవిడ, మాతో పని చెయ్యడానికి వచ్చింది. నేను ఆవిడని "మీకు ఇంకా కాన్పు రావడానికి ఎంత సమయం ఉంది..?" అని అడిగాను. "బహుశ రేపు ఉదయం" అందావిడ. దానికి నేను "మరి నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు..?" - అని అన్నాను. "లేదు, ఇది నాకు రెండో కానుపు. నేను క్రిందటిసారి కానుపు వచ్చే రెండు గంటల ముందు వరకూ పని చేస్తూనే ఉన్నాను" - అన్నదావిడ.  మన జీవితాలూ, మన ఆర్ధిక అంశాలూ, పార్టీలూ, సామాజిక చెత్తా అంతాకూడా మనకి ఏంతో ముఖ్యమైంది.

మనకి, భావి తరాలమీద ఏమీ శ్రద్ధ లేదు. కనీసం, మన భావితరం మనకంటే మెరుగ్గా ఉండాలని ఆలోచించేపాటి బాధ్యత కూడా, మనకి మన భావితరాల పట్ల లేదు. కానీ, ఇది ఎంతో ముఖ్యమైనది. భావితరం మనకంటే తక్కువ స్థాయిలో ఉంటే, అది మానవాళి పట్ల మనం చేస్తున్న నేరమే..!! మీరు మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలి, వెనుకకు కాదు. మీరు, శిశువును ప్రభావితం చేయడానికి ఎటువంటి విషయాలమీద దృష్టి పెట్టాలో అనేదానిమీద నేను ఒక పుస్తకం వ్రాయాలనుకుంటున్నాను. అయితే అప్పుడు ఎక్కువమంది గర్భం దాలుస్తారేమో..!?  అదొక సమస్య అయిపోతుంది. నేను, ఇది నా చివరి దశలో రాస్తాను. ఎందుకంటే, నేను ఇక్కడ ఉండగా జనాభాను పెంచడం నాకు ఇష్టం లేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు