ప్రశ్న: శక్తిని ప్రతికూలంగా ప్రయోగించవచ్చా? ఉదాహరణకు క్షుద్ర విద్య లాంటివి.

సద్గురు: శక్తి అనేది కేవలం శక్తి మాత్రమే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. శక్తి అనేది దివ్యమైనది కాదు అలాగే దుష్టమైనది కాదు. మీరు ఆ శక్తి నుండి దైవాన్ని కానీ దెయ్యాన్ని కానీ ఏమైనా తయారుచేయచ్చు. అది విద్యుచ్చక్తి వంటిది. విద్యుచ్చక్తి దివ్యమైనదా లేక అరిష్టమైనదా? విద్యుచ్చక్తితో మీ ఇంట్లో వెలుగును నింపినప్పుడు అది దివ్యమైనది. ఒక వేళ అది ఎలక్ట్రిక్ కుర్చీ అయితే, అది దుష్ట శక్తి అవుతుంది. ఆ క్షణంలో ఎవరు దాన్ని నిర్వహిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి 5 వేల సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణుడిని అర్జునుడు ఇదే ప్రశ్న అడిగాడు. "ప్రతి ఒక్కరిలో పనిచేసే శక్తి ఒకటే అయినప్పుడు, అది దివ్యమైనది అయినప్పుడు, అది దైవత్వం అయినప్పుడు, దుర్యోధనుడిలో ఉన్న శక్తి ఇలా ఎందుకు పనిచేస్తుంది?" ఎన్నో బోధనలు చేశాక కూడా అర్జునుడు చిన్న పిల్లవాడిలా ప్రాథమికమైన, సామాన్యమైన ప్రశ్నను మళ్ళీ అడిగినందుకు శ్రీ కృష్ణుడు నవ్వుకున్నాడు. "దేవుడు నిర్గుణుడు, దైవం నిర్గుణమైనది. తనకంటూ స్వంత గుణాలేమి లేవు" అని కృష్ణుడు బదులిచ్చాడు. దాని అర్థం అది కేవలం స్వచ్ఛమైన శక్తి. దాని నుండి మీరు ఏమైనా తయారుచేయవచ్చు. మిమ్మల్ని తినడానికి వచ్చే పులిలో ఏ శక్తి ఉందో, మిమ్మల్ని కాపాడటానికి వచ్చే దైవంలోను అదే శక్తి ఉంటుంది. వారు వేరు వేరు విధాలుగా పనిచేస్తున్నారు. మీరు మీ కారును నడుపుతున్నప్పుడు, అది మంచిదా, చెడ్డదా? అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లగలదు లేదా ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలను హరించగలదు. కాదంటారా?

అయితే మనుషులు క్షుద్ర విద్యలను చెయ్యగలరా? తప్పకుండా చేయగలరు. సానుకూల ప్రయోజనాలు ఉన్నప్పుడు, ప్రతికూల ప్రయోజనాలు కూడా ఉంటాయి. వేదాల్లో ఒకటైన అధర్వణ వేదం శక్తులను అనుకూల, ప్రతికూల విధాలుగా ఉపయోగించడాన్ని బోధిస్తోంది. కానీ నేను గమనించినది ఏమిటంటే ఇవి చాలా వరకు మానసికమైనవి. అది కొంచెమే ఉండవచ్చు, మిగిలినదంతా మీ మనసు వెర్రిగా ఊహ చేస్తుంది. నేను మీకు వెర్రి ఎక్కించాలి అనుకుంటే నేను నిజమైన క్షుద్ర విద్య ప్రయోగం ఏమి చెయ్యనక్కరలేదు. మీరు రేపు ఉదయం ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఒక కపాలాన్ని, కొంచెం రక్తాన్ని గుమ్మంలో చూస్తే చాలు, మీరు వ్యాధి భారిన పడతారు. మీ వ్యాపారం దెబ్బతింటుంది. మిమ్మల్ని ఒక భయం పట్టుకోవడం వల్ల మీకు అంతా ప్రతికూలంగానే జరుగుతుంది. ఎలాంటి క్షుద్ర విద్య ప్రయోగించబడలేదు. కేవలం క్షుద్ర విద్యను సూచించే కొన్ని చిహ్నాలే మీ మనస్సును సర్వ నాశనం చేయగలవు. చాలా సార్లు క్షుద్ర విద్య అనేది మానసికమైనది. ఒక వేళ జరిగినా వాటిలో ఒక పది శాతమే నిజంగా జరిగి ఉండవచ్చు. మిగిలినదంతా మీ ఊహలతో మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. అందుకే అది ప్రతీకాత్మకంగా ఉంటుంది. మీ మనస్సు మీపైన కలుగజేసే ప్రభావాన్నీ వారు బాగా అర్థం చేసుకున్నారు. ఒకసారి ప్రతీకవాదం సృష్టించబడితే, మిమ్మల్ని మిరే నాశనం చేసుకుంటారు.

చేతబడి నుండి ఎవరిని వారే రక్షించుకోవటం ఎలా?

ఇతరులకు హాని కలిగించేలా శక్తులను ప్రతికూలంగా ప్రయోగించే ఒక శాస్త్రం ఉంది. అయితే రక్షణ మార్గం ఏమిటి? మీరు ఆధ్యాత్మిక సాధనలో ఉంటే కనుక ఇలాంటి విషయాలను గూర్చి బాధపడవలసిన అవసరమే లేదు. కనీసం వాటిని గూర్చి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. మరొక మార్గం ఏమిటంటే రుద్రాక్ష వంటి రక్షకాలను ధరించటం. అది అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షణ కలిపిస్తుంది. కాని మీరు వీటి గురుంచి చింతించవలసిన పనిలేదు. మీ జీవితంపై దృష్టిని నిలిపి సాగిపోండి. మీరు సాధనలో ఉన్నప్పుడు, మీరు బాధపడవలసిన అవసరం లేదు, అదే రక్షణ కల్పిస్తుంది.

ధ్యానలింగం

Dhyanalinga - In Search of Shiva

ఒకవేళ మీరు అటువంటి ప్రభావానికి లోనై ఉంటే, వచ్చి ధ్యానలింగ ప్రభావ పరిధిలో కొద్ది సేపు కూర్చోండి. ఎందుకంటే ధ్యానలింగపు ప్రత్యేకమైన కొన్ని పార్శ్వాలు ఇలాంటి ప్రభావాలను ప్రక్షాళన చేయడం కోసం ఏర్పరచారు. ఇలాంటిదేదో జరిగింది అని మీకు భయం ఉంటే కనుక ఒకరోజు వచ్చి ధ్యానలింగ సమక్షంలో కూర్చొని వెళ్ళండి. అది రక్షణ కల్పిస్తుంది. కాని, మీరు అటువంటి విషయాలను పట్టించుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో బయటి శక్తుల కంటే మీ మనసు మీకు చేసే హానే ఎక్కువ.

ధ్యానలలింగ ప్రవేశ మార్గంలో వనశ్రీ, పతంజలి క్షేత్రాలు ఉన్నాయి. అవి ధ్యానలింగానికి పదిహేను డిగ్రీల కోణంలో ఉన్నాయి. అందుకే వాటిని అక్కడ నిర్మించటం జరిగింది. లేకపోతే నిర్మాణ విజ్ఞానం ప్రకారం వాటిని మరికొంచెం దగ్గరగా నిర్మించేవాడిని. సాధారణంగా ఏవైనా శక్తులు ఆవహించిన వారు కాని, లేదంటే ఇలా క్షుద్ర విద్యల బారిన పడిన వారు గాని, ముందు వైపు 15 డిగ్రీల కోణంలో గాని, వెనుకవైపు 15 డిగ్రీల కోణంలో గాని కూర్చొనేలా ఏర్పాటు చేస్తాం. అది వారి సమస్య స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

అటువంటి వారి ప్రయోజనం కోసమే ఆ స్థలాన్ని ఏర్పాటు చెయ్యటం జరిగింది. మీకు తెలిసినా తెలియకపోయినా, శక్తులను ప్రతికూలంగా వాడే క్షుద్రవిద్యలు మరికొన్ని కూడా ఉన్నాయి. లోపలకు వచ్చే మార్గంలో ఆ పదిహేను డిగ్రీల కోణం ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా లోపలికి వచ్చే వారు మోసుకొని వస్తున్న ఆ ప్రతికూల శక్తులను ప్రవేశ ద్వారంలోనే వదలివేస్తారు. అలా వదలి వేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. అందువల్లే ధ్యానలింగ దర్శనం చేసుకొన్న వారిలో చాలా మంది తమ జీవితం హఠాత్తుగా మారిపోవటాన్ని గమనిస్తారు. తమపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తొలగిపోవటం వల్లనే అలా జరుగుతుంది.

ప్రతికూల ప్రభావాలు అని మనం అన్నప్పుడు, ఎవరో ఏదో మనకు విరుద్ధంగా చేశారు అని అర్థం కాదు. ఎన్నో మార్గాల్లో మీరే స్వయంగా ప్రతికూలతను స్వీకరించి ఉండవచ్చు. ఎవరో విషపూరితమైన పండును మీకు ఇచ్చారని కాదు, కొన్ని పండ్లల్లో సహజంగానే కొంత విషతత్వం ఉండచ్చు. దాన్ని తిన్నప్పుడు అది మీ శరీరంలో ప్రవేశించవచ్చు. అలాగే జీవితానికి సంబంధించిన ప్రతికూల విషయాలు ఏవో, ఏదో మార్గంలో మీలో ప్రవేశించి ఉండవచ్చు. ఎక్కడో ఎవరో కూర్చుని మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థం కాదు. ధ్యానలింగ ప్రవేశ మార్గం, మొదటి పదిహేను డిగ్రీల కోణం ఇందుకే సృష్టించబడింది. ప్రజలకు అంతకు ముందు ఏమైనా ఆవహించి ఉంటే, వాటి నుండి ఇవి రక్షణ కల్పిస్తాయి. ఒక్కసారి ఆ అరవై డెబ్భై అడుగుల ప్రదేశంలో నడిస్తే అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పించబడుతుంది.

Editor’s Note: “Mystic’s Musings” includes more of Sadhguru’s insights on the human energy system. Read the free sample or purchase the ebook.