logo
logo
Drawing of Vishnu offering his eye and lotus flowers to Linga.

విష్ణువు ఇంకా శివుని గురించి మూడు కథలు

మన సాంప్రదాయంలో శివుడు ఇంకా విష్ణువుల గురించి ఆసక్తికరమైన ఒక మూడు కథలను ఇక్కడ ఇస్తున్నాము: విష్ణువుకు శివుడు తన నివాసాన్ని కోల్పోయినప్పుడు; విష్ణువు శివుడిని కాపాడినప్పుడు; అలాగే ఆఖరిగా మనసుని హత్తుకునేటువంటి, శివునిపై విష్ణు భక్తిని తెలిపే ఒక కథ.

శివుడు ఇంకా విష్ణువు - బద్రీనాథ్ ఉదంతం


బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. అద్భుతమైన ప్రదేశం. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. ఒక రోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, “మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడూ మీరు ఊరికే ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మిదేవి, నిరంతరం మిమ్మల్నిసేవిస్తూ, చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం, మరింత శక్తివంతమైనదేదైనా మీరు చేయాలి” అంటాడు.

ఈ విమర్శను తప్పించుకోవడానికి, అలాగే తనను మెరుగుపరచుకోవడం కోసం, సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయాలకు వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది, అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా - ప్రతీదీ కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కానీ అది శివుని నివాసం అని - అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు. తనకి గనక కోపం వస్తే, కేవలం మీ గొంతే కాకుండా, తన గొంతు కూడా కోసుకునే రకం ఈయన. ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు.

అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి, ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. వాహ్యాళికి వెళ్ళిన శివుడు పార్వతీ ఇంటికి తిరిగి వస్తారు.. వాళ్లు వచ్చేటప్పటికి వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాణ్ణి ఎత్తుకోబోయింది. శివుడు, ‘‘పిల్లవాణ్ణి ముట్టుకోకు,’’ అని పార్వతీ దేవిని వారించాడు. ఆవిడ, ‘‘ఎందుకింత క్రూరత్వం, అలా ఎలా అనగలుగుతున్నారు?’’ అని అడిగింది.

శివుడు, పార్వతీ దేవితో ఇలా చెప్పాడు, ‘‘ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాడు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోనీ, తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాడు’’ అని. కానీ పార్వతీ దేవి, ‘‘వీల్లేదు. నాలోని మాతృత్వం పిల్లవాణ్ణి ఇలా ఏడుస్తూ వదిలేయ లేదు’’ అని, ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకొని ఇంటిలోకి తీసికొని వెళ్లింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు, శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతోందో తెలుసు. అయినా, ‘‘సరే కానీ, ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నాడు.

పార్వతీ దేవి పిల్లవాణ్ణి సముదాయించింది. అన్నం తినిపించింది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్లింది. వాళ్లు తిరిగి వచ్చేటప్పటికి ఇంటిలోపలవైపు తలుపుకు గడియ పెట్టి ఉంది. పార్వతీ దేవి ఆశ్చర్యచకితురాలైంది, ‘‘తలుపెవరు వేశారు..?’’ . శివుడు ‘‘నేను చెప్పాను కదా? పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు, వాడు లోపలి నుండి తలుపు గడియ పెట్టాడు’’.

పార్వతీ దేవి, ‘‘ఇప్పుడేం చేద్దాం’’ అన్నది.

శివుడికి రెండే మార్గాలున్నాయి: ఒకటి, తన ముందున్న దాన్నంతా దహించివేయడం. రెండు, మరో నివాస స్థానం వెతుక్కోవడం. అందువల్ల ఆయన, ‘‘ఎక్కడికన్నా వెళదాం. ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా. నేను వాణ్ణి ఏమీ చేయను’’. అన్నాడు

ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు. తగిన చోటు కోసం వెతికారు. చివరికి కేదార్‌నాథ్ లో స్థిరపడ్డారు. మరి ఇదంతా ఆయనకు ముందే తెలియదా? అని మీరు అడగవచ్చు. మీకెన్నో విషయాలు తెలుసు, కాని మీరు వాటినలా జరగనిస్తారు.

విష్ణువు శివున్ని కాపాడినప్పుడు


యోగ సంప్రదాయంలో, శివుని బేషరతు కరుణ గురించి ఇంకా, ఒకరి కోరికలకు తను భోళాగా స్పందించడం గురించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఒకప్పుడు, గజేంద్ర అన్న పేరుగల ఒక అసురుడు ఉండేవాడు. గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ట ఆచరించి, శివుడు నుండి ఒక వరం పొందుతాడు. తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు అతని దగ్గర ప్రత్యక్షమవ్వాలన్న వరం అది. ఇక గజేంద్రుడు, తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికీ శివుడిని పిలుస్తున్నాడన్న విషయాన్ని గమనించాడు నారద ముని. ముల్లోకాలలోనూ తుంటరి అయిన నారద ముని, గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు.

అతను గజేంద్రునితో, “నువ్వు శివుడిని పోతూ వస్తూ ఉండనిస్తున్నావెందుకు? ? ఎలాగూ ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు. అసలు ఆయన్ని నీలోకి వచ్చేసి అక్కడే ఉండమని అడగొచ్చు కదా, అప్పుడు ఆయన ఎప్పటికీ నీ వాడిగానే ఉంటాడు కదా “ అంటాడు. గజేంద్రుడు ఇది మంచి ఆలోచనే అనుకోని, ఆ ప్రకారం శివుడిని వేడుకుంటాడు. శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు, అతను “నువ్వు నా లోనే ఉండాలి, నువ్వు ఇంక ఎక్కడికీ వెళ్ళకూడదు” అంటాడు. శివుడు భోళాగా ఒక పిల్లవాడిలా స్పందిస్తూ, సరే అని, ఒక లింగం రూపంలో గజేంద్రుని లోనికి ప్రవేశించి, అక్కడే ఉంటాడు.

సమయం గడిచే కొద్దీ, విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు.. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. దేవుళ్ళు, గణాలు అందరూ శివుని కోసం వెదకడం మొదలుపెడతారు. ఎంతగానో వెతికిన తర్వాత, ఇక ఎవరూ ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేక పోయినప్పుడు, పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరకు వెళతారు. విష్ణువు పరిస్థితిని చూసి, “ఆయన గజేంద్రునిలో ఉన్నాడు” అని చెబుతాడు. అప్పుడు దేవుళ్ళందరూ విష్ణువుని, “మరి శివుని గజేంద్రునిలో నుండి బయటకు తీసుకురావడం ఎలా” అని అడుగుతారు, ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా, గజేంద్రుడు అమరుడు అవుతాడు.

ఎప్పటిలానే, విష్ణువు సరైన ఉపయం ఇస్తాడు. దేవుళ్ళు అందరూ శివ భక్తులు వలే వేషధారణ చేసి, గజేంద్రుని రాజ్యంలోనికి వచ్చి, గొప్ప భక్తితో శివుడిని పొగుడుతూ పాడటం మొదలు పెడతారు. గొప్ప శివభక్తుడు అయిన గజేంద్రుడు, ఈ శివ భక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు. శివుని భక్తులలా వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం, అక్కడకు వెళ్లి, భక్తితో శివుని కోసం ఆడతారు, ఆయనను ఆరాధిస్తారు, ఇంకా ఆయన కోసం నృత్యం చేస్తారు. గజేంద్రుని లోపల ఉన్న శివుడు, తనను తాను నిగ్రహించుకోలేకపోతాడు, ఇక స్పందించక తప్పదు. కాబట్టి తను గజేంద్రుడిని ముక్కలు ముక్కలుగా చేసి, అతనిలో నుండి బయటకు వస్తాడు!

శివునిపై విష్ణువుకి ఉన్న భక్తిదేవుళ్ళు ఇంకా రాక్షసులు, ఇద్దరూ శివుడిని ఆరాధిస్తారు. దేవదానవులకూ, ఉత్తములకు ఇంకా అధములకు - అందరికీ శివుడు భగవంతుడు. ఆ విష్ణువే ఆయన్ని ఆరాధించేవాడు. విష్ణువు శివుని భక్తుడు అని తెలిపే ఒక అందమైన కథ ఉంది.

ఒకసారి, విష్ణువు శివునికి 1008 తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు. తను తామర పువ్వులను వెతుకుతూ వెళతాడు. ప్రపంచం మొత్తం వెతికాక తనకి కేవలం 1007 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువ అవుతుంది. తను వచ్చి ఆ పూలు అన్నింటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్ళను తెరవకుండా, ఓ చిరు నవ్వు చిందిస్తాడు, ఎందుకంటే ఒక పువ్వు తక్కువ అయ్యింది కాబట్టి. అప్పుడు విష్ణువు, “నన్ను కమలనయనుడు అంటారు, అంటే తామరుల వంటి కన్నులు గల దేవుడను అని. నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను” అనుకొని, వెంటనే తన కుడి కనుగుడ్డుని పీకి లింగం పైన పెడతాడు. ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు, విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు.

సంపాదకుడి సూచన: ఆదియోగి అయిన శివుని గురించి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను చదవడానికిఇక్కడ నొక్కండి.

    Share

Related Tags

శివుని కథలు

Get latest blogs on Shiva

Related Content

శివుడు - కన్యాకుమారి ప్రేమ కథ