“అధ్బుతమైన శివుని రేయి” మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. ఈ రాత్రి ఎందుకు అంత ప్రముఖమైందో ఇంకా దానిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్నీ సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతీరోజూ వేడుక చేసుకోవటానికి వారికొక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి. వారు వివిధ చారిత్రక సంఘటనలు, విజయాలుకు సూచనగా లేదా విత్తనాలు నాటడం ఇంకా పంటకోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతీ సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది.

ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు.