ieco
ieco

మహా దేవుడైన శివుడు

article శివుని గురించి
ఆదియోగి శివుడిని మహాదేవుడు అని, లేదా అందరు దేవుళ్ళకంటే గొప్పవాడు అని ఎందుకు అంటారో తెలుసుకోండి.

సద్గురు: కొన్ని రోజుల క్రితం ఎవరో నన్ను, “మీరు ఆదియోగి శివుని అభిమానా?” అని అడిగారు. జనాల భావోద్వేగాలు ఎవరితో అయినా గుర్తింపు ఏర్పరచుకుంటే అప్పుడు ఒక ఫ్యాన్ క్లబ్ మొదలవుతుంది. నేను ఖచ్చితంగా ఆయన ఫ్యాన్ ని కాదు. అసలైన విషయం మరొకటి ఉంది, కానీ ముందు దీని గురించి మీకు వివరిస్తాను.

మొత్తం మీద, ఏ తరంలో చూసుకున్నా ఒక మనిషి ఆ తరానికి లేదా రాబోయే తరాలకు ఏమి అందించాడు అన్నదాన్ని బట్టి అతనికి విలువ ఇస్తారు. ఈ భూమి మీద ఇతరుల జీవితాల కోసం ఎంతో సహకారం అందించిన అద్భుతమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారున్న సమయాలలోని అవసరాలను బట్టి – కొందరు ఓ ప్రేమ తరంగాన్ని తీసుకువచ్చారు, కొందరు ధ్యాన తరంగాన్ని తీసుకువచ్చారు, ఇంకొందరు ఆర్థిక శ్రేయస్సు తరంగాన్ని తీసుకువచ్చారు.

ఉదాహరణకు మహాత్మాగాంధీని తీసుకుంటే- అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే – ఇది అతని తక్కువ చేయడానికి కాదు – అది స్వాతంత్రానికి ముందు కాబట్టి, అతని విధానాలు, అతని వైఖరి, ఇంకా అతను పని చేసిన తీరు అతనిని ఒక స్థాయికి తీసుకువెళ్ళాయి. అతను సరైన వ్యక్తి ఇంకా ఆ సమయంలో నమ్మశఖ్యం కాని పనులు చేసాడు కూడా. కానీ అదే అన్ని సమయాలకూ సందర్భోచితం అవ్వదు. లేదా మార్టిన్ లూథర్ కింగ్ ను తీసుకుంటే, అప్పట్లో వివక్ష ఉంది కాబట్టి, ఆ సమయానికి అతను చాలా ముఖ్యమైన వాడు అయ్యాడు, కానీ సమాజంలో ఒకవేళ అటువంటి సమస్య ఉండి ఉండక పోయినట్లయితే, అతను కూడా మరొక సాధారణ వ్యక్తిగా ఉండేవాడు.

మీరు చరిత్ర తిరగేస్తే, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వారి ప్రాముఖ్యత వచ్చింది ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలు, ఇంకా అవసరాల వల్ల, లేదా ఆ సమయంలో ఉన్న కొన్ని కొరతల వల్ల. మీరు గౌతమ బుద్ధుడిని తీసుకుంటే, అప్పట్లో సమాజం ఆచార వ్యవహారాలలో మునిగిపోయి ఉండేది. కాబట్టి, అతను ఆచార వ్యవహారాలతో సంబంధం లేని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను తీసుకు వచ్చినప్పుడు, అది ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఒకవేళ ఆ సమాజం పెద్దగా ఆచార వ్యవహారాలు లేనిది అయివుంటే, అప్పుడు అది ఏ విధంగానూ కొత్తదిగా అనిపించేది కాదు, అలాగే అంత ప్రాముఖ్యమైనదిగా అయ్యేది కాదు.

ఎన్నో విధాలుగా, కృష్ణుడు ఎంతో ప్రాముఖ్యమైన వాడు. అయినప్పటికీ, ఒకవేళ సమాజంలో కలహాలు ఉండి వుండక పోయినట్లయితే, పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం లేకపోయినట్లయితే, అప్పుడు అతను కేవలం ఒక స్థానిక ప్రముఖుడు మాత్రమే అయ్యేవాడు. ఇంత గొప్ప వాడిగా అయ్యేవాడు కాదు. లేదంటే రాముణ్ణి తీసుకున్నా, అతని భార్య అపహరణానికి గురై ఉండకపోతే, అతను అందరిలా మరొక రాజుగా ఉండేవాడు. బహుశా చాలా మంచి రాజుగా చరిత్రలో నిలిచే వాడు, లేదా కొంతకాలం తర్వాత ప్రజలు ఆయనను మరిచిపోయేవారు. ఆ యుద్ధము ఇంకా లంకాదహనం అనేవి గనుక జరగక పోయినట్లయితే, అతని జీవితం పెద్దగా ప్రాముఖ్యమైనదిగా అయ్యేది కాదు.

ఆదియోగి ప్రాముఖ్యత

ఆదియోగి శివుని ప్రాముఖ్యత కేవలం ఇదే – అటువంటి సంఘటన ఏదీ జరగలేదు. ఏ యుద్ధమూ లేదు, ఏ కలహాలూ లేవు. అతను ఆ రోజుకు సంబంధించిన ఏ అవసరాలను నెరవేర్చలేదు. ఆయన అన్ని సమయాలలో సందర్భోచితంగా ఉండే విధంగా మానవ చైతన్యాన్ని పరిణామం చేయటం కోసం సాధనలను ఇంకా విధానాలను అందించాడు. ప్రజలకు ఆహారమో, ప్రేమో లేదా శాంతి కొరతగా ఉన్నప్పుడు, దాన్ని మీరు అందిస్తే, ఆ సమయానికి మీరు ఒక గొప్ప ప్రముఖులుగా అవుతారు. కానీ అటువంటి కొరతలు ఏమీ లేనప్పుడు, తనని తాను మెరుగుపరచుకోవడం ఎలా అన్నదే ఒక మనిషికి మొత్తం మీద ముఖ్యమైనది అవుతుంది.

మనం మహాదేవ అనే బిరుదును కేవలం ఆయన మాత్రమే ఇచ్చాము. ఎందుకంటే, ఆయన మేధస్సు గాని ఆయన దార్శనికత గాని లేదా దాని వెనకాల ఉన్న ముందుచూపు గానీ మరెవ్వరూ కూడా కనబరచలేనివి. మీరు ఎక్కడ పుట్టారు, ఏ మతంలో పుట్టారు, ఏ కులంలో పుట్టారు, లేదా ఏ నమ్మక వ్యవస్థలో పుట్టారు, మీరు స్త్రీనా పురుషుడా అన్న వాటితో నిమిత్తం లేకుండా – ఈ విధానాలను ఎప్పటికీ ఉపయోగించుకోవచ్చు. ఆఖరికి ప్రజలు ఆయన్ని మర్చిపోయినా సరే, వాళ్ళు అవే విధానాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మానవ వ్యవస్థలో ఏ అంశాన్నీ కూడా పరిశోధించకుండా విడిచిపెట్టలేదు. అతను ఒక బోధనను ఇవ్వలేదు. అతను ఆ సమయానికి ఒక పరిష్కారాన్ని ఇవ్వలేదు. ప్రజలు అటువంటి సమస్యలతో ఆయన వద్దకు వెళ్లినప్పుడు, ఆయన తన కళ్ళను అలా మూసుకుని పూర్తి అనాసక్తి చూపించాడు.

మానవ స్వభావాన్ని తెలుసుకోవడం అన్న విషయంలో, ప్రతి మనిషీ బయటపడే ఒక మార్గాన్ని కనుగొనే విషయంలో, అక్షరాలా ఆయన అందించినది ఒక శాశ్వతమైన సహకారం; అది ఆ సమయానికి సంబంధించినదో లేదా ఆ సమయంలో గొప్పదైనదో కాదు. సృష్టి అంటే, ఏదైతే శూన్యమో అది పదార్థంగా ముడి వేయబడింది. అతను ఈ సృష్టి ముడిని విప్పి, సృష్టికి అతీతమైన స్థితికి మార్గాన్ని కనుగొన్నాడు.

ఆదియోగిని శివుడు అని ఎందుకు అంటారు

మనం అతనికి శి-వ అనే పేరు ఇచ్చాము. అంటే దానర్థం “ఏదైతే లేదో అది” అని. ‘ఏదైతే లేదో’ అది ఒక పదార్థంగానో లేదా ‘ఏదైతే ఉన్నదో’ అయినప్పుడు, మనం ఆ పార్శ్వాన్ని బ్రహ్మ అంటాము. శివుడిని అలా ఎందుకు పిలుస్తారు అంటే, అతను ఒక విధానాన్ని ఇచ్చాడు, ఒక పద్ధతిని – కేవలం ఒక్క మార్గం కాదు, ఉన్న దాని నుండి లేని దానిగా మరేందుకు వీలైన ప్రతీ మార్గాన్నీ ఇచ్చాడు. అలా మారడాన్ని ముక్తి అంటాము.

శివ అనేది ఒక పేరు కాదు. అది ఒక వివరణ. మనం ఎలా అయితే ఫలానా అతను ఒక డాక్టర్ అనో లేదా లాయర్ అనో లేదా ఒక ఇంజనీర్ అనో అంటమో, అదే విధంగా ఆయన్ని శివుడు అన్నప్పుడు ఆయన లయకారకుడు అని అర్థం. ఇది కొద్దిగా అపార్థం చేసుకోవడంతో, జీవితాన్ని వినాశనం చేయడంగా వివరించబడింది. కానీ ఒక విధంగా చూస్తే ఇది కూడా సరైనదే. మనం వినాశ కారకుడు అన్న పదాన్ని ఉపయోగించినపుడు ప్రజలు అది ప్రతికూలమైనదని అవగాహన చేసుకుంటారు. ఎవరైనా మోక్ష కారకుడు అంటే దానిని అనుకూలమయినదని అవగాహన చేసుకుంటారు. మెల్లిగా లయకారకుడు, వినాశ కారకుడు అయ్యాడు, ప్రజలేమో ఆయన వారికి ప్రతికూలం అయినవాడు అని ఆలోచించడం మొదలుపెట్టారు. మీరు ఆయనని ఎలా పిలిచినా సరే, ఆయన పట్టించుకోడు – మేధస్సు స్వభావం ఇదే.

మీ మేధస్సు కనుక ఒక స్థాయికి ఎదిగితే, అప్పుడు మీకు నైతికతతో అవసరం ఉండదు. కేవలం మేధస్సు విషయంలో కొరత ఉన్నప్పుడు మాత్రమే, మీరు ప్రజలకు ఇది చేయండి, అది చేయండి అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరి మేధస్సు అయినా ఎదిగితే, వాళ్ళకి ఏం చేయాలో ఏమి చేయకూడదో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయం లో ఆయన కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. యోగ వ్యవస్థలో ఉన్న యమా, నియమ అనేవి పతంజలి తయారు చేసినవి, ఆదియోగి తయారుచేసినవి కాదు. పతంజలి తర్వాత వచ్చాడు.
పతంజలి మనకు ఎందుకు ముఖ్యం అంటే, యోగా అనేది హాస్యాస్పదంగా అనిపించేంతగా మరీ ఎక్కువ శాఖలుగా విడిపోయిన అందువల్ల మాత్రమే. ఒక 25, 30 సంవత్సరాల క్రితం మీరు ఒక మెడికల్ చెకప్ చేయించుకోవాలి అనుకుంటే, కేవలం ఒక డాక్టర్ మాత్రమే సరిపోయేవాడు. ఇప్పుడు 12 నుండి 15 మంది అవసరమవుతారు – ఒకరు మీ ఎముకలకి, ఒకరు మీ కండరాలకి, ఒకరు మీ రక్తానికి, ఒకరు మీ గుండెకి, ఒకరు మీ కళ్ళకి … ఇలా ఈ చిట్టా పెరుగుతూనే ఉంటుంది.

ఉదాహరణకి ఒక వంద సంవత్సరాలు గడిచే సమయానికి, మీకు మెడికల్ చెకప్ అవసరమైతే, అందుకు ఒక 150మంది డాక్టర్ లు అవసరమవుతారు అన్నంతగా స్పెషలైజేషన్ కొనసాగింది అనుకోండి. ఇక మీరు వెళ్లాలని అనుకోరు. ఎందుకంటే మీరు 150 అపాయింట్మెంట్లు పొంది, వెళ్లి కలిసి, రిపోర్టులు చెక్ చేసే సమయానికి, ఇక దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అప్పుడు ఎవరో ఒకరు వీటన్నిటినీ ఒకటిగా క్రోడీకరించి, ఒక ఫ్యామిలీ డాక్టర్ ను తయారు చేద్దాము అనే ప్రతిపాదన తెస్తరు. పతంజలి చేసింది ఇదే.

ఆ సమయానికి దగ్గరదగ్గరగా 1800 యోగా శాఖలు ఉన్నాయి అని అంటారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి అంటే, మీరు 1800 స్కూళ్ళకి వెళ్ళాలి, అలాగే 1800 విభిన్నమైన రకాల యోగాలు చేయాలి. అది ఆచరణ సాధ్యం కానిదిగా, ఇంకా హాస్యాస్పదమైనదిగా అయ్యింది. అందుకని పతంజలి వచ్చి, వాటన్నింటినీ, యోగ యొక్క ఎనిమిది పాదాలను సాధన చేసే విధంగా 200 సూత్రాలలో పొందుపరిచారు. అటువంటి పరిస్థితే గనుక ఉండి ఉండకపోయినట్లయితే, పతంజలి ముఖ్యమైన వారు అయ్యేవారు కాదు. కానీ ఆదియోగి లేదా శివుని దగ్గరకి వచ్చేసరికి విషయం అది కాదు. జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఆయన ఎప్పుడూ సందర్భోచితమైనవాడే. అందుకే ఆయన్ని మహాదేవ అంటారు.

సంపాదకుడి సూచన: ఆదియోగి అయిన శివుని గురించి ఆసక్తికరమైన కథనాలను చదవడానికిఇక్కడ నొక్కండి.