ఆదియోగి – యోగాకు మూలం.!!

article శివుని గురించి
ఆదియోగి – యోగాకు మూలం.!! 15,000 వేల సంవత్సరాల క్రితం, అన్ని మతాలకూ పూర్వమే, ఆదియోగి, మొదటి యోగి, హిమాలయాల్లో కనిపించారు. నిశ్చలంగా కూర్చోవడం లేక పరవశంతో నాట్యం చేయడం ఇలా ఒక స్థితినుంచి మరొక స్థితిలోకి ఆయన మారుతూ ఉన్నాడు. ఆయన కంటి నుంచి రాలుతున్న ఆనంద భాష్పాలే ఆయన సజీవంగా ఉన్నాడనడానికి గుర్తు. మనకు తెలియని అనుభూతి ఏదో ఆయన పొందుతున్నాడు అని తెలుస్తూనే ఉంది. ప్రజలు చుట్టూ ఆసక్తిగా చేరారు, కానీ ఆయనకు ...

ఆదియోగి – యోగాకు మూలం.!!

15,000 వేల సంవత్సరాల క్రితం, అన్ని మతాలకూ పూర్వమే, ఆదియోగి, మొదటి యోగి, హిమాలయాల్లో కనిపించారు.

నిశ్చలంగా కూర్చోవడం లేక పరవశంతో నాట్యం చేయడం ఇలా ఒక స్థితినుంచి మరొక స్థితిలోకి ఆయన మారుతూ ఉన్నాడు. ఆయన కంటి నుంచి రాలుతున్న ఆనంద భాష్పాలే ఆయన సజీవంగా ఉన్నాడనడానికి గుర్తు. మనకు తెలియని అనుభూతి ఏదో ఆయన పొందుతున్నాడు అని తెలుస్తూనే ఉంది. ప్రజలు చుట్టూ ఆసక్తిగా చేరారు, కానీ ఆయనకు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. చివరికి అందరూ వెళ్ళిపోయారు, ఒక్క ఏడుగురు తప్ప. వారందరూ ఆయనతో ‘మీకు తెలిసినదేదో మాకు తెలియజేయండి’ అని ప్రార్థించారు. వాళ్ల పట్టుదలను చూసి ఆయన వారికి ఒక సాధన ఇచ్చారు. వారంతా ఏకాగ్రతతో ఆ సాధన 84 సంవత్సరాలపాటు చేశారు. ఆ కాలంలో కూడా ఆదియోగి వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక రోజు ఉత్తరాయణం పూర్తయిన తర్వాత దక్షిణాయనం వచ్చినప్పుడు, ఆదియోగి వారిని మెరుస్తున్న అగ్ని కళికల లాగా ఉండడం చూశారు. వారిని అలా 28 రోజులు గమనించాక, ఆ తర్వాత వచ్చే పున్నమి నాడు, మనం ఈనాడు గురుపూర్ణిమగా జరుపుకుంటున్న రోజున, ఆయన తనను తాను ఆదిగురువుగా రూపాంతరం చేసుకున్నాడు. కాంతిసరోవరం ఒడ్డున, యోగశాస్త్రాలను ఆ ఏడుగురు శిష్యులకు బోధించడం ప్రారంభించాడు. ఆ ఏడుగురినే ఇప్పుడు మనం సప్తర్షులుగా పూజిస్తున్నాము. మానవుడు తన పరిమితులను దాటి అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి ఉన్న 112 విధానాలను ఆయన వారికి బోధించాడు. ఆదియోగి అందించినవి, వ్యక్తి పరిణామం చెందడానికి ఉపయోగపడే ఉపకరణాలు. వ్యక్తులు మారినప్పుడే ప్రపంచం మారుతుంది. ఆయన ఇచ్చిన ప్రధాన సందేశం ఏమిటంటే మానవ శ్రేయస్సుకు, ముక్తికి ‘ఉన్న ఒకే ఒక మార్గం లోనికి చూడడమే’, మానవ శ్రేయస్సుకు అంతర్గత సాంకేతికత ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాలు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది.