ieco
ieco

112 అడుగుల ఆదియోగి గురించి బహుశా మీకు తెలియని 12 విషయాలు

article ఆధ్యాత్మికత ఇంకా మార్మికత
2020 ఫిబ్రవరి 21 మహాశివరాత్రి నాడు, ఆదియోగి సమక్షంలో ఉత్సాహభరితంగా రాత్రంతా జరిగే ఈ పండుగ కోసం ఈశా యోగా కేంద్రం సన్నద్ధమవుతోంది. 112 అడుగుల ఆదియోగిని సందర్శించే ముందు, మీరు తెలుసుకోవలసిన 12 విషయాలు.

1. ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి…

112 అడుగుల ఎత్తున్న ఆదియోగిని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ప్రపంచంలోనే “అతిపెద్ద ముఖాకృతి” గా గుర్తించింది. ఆదియోగి యొక్కఈ ప్రతిమ 150 అడుగుల వెడల్పు, 25 అడుగుల మందము ఉంటుంది, ఇది దాదాపు 500 టన్నుల స్టీల్‌తో తయారు చేయబడింది.

 

2. ఆదియోగి దివ్య దర్శనం

ఈ అద్భుతమైన 3D లేజర్ షోలో, మానవాళికి యోగ శాస్త్రాలను ఆదియోగి ఏ విధంగా అందించారో చూపుతారు, ఆదియోగి ఆకాశాన్ని వెలుగులతో నింపేస్తారు. వారాంతాలలోనూ, పౌర్ణమి, అమావాస్య రోజులలోనూ, ఇంకా ఇతర పండుగ రోజులలో రాత్రి 8 నుండి 8:15 వరకు ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు.

3. ఆదియోగి వస్త్ర అర్పణ

ఆదియోగి చుట్టూ ఉండే 621 చిన్న చిన్న త్రిశూలాలలో ఏదైనా ఒకదానిపై నల్లటి వస్త్రాన్ని కట్టడం ద్వారా భక్తులు ఆదియోగికి వస్త్రాన్ని సమర్పించవచ్చు.

4. ఆదియోగి ప్రదక్షిణ

ఆదియోగి ప్రదక్షిణ అనేది ధ్యానలింగం, ఆదియోగిల చుట్టూ చేసే రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులు అయ్యేందుకు సద్గురుచే రూపకల్పన చేయబడిన ఈ ప్రదక్షిణ, ముక్తి మార్గంలో మనిషి చేసే కృషికి దోహదం చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని జపించడం, ఇంకా ఒక నిర్దిష్ట ముద్రతో ప్రదక్షిణ చేయడం ద్వారా, ఈశా యోగా కేంద్రంలోని వివిధ ప్రతిష్ఠీకరింపబడిన స్థలాల శక్తిని స్వీకరించేందుకు ఈ ప్రదక్షిణ ఒక మార్గం.

5. యోగేశ్వర లింగ అర్పణలు

మీరు యోగేశ్వర లింగ శక్తులను గ్రహించగలిగేలా చేయడానికి, లింగానికి జలాన్ని ఇంకా వేప ఆకులను సమర్పించవచ్చు.

6. పూర్ణిమ సంగీత కచేరీ

ప్రతి పౌర్ణమి రాత్రి, దర్శనార్ధం ఆదియోగి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది, అలాగే సౌండ్స్ ఆఫ్ ఈశా వారిచే, రాత్రి 10:30 నుండి 11:30 వరకు ఆదియోగి వద్ద సంగీత కచేరి జరుగుతుంది.

7. అమావాస్య

ప్రతి అమవాస్య రోజున, సమీప గ్రామ ప్రజలు యోగేశ్వర లింగానికి సంప్రదాయ సమర్పణలు చేస్తారు. అలాగే సాంప్రదాయ సంగీతం ఇంకా నృత్య సమర్పణ కూడా ఉంటుంది, ఆపై ప్రసాదం పంపిణీ చేయబడుతుంది. ఇది కుటుంబానికంతటికీ శ్రేయోదాయకం.

8. సద్గురు దూరదృష్టి

ఈ రోజు ఇక్కడ నిలిచి ఉన్న ఆదియోగి ముఖాన్ని సృష్టించడానికి, రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది, ఇంకా ఆకృతిని తీర్చిదిద్దడానికి డజన్ల కొద్దీ సవరణలు చేయవలసి వచ్చింది. ఆదియోగి ముఖాన్ని ఎలా చిత్రీకరించాలో సద్గురుకి తన మనస్సులో ఒక నమూనా ఉంది. దాన్ని సాకారం చేయడంలో, ఆయన కొంచెం కూడా రాజీ పడలేదు. అందువల్లే ఫలితం అత్యద్భుతం!!

 

9. ఆదియోగి సంపద

యోగేశ్వర లింగం చుట్టూ నేలపై ఇత్తడి పలకలు అమర్చబడ్డాయి. ఈ పలకలపై, యోగ సంప్రదాయంలో వివరించబడిన విధంగా, ఆదియోగి యొక్క కొన్నిఅతివిలువైన వస్తువుల కళాకృతులు ఎంతో వివరంగా చెక్కబడి ఉంటాయి. అవి, చెవిపోగులు, ఆయన జటాజూటానికి అలంకారమైన సన్నని నెలవంక, రుద్రాక్ష పూస, వేప ఆకు, డమరు, విల్లు, గొడ్డలి ఇంకా ఒక గంట.

10. “బహుభాషా” లింగం

మీరు యోగేశ్వర లింగాన్ని నిశితంగా పరిశీలిస్తే, తమిళం, తెలుగు, కన్నడ ఇంకా మలయాళం నాలుగు దక్షిణ భారతీయ భాషలలో “శంభో” అనే మంత్రం చెక్కి ఉండడాన్ని గమనించవచ్చు.

11. సప్తఋషుల శిల్పాలు

యోగేశ్వర లింగం వద్ద ఉన్న ఒక ప్రముఖ అంశం, సద్గురుచే ప్రతిష్టించబడిన సప్తఋషుల శిల్పాలతో కూడిన నల్లరాతి ఫలకం. ఈ పవిత్రమైన ఫలకాన్ని, దానిని శుభ్రం చేసే వారితో సహా, ఎవరూ చేతితో తాకరు.

12. రుద్రాక్షల సమర్పణ

ఆదియోగి మెడ చుట్టూ 100,008 రుద్రాక్షలతో కూర్చబడిన ప్రపంచంలోనే అతి పెద్ద రుద్రాక్ష మాల ఉంటుంది. పన్నెండు నెలల పాటు దైవిక శక్తిని గ్రోలే ఈ రుద్రాక్షలు, పరమ పవిత్రమైన మహాశివరాత్రి నాడు భక్తులకు ప్రసాదంగా అందించబడతాయి.

మహాశివరాత్రి నాడు, సద్గురు అందించే శక్తిని, శ్రేయస్సు చేకూర్చే అవకాశాలను పొందడం అనేది అరుదైన భాగ్యం. మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధి, శ్రేయస్సుల కోసం ప్రకృతి అందించే శక్తులను అందుకోవడానికి మహాశివరాత్రి ఒక అరుదైన అవకాశం. ఆదియోగి సమక్షంలో ఈశా యోగా కేంద్రంలో రాత్రంతా సాగే ఎంతో ఉత్సాహభరితమైన మహాశివరాత్రి వేడుకలు, ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం!