logo
logo

ఆది యోగి… స్వరూప సాక్షాత్కారము

ఆది యోగి... స్వరూప సాక్షాత్కారము"శివు" నికి ఉన్న అనేక ఇతర నామాల్లో త్రయంబకుడు, త్రినేత్రుడు (మూడు కన్నులు గలవాడు) అన్నవి ఉన్నాయి. ఆయనకున్న మూడవ కన్ను వల్ల, ఆయన "లేనిదాన్ని (నాస్తి)" ని చూడగలడు. ఏది "ఉన్నదో (అస్తి)" అది భౌతిక స్థితిలో ఉంటుంది. "నాస్తి" అన్నది అభౌతికం. ఈ క్షణంలో, మీరు మీ ఐదు ఇంద్రియాల ద్వారా గ్రహించలేనిది ప్రతిదీ, మీ అనుభవపు పరిధికి ఆవల ఉంటుంది. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే, మనిషి "నాస్తి"ని ... అభౌతికంగా ఉన్నదానిని అంటే "శి-వ" ని చూడగలడు. ప్రస్తుతం తాము ఉన్నదాని కన్నా మరింత కావాలన్న మనిషి ఆశ, చాలా ప్రాణులను బలిగొంది, చాలా జీవరాశులు అంతమవడానికి దారితీసింది, ఈ ఆశ ఈ భూమి ఉనికికే విఘాతంగా పరిణమించింది. ధనం, ఆస్తి, అనుబంధాలూ, కుటుంబం, మొదలైన వాటిలో మీరు ఇతరులకంటే అధికులము అనుకోవడం అన్నది, కేవలం సాపేక్షికమైనదే, ఎవరో ఇతరులతో పోల్చుకోవడం వల్లనే. కాని వ్యక్తిగా, మీ స్థితిలో ఏరకమైన ఉన్నతీ లేదు. మీ గ్రహణ శీలత ఉన్నతమైనప్పుడు మాత్రమే, మీ జీవితాన్ని అనుభవించే తీరు ఉన్నతమౌతుంది.

ఈ ఆదియోగి (ముఖా కృతి) విగ్రహం ఈ భూమి మీద అతి ఎత్తైనది.

మన గ్రహణ శీలత ఉన్నతమైనప్పుడు మాత్రమే మన జీవితాలు ఉన్నతం అవుతాయని ప్రజలందరూ అవగాహన చేసుకోవడానికై "ఆదియోగి" విగ్రహాన్ని ప్రపంచమంతటా స్థాపించడానికి ప్రయత్నం జరుగుతోంది. మేము ఇప్పుడు ఒక 112 అడుగుల "ఆదియోగి" విగ్రహాన్ని తయారుచేసి ఈశాయోగా కేంద్రంలో స్థాపించాము. ఆ సంఖ్య సాంకేతికమూ, శాస్త్రీయంగా మన అస్తిత్వానికి ముఖ్యమైనదీ. మనుషులు పరమోన్నతమైన దానిని చేరుకునేందుకు ఆయన 112 మార్గాలను బోధించారు. మనుషులు సాధన చెయ్యడానికి 112 చక్రాలు ఉన్నాయి. ఆదియోగి విగ్రహం ఈ భూమి మీద అతి ఎత్తైనది. ఆదియోగి విగ్రహంతో పాటు, ఒక పుస్తకం కూడా వెలువడింది. అన్నీ అనుకూలిస్తే, రాబోయే రెండు సంవత్సరాల్లో ఒక చిత్రం కూడా తీయడం జరుగుతుంది.

ఈ విగ్రహాన్ని తయారు చెయ్యడంలోని ఆంతర్యం, మరొక విగ్రహాన్ని తయారుచేసి ప్రపంచానికి అందివ్వడం కాదు; ఈ మానవాళిని "కొన్ని నమ్మకాల గుంపు" అన్న స్థితి నుండి, జీవితంలో సత్యాన్నీ, దానికి అతీతమైనదాన్నీ అన్వేషించే వ్యక్తులుగా మార్చడానికి ఒక శక్తివంతమైన సాధనంగా తయారుచెయ్యడానికే. ఈ భూమి మీద జరుగుతున్న యుద్ధాలన్నీ, మంచికీ - చెడుకీ మధ్య జరిగే సంఘర్షణలుగా కొందరు వర్ణిస్తే వర్ణించవచ్చు. కానీ ముఖ్యంగా ఒక వ్యక్తి నమ్మకాలకీ మరొక వ్యక్తి నమ్మకాలకీ మధ్య జరుగుతున్న సంఘర్షణ ఫలితాలే ఇవి. ఒక సారి మీరు దేన్నైనా నమ్మడం ప్రారంభిస్తే, మిగతావన్నీ మీరు చూడగలిగే స్థితిలో ఉండరు. కొన్ని నమ్మకాలు పనిచెయ్యడానికి, మీకు గుంపు జనం కావాలి. అలాకాక, మీరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆలోచించడం ప్రారంభిస్తే, నమ్మకాలు పటాపంచలౌతాయి. ఈ అన్వేషణ వ్యక్తిగతమైనది. ప్రతి పురుషుడూ, స్త్రీ, తమంత తాము సాధనచెయ్యవలసినదే.

ఒక మతంగా కాకుండా, కేవలం వ్యక్తిగతమైన అన్వేషణా సంస్కృతిని, సృష్టించడం ముఖ్యం. ఇలాంటి సాధకులతో ఉన్న సుగుణం ఏమిటంటే, వారి గందరగోళం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్ళు అన్వేషిస్తున్నప్పుడు, ఆ అన్వేషణకు ఏదో ఉంటుందే కాని, పోరాడడానికి వారికి ఏ కారణమూ ఉండదు. ఇప్పుడు ప్రపంచానికి ఇది చాలా అవసరం. మానవాళికి ఈరోజు అందుబాటులోవున్న శక్తుల తీరు చూస్తుంటే– మనల్ని మనం నాశనం చేసుకునేందుకు లేదా ఇంతకంటే అధ్వాన్నం కావడానికి ఈరోజుల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం అన్వేషిస్తున్నప్పుడు, మనం ఏదో సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము, కాని ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నపుడు మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నమ్మకం అంటే - మనకి ఏమాత్రం అవగాహనలేని వాటిని సంకోచం లేకుండా అంగీకరించడం. ఇలా చేస్తే అది స్పష్టతలేని, భరోసా ఇస్తుంది. అన్వేషించడం అంటే - నిశ్చత నుండి అనిశ్చతకు స్పృహతో ప్రయాణం చెయ్యడం. మీరు నిరంతరం తెలియని చోటుల్లో అడుగుపెడుతున్నారంటే, మీరు నిజంగా ముందుకి వెళుతున్నట్టు లెక్క. మీరు ఉన్నచోటే గుడుగుడుగుంచం ఆడుతున్నారంటే, మీరు ఎక్కడికీ వెళ్ళడం లేదన్నది అర్థం. జీవితంలోని అనేక పార్శ్వాలను అన్వేషించే వారికెప్పుడూ, అనిశ్చత, సందేహాలూ ఉంటాయి. గొప్ప శాస్త్రజ్ఞులెప్పుడూ అయితే, గియితే అనే మాటాడుతారు.తర్వాతి తరం వారు సాధకులు కావాలి కాని, విశ్వాసులు కారాదు, వాళ్ళు ఎక్కడో అగోచరమైన స్వర్గం ఉందనీ, దాన్ని చనిపోయిన తర్వాత మాత్రమే చేరుకుంటామనీ అనుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని వారంతా సాధనతో పరిణామం చెందేందుకు అవసరమైన సరికొత్త చైతన్యం తీసుకురావడంలో ఆదియోగి విగ్రహం ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద జీవించే వారందరికీ పళ్ళుతోముకోవడం ఎలాగో తెలుసు. కానీ వాళ్ళకి ఎలా ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకాలో తెలీదు. మనుషులు వాళ్ళ శరీరాన్నీ, మనసునీ ఎలా అదుపుచేసుకోవాలో తెలుసుకోవాలి. అది జరిగిననాడు, మానవాళి అద్భుతమైన భవిష్యత్తుగల శక్తివంతమైన జీవరాశిగా పరిణమించగలదు.

ఇప్పుడు మనుషులకి ప్రతిదీ ఒక సంఘర్షణే. వాళ్ళకి తమని తాము మార్చుకోగల సాధన సంపత్తులు లేవు. మనం మన ఇంటితోనూ, సామాజిక పరిసరాలతోనూ మొదలుపెట్టి అన్నిటినీ మార్చవలసిన సమయం వచ్చింది. మనం మనుషులుగా ఎలా కలిసి పనిచెయ్యాలన్న విషయం మీద దృష్టిపెట్టే సంస్కృతిని నిర్మించాలి. మన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలిస్తే, దానిని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే, మనం యాదృచ్ఛికంగా జీవించడం, అంటే, నిత్యం ఆందోళనతో జీవించడం, అలవాటయిపోతుంది. దాని వల్ల చిన్న చిన్న విషయాలుకూడా ప్రయాస పడితేనేగాని సాధించడం జరగదు. మనుషులందరూ ఏం చేస్తున్నారు? బ్రతకడానికి సంపాదిస్తున్నారు. కోరుకుంటే పిల్లల్ని కంటున్నారు. ఏదో రోజు వాళ్ళు మరణిస్తారు. మిగతా జీవరాశులూ అవే పనులు చేస్తున్నాయి, ఇంతకంటే ప్రతిభావంతంగా. నా ఉద్దేశ్యం మానవాళి సృష్టించినదంతా పనికిరానిదని కాదు. శాస్త్రసాంకేతికతల నాణ్యతా, అవి సృష్టించగల వాటితో మనుషులు సాధించగల ప్రగతీ – ఇవి దానిని వినియోగించే మనుషుల సమర్థతలమీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే - మనల్నీ, మనతోపాటు సమస్త జీవరాశినీ నాశనం చెయ్యడానికి బదులు, మన జీవితాలనూ, ఈ భూమిమీద మసలే సమస్త జీవరాశి జీవన ప్రమాణాలనూ మెరుగుపరచడానికి శాస్త్ర సాంకేతికతలను వివేకంతో ఉపయోగించగల మనుషులను సృష్టించవలసిన అవసరం ఉందని. ఇప్పుడు జరుగుతున్నట్టు, మన ఉనికికీ, మనతో పాటు అన్నిటి ఉనికికీ ప్రమాదం తీసుకురావడం కాదు.

గత రెండు మూడు వేసవులూ అంతకుముందుకంటే వేడిగా ఉన్నాయి. ఇది మీరు గ్రహించే ఉంటారు. హిమాలయాల్లో కూడా ఇది మీరు చూడొచ్చు. భాగీరథి పుట్టిన గోముఖం వద్ద, నీరు మంచుగుహ ముఖద్వారం నుండి "ఫౌంటెన్" లా పెల్లుబికి వచ్చేది. ఇప్పుడు మంచు ఎంతగా కరిగిపోయిందంటే, ఆ మంచు గుహలోకి ఒక మైలు దూరందాకా నడుచుకుని పోగలరు. అందులోంచి ఒక చిన్న ఊటమాత్రమే ఊరుతోంది. ఒకప్పుడు సంవత్సరం పొడుగునా మంచుతో కప్పబడి ఉండే పర్వతాల శిఖరాలు, ఇప్పుడు కొన్ని నెలలపాటు అలా బోసిగా ఉంటున్నాయి. కావేరీ నది సంవత్సరంలో మూడు నెలలపాటు సముద్రాన్నిచేరుకోవడం లేదు. కొన్ని వేల సంవత్సరాలు జీవనదిగా ప్రవహించిన దాన్ని, మనం ఒక్క తరంలో, ఏదో ఋతువులో మాత్రమే ప్రవహించే నదిగా మార్చేసాము. వీటన్నిటి తాత్పర్యం ఒకటే: శాస్త్ర, సాంకేతిక పరికరాలు బాధ్యతగా ప్రవర్తించని వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని. మనకి ఇప్పుడు కావలసింది శాస్త్ర సాంకేతిక రంగాలలో మార్పు కాదు. మనుషుల్ని "మనుషులు" గా తీర్చిదిద్దగల ఉపకరణాలు. రాబోయే దశకంలో పెద్ద ఎత్తున ఈ రకమైన మార్పుని తీసుకురాగల సాధనాలు అందుబాటులోకి తేలేకపోతే, మన పిల్లలకి ఈ ప్రపంచంలో జీవించడం రాను రాను మరింత కష్టమైపోతుంది.

ఈ భూమి మీద రాబోయే పన్నెండు సంవత్సరాలూ, ఆధ్యాత్మిక చైతన్యానికి స్వర్ణయుగం కాబోతోంది

మనం సూర్యుడి కొత్త ఆవృతిలో ప్రవేశించాం. ఈ భూమి మీద రాబోయే పన్నెండు సంవత్సరాలూ, ఆధ్యాత్మిక చైతన్యానికి స్వర్ణయుగం కాబోతోంది. రాబోయే పది సంవత్సరాలూ మనం పనులు సవ్యంగా చెయ్యగలిగితే ఫలవంతమౌతుంది. ఇటువంటి పరిణామానికి మానవమేధ పూర్వం కంటే ఎక్కువ సన్నద్ధతలో ఉంది. పరిణామాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆదియోగి మొదట బోధించిన సమయంతో ఈ కాలం పోలి ఉంది. ఇవన్నీ శుభ పరిణామాలే. భావితరాలకోసం మన తరం ఇది సాధ్యం చెయ్యాలని నా ఆకాంక్ష, నా ఆశీస్సూ. ఇది సాధ్యం చెయ్యడానికి ఆదియోగి విగ్రహాన్ని ఒక సాకారమైన మూర్తిగా వినియోగించదలుచుకున్నాము. ఆయన్ని ఒక యోగిగానే తప్ప దేవుడుగా ప్రచారం చెయ్యడంలేదు. దేవుడని చెబితే మీరు ఆయన్ని పూజించాలి. యోగి అంటే అదొక అవకాశం. జాతి, మతం, వర్గ, లింగ బేధాలకు అతీతంగా, ఎవరు వస్తే వాళ్ళకి పరిణామం చెందడానికి కావలసిన సాధన సంపత్తి సమకూర్చే స్థావరాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. మొదటిది టెన్నెసీలో జరిగింది. ఇక్కడ ఏ అద్భుతాలూ జరగవు. ఎవ్వరూ దేని కోసం అర్జీపెట్టుకోకూడదు. కేవలం సాధన మాత్రమే. అయినా, రోజు రోజుకీ వచ్చే మనుషుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

దానికి కావలసిన వాతావరణం మనం సృష్టిస్తే, అక్కడ మనుషులు మార్పుకి కావలసిన ఉపకరణాలు పొందగలిగేటువంటి ప్రదేశాలు, ప్రపంచం అంతటా ఏర్పడే అవకాశం కలుగుతుంది. దీనికి అవసరమైన శక్తినీ, స్థావరాలనీ, అందుబాటులోకి తీసుకురాగలిగితే, ప్రజలు తమంత తాముగా వస్తారు. ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది అటువంటి విషయాలు తెలుసుకోవడాన్ని అభిలషిస్తున్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న నమ్మకాలపై వ్యక్తులు తమ అసంతృప్తి ప్రకటిస్తున్నారు. వేరే మార్గం లేకపోవడంవల్ల, చాలామంది ప్రజలు తమ నమ్మకాలు ఎంత అర్థరహితంగా కనిపిస్తున్నప్పటికీ వాటినే పట్టుకుని వేలాడుతున్నారు. ప్రపంచ శ్రేయస్సు దీనిపై ఆధారపడి ఉండడంవల్ల అటువంటి మార్గాన్ని చూపించడం మనందరి బాధ్యత.

శాంతి నిండిన ప్రపంచం కావాలంటే, మనకి శాంతియుతులైన మనుషులుకావాలి; ప్రేమ పూర్వకమైన ప్రపంచం కావాలంటే, మనకి ప్రేమించగలిగిన మనుషులు కావాలి; వివేకవంతమైన ప్రపంచం కావాలంటే, మనకి వివేకవంతులైన మనుషులు కావాలి. మనం బ్రతకడానికి అనువుగా, మన పిల్లలు జీవించడానికి వీలుగా, ఈ ప్రపంచం నిండా జనాభాని తీర్చిదిద్దాలనుకుంటే, రాబోయే పది పన్నెండు సంవత్సరాల్లో, ప్రతి బాలికా, ప్రతి బాలుడూ వాళ్ళు పదిపన్నెండేళ్ళువచ్చేలోపు కళ్ళుమూసుకుని పదినిముషాల పాటు ప్రశాంతంగా కూర్చోగలిగే సరళమైన మార్గాలు అందించ వలసిన ఆవశ్యకత మన మీద ఉంది. ఈ భూమి మీద జీవించే ప్రతిమనిషీ తనని తాను మార్చుకోగలిగే సులభమైన మార్గాలు తెలుసుకోగలగాలి. అవి వాళ్ళ జీవితాలలోకి తీసుకురాలేనినాడు, హింసా, వినాశం ఈ ప్రపంచంలో కొనసాగుతూ, వృద్ధిచెందుతూనే ఉంటాయి. 2050 సంవత్సరానికి ప్రపంచజనభా 970 కోట్లు చేరుకుంటుందని అంచనా. జనాభా సాంద్రత పెరుగుతున్నకొద్దీ, పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయి. మనం కలిసికట్టుగా బ్రతకాలంటే, మనుషులు మరి కొంచెం ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలగడం ముఖ్యం. ఆ కారణం వల్లనే, మార్పు తీసుకురాగలిగిన ఉపకరణాల ప్రాముఖ్యత మరింత ఎక్కువ.

 

మీరందరూ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆదియోగి విగ్రహం గురించి ఏదో విధంగా తెలిసేలా కృషి చెయ్యాలన్నది నా అభిమతం. అతని ముఖం చూసిన ప్రతివారూ వెంటనే యోగ సాధన మొదలుపెట్టరు. కానీ,"ఆదియోగి" అన్నపదం వాళ్ళ మనసు మీద నెమ్మదిగా పనిచెయ్యడం ప్రారంభిస్తుంది. ప్రసన్నమైన మనుషులని తయారుచెయ్యడానికి ఇక్కడ ఏదో కృషి జరుగుతోందని ప్రపంచానికంతా తెలుస్తుంది. తాము చూసిన ప్రపంచానికంటే తరువాతి తరానికి మెరుగైన ప్రపంచాన్ని విడిచిపెట్టడం ప్రతితరానికి ముఖ్య కర్తవ్యం. పర్యావరణానికి మన జీవితకాలంలో కలిగించిన వినాశాన్ని మనం పునరుద్ధరించలేము. కనీసం మనం మనుషుల్ని అంతకు మునుపు కంటే మెరుగైన స్థితిలో విడిచి పెట్టగలం. వాళ్ళు ప్రశాంత మనస్కులై ఆనందంగా ఉండగలిగితే, వాళ్ళే పర్యావరణాన్నిసరిదిద్దగలరు. మనం అది సాకారం చేద్దాం.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

Maha Mrityunjaya Mantra in Telugu - మహా మృత్యుంజయ మంత్రం మరియు MP3 డౌన్లోడ్