logo
logo
Illustrative Image of Shiva | Isha Foundation

శివుని నీలకంఠం

ఆదియోగి అయిన శివునికి ఉన్న ఎన్నో నామాలలో "నీలకంఠుడు" అనే నామం ఒకటి. అంటే నీలి వర్ణం గల కంఠం కలిగినవాడని అర్ధం. శివుని నీలికంఠం వెనుక ఉన్న ప్రతీకను సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న: శివుని నీలి కంఠం వెనుక ఉన్న ప్రతీక ఏమిటి?

సద్గురు: యోగ సాంప్రదాయంలో ఒక కథ ఉంది. దేవతలు ఇంకా రాక్షసుల మధ్య ఎప్పుడూ వివాదం నడుస్తూ ఉంటుంది. పదేపదే విభేదాలు సంభవించడం ఇంకా అనేక మంది చంపబడుతుంటే, వారు మహా సముద్రాలలో దాగి ఉన్న అమృతాన్ని బయటకు తీసుకువచ్చి, రెండు సమూహాలు దానిని పంచుకుని అమరత్వం పొంది తద్వారా సంతోషంగా పోరాడుకోవచ్చని నిర్ణయించుకున్నారు. యుద్ధం చాలా భయంకరమైన వ్యవహారం, ఎందుకంటే అది ఎంతో మంది మరణానికి కారణమవుతుంది. మరణం అనే అంశాన్ని నిర్వహించుకోగలిగితే, యుద్ధం చాలా అద్భుతమైన విషయం.

వారు ఆ విధంగా పొత్తు కుదుర్చుకుని మహాసముద్రాలను మథించాలని నిర్ణయించుకున్నారు. పురాణం ప్రకారం, వారు 'మేరు' అనే ఒక పర్వతాన్ని బయటకు లాగి, దానిని చిలకడానికి ఒక పెద్ద పామును తాడుగా ఉపయోగించారు. వారు మథించడం ప్రారంభించినప్పుడు, మొదట్లో అమృతం కాకుండా, సముద్రం దిగువ నుండి భయంకరమైన విషం బయటకు వచ్చింది. దీనిని హాలాహలం అని పిలిచేవారు. ఈ భయంకరమైన విషం చాలా ఎక్కువ వచ్చింది. దేవతలందరూ భయపడ్డారు, ఇంత విషం బయటకు వస్తే, అది ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇంకా దీని గురించి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

ఎప్పటిలాగే, దాని గురించి ఎవరూ ఏమీ చేయలేనప్పుడు, శివుడే సరైనవాడు అని వారు భావించారు. వారు శివుడిని రమ్మని పిలిచి, భారీ పరిమాణంలో బయటకు వస్తున్న ఆ విషాన్ని చూపించారు. "అది గనుక వ్యాపిస్తే, అది మొత్తం జీవాన్ని నాశనం చేస్తుంది. మీరు ఏదో ఒకటి చేయాలి" అన్నారు. ఎప్పటిలాగే, తన సొంత శ్రేయస్సు గురించి ఎటువంటి ఆందోళన లేకుండా, ఆయన విషాన్ని తాగేసాడు. ఇది చూసిన ఆయన భార్య పార్వతి వెంటనే వెళ్లి ఆయన గొంతు పట్టుకుంది, కాబట్టి అది ఆయన గొంతు వద్ద ఆగిపోయింది. దానితో ఆయన గొంతు అంతా నీలం రంగులోకి మారింది.

పక్షపాతం ఒక విషం - శివుని నీలి కంఠం వెనుక ఉన్న ప్రతీక


ఇది చాలా ముఖ్యమైన కథ. ప్రతి మనిషి విషయంలో ఇది వాస్తవమే. మీరు ప్రతి మనిషి అంతరంగం లోకి తగినంత లోతుగా చూస్తే, ఒక్కటే చూడచ్చు, ఎల్లప్పుడూ విస్తరిస్తున్న జీవం. వారు దానితో గుర్తించబడితే, వారి మనస్సు ఇంకా భావోద్వేగాలు కూడా అలాగే పనిచేస్తాయి. కానీ మీరు వారి ఉపరితలంపై చూసినట్లయితే, ఇది ఒక మహిళ, ఇది ఒక వ్యక్తి, ఇతను ఒక అమెరికన్, ఇతను ఒక భారతీయుడు, ఇలా చాలా ఉంటాయి. ఈ పక్షపాతం ఒక విషం. వారు పైపైన చిలికినప్పుడు, ప్రపంచంలో ఉన్న విషం బయటకు వస్తుంది. ఎవరూ విషాన్ని తాకాలనుకోరు కాబట్టి అందరూ దాని నుండి పారిపోయారు. శివుడు ఈ ప్రపంచ విషాన్ని తాగాడు, ఇంకా అది ఆయన గొంతు వద్ద ఆగిపోయింది. అది లోపలికి వెళ్లి ఉంటే, ఆయన విషపూరితం అయ్యేవాడు. కానీ అది ఆయన గొంతు వద్ద ఆగిపోయింది, ఇంకా ఆయన దానిని ఎప్పుడైనా ఉమ్మివేయవచ్చు. అది మీ గొంతులో ఉంటే, మీరు దానిని ఉమ్మివేయవచ్చు. అది మీ వ్యవస్థలోకి ప్రవేశిస్తే, మీరు దాన్ని బయటకు తీయలేరు. ప్రస్తుతం, మీ జాతీయత, లింగం, కుటుంబం, జన్యుపరమైన గుర్తింపులు, జాతి గుర్తింపులు, మతం - ఇవి మీ గొంతులో ఆగలేదు. అవి మీ శరీరంలోని ప్రతి కణంలోకి వెళ్లిపోయాయి. విషయం ఏమిటంటే, వాటిని మధించి పైకి తీసుకువచ్చి, బయటకు ఉమ్మేస్తే, మీరు ఇక్కడ ఒక జీవపు తునకగా జీవించవచ్చు.

శివుని నీలి కంఠం వెనుక ఉన్న ప్రతీక ఇది. ప్రపంచంలోని విషాలను తన గొంతులో భద్రపరిచాడు, దానిని బయటకు తీయవలసి వచ్చినప్పుడు ఉమ్మివేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ అది అతని శరీరంలోకి వెళితే, దాన్ని బయటకు తీసే మార్గం ఉండదు. ఒక విధంగా మొత్తం ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా, మీ పక్షపాతాలన్నీ పైకి వచ్చేలా మధించి, ఒకరోజున బయటకు ఉమ్మివేసేలా చేయడమే. అది గనుక ఎంతో లోతుగా ఉంటే, దాన్ని బయటకు తీయడం ఎలా? నేను మీ పక్షపాతాల్లో ఒకదాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే, మీ అనుభవంలో మీకు అది మీ జీవాన్నే బయటకు లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. మీ లింగం, పిల్లలు, తల్లిదండ్రులు లేదా జాతి అనే మీ గుర్తింపులను నేను తీసివేయడానికి ప్రయత్నిస్తే, మీ జీవాన్నే బయటకు లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. లేదు, పక్షపాతం అనే విషాన్ని మాత్రమే బయటకు తీస్తున్నాము. కాబట్టి పక్షపాతంనే విషాన్ని ఉమ్మివేయడానికి ఇది సమయం.

సంపాదకుడి సూచన: శివునికున్న అనేక రూపాల గురించి ఆశ్చర్యపోతున్నారా?శివుని వివిధ రూపాల గురించి ఇంకా అవి దేనిని సూచిస్తాయి అన్న దాని గురించి అంతా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

శివలింగాల గురించి మీకు తెలియని 12 విషయాలు