logo
logo
Shiva and Kali: The Tantric Symbolism

శివుడు ఇంకా కాళీకాదేవి: తాంత్రిక చిహ్నం

కాళికాదేవి శివుని ఛాతి మీద నిల్చుని ఉన్నట్టు చూపించడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. కాళికాదేవి శివుణ్ణి చంపిన కథను చెబుతూ, అది దేనికి ప్రతీకనో వివరిస్తున్నారు.

ప్రశ్న: సద్గురు, కాళికాదేవి శివుని మృతదేహంపై నిల్చుని ఉన్నట్టు చూపించే చిత్రాలు కొన్నింటిని నేను చూశాను. ఈ చిత్రీకరణ వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

కాళికాదేవి శివుణ్ణి చంపడం



సద్గురు:: శక్తి యొక్క స్త్రీత్వ అంశం ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే ఓ విధమైన కథ ఇది. ఓసారి ఏం జరిగిందంటే, అనేక మంది రాక్షసులు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడతారు. ఎన్నో దుష్టశక్తులు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవటం మొదలు పెడతాయి. కాబట్టి కాళికాదేవీ ఉగ్రరూపం దాలుస్తుంది. తను విజృంభించినప్పుడు, తనని ఎవరు ఆపలేరు. తను ఎదురొచ్చిన అన్నింటిని వధిస్తూ వెళుతుంది.

కారణానికి మించి, అవసరానికి మించి, చేయాల్సిన చర్యకి మించి, ఆమె ఉగ్రం కొనసాగుతూనే ఉంటుంది. ఆమె ఉగ్రం ఎంతటి ఊపందుకుంటుందంటే, ఇక అది తగ్గజాలదు, అలాగే ఆమె వధిస్తూ పోతూనే ఉంటుంది కాబట్టి, ఎవరు కూడా వెళ్లి ఆమెను ఆపే సాహసం చేయరు. అప్పుడు వాళ్ళు శివుణ్ణి ఆశ్రయించి, “ఆమె ఈ విధంగా చెలరేగుతోంది. ఆమె మీ పత్ని. దయచేసి ఆమెను శాంత పరచడానికి ఏమైనా చేయండి” అని వేడుకుంటారు.

కాళికాదేవి గురించి తనకి తెలుసు కాబట్టి, శివుడామే దగ్గరకెళతాడు. కోపంగానో లేక యుద్ధం చేసే ఆలోచనతోనో కాదు, ఊరికే అలా వెళతాడు. కానీ కాళికాదేవి శక్తి ఏ స్థాయికి చేరుకుందంటే, అది శివుణ్ణి నేలమట్టం చేస్తుంది. తను, ఆయన మీద నిల్చున్నప్పుడు గానీ, తను ఏం చేసిందో తను గ్రహించదు. అప్పుడు తను నిమ్మళించి, ఆయనలోకి మళ్లీ జీవాన్ని ఊదుతుంది.

దేవి తన సొంత తలను తీసేస్తుంది



ఈ సంఘటనలను ఆధారం చేసుకుని ఎన్నో తంత్ర ప్రక్రియలున్నాయి. తాంత్రికులు తమ సొంత తలను తీసేసి, దాన్ని చేత్తో పట్టుకుని నడుస్తున్న చిత్రాలు లేదా పెయింటింగులు మీరు చూసే ఉంటారు. లేదా ఆ దేవీయే తన తలను తీసేసి, చేతిలో పట్టుకుని నడుస్తున్నట్టు చూపించడాన్ని చూసుంటారు. ఇవన్నీ జనాలు తమ సొంత తలను తీసేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి అతికించే అనేక తంత్ర ప్రక్రియలు. కొన్ని పద్దతుల ద్వారా వాళ్ళు ఇది చేయగలుగుతారు.

తంత్రం: జీవం పోయడం, తీయడం



నాకు తెలుసు, ఈ రోజుల్లో, చాలామంది మనం తంత్రం అనగానే అడ్డు అదుపు లేని వ్యభిచారం అనుకుంటారు. ఇందుకు కారణం ఏంటంటే తంత్రాన్ని గురించిన పుస్తకాలన్నీ దాదాపు అమెరికన్ల చేతే వ్రాయబడ్డాయి. అలాగే అందరూ తంత్రం గురించి మ్యాగజైన్లలో ఇంకా పుస్తకాలలో మాత్రమే చదువుతారు. తంత్రం అంటే విచ్చల విడితనం కాదు. తంత్రం అంటే కటోరమైన క్రమశిక్షణ. తంత్రం అనేది, జీవాన్ని తీసి మళ్ళీ జీవం పోయగలిగే సాంకేతికత, విధానం, సామర్థ్యం. తంత్రం అంటే మీరు జీవాన్ని పూర్తిగా కూల్చేసి మళ్లీ దాన్ని తిరిగి నిలబెట్టగలిగేంతగా ఈ వ్యవస్థపై పట్టు సాధించటం.

కాళికాదేవి శివుణ్ణి చంపడం దేనికి చిహ్నం



మీరు జీవం పైన ఎంతటి పట్టు సాధించవచ్చు అంటే, ఇక జీవన్మరణాలు రెండూ కూడా పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటాయి, మీరు జీవాన్ని పూర్తిగా కూల్చేసి మళ్లీ దాన్ని తిరిగి నిలబెట్టొచ్చు. ఇది బలప్రదర్శన కాదు. దానర్థం మీరు జీవంపైన అంతటి పట్టు సాధించాలనుకుంటున్నారు అని.

జీవంపైన మీకు ఎంతో కొంత పట్టు ఉంటే తప్ప మీరు ఏదీ చేయలేరు. జీవం పైన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత పట్టు ఉంటుంది. లేదంటే మీరు ఏమీ చేయలేరు. మీకు ఏ స్థాయి పట్టుందనేది మీరెంత చేయగలుగుతారనేదాన్ని నిర్ధారిస్తుంది.

కాళికాదేవి శివునిపై నిల్చుని ఉండటం అనేది ప్రాథమికంగా, జీవ ప్రక్రియపై పూర్తి పట్టు కలిగుండటాన్ని సూచిస్తుంది. దానర్థం మీరు ఆ దేవుడినే చంపి, మళ్లీ అతనికి తిరిగి జీవాన్ని పోయగలరు అని. ఇది కొంచెం తెంపరితనంగా అనిపిస్తుంది, అనిపించడం లేదూ? కానీ తంత్రం అనే సాంకేతికత ఆ విధంగానే ఉంటుంది.

    Share

Related Tags

మార్మికతశివుడు ఇంకా ఆయన పరివారంశివుని కథలుశివపార్వతులు

Get latest blogs on Shiva

Related Content

శివ అంటే ఎవరు: మనిషా, కల్పనా లేక దైవమా?