logo
logo

మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలుకువగా ఉంచేందుకు నాలుగు శివుని కథలు

యోగ సంప్రదాయంలో, జానపద శైలిలో అమూల్యమైన జ్ఞానాన్నందించే శివుని కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నాలుగు శివుని కథలను ఇక్కడ ఇస్తున్నాం

Story 1: మొదటి కథ: శివుడు - ఎడ్లబండి

సద్గురు: ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్లి విశ్వనాథుడయిన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, “దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు, నాకు వయసు పైబడుతుంది. నేనక్కడికెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను” అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేదీ అడగదు.

కాబట్టి అతను తన తల్లితో పాటు, దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ, సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్తి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకొని నడవటం మొదలు పెడతాడు, కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం, “ శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్నడిగిన ఒకే ఒక కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకెళ్లాలి. మేం అక్కడికొస్తున్నది నీ కోసమే కదా. దయచేసి నాకు బలాన్ని ఇవ్వు” అని వేడుకోవడమే.

అలా నడుస్తుండగా అతనికి, వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచు లోనుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనబడుతుంది. కానీ ఒంటెద్దు బళ్లను కేవలం చిన్న పాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని వాడతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తుంటుంది, కానీ పొగమంచు వల్లా, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల, ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు.

అప్పుడు ఈ భక్తుడు, “ మా అమ్మకి బాగోలేదు. ఖాళీగా ఉన్నా మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి “ అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండి ఎక్కుతారు, బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు, అడవి మార్గంలో కూడా ఈ ఎద్దులబండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు. అప్పుడతను కిందకి చూస్తే, బండి చక్రాలు తిరుగుతూ ఉండవు. అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది, అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, “మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం. ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే ఆ చోటు. ఇక నేను వెళ్తాను” అని, అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దు, బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు.

ఇక ఇతను గ్రామానికి తిరిగొస్తాడు. అందరూ, “ఇతను చాలా తొందరగా వచ్చాడు. తన తల్లిని కాశీకి తీసుకువెళ్లుండడు, తనని మధ్యలో ఎక్కడో వదిలేసుంటాడు” అనుకుంటారు. వాళ్లతన్ని, “మీ తల్లిని నువ్వు ఎక్కడొదిలేసావు” అనడుగుతారు. అతను, “ లేదు, మేం వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ శివుడే మా కోసం వచ్చాడు” అంటాడు. వాళ్లు,”ఇదంతా చెత్తవాగుడు!” అంటారు. అతను,”మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం, ఆయన మా కోసం వచ్చాడు. నా జీవితం వెలిగించబడింది. నా మనస్సాక్షికి ఇది తెలుసు. మీకది తెలీక పోతే, అది మీ సమస్య” అంటాడు. అప్పుడు వాళ్ళు, “అయితే మాకు, ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనటానికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనటానికి మాకు ఏదో ఓ రుజువు చూపించు “ అంటారు. అతను, “అదంతా నాకు తెలీదు ఎందుకంటే నేనాయనను చూడలేదు, నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను, లోపల ముఖం కనబడలేదు, అక్కడ ఏమీ లేదు” అంటాడు.

అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారత దేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించే వారు.

రెండవ కథ: ఓ శివభక్తుడుగా మారిన దొంగ ‘మల్ల’

సద్గురు: నేను పుట్టిన ప్రదేశానికి చాలా దగ్గరలో నివసించిన ఓ యోగి గురించి చెబుతాను. నేనితని గురించి ఇంకా అక్కడ జరిగిన అద్భుతాల గురించి విన్నాను. కానీ యవ్వనంలో ఉండడంతో దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అది నన్ను కొద్దిగా కదిలించింది. కానీ ఆ సమయంలో నేను దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.

మైసూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుతం నంజన్గూడ్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లలో మల్ల అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ఏ సాంప్రదాయానికి గానీ, లేదా మనకి తెలిసిన ఏ ఆరాధనా విధానానికి గానీ, ధ్యాన విధానానికి గానీ చెందినవాడు కాదు. కానీ తన బాల్యం నుండి కూడా, కళ్ళు మూశాడంటే అతనికి కనబడేది ఆ శివుని రూపమే. బహుశా ఆతనికి భక్తుడనే పదం సరిపోదేమో. అతనిలా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ శివుని బందీలు. వాళ్లకు వేరే ఎంపిక లేదు. బహుశా నేను కూడా, ఆయనచే బంధించబడిన వాడినేనెమో. మేం ఆయన్ని ఆశ్రయించలేదు - ఎవరినీ ఆశ్రయించడానికి ఒప్పుకోలేనంత అహంకారం, అయినాసరే ఆయనచే బంధింపబడ్డాము. శివుడు ఓ వేటగాడు. ఆయన కేవలం జంతువులనే గాక మనుషులను కూడా పడతాడు. ఇతను వారిలో ఒకడు.

‘మల్ల’కి శివుని గురించి ఏమీ తెలీదు. అతనెటువంటి పనిని గానీ, కళని గానీ నేర్చుకోలేదు. ఎవరినైనా ఆపి తమ దగ్గరనుండి తనక్కావాల్సింది తీసుకోవడం తప్పని అతనికెప్పుడూ అనిపించలేదు. కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తుండేవాడు, అందరూ అతనిపై బందిపోటు అని ముద్ర వేస్తారు.

ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం, బందిపోటు దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. అతనిలా బెదిరించి లాక్కునే చోటు “కల్లనమూలై” అని ప్రసిద్ధి చెందింది, కల్లనమూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశం అని. మొదట్లో అందరూ అతన్ని శపించేవారు. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి, అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతీ పైసానీ కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు. ఓ పెద్ద వేడుక చేసేవాడు!

కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక, అందరూ ఆయన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి, ఆయనకి స్వచ్ఛందంగా చెందాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వటానికి ముందుకు రారో, వాళ్ళని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదనుకునేవాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత, అన్నదమ్ములైనా ఇద్దరు యోగులు ఆ దారిన వస్తారు. బందిపోటు దొంగ కానీ గొప్ప భక్తుడయిన ఇతన్ని చూస్తారు. వాళ్లతనికి, “నీ భక్తి అమోఘం, కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయి.” అని చెబుతారు. అందుకతను, “నేనిదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను, అందులో తప్పేముంది?” అంటాడు. వాళ్లతన్ని ఒప్పించి, పక్కకు తీసుకెళ్లి, ఆయన్ని వేరో పద్ధతుల్లో పెడతారు. అలాగే ఆ ప్రదేశం కల్లనమూలై నుండి మల్లనమూలై అయ్యింది. ఈ రోజుకీ ఆ చోటని మల్లనమూలై అంటారు. అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు, అక్కడొక పెద్ద సాంప్రదాయంగా మారాయి.

అతను తన బందిపోటు దొంగతనాలను విడిచిపెట్టి, కళ్ళు మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరంన్నర కాలంలో, మహా సమాధి పొందుతాడు. ఈ విధంగా అతనికి ముక్తి కలిగించాక, అదే రోజున ఆ ఇద్దరు యోగులు కూడా కుర్చుని తమ శరీరాలను వదిలేస్తారు. ఈ రోజుకి కూడా కబిని నదీ తీరాన, వారికోసం కట్టిన మల్లనమూలై అనే గుడి ఉంటుంది.

మూడవ కథ: కుబేరుడు గొప్ప శివుని భక్తుడిగా మారిన విధానం

సద్గురు: కుబేరుడు యక్ష రాజు. యక్షులంటే మధ్యస్థ జీవాలు. వాళ్లిక్కడి జీవమూ కాదు, అలానే పరానికి చెందిన జీవమూ కాదు. వాళ్లు మధ్య స్థితిలో ఉన్నవాళ్ళు. కథేంటంటే, రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు, కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది. తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ, అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి శివభక్తుడు అవుతాడు.

శివుడు, తనకున్న కరుణ చేత, వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటిని అతనికి ప్రసాదిస్తాడు. దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు. సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది. కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు, ఓ భక్తుడు, తాను గొప్ప భక్తుడినని అనుకోవటం మొదలుపెట్టినప్పుడు, తనకున్నదంతా కోల్పోతాడు. కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి, అతను ఓ గొప్ప భక్తుడిననుకోవటం మొదలుపెడతాడు. అయితే శివుడు ఎప్పుడూ కూడా, ఒక్క విభూతిని తప్ప, మరేదీ తీసుకోడు. కానీ కుబేరుడు, తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఓ గొప్ప భక్తుడిననుకోవడం మొదలుపెడతాడు.

ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి, “నీకు ఏం చేయమంటావో చెప్పు. నేను నీకు ఏదోటి చేయాలనుకుంటున్నాను” అంటాడు. అందుకు శివుడు, “ఓహో, నువ్వు నా కోసం ఏం చేయలేవు. నా కోసం నువ్వు ఏం చేయగలవు? నాకు ఏమీ అక్కర్లేదు. నేను బానే ఉన్నాను.” అని, గణపతిని చూపుతూ “కానీ నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది. అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు” అంటాడు. కుబేరుడు, “అదొక సమస్యే కాదు” అని, గణపతిని భోజనానికి తీసుకువెళతాడు. భోజనం వడ్డిస్తారు, ఆయన తింటూ తింటూ తింటూనే ఉంటాడు. వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు, ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి, అపారమైన ఆహారాన్ని వండిస్తాడు. వాళ్లదంతా వడ్డిస్తారు, ఆయన తింటూనే ఉంటాడు.

కుబేరుడు అప్రమత్తమై. “గణేశా ఆగు, ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది” అంటాడు. అందుకు గణపతి, “నువ్వేమి బెంగ పడకు, ఈ పామును చూశావా, నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది. నా పొట్టను గురించి నువ్వు బెంగ పడాల్సిన అవసరం లేదు. నాకాకలిగా ఉంది, భోజనం తెప్పించు. నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటాననన్నావు!” అంటాడు.
కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు. ఏమంటారంటే, ఆహారం కొనటానికి అతను కొంత మందిని వేరే లోకాలకి కూడా పంపించాడు అంటారు. అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు. గణపతి దాన్నలా తినేసి, “నాకింకా కడుపు నిండలేదు, మరింత ఆహారం ఎక్కడ?” అంటాడు. కుబేరుడు తన ఆలోచనెంత అల్పమైనదో తెలుసుకుని, శివునికి నమస్కరిస్తాడు. “నాకున్న సంపద, నీకు కాలి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు. నువ్వు నాకిచ్చిన దానిలో నుండి, తిరిగి నీకు కొంచెం ఇస్తూ, నేనేదో గొప్ప భక్తుడిననుకోని, నేను పొరపాటు చేశాను” అంటాడు. ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది.

నాలుగవ కథ: అర్ధనారిగా శివుడు ఇంకా భృగుమహర్షి

సద్గురు : యోగా అన్నప్పుడు మనం ఓ ప్రత్యేకమైన వ్యాయామం గురించొ లేదా ఓ సాంకేతికత గురించొ మాట్లాడడం లేదు. మనం అసలు ఈ సృష్టి వెనకాల ఉన్న శాస్త్రం గురించీ, ఇంకా ఈ సృష్టిలో ఓ ముక్క అయిన దీన్ని, దాని అనంత సంభావ్యతకు తీసుకెళ్లడం గురించీ మాట్లాడుతున్నాం. మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఓ అనంతమైన అవకాశంగా చేసుకోగలిగేలా చేసే ఓ శాస్త్రం ఇంకా సాంకేతికత గురించి మాట్లాడుతున్నాం.

శివుడు సప్త ఋషులకు, యోగాని అందజేయడం, ఇంకా ఈ ఉనికి యొక్క స్వభావం గురించి తెలీజేయడం మొదలుపెట్టినప్పుడు, ఓ అందమైన సంఘటన జరిగింది. అనుగ్రహ సరస్సయిన, కాంతి సరోవరం తీరాన ఈ మొదటి యోగా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, అక్కడ పార్వతీదేవి కూడా ఉంది. తర్వాత తర్వాత భృగుమహర్షిగా పిలవబడిన సప్త ఋషులలో ఓ ఋషి శివుని గొప్ప భక్తుడు. ఎప్పటిలాగానే భృగుమహర్షి పొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చేయాలనుకుంటాడు. పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చొని ఉంటుంది, అయినా సరే భృగుమహర్షి వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్తూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు. అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకుంటాడు, పార్వతీ దేవికి కాదు

శివుడికి అతను ఇలా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ పార్వతిదేవికి అలా అనిపించదు. తనకలా చేయటం నచ్చదు. ఆమె శివుని వైపు చూసినప్పుడు, శివుడు, “దగ్గరికి జరుగు, తను నీక్కూడా ప్రదక్షిణ చేస్తాడు” అంటాడు. పార్వతి దేవి పక్కకు జరుగుతుంది. ఇక ఇప్పుడు భృగుమహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్లేందుకు వారి మధ్య తగినంత చోటుండదు. దాంతో అతను, ఓ ఎలుక రూపంలోకి మరి, పార్వతీ దేవి చుట్టూ కాకుండా, కేవలం శివుని చుట్టూనే తిరిగి ప్రదక్షణ చేస్తాడు.

దాంతో పార్వతీదేవి చికాకు పడుతుంది. ఆమెని సంతోషపెట్టడం కోసం, శివుడామెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. భృగుమహర్షి ఓ చిన్న పిట్ట రూపంలోకిగా మారి, పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు. ఇక ఈ పాటికి ,పార్వతి రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి శివుడామెను తనలోనికి లాగి తనలో ఓ భాగంగా చేసుకుంటాడు. అంటే ఆయనలో ఓ భాగం పార్వతి అవుతుంది మరో భాగం శివునిగా ఉంటుంది. అతను అర్ధనారీ అవుతాడు.

ఇది చూసిన భృగు మహర్షి, ఓ తీనేటీగ రూపంలోకి మారి, కేవలం కుడి కాలి చుట్టూ మాత్రమె ప్రదక్షణ చేస్తాడు. భృగు మహర్షి యొక్క చిన్న పిల్లవాడి తరహా భక్తి అమోఘం. కానీ అదే సమయంలో శివుడు, భృగు మహర్షి తన భక్తిలో పడి, ఈ సృష్టి యొక్క అంతిమ స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలం అవ్వకూడదనుకుంటాడు. కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు. ఇక భృగుమహర్షికి కేవలం ఓ కాలికి గానీ, లేదా శరీర్రం లోని ఏ ఒకే భాగానికి గానీ ప్రదక్షణ చేసే మార్గం ఉండదు. ప్రదక్షణ చేయాలనుకుంటే, తను స్త్రీత్వం ఇంకా పురుషత్వం ఈ రెండు సూత్రాలకూ ప్రదక్షణ చేసి తీరాలి.

ఈ కథ ఏం చెబుతోందంటే, యోగ అన్నప్పుడు, మనమన్నింటినీ కలుపుకునే ఓ పార్శ్వం గురించి మాట్లాడుతున్నాం. అది ఆరోగ్యాన్ని సృష్టించుకోవడం కోసం చేసే ఓ వ్యాయామమో లేదా ప్రక్రియో కాదు. ఇది మనిషి అనంతమైన శ్రేయస్సు గురించి, జీవం యొక్క ఏ అంశాన్నీ కూడా మినహాయించకుండా ఉండడం గురించి. అది అన్ని పార్శ్వాలకూ అతీతమైన పార్శ్వాన్ని చేరుకోవడం గురించి. అది మీ వ్యవస్థని - మీ శరీరాన్నీ, మనసునీ, భావోద్వేగాలనీ, శక్తులనీ - దివ్యత్వాన్ని అందుకునేందుకు ఒక నిచ్చెనగా చేసుకోవడం గురించి. అది, మీ అనంతమైన స్వభావాన్ని చేరుకునేందుకు, మిమ్మల్ని మీరు ఓ మెట్టుగా మలచుకునేందుకు ఒక విధానం.

    Share

Related Tags

శివుని కథలు

Get latest blogs on Shiva

Related Content

మనకి తెలీని శివుడు: శివుణ్ణి గుర్తించడం