logo
logo
shiva linga

శివలింగాల గురించి మీకు తెలియని 12 విషయాలు

లింగా అనే పదానికి "రూపం లేదా ఆకృతి" అని అర్థం. అప్పటిదాకా అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమవ్వడం మొదలవగానే, లేదా మరోరకంగా చెప్పాలంటే, సృష్టి ప్రక్రియ ప్రారంభం కాగానే, అది మొదట దీర్ఘవృత్తాకారాన్ని తీసుకుంది.

ఆది - అంతము అయిన రూపం

సద్గురు:


లింగా అనే పదానికి "రూపం లేదా ఆకృతి" అని అర్థం. అప్పటిదాకా అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమవ్వడం మొదలవగానే, లేదా మరోరకంగా చెప్పాలంటే సృష్టి ప్రక్రియ ప్రారంభం కాగానే, అది మొదట దీర్ఘవృత్తాకారాన్ని తీసుకుంది. ఏ లోపము లేని, పరిపూర్ణమైన దీర్ఘవృత్తాకారాన్నే, మనం లింగం అంటాం. సృష్టి ఎప్పుడూ దీర్ఘవృత్తాకారం లేదా లింగాకారంలో మొదలయ్యి, ఆ తర్వాత రకరకాల రూపాలను సంతరించుకుంది. అంతేకాదు, మనము గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళినప్పుడు, పూర్తిగా లయమైపోయే ముందు, మరోసారి ఆ శక్తి, లింగాకృతిని తీసుకుంటుంది. కాబట్టి, మొట్టమొదటి ఆకృతి లింగాకారం, ఆఖరిగా తీసుకునే రూపం కూడా లింగాకారమే.

లింగా


ఆది పురుషుడ వీవు
శూన్యవిశ్వం తొలుత వెలువరించిన భావ రూపమే నీవు

విజ్ఞ్యలు నిన్ను వెంబడించిరి
కనుగొనిరి మూలకారణము నీవేయని
ఈ జీవ పరిహాసముల కెల్ల

జగతి బాధలకు మరి ఆనందముల కెల్ల మూలము నీవే
పాతాళము చేరు లోతు నీవే, ఆకాశములనంటు శిఖరం నీవే

ఆహా, ఏమి నీ వాడు ఆటలు
ఆదియు నిదియు కాని
అనంత రూపాలకు ఆదిమూలము నీవే

నీ యునికి, నా మనికి వివరమ్ము
తెలిసికొన గోరి, పెనుగులాడితి నీసృష్టి అంతా

ఓ ఈశ్వరా, అమోఘ దివ్య రూపా
ఇట నీ ధామమై నిలచి, ఈశా ధన్య మైనది,
– సద్గురు

లింగాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయటం:


“అవసరమైన సాంకేతికత, కొద్దిపాటి స్థలం, చివరికి ఒక రాతి ముక్కని కూడా దివ్య తేజస్సుతో నింపవచ్చు. ఇదే ప్రతిష్ఠాపనలోని గొప్పతనం.” – సద్గురు

సద్గురు:


మీరు నాకు ఏదైనా ఒక వస్తువును ఇస్తే, ఉదాహరణకి ఒక కాగితం ముక్క, దాన్ని నేను అత్యంత శక్తివంతం చేసి మీకు ఇవ్వగలను. మీరు ఆ కాగితాన్ని, నేను దాన్ని ముట్టుకునే కంటే ముందర, ఆ తర్వాత పట్టుకుని చూస్తే, మీకు తెలుస్తుంది. కానీ, ఆ కాగితం శక్తిని నిలిపి ఉంచుకోలేదు. అదే మీరు ఒక పరిపూర్ణమైన లింగాకృతిని తయారు చేస్తే, అది ఎప్పటికీ తరగని శక్తి నిలయంగా అవుతుంది. మీరు అందులో ఒక్కసారి శక్తి నింపితే చాలు, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది.

ప్రాణ ప్రతిష్ఠ


ప్రతిష్ఠ అంటే పవిత్రీకరించడం. సర్వసాధారణంగా, ప్రతిష్ఠాపన, మంత్రాలూ, తంత్రాలు, ఇంకా కొన్ని రకాల ప్రక్రియలతో చేస్తారు. అలా మంత్రాలతో ప్రతిష్ఠాపన చేస్తే, ఆ విగ్రహాన్ని జీవంతో ఉంచడానికి, ప్రతినిత్యం ఆరాధనా, అభిషేకం వంటి ప్రక్రియలు జరుగుతూ ఉండాలి. కానీ, ప్రాణ ప్రతిష్ఠ అటువంటిది కాదు. ఒకసారి ప్రాణశక్తి తో ( ఏ మంత్రాలూ, తంత్రాలూ లేకుండా) ప్రతిష్ఠాపన జరిగితే, అది శాశ్వతంగా నిలిచిపోతుంది. దాన్ని సజీవంగా ఉంచడానికి వేరేమీ చేయవలసిన అవసరం లేదు. అందుకే, ధ్యానలింగంలో ఎలాంటి పూజలూ జరగవు. దానికి ఎటువంటి సంరక్షణ అవసరం లేదు. అది ప్రాణశక్తితో ప్రతిష్ఠాపన చేయబడినది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ లింగలోని రాతిని తొలగించివేసినా, అది అదే శక్తితో ఉంటుంది. ప్రపంచమంతా అంతమైపోయినా, ఆ రూపం అలాగే నిలబడి ఉంటుంది.

లింగాన్నితయారుచేయటం - అనుభవాత్మక విజ్ఞాన శాస్త్రం

సద్గురు:


లింగాలను తయారు చేసే విధానం గొప్ప అనుభవంతో పొందగలిగిన జ్ఞానం ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ గత 8,9 వందల సంవత్సరాల నుంచి, ముఖ్యంగా, భక్తి ఉద్యమం దేశాన్ని ముంచెత్తినప్పుడు, దేవాలయాలను నిర్మించే శాస్త్ర విజ్ఞానం మరుగున పడిపోయింది. ఒక భక్తుడికి, తన భావోద్వేగం కంటే ఇంకేదీ ముఖ్యం కాదు. భావోద్వేగమే అతని మార్గం. ఆ భావోద్వేగం ఇచ్చే బలంతోనే అతను ఏదైనా చేయగలుగుతాడు. అందువలన, వాళ్లు శాస్త్రాన్ని పక్కనపెట్టి, తమకు, ఎవరికి వారికి ఇష్టమైన రీతిలో, ఆలయాలను కట్టడం ప్రారంభించారు. అది ఒక ప్రేమ వ్యవహారం, సరేనా? ఒక భక్తుడు తనకి ఏం కావాలంటే అది చేస్తాడు. ఏమి జరిగిన పరవాలేదు, ఎందుకంటే అతని భక్తి ఆవేశమే అతనికి కొండంత బలం. ఇందువల్ల, లింగాలను తయారు చేసే విజ్ఞానం తరిగిపోసాగింది. నిజానికి అది(ప్రతిష్ఠ) చాలా లోతైన శాస్త్రం. ఇది కేవలం అనుభవంతోనే సంపాదించగల విజ్ఞానం, అందుకే ఎప్పుడూ ఎక్కడ దాన్ని రాసి భద్రపరచలేదు. ఒకవేళ రాసి ఉంచితే, దాన్ని పూర్తిగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. చాలా లింగాలు ఇలాగే ఎటువంటి శాస్త్రజ్ఞానం లేకుండా తయారు చేసేశారు.

లింగాలు చక్రాలకు ప్రతినిధులు


సద్గురు: శక్తి వ్యవస్థలో, ప్రాణ నాడుల కలయిక వల్ల శక్తి వలయాలు ఏర్పడే ప్రదేశాలే చక్రాలు. చక్రాలు మొత్తం 114 ఉన్నాయి. కానీ, మనం సాధారణంగా చక్రాలు అన్నప్పుడు, వాటిల్లో అతి ముఖ్యమైన ఏడు చక్రాలను మాత్రమే సూచిస్తున్నామని అర్ధం. ఈ ఏడు చక్రాలూ మన జీవనం లోని ఏడు పార్శ్వాలను సూచిస్తాయి. అవి మన దేహంలో ఏడు పెద్ద రవాణా కూడళ్ల వంటివి అన్నమాట.

ప్రస్తుతం భారత దేశంలో ఉన్న లింగాలు కేవలం ఒకటో, రెండో చక్రాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ధ్యానలింగానికి ఉన్న ఒకే ఒక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఏడు చక్రాలూ సంపూర్ణంగా శక్తివంతం చేయబడి, అత్యుత్తమ స్థాయిలో ప్రతిష్ఠించబడ్డాయి. ఇది అత్యుత్తమమైన స్థాయి సృష్టి- ఏ విధంగా అంటే, మీరు శక్తిని అతి తారాస్థాయికి తీసుకువెళితే, అది కేవలం కొంత సేపు మాత్రమే ఒక రూపంలో ఇమడగలదు. ఆ తరువాత అది రూపహీనం అయిపోతుంది. అయితే, ఆలా అరూపిగా ఉన్నప్పుడు శక్తిని సామాన్య జనులు అనుభూతి చెందలేరు. కాబట్టి, రూపహీనత్వాన్ని పొందేంత తారాస్థాయికి శక్తిని తీసుకెళ్లి, అక్కడ దానిని ఘనీభవింపజేయడం - ఇదీ ధ్యానలింగ ప్రతిష్ఠాపన విధానం.

పంచభూత స్థల లింగాలు

సద్గురు:


యోగసాధనలో అత్యంత ప్రాథమికమైనది భూత శుద్ధి. ప్రకృతిలో ఉన్న ఐదు మూలకాలే పంచ భూతాలు. మీరు గమనిస్తే, మీ భౌతిక శరీరం పంచ భూతాలతోనే తయారయింది. అవి - భూమి, అగ్ని, వాయువు, నీరు ఇంకా ఆకాశం. అవి ఒక నిర్దిష్ట పద్ధతిలో కూడి ఈ భౌతిక శరీరాన్ని నిర్మిస్తాయి. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఈ భౌతిక, పంచ భూత పరిధులని దాటి వెళ్లడం. మీ అనుభవంలోకి వచ్చే ప్రతి విషయం పైనా, ఈ పంచ భూతాల పట్టు ఉంటుంది. వీటిని అధిగమించడానికి, యోగ సాధన ప్రాథమిక ప్రక్రియలో భూతశుద్ధి అనే అంశం ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క మూలభూత ప్రభావాన్నించి విడివడటానికి, ఒక ప్రత్యేక సాధన ఉంది.

దక్షిణ భారత దేశంలో, ఐదు అద్భుతమైన ఆలయాలు నిర్మించబడ్డాయి - ఒక్కొక్క చోట ఉన్న లింగం - పంచభూతాలలో ఒక్కొక్క మూలకానికి ప్రాతినిధ్యం వహించేట్టుగా. మీరు నీటి మూలకం పై సాధన చెయ్యాలంటే, తిరువనైకవల్ వెళ్ళాలి. ఆకాశ భూతం గురించిన సాధన కోసం చిదంబరం వెళ్ళాలి; వాయువుకి కాళహస్తి; భూమికి కాంచీపురం; ఇక అగ్నికి తిరువణ్ణామలై.

ఈ ఆలయాలు సాధనా స్థలాలుగా నిర్మించబడ్డాయి, పూజల కోసం కాదు.

జ్యోతిర్లింగాలు


సద్గురు:
సమాజంలోని ప్రతిఒక్కరూ, మనిషి పొందగల పరమోత్తమ శ్రేయస్సుపైనే దృష్టి సారించిన అతి కొద్ది ప్రప్రంచ సంస్కృతులలో, భారతీయ సంస్కృతి ఒకటి. మీరు భారతదేశంలో పుట్టినట్లయితే, మీ జీవితం కేవలం మీ వ్యాపారం, మీ భార్య పిల్లలు, మీ సంసారం గురించి ఏ మాత్రం కాదు; ఈ జీవితం కేవలం ముక్తికి సాధనం మాత్రమే. మొత్తం సమాజమంతా ఇలాగే నిర్మితమై ఉండేది.

అందుకోసం ఈ సంస్కృతి, బహు శక్తివంతమైన పలు రకాల సాధనాలను సృష్టించింది. ఇదే దిశలో జ్యోతిర్లింగాలను చాలా శక్తివంతమైన సాధనాలుగా తయారు చేశారు. ఇటువంటి రూపాల సమక్షంలో ఉండటం చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.

జ్యోతిర్లింగాలు బ్రహ్మాండమైన శక్తి రూపాలు. ఎందుకంటే, అవి కేవలం మానవ సామర్ధ్యంతోనే కాకుండా, ప్రాకృతిక శక్తుల సహకారంతో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో సృష్టించబడి, ప్రతిష్ఠ చేయబడినవి. జ్యోతిర్లింగాలు కేవలం 12 మాత్రమే ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా కూడా చాలా విశిష్ఠత కలిగిన బిందు స్థానాలలో వాటిని ప్రతిష్ఠించారు. ఈ సృష్టిలోని కొన్ని శక్తులకు అనుగుణంగా ఈ కేంద్రాలున్నాయి. చాలా కాలం క్రిందట, విశేష స్థాయి అవగాహన కలిగిన వారు, గ్రహ-నక్షత్ర గమనాల ఆధారంగా ఈ ప్రాంతాలను గణించి, ఈ కేంద్ర బిందువులను నిర్ధారణ చేశారు.

కొన్ని జ్యోతిర్లింగాలు ఇప్పుడు సజీవంగా లేవు. కానీ వాటిలో చాలా మటుకు, ఇప్పటికీ గొప్పశక్తివంతమైన సాధనాలు.

మహాకాలుడు- కాల యంత్రం

సద్గురు:


శి-వ అంటే శబ్ద పరమైన అర్థం -"ఏది లేదో అది" లేదా " ఏమీ కానిది". అక్కడున్న మధ్య గీత (హైఫన్) చాలా ముఖ్యమైనది. విశాలమైన శూన్యం ఒడిలోంచి ఈ సృష్టి అంతా ఉద్భవించింది.  విశ్వంలో, అలాగే అణువులో కూడా 99% నిజానికి శూన్యమే ఆవరించి ఉన్నది. కాల అనే  పదం సమయానికి, శూన్యానికి, ఇంకా శివుడి రూపాల్లో ఒకటైన కాలభైరవ రూపానికి ఆపాదించబడుతుంది. కాలభైరవ అనేది చీకటి యొక్క ఒక ఉత్తేజ భరితమైన స్థితి, కానీ అతను సంపూర్ణంగా నిశ్చలుడు అయినప్పుడు, మహాకాలుడుగా మారిపోతాడు- అదే అత్యద్భుతమైన కాల యంత్రం.

ఉజ్జయినిలోని మహాకాలుని ఆలయం ఒక అద్భుతమైన ప్రతిష్ఠా స్థలం. ఈ అతి భయంకర శక్తి స్వరూపము పిరికి వాళ్ళ కోసం కాదు సుమా. మూల ప్రకృతితో అతి బలవంతమైన ఆ శక్తి

కేవలం అంతిమ విముక్తి అన్వేషించే వాళ్ల కోసం మాత్రమే- దాన్నే మనం లయం అయిపోవడం అంటాం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నలింగాలు

సద్గురు:


ఆత్మజ్ఞానం పొందిన వాళ్లలో శివుని గురించి మాట్లాడని వాళ్ళు ఎవ్వరూ లేరు. అది(శివుడిని) అవధులు లేని ఒక పార్శ్వం దృష్ట్యా గానీ లేదా భౌతిక తత్వాన్ని దాటి ఉన్నదిగా కానీ. తేడా కేవలం, వారి వారి ప్రాంతాలను అనుసరించి వారు వ్యక్తం చేసిన భాష, సంకేతాలు మాత్రమే.

అయితే, గత పదిహేను వందల సంవత్సరాలుగా, ప్రపంచంలో కొన్ని మతాల వ్యాప్తి కోసం అవలంబించిన విపరీత ధోరణుల వల్ల, చాలా మటుకు గతకాలపు గొప్ప సంస్కృతులు - మెసొపొటేమియా నాగరికత, మధ్య ఆసియా ప్రాంతాల నాగరికతలు, ఇంకా ఉత్తర ఆఫ్రికా నాగరికత వంటివి అంతరించిపోయాయి. కాబట్టి, ఇప్పుడు అది కనిపించదు కానీ, లోతుగా పరిశీలిస్తే, చరిత్రలో అది అంతటా ఉందని జాడలు కనిపిస్తాయి. కాబట్టి మార్మిక విజ్ఞానం అనేది ప్రతి సంస్కృతిలోనూ ఏదో ఒక రూపంలోఉన్నది. కానీ గత పదిహేను వందల ఏళ్లలో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అది మరుగున పడిపోయింది.

వివిధ రకాల పదార్థాలతో చేయబడ్డ లింగాలు


ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లింగాలను స్వయంభూ లింగాలు అని అంటారు. ఉత్తర భారతదేశంలోని జమ్ము రాష్ట్రంలో అమర్నాథ్ గుహ ఉంది. ఈ గుహలో ప్రతి సంవత్సరం మంచు శివలింగం తయారవుతుంది. గుహ పై కప్పు నుంచి చుక్కలుగా కారే నీటిలోని ఖనిజ లవణాల వల్ల సహజంగా లింగం తయారవుతుంది. అలా గుహ పైకప్పు నుంచి నీటి చుక్కలు ఒకటి ఒకటిగా జారి పడుతూ, అంతలోనే గడ్డ కట్టి మంచు రూపంలోకి మారిపోవడం, చూడడానికి ఒక మాయాజాలం లాగా ఉంటుంది.

కొన్ని లింగాలను రాతిపైన, చెక్క పైన ఇంకా రత్నాల పై కూడా చెక్కుతారు; మరికొన్ని మట్టితో, ఇసుకతో, లోహంతో కూడా తయారుచేస్తారు. ఇవి ప్రతిష్ఠిత లింగాలు. చాలా లింగాల పైన లోహంతో చేసిన ముఖాన్ని తొడుగుగా ఉంచుతారు. ఇందువల్ల, భక్తులు భగవంతుడితో మరింత బాగా అనుసంధానం కాగలరు. వీటిని ముఖ లింగాలు అంటారు. కొన్ని లింగాల మీద అయితే శివుని సంపూర్ణ రూపం చెక్కబడి ఉంటుంది.

లింగాలు స్త్రీ, పురుష తత్వాల ఏకత్వానికి ప్రతీకలు. లింగాకృతిలోని ఆధార భాగం(పానవట్టం) స్త్రీ తత్వాన్ని సూచిస్తుంది- దీన్ని గౌరీ పీఠం లేదా పానవట్టం అంటారు. గౌరీ పీఠముతో కలిసి లింగము, స్త్రీ పురుష శక్తి స్వరూపాలైన, శక్తి-శివుల కలయికను సూచిస్తుంది.

లింగం - ఒక గురువు


యోగా వివరించే శక్తి స్థాయి పంచేంద్రియాల పరిధిలో ఉండదు కాబట్టి, ఈ ఆంతరిక స్థాయి అనుభవాలు పొందడానికి ఒక గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. చాలా మటుకు సంబంధాలు భౌతిక, మానసిక, భావోద్వేగ బంధాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ గురుశిష్యుల అనుబంధం మాత్రం అపూర్వమైనది. ఎందుకంటే అది శక్తితలంలో పనిచేస్తుంది.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం, పూర్తిగా పంచేంద్రియాల మీద ఆధారపడి ఉండడంవల్ల, అన్నిరకాల పరిశోధనలకు హేతుబద్దమైన పద్ధతులను అనుసరించటం వల్ల, అది కేవలం మనిషి మెదడు యొక్క ఆలోచనాశక్తికే పరిమితమైపోయింది. అలాగే ఆధునిక విద్యా విధానం కూడా ఇదే రీతిలో మనిషి యొక్క గ్రహణశక్తిని విస్మరిస్తూ, నిర్లక్ష్యం చేస్తూ సాగుతోంది. ఇటువంటి వాతావరణంలో, హేతువాదానికి అందని గురువు యొక్క అంతర్దృష్టి సామర్థ్యం పట్ల చాలా అనుమానాలు ఉంటాయి. అయినా కూడా, ఎప్పటికప్పుడు, సత్యాన్వేషకుడు సహజ స్పురణ చేత తన గురువు దగ్గరికి చేరుకుంటూనే ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకపు ఆవశ్యకతను పూరించడం కోసం, కొంతమంది దార్శనిక గురువులు, తమ సమక్షాన్ని, శక్తిని ప్రతిబింబించే శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ధ్యానలింగం, గురువు యొక్క అత్యుత్తమమైన అభివ్యక్తీకరణ. యోగ శాస్త్రాల్లో నిక్షిప్తమైన సారమే, ఆంతరిక శక్తుల అత్యుత్తమ స్థాయిలో ధ్యానలింగం రూపంలో మూర్తి మంతమైనదిగా ఉన్నది.

శివలింగం - విశ్వాంతరాళ స్తంభం


ఇలా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణు ఒక గొప్ప అగ్ని స్తంభాన్నిచూశారు. ఈ అనంతమైన తేజో స్తంభం నుంచి ॐ అనే నాదం శబ్దం వెలువడుతోంది. ఆశ్చర్యచకితులై వారిద్దరూ దీని గురించి శోధించాలని అనుకున్నారు. బ్రహ్మ, హంస రూపం ధరించి, స్తంభం యొక్క శిఖరాగ్రాన్ని కనుక్కుందామని నీలాకాశంలో పైకి ఎగిరాడు. విష్ణువు వరాహ(పంది) రూపం ధరించి, స్తంభానికి మూలాన్ని కనుక్కుందామని క్రింది వైపు తవ్వుకుంటూ వెళ్లాడు.

ఇద్దరూ ఓడిపోయారు. ఈ అగ్ని స్తంభం స్వయంగా శివుడే. ఆద్యంతాలు లేని వాడిని ఎవరైనా ఎలా కొలవగలం? విష్ణు తిరిగివచ్చి, తన ఓటమిని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తన అపజయాన్ని స్వీకరించలేక, తాను శిఖరాగ్రాన్ని చూశానని అబద్దం ఆడుతాడు. అందుకు ఋజువుగా, ఒక కేతకీ పుష్పాన్ని (మొగలి పువ్వు) సాక్ష్యంగా చూపిస్తాడు.

ఇలా అబద్ధం వినబడగానే, శివుడు ఆదియోగిగా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరు దేవుళ్ళు ఆయన పాదాల మీద పడ్డారు. అబద్దం చెప్పిన కారణంగా, ఇక నుంచి, బ్రహ్మ పూజకి అనర్హుడు- అని శివుడు ప్రకటిస్తాడు. బ్రహ్మ దేవుడికి వత్తాసు పలికినందుకు గానూ, మొగలి పువ్వు శివుని అనుగ్రహాన్ని కోల్పోయింది. ఆదియోగి ఇకపై మొగలి పువ్వుని సమర్పణ గా స్వీకరించడానికి నిరాకరించాడు., కానీ, ఒక్కమహాశివరాత్రి రోజు మాత్రం దానికి మినహాయింపు ఇచ్చాడు. ఈరోజుకీ కూడా, తెల్ల మొగలి పువ్వు ను ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి రోజున మాత్రమే శివునికి అర్పిస్తారు.

ధ్యానలింగం


"ధ్యానలింగ సన్నిధిలో మౌనంగా కొద్ది నిమిషాలు కూర్చుంటే చాలు, ధ్యానం అంటే తెలియని వారు కూడా గాఢ ధ్యాన స్థితి అనుభూతి పొందగలరు."
– సద్గురు

సంస్కృతంలో "ధ్యాన" అంటే " ధ్యానం", "లింగ" అంటే రూపం. సద్గురు తన ప్రాణ శక్తిని ఉపయోగించి ఒక మార్మిక ప్రక్రియ ద్వారా ఈ ధ్యాన లింగాన్ని అత్యుత్తమ శక్తి స్థాయిలో ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ ప్రక్రియ ద్వారా, సప్త చక్రాలను (మానవ దేహంలో ముఖ్యమైన ఏడు నాడీ శక్తికేంద్రాలు) అత్యుత్తమ స్థాయిలో శక్తివంతం చేసి బంధించడం వల్ల, ఈ ధ్యానలింగం ఒక ఆత్మ జ్ఞానం పొందిన పరిపూర్ణ జీవి యొక్క శక్తి శరీరం లాగా రూపొందింది.

ఏ పూజలు, ప్రార్థనలు అవసరము లేని ఈ ధ్యాన మందిరం, అన్ని మతాలను ఒకే మూలం నుంచి జనించిన వివిధ వ్యక్తీకరణలుగా గుర్తిస్తుంది.

ధ్యానలింగ


నీవు నా గురుని ఇఛ్చవు
నాకున్న ఒకే ఒక్క వెర్రి వి
కలలో, నా మెలుకువ లో
నాకున్న కోరిక ఒకటే – అది నిన్ను నిజము చేయుటే

ఏమి చేయుట కైన సిద్ధమిక నేను
మనుజులు చేయదగినదైన కానిదైనను
సిద్ధ మీ జీవమర్పించుటకు
మరి నూరు జన్మలు కావలెనన్నను సరే

ఇట నిక నీ వవతరించినావు
ఓ ప్రకాశ మూర్తి
నీ కాంతి, నీ కరుణ
లేపనీ ఈ మందల, గాఢ సుషుప్తి నుండి
త్రోయనీ మెలుకువల వెలుగులోకి

సాకారమైనావు ఇపుడు నీవు కాని
ఈ జీవితపు కానుక ఇంకా మిగిలి ఉన్నది నాకు
ఏమి చేతు నింక నాతో నేను

శిఖరాలపై నుంటి చాలా కాలమిక
సమయమిది నాకు లోయల సేద దీరగా

సద్గురు

    Share

Related Tags

మార్మికత

Get latest blogs on Shiva

Related Content

శివుడు – అనాగరికుడు, మొరటు వాడు, అచ్చంగా జీవమే ఆయన