logo
logo

మంత్రానికున్న శక్తి

ఆధునిక విజ్ఞానశాస్త్రం ఈనాడు, ఈ సృష్టి అంతా శక్తి ప్రకంపనలేనని ఎటువంటి సందేహం లేకుండా చెబుతోంది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో, అక్కడ శబ్దం ఉంటుంది. మనం యోగాలో ఈ సృష్టి అంతా శబ్దమే అనీ, దీన్ని నాదబ్రహ్మ అని అంటాము. ఈ సృష్టి అంతా సంక్లిష్ట మైన శబ్ద అమరికలే. ఈ సంక్లిష్టమైన అమరికల్లో, కొన్ని శబ్దాలని మూల శబ్దాలుగా గుర్తించారు. వీటినే మనం మంత్రాలు అంటాము. మిమల్ని ఓ పెద్ద గదిలో పెట్టి తాళం పెడితే, మీరు జీవితాంతం అక్కడే జీవిస్తూ ఉన్నారనుకోండి. ఒకవేళ మీకు ఆ గదికి తాళం చెవి దొరికితే దాన్ని తాళం కప్పలో పెట్టి మీరు తిప్పగలిగితే, అప్పుడు పూర్తిగా ఓ కొత్త ప్రపంచమే మీకు తెరుచుకుంటుంది. కానీ ఆ తాళం చెవి ఎక్కడ పెట్టాలో మీకు తెలియకపోతే, ఏ నేల మీదనో లేదా పైకప్పులోనో పెట్టి తిప్పితే అది మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. తాళం చెవి అనేది ఒక ఇనుప ముక్క మాత్రమే, కానీ మీరు దాన్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకొని, ఎలా తిప్పాలో తెలుసుకుంటే అది మీకు అస్తిత్వపు మరో పార్శ్వం పూర్తిగా తెరచుకొనేలా చేస్తుంది.

దివ్యత్వాన్ని తెలుసుకుని అనుభూతి చెందడమంటే, మీ శక్తిని ఉన్నత పార్శ్వాలకు పరిణమింప చేయాలి, మీలో శక్తి మరింత సూక్ష్మంగా ఎదగాలి. మహాశివరాత్రిన, భూమి ఉత్తరార్ధంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతుంది – ఇక్కడ సహజంగానే మానవ దేహంలో శక్తి ఉప్పొంగుతుంది. ఉప్పొంగిన ఈ శక్తిని ఉపయోగించుకోవాలంటే మన వెన్నెముకను నిటారుగా ఉంచాలి. జీవ శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెబుతున్నట్లుగా, పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన అంశం వెన్నెముక సమాంతరంగా ఉండడం నుంచి నిటారుగా మారడం. ఇలా జరిగిన తర్వాతే మీ మేధస్సు వికసించింది. అందుకని ఈ రాత్రి మీరు వెన్నెముకను నిటారుగా ఉంచడానికి సుముఖంగా ఉంటే, మేము మిమ్మల్ని రాత్రంతా మేల్కొని ఉంచడానికి సాధ్యమైనవన్నీ చేస్తాము. సహజంగా ఉప్పొంగే ఈ శక్తిని ఉపయోగించుకుని, సరైన మంత్రాలు, ధ్యానాలు ఇంకా ఇక్కడి వాతావరణంతో మీరు దివ్యత్వానికి మరో అడుగు చేరువ కాగలరు.

తర్కపరమైన ఆలోచనా విధానం కలవారు, “ఒక మంత్రంతో ఇదంతా జరుగుతుందా?” అని సహజంగానే ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ మన సంస్కృతిలో ఉంది. ఒక రోజు, గొప్ప సిద్ధులు కలిగిన ఒక యోగి, శివుడి దగ్గరికి వచ్చాడు. “ఎందుకు నీ భక్తులు ఎప్పుడూ ఈ మంత్రాలు అరుస్తూ ఉంటారు?. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నువ్వు వారికి ఇలాంటి చెత్తంనంతా ఆపమని ఎందుకు చెప్పట్లేదు?” అన్నాడు. శివుడు అతనిని చూసి, “నువ్వు ఒక పని చెయ్యి.” అని అక్కడున్న ఒక పురుగుని చూపించాడు. అది భూమి మీద పాకుతోంది. “ దాని దగ్గరికి వెళ్లి నువ్వు ‘శివ శంభో’ అని ఉచ్చరించు, ఏం జరుగుతుందో చూద్దాం’’ “అన్నాడు.

ఆ యోగి భుజాలు ఎగరేసి, అయిష్టంగానే సరేనన్నాడు. అతను ఆ పురుగు దగ్గరకు వెళ్లి “శివ శంభో’’ అనగానే, ఆ పురుగు చచ్చి పడిపోయింది. ఆ యోగి నివ్వెరపోయి, “ ఏమిటిది? ఈ మంత్రం ఉచ్ఛరిస్తేనే ఆ పురుగు చచ్చి పోయింది” అన్నాడు. శివుడు నవ్వి, అక్కడ ఎగురుతున్న ఆ సీతకోకచిలుకని చూపించాడు. దాన్ని చూసి “ శివ శంభో” అనమన్నాడు. అందుకా జ్ఞాన యోగి, “లేదు, నాకా సీతకోకచిలుకని చంపడం ఇష్టం లేదు” అన్నాడు. శివుడు ప్రయత్నించమన్నాడు. జ్ఞాన యోగి సీతాకోకచిలుకను చూసి “శివ శంభో” అన్నాడు. సీతాకోకచిలుక చనిపోయింది. ఆ జ్ఞాన యోగి “ఈ మంత్రం యొక్క ఫలితం ఇదైతే, ఎవరైనా దానిని ఎందుకు ఉచ్ఛరించాలనుకుంటారు?” శివుడు ఇంకా చిరునవ్వుతోనే, అడవిలో చెంగున తిరిగే ఒక అందమైన జింకను గమనించాడు. “జింకపై దృష్టి పెట్టి, శివ శంభో” అనమన్నాడు. “లేదు, నాకు చంపడం ఇష్టంలేదు” అన్నాడు. అందుకు శివుడు, “పర్వాలేదు, అను” అన్నాడు. జ్ఞాన యోగి, “శివ శంభో” అన్నాడు. జింక చనిపోయింది. అతడు పూర్తిగా కలవరపడ్డాడు. “ఈ మంత్రం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఇది అన్నిటినీ చంపుతోంది. ”

శివుని ఆశీర్వాదం కోసం అప్పుడే పుట్టిన శిశువుతో ఓ తల్లి వచ్చింది. శివుడు జ్ఞాన యోగిని చూస్తూ, “ఈ బిడ్డ కోసం ఆ మంత్రం చెప్పరాదూ?” అని అన్నాడు. “లేదు, నేను అలాంటి పనులను చేయాలనుకోవడం లేదు. శిశువును చంపడం నాకు ఇష్టం లేదు” అన్నాడు. శివుడు ” ప్రయత్నించూ” అని అతన్ని ముందుకు తోసాడు. జ్ఞాన యోగి ఆ పిల్లవానిని దగ్గరకు చాలా ఆందోళనతో వెళ్లి “శివ శంభో” అన్నాడు. ఆ శిశువు లేచికూర్చొని ఇలా అన్నాడు, “నేను ఒక పురుగుగా ఉన్నాను, ఒక మంత్రం నన్ను ఒక సీతాకోకచిలుక రూపంలోకి మార్చింది. మరొక మంత్రం తో, నీవు నన్ను జింకగా చేసావు. మరొక మంత్రంతో, నన్ను మానవునిగా చేసావు. మరొకసారి ఉచ్చరించు, నాకు దివ్యత్వాన్ని పొందాలని ఉంది.”

– సద్గురు ప్రసంగం, మహాశివరాత్రి 2010 నుండి తీసుకోబడింది

Related Content

మనకి తెలీని శివుడు : స్థూలం నుండి సూక్ష్మానికి