logo
logo

శివ గంగల కథ, అందులోని అంతరార్థం

శివుని జటాజూటాలలో నుంచి గంగా నది జాలువారడమనే కథ గురించి, మాండలికంగా ఆ కథ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుందన్న దాని గురించి సద్గురు వివరిస్తున్నారు.

శివ గంగల కథ, అందులోని అంతరార్థం


సద్గురు: గంగా నది శివుని జటాజూటాల నుండి జాలువారుతుందని అంటారు. హిమాలయాలలో, అక్కడున్న ప్రతి శిఖరమూ సాక్షాత్తు ఆ శివుడే అని ఓ నానుడి ఉంది. హిమాలయ శిఖరాలు మంచుతో కప్పబడి ఉంటాయి, ఈ మంచుతో కప్పబడిన కొండల నుండి పారే ఎన్నో చిన్న చిన్న వాగులన్నీ ఒకటిగా కలిసి, ఓ ప్రవాహంగా మారి, ఆపై నదులుగా అవుతాయి. అందువల్లే వాళ్ళు హిమాలయం శివుని వంటిదనీ, కిందకు పారే ఈ వాగులను ఆయన జటాజూటాలనీ, అవే గంగానదిగా అయ్యాయని, అది నింగి నుండి భువికి దిగివచ్చిందని అంటారు. నింగి నుండి రావడమన్నది నిజమే, ఎందుకంటే మంచు ఆకాశం నుండే కురుస్తుంది.

ఇలాంటి ఉపమానాల నుండే గంగా నది కథ వచ్చింది. అలాగే, గంగ నింగి నుండి వచ్చింది కాబట్టి దాన్ని అత్యంత స్వచ్ఛమైన జలంగా పరిగణిస్తారు. అన్నింటికీ మించి, ఒక విధమైన ప్రదేశం గుండా ప్రవహించడం వల్ల గంగాజలానికి ఓ విధమైన గుణం వస్తుంది. 19 ఏళ్ల వయసు నుండి ప్రతి సంవత్సరం నేను ఒంటరిగా హిమాలయాలు ఎక్కేవాడిని. పెద్దగా వస్తు సామాగ్రి ఏమీ తీసుకోకుండా ఊరికే అలా వెళ్ళేవాడిని. నా దగ్గర కేవలం ఓ డెనిమ్ జీన్స్ ప్యాంటు ఇంకా ఓ మందపాటి టీ షర్టు మాత్రమె ఉండేవి. కాబట్టి ఎప్పుడూ చలికి వణుకుతూ ఆకలితో ఉండేవాడిని. ఇది చాలా సార్లు జరిగింది అదేంటంటే, కేవలం కొన్ని దోసిళ్ళ గంగాజలం తాగినప్పుడు, అది నన్ను నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు, ఎటువంటి అలసటా లేకుండా వెళ్ళగలిగేలా చేసింది. అలాగే చాలా మంది, గంగాజలం తాగినప్పుడు తమ రుగ్మతలు పోయాయని స్వయంగా నాతో చెప్పారు. మీకు తెలుసు కదా, భారతదేశంలో ఆఖరికి ఎవరన్నా చనిపోతున్నప్పుడు కూడా, కొద్దిగా గంగాజలం పోస్తారు.

గంగా జలం గొప్ప ప్రభావం చూపగలదు, అందుకు కారణం మీరు ఏదో నమ్మడం కాదు గానీ, అందుకు కారణం ఆ జలానికి ఉండే గుణం అటువంటిది. వాస్తవానికి ఈ నీటికి ఆ గుణాన్ని ఇచ్చేది హిమాలయాలు.

నదులకు జీవం ఉంటుంది


గంగా నదిని గురించిన కధ ఏంటంటే, దేవలోకాలలో ప్రవహించే ఈ నది, మన భూమి మీదకి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ తాకిడికి ప్రపంచం నాశనమయిపోయే అవకాశం ఉంది. కాబట్టి శివుడు ఆ ప్రవాహాన్ని తన తలపై ఒడిసిపట్టి, తన జటాజూటాల ద్వారా, హిమాలయ కొనల మీదుగా నెమ్మదిగా ప్రవహించేలా చేస్తాడు. ఈ విధంగా మాండలిక కధ ద్వారా, ప్రజలకు గంగా నది ఎంత ముఖ్యమైనదో, ఎంత పవిత్రమైనదో వివరించారు. భారతీయుని స్వచ్ఛతకు గంగా నది స్వచ్ఛత ఓ ఉపమానం(symbolism) అయ్యింది. మీరు గనక నదుల వద్ద ఎక్కువ కాలం గడిపితే, ప్రతి నదికీ తనదైన సొంత జీవం ఉంటుందని మీకు అర్థమవుతుంది. ఇది ప్రపంచంలో ప్రతీ చోటా వర్తిస్తుంది - అది ఈజిప్టులో ఉన్న నైలు నది అయినా, యూరప్ లో ఉన్న డానుబే నది అయినా, రష్యా ఇంకా మధ్య ఆసియా దేశాల గుండా ప్రవహించే వోల్గా నది అయినా, అమెరికాలోని మిస్సిసిపీ నది అయినా, లేదా దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది అయినా - అన్నింటికీ ఇది వర్తిస్తుంది. వాటిని కేవలం ఓ నీటి వనరులుగా మాత్రమే చూడరు. ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతులూ నదుల తీరాలలోనె ఉద్భవించి అభివృద్ధి చెందాయని మనకు తెలుసు, అందుకు కారణం కూడా మనకి స్పష్టంగా తెలుసు. కానీ నదులతో చాలా దగ్గరగా గడిపే వారి అనుభవంలో అది కూడా ఓ సజీవ ఉనికే. దానికి తనదైన వ్యక్తిత్వం ఉంటుంది, తనదైన భావావేశాలు, భావోద్వేగాలు, ఇంకా అనేక ఇతర లక్షణాలుంటాయి.

నది అనేది ఒక సజీవ ప్రక్రియ, గంగా నది విషయంలో కూడా ఇది వాస్తవమే. నాకు గంగా నది పుట్టుక ప్రదేశమైన గోముఖ్ వద్దకు వెళ్లే భాగ్యం దక్కింది. అలాగే దాని ఉపనదులయిన మందాకిని, అలకనంద, ఇంకా దాని ప్రధాన ఉపనది అయిన భాగీరథి వద్దకు కూడా వెళ్ళే భాగ్యం దక్కింది. హిమాలయాల పైన గంగా జలాలు స్వచ్ఛతకు ఇంకా పవిత్రతకు ప్రతీకలు, ఆపై గంగా నది కిందకి మెట్ట భూముల లోకి ప్రవహిస్తుంది, భారత దేశ ఉపఖండంలో ఉత్తరానా ఉన్న ప్రజలకు అదే జీవనాడి. కాల గమనంలో గంగానది, ఎన్నో ఎన్నో రాజుల వంశాలు రావడాన్నీ ఇంకా కనుమరుగవడాన్నీ చూసింది. దేశంలోని ఆ భాగంలోని ప్రజలకు, అది బలానికి ఇంకా అభ్యుదయానికి ఓ నిరంతర వనరుగా ఉంటూ వచ్చింది.

ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయిందంటే, మనం దాన్ని కేవలం ఓ వనరుగా చూస్తున్నాం, పైన హిమాలయాలలో డ్యాములు కట్టాము. ఇలా చేయటం గంగానదిని ఓ సజీవ మాతృమూర్తిగా ఇంకా దేవతగా చూసే అనేకమంది నొచ్చుకునేలా చేసింది. అలాగే కింద మైదానాల దగ్గరకు వచ్చేసరికి, అది భారీగా కలుషితం చేయబడుతుంది. గంగా నదిని మళ్లీ దాని పూర్తి స్వచ్ఛతకు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేనిప్పటికి 30 ఏళ్ల నుండి హిమాలయాలకు వెళుతున్నాను, నేను గమనించిందేంటంటే, అక్కడి మంచు పరిమాణంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు దట్టంగా మంచుతో కప్పబడి ఉండే శిఖరాలు, ఇప్పుడు మంచుతో కప్పబడటం లేదు. అవి ఉత్తగా, బల్లెం అంచులలా కనిపిస్తున్నాయి. దీని వల్ల గంగా నదికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. గోముఖ్ ప్రారంభంలోని హిమానీనదాలు(glaciers) కూడా చాలా వేగంగా తగ్గిపోతున్నాయి. ఓ ఆవు ముఖములా ఉంటుంది కాబట్టి దాన్ని గోముఖ్ అన్నారు. నాకు బాగా గుర్తుంది, ఆగష్టు 1981 లో నేను మొట్టమొదటి సారి అక్కడకి వెళ్ళినప్పుడు, ఈ గుహలో నుండి నీరు బయటికి ప్రవహించే ఆ ద్వారం, కేవలం 15 నుంచి 20 అడుగుల వెడల్పు మాత్రమె ఉండేది, అచ్చం ఆవు ముఖంలా కనిపించేది. ఇప్పుడది 200 అడుగుల వెడల్పు ఉంది. కావాలంటే ఓ అర మైలు దూరం వరకూ లోపాలకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు.

వాతావరణ మార్పు వల్ల గంగా నది పై భారీ ప్రభావం పడుతూ ఉంది. ఒకవేళ అది గనుక గంగానది ఉనికికి అంతరాయం కలిగించిందీ అంటే, భారతదేశంలోని ఉత్తర భాగంలో తరతరాలుగా గంగా నదినే జీవనాడిగా చేసుకుని బ్రతుకుతున్న ప్రజల జీవితాలలో ఓ పెద్ద విపత్తు చోటుచేసుకున్నట్టె.

గంగానదిని కాపాడాల్సిన ఆవశ్యకత



ప్రతీ సంస్కృతికీ, ప్రతి ఒక్కరికీ, ప్రతి నాగరికతకీ తమ ప్రజల జీవితాలలోని ఓ విభిన్న స్థాయి పవిత్రతను తీసుకురావడానికి, వారికి స్పూర్తినిచ్చేందుకు ఏదో ఓ చిహ్నం(symbolism) అవసరం. గంగానది అనాది కాలంగా ఆ పాత్రను పోషిస్తూ వచ్చింది, అలాగే కుంభమేళా సమయంలో, 8 నుండి 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఓ చోట చేరడం వల్ల, ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం ఈ నది ఒడ్డునే జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున మనుషులందరూ ఒకచోట సమావేశమవ్వడమనేది ప్రపంచంలో మరెక్కడా జరగదు. ఈ స్ఫూర్తి వెనుక ఉన్నది గంగా నది ఇంకా ఆ నది స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రతీక లేదా చిహ్నం చాలా ఆవశ్యకమైనది. కేవలం మన మనుగడ కోసం, మన అవసరాల కోసం మాత్రమే కాదు గానీ, మానవులలో స్ఫూర్తిని నింపడం కోసం ఈ నదిని కాపాడాలి, స్వచ్ఛంగా ఉంచాలి.

సంపాదకుడి సూచన: ఈ వీడియోలో, భారతదేశంలో నదులను ఎందుకు పూజిస్తారో సద్గురు వివరిస్తున్నారు.

    Share

Related Tags

శివుడు ఇంకా ఆయన పరివారం

Get latest blogs on Shiva

Related Content

శివుని అత్యంత భయానక రూపమైన కాలభైరవుని ప్రాముఖ్యత