సద్గురు: శివ పురాణం ప్రకారం, ఆదియోగి అయిన శివుడు తపస్వి. కపాలాలను ధరించి స్మశానాలలో సంచరించేవాడు. ఆయన చాలా ఉగ్రుడు, దగ్గరకి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలేది కాదు. దేవతలు ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందారు. "ఇలాగే కొనసాగితే, అతని శక్తి, ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రభావం చూపి, అందరూ తపస్వులుగా మారిపోతారు. ఇది జ్ఞానం పరంగానూ, విముక్తి పరంగా మంచిదే, కానీ మన గతేంటి? మన ఆట ముగిసిపోతుంది. ప్రజలు మనకు కావలసినవి అందించరు. మన ఆటలు సాగవు. మనం ఏదైనా చేయాలి" అని భావించారు.
చాలా బ్రతిమలాడి, బామాడి, ఎలాగో సతితో వివాహం జరిపించారు. వివాహం తర్వాత శివుడు పాక్షికంగా గృహస్థుడయ్యాడు. అతను కొన్ని సమయాల్లో బాధ్యతాయుతమైన గృహస్థుడిగా, కొన్నిసార్లు బాధ్యతారహితమైన తాగుబోతుగా, కొన్నిసార్లు సృష్టినే దహించివేసే కోపిష్టిగా, మరికొన్నిసార్లు అత్యంత ప్రశాంతంగా సృష్టికే ఓదార్పునిచ్చే వాడిగా, అతను అలా మారుతూనే ఉన్నాడు.
ప్రపంచానికి అవసరమైన విధంగా సతి అతన్ని పూర్తిగా అదుపు చేయలేక పోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల సతి దేహత్యాగం చేసింది. శివుడు మళ్ళీ మునుపటి కంటే తీవ్రంగా, పట్టుదలతో తపస్విగా మారాడు. ప్రపంచమంతా తపస్సులో మునిగిపోయే ప్రమాదం మరింత పెరిగింది. దేవతలు మళ్ళీ ఆందోళన చెందారు.
వారు మళ్ళీ శివుణ్ణి వివాహబంధంలో బంధించాలనుకున్నారు. అందుకోసం వారు జగన్మాతను ప్రార్థించగా, ఆమె పార్వతిగా జన్మించింది. ఏదో ఒక విధంగా శివుణ్ణి వివాహం చేసుకోవడం ఒక్కటే ఆమె జీవిత లక్ష్యం. పెరిగి పెద్దయ్యాక అనేక విధాలుగా శివుణ్ణి ఆకర్షించడానికి ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. చివరికి దేవతలు ఎలాగోలా శివుని మనసును మార్చడానికి మన్మథుని సహాయం తీసుకున్నారు. ఏదో ఒక మధుర క్షణంలో, మళ్ళీ గృహస్థుడైనాడు. అప్పటి నుండి శివుడు సన్యాసి ఇంకా గృహస్థు పాత్రలను అద్భుతమైన సమతుల్యతతో నిర్వహించాడు.
శివుడు పార్వతికి ఆత్మజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడు. ఎన్నో విచిత్ర, ఆంతరంగిక మార్గాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందే విధానాన్ని నేర్పాడు. పార్వతి పరమానందాన్ని పొందింది. కానీ, ఇది ఎవరికైనా, ఎల్లప్పుడూ జరిగే విధంగానే, ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత క్రిందికి చూసినప్పుడు, మొదట ఆనందంతో పొంగిపోతారు; తరువాత దయ ఉప్పొంగుతుంది. అప్పుడు దాన్ని పంచాలనుకుంటారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఎలాగైనా పొందాలని మీరు కోరుకుంటారు.
మహాశివరాత్రి నాడే శివపార్వతుల వివాహం జరిగింది. ఆదియోగి అయిన శివుడు బంధాల భయం లేకుండా తన పరమ వైరాగ్యాన్ని ప్రాపంచిక అభిరుచిలోకి మార్చుకున్న రోజు అది. ఈ అభిరుచే తన లోతైన జ్ఞానాన్ని, అవగాహనను పంచుకోవడానికి ఒక మార్గంగా మారింది.
పార్వతి ప్రపంచాన్ని చూసి శివునితో అన్నది, "మీరు నాకు నేర్పిన ఈ జ్ఞానం అద్భుతమైనది, ఇది ప్రతి ఒక్కరికీ చేరాలి. కానీ నాకు నేర్పిన విధానంలో ప్రపంచానికంతటికీ నేర్పడం సాధ్యం కాదని అర్థమవుతోంది. ప్రపంచానికి అందించడానికి వేరే పద్ధతిని రూపొందించాలి" అన్నది. అప్పుడే శివుడు యోగ విధానాన్ని ప్రతిపాదించడం మొదలుపెట్టాడు. ఏడుగురు శిష్యులను ఎంచుకున్నాడు, వారే ఇప్పుడు సప్తరుషులుగా కొనియాడబడుతున్నారు. అప్పటి నుండి ఆత్మజ్ఞానం పొందడానికి అందరికీ నేర్పగల ఒక శాస్త్రీయ పద్ధతిగా యోగ మారింది.
ఈ విధంగా శివుడు రెండు వ్యవస్థలను రూపొందించాడు - తంత్రం, యోగం. తన భార్య పార్వతికి తంత్రాన్ని నేర్పాడు. తంత్రం చాలా ఆంతరంగికమైనది, చిన్న చిన్న సమూహాలకు మాత్రమే నేర్పగలిగేది. కానీ యోగాన్ని పెద్ద సమూహాలకు నేర్పవచ్చు. ప్రస్తుత ప్రపంచానికి, ముఖ్యంగా నేటి కాలానికి ఇది చాలా అనువైనది. అందుకే ఈనాటికీ శివుడు మొదటి యోగ గురువు లేదా ఆదిగురువుగా పరిగణించబడుతున్నాడు.