logo
logo

శివ పురాణం – కథల ద్వారా విజ్ఞానం

శివ పురాణం - కథల ద్వారా విజ్ఞానం



శివపురాణం లోని విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రాలను, అందులో వివరించిన శక్తిమంతమైన సాధనాలతో మానవ పరిమితులను ఎలా అధిగమించాలో సద్గురు ఇలా వివరిస్తున్నారు ...

ప్రశ్న: సద్గురూ! మీరు శివునికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. మీరు జెన్ మాస్టర్ ల వంటివారి గురించి ఎక్కువ మాట్లాడరెందుకు?

సద్గురు: "శివ" అని సూచించబడుతున్న అనంతమైన ఈ శూన్యం, పరిమితిలేని నిరాకార స్వరూపం... దానికి మొదలూ, చివరా లేవు, అది శాశ్వతమైనది. అయితే మనిషి అవగాహన, రూపానికి పరిమితమైపోయింది కాబట్టి, మన సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఈ "శివ"త్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ, అగోచరమూ అయిన ఈశ్వరునిగా, మంగళకరుడైన 'శంభు’నిగా, అమాయకత్వం తో మనల్ని నిర్వీర్యులనిచేసే'భోళా శంకరునిగా', సకల వేదాలూ, శాస్త్రాలూ, తంత్రాలూ బోధించిన గొప్ప గురువు 'దక్షిణామూర్తి'గా, ఎవరినైనా ఇట్టే క్షమించేసే 'ఆశుతోషు'ని గా, ఆ సృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలముకున్న 'కాలభైరవుని'గా, ప్రశాంతతకు ప్రతిరూపమైన 'అచలేశ్వరుని'గా, బ్రహ్మాండ నృత్యకారుడైన 'నటరాజు'గా, ఇలా ఈ జీవితానికి ఎన్నెన్ని పార్శ్వాలుండగలవో అవన్నీ కూడా ఆయనకి ఆపాదింపబడ్డాయి.

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా 'దైవత్వం'గా ప్రజలు భావించే వాటినన్నిటినీ "మంచి" గా సూచిస్తారు. కానీ మీరు "శివపురాణం" చదివితే మీరు శివుణ్ణి మంచివాడనీ అనలేరు, చెడ్డవాడనీ అనలేరు. సర్వస్వమూ ఆయనే: ఆయనే కురూపీ, ఆయనే అత్యంత సుందరమూర్తీ; ఆయనే ఉత్తమోత్తముడూ, ఆయనే పరమదుష్టుడూ; ఆయనే నియమబద్దుడూ, ఆయనే తాగుబోతుకూడా. దేవతలూ, రాక్షసులూ మొదలు సమస్త జీవరాశులూ ఆయన్ని కొలుస్తాయి. శివుణ్ణి గురించి మనం జీర్ణించుకోలేని కథలనన్నిటినీ, నాగరికతగా పిలవబడేది, తుడిచిపారేసింది. కానీ శివతత్త్వమంతా అక్కడే ఉంది! జీవితంలో ఒకదానికొకటి విరుద్ధమైన పార్శ్వాలన్నీ శివుని వ్యక్తిత్వంలో నెలకొల్పబడ్డాయి. ఈ సమస్త సృష్టిలోని జటిలమైన లక్షణాల సమాహారాన్ని 'శివ' అనబడే ఈ వ్యక్తిలో ఎందుకు సమ్మేళితం చేశారంటే, ఈ ఒక్క మనిషిని మీరు పూర్తిగా అంగీకరించగలిగితే, మీరు ఈ జీవితాన్ని దాటేసినట్టే! అసలు జీవితంలో అందరికీ ఎప్పుడూ ఎదురయ్యే పెద్ద సమస్య ఏమిటంటే, ఏది మంచి, ఏది చెడు, ఏది సుందరం, ఏది కాదు, అన్నది నిర్ణయించ వలసి రావడం. జీవితం ఎంత సంక్లిష్టంగా ఉండగలదో, అంత సంక్లిష్ట లక్షణాల సమాహారమైన ఈ ఒక్క వ్యక్తిని గనక మీరు మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే, ఇక మరెవరితోనూ, మీకు ఎటువంటి సమస్యా ఎదురవదు.

శివపురాణం లోని కథల్ని గనక మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో మీకు సాపేక్ష సిద్ధాంతం, పరిమాణ యాంత్రిక శాస్త్రం (quantum Mechanics), అంతే కాదు ఆధునిక భౌతిక శాస్త్రమంతా ... కథల రూపంలో ఎంతో అందంగా చెప్పారని గ్రహిస్తారు. మనది తర్కంతో పెనవేసుకుపోయిన సంస్కృతి. విజ్ఞాన శాస్త్రాన్ని కథనాల ద్వారా చెప్పారు. ప్రతిదానికీ ఓ వ్యక్తిత్వం ఇవ్వబడింది. కాలక్రమంలో ఎక్కడో ఆ కథల్లోంచి శాస్త్రం విస్మరించబడి కథలు మాత్రమే కొనసాగించబడ్డాయి... ఆ కథలు కూడా ఒక తరం నుండి మరొక తరానికి, హాస్యాస్పదం అనిపించేంతలా, అతిశయోక్తులతో చిలవలు-పలవలుగా అల్లబడ్డాయి. ఆ కథల్లోకి విజ్ఞానాన్ని తిరిగి జొప్పించగలిగితే, శాస్త్రాన్ని మళ్ళీ ఎంతో అందంగా చెప్పవచ్చు.

మానవ ప్రకృతినిలోని చేతనని ఉత్కృష్ట శిఖరాలకి తీసుకువెళ్ళ గల మహోన్నతమైన విజ్ఞాన ఖనియైన ఈ శివపురాణం, అందమైన కథలుగా చెప్పబడింది. యోగం అనేది ఎటువంటి కథల ఆధారం లేకుండా ఒక శాస్త్రంగా చెప్పబడింది. కానీ మీరు కొద్దిగా తరచి చూస్తే, శివపురాణమూ, యోగ శాస్త్రమూ అవిభాజ్యమన్న విషయం ప్రస్ఫుటమౌతుంది. ఒకటి కథలంటే మక్కువున్న వారికీ, రెండవది ప్రతి విషయాన్నీ శాస్త్రీయ దృక్పథంతో మాత్రమే చూసి తెలుసుకోవాలనుకునే వారికీ. రెండింటిలోనూ మౌలిక విషయాలు ఒక్కటే.

ఆధునిక విద్యావిధానపు రీతుల గురించి శాస్త్రవేత్తలిప్పుడు ఎన్నో పరిశోధనలు జరుపుతున్నారు. అందులో వారు తెలుసుకున్న ఒక విషయమేమిటంటే, 20 ఏళ్ల పాటు ఒక పిల్లవాడు ఈనాటి విద్యావిధానంలో చదువుకుని బయటకు వస్తే, ఆ పిల్లవాని వివేచనశక్తి చాలవరకు తిరిగి కోలుకోలేనంతగా నాశనమైపోతుందని. ఇంకో మాటలో చెప్పాలంటే, అతనొక విషయ పరిజ్ఞానంగల మూర్ఖునిగా బయటకొస్తాడు! అందుకే ఈ శాస్త్రవేత్తలిప్పుడు ఆటపాటల ద్వారా, కథా-కథనాల ద్వారా విద్యాబోధన చేయమని సలహా ఇస్తున్నారు. ఈ దిశగా చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ, స్థూలంగా ప్రపంచంలోని విద్యా విధానం చాలవరకు వివేకాన్ని అణచేదిగానే కొనసాగుతోంది. ఒక క్రమ పద్ధతిలో అందివ్వకపోతే, ఎక్కువ సమాచారం అందించడం వివేచనని అణచివేస్తుంది! ఆ పద్ధతుల్లో కథారూపకమైన బోధన ఉత్తమమైనది. మన సంస్కృతిలో చేసినది సరిగ్గా అదే. గహనమైన వైజ్ఞానిక కోణాలను సైతం చక్కని కథలరూపంలో అందజేసారు.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

శివుని సాన్నిధ్యం