శివుడు ఎవరు? భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ వ్యక్తి చుట్టూ ఎన్నో కధలు, పురాణాలూ ఉన్నాయి. ఆయన దేవుడా? లేక భారతీయ సంస్కృతి చేసిన సంయుక్త కల్పనా? లేక దాన్ని అన్వేసిస్తున్న వారికి మాత్రమే అర్థం అయ్యేలా ‘శివ’ అనేదానికి ఇంకా లోతైన అర్థం ఏదైనా ఉందా?
సద్గురు: సద్గురు “శివ” అన్నప్పుడు మనం రెండు ప్రాధమికమైన అంశాల గురించి మాట్లాడుతున్నాము. “శివ” అనే పదానికి భాషా పరంగా“ఏది లేదో అది” అని అర్థం. నేడు ఆధునిక విఙ్ఞాన శాస్త్రం కూడా అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తున్నది. ఈ సృష్టి మూలం, ఈ విశ్వ మౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే. ఈ నక్షత్ర మండలాలు కేవలం చల్లిన నీటి తుంపర లా, దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యమే, దీనినే శివ అంటారు. అంటే అదే గర్భం, ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దానిలోనే లయమై పోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి.
ఇందువల్లే శివుణ్ణి అస్తిత్వం ఉన్నవానిగా కాక అస్తిత్వం లేనివానిగా వర్ణిస్తారు.
శివుణ్ణి వెలుగుగా కాకుండా చీకటిగా వర్ణిస్తారు. మానవాళి వెలుగును ఎంతో గొప్పగా ప్రశంసించడానికి కారణం, వారు చూడటానికి ఉపయోగించే కళ్ళ గుణం అలా ఉంది కాబట్టి. కానీ, నిరంతరం ఉండేది చీకటి మాత్రమే. వెలుగు అనేది ఒక తాత్కాలికమైన ఘటనే అవుతుంది. ఈ వెలుగుకి మూలం ఏదైనా సరే– ఒక లైట్ బుల్బ్ లేక సూర్యుడు – ఏవైనా, కాలంతో పాటు వెలుగునిచ్చే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. వెలుగు శాశ్వతమైనది కాదు. అది ఒక పరిమితమైన ఘటనే, ఎందుకంటే అది కొద్ది కాలముంటుంది ఆ తరవాత ముగిసిపోతుంది. వెలుగులో కంటే చీకటిలోనే ఓ గొప్ప సాధికారత దాగుంది. చీకటి అన్ని చోట్లా ఉంటుంది. అంతా నిండి ఉంది ఒక్క చీకటే.
కాని నేను “దివ్యమైన చీకటి” అంటే, నేను క్షుద్ర పూజ చేసేవాడిననో లేదా మరొకటో అనుకుంటారు. వాస్తవానికి కొన్నిపశ్చిమ దేశాల్లో శివుడు ఒక దెయ్యమనే ప్రచారం జరుగుతోంది! కాని మీరు దీనిని సిద్ధాంతపరంగా గమనిస్తే ఈ సృష్టి పరిణామం, అది ఎలా జరిగిందనే దాని గురించి ఈ భూమి మీద ఇంతకన్నా తెలివైన సిద్ధాంతం మరొకటి లేదు. “శివ” అనే మాట వాడకుండా సాంకేతిక పదాల ద్వారా ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని శాస్త్రజ్ఞులతోనూ నేను ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, “నిజామా? ఇది ముందే తెలుసుకున్నారా? ఎప్పుడు?” అని. మనకు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలుసు. భారతదేశంలోని ప్రతి పల్లెటూరు బైతుకు కూడా అనాలోచితంగా ఈ విషయం తెలుసు. దాని వెనుక ఉన్న విఙ్ఞానం తెలియకుండానే అతను దాని గురించి మాట్లాడతాడు.
మరి ఇంకోస్థాయిలో మనం “శివ” అన్నప్పుడు మనం ఒక యోగి గురించి, మొట్టమొదటి యోగి లేక ఆదియోగి గురించి, అలాగే మొట్టమొదటి గురువు లేక ఆది గురువు గురించి మాట్లాడుతున్నాము. ఈ రోజున మనం యోగ అనే దానికి మూలమైన వారి గురించి మాట్లాడుతున్నాము. యోగ అంటే తల్లక్రిందులుగా నుంచోటమో లేక శ్వాసను బిగపట్టి ఉంచటమో కాదు. ఈ సృష్టి ఎలా జరిగిందనే దాని ప్రాధమిక స్వభావం తెలుసుకోవటానికి, దాన్ని అత్యున్నత స్థాయికి (సంభావ్యతకు) ఎలా తీసుకువెళ్ళవచ్చో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానమే యోగ.
యోగ శాస్త్ర బోధన మొట్ట మొదటిసారిగా కాంతి సరోవరమనే సరస్సు ఒడ్డున జరిగింది. ఇది హిమాలయాల్లో కేదార్ నాథ్ కు కొన్ని మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ ఆది యోగి ఈ అంతర్గత పరిజ్ఞానాన్ని మనం ఈ రోజు సప్త ఋషులుగా కీర్తించే తన మొదటి ఏడుగురు శిష్యులకు విధి విధానంగా నేర్పించారు. ఇది మతాలన్నీ పుట్టక మునుపే జరిగింది. మానవాళిని (మళ్ళీ ఒక్కటిగా చేయలేని విధంగా) విడగొట్టటానికి మార్గాలు సృష్టించకముందే, మానవ చైతన్యాన్ని పెంచటానికి అవసరమైన శక్తివంతమైన సాధనాలను సాక్షాత్కరింప చేసుకుని, నేర్పించటం జరిగింది.
అంటే ......“శివ” అంటే “అస్తిత్వం లేనిది” అనీ, అలాగే ‘ఆదియోగి’, అని కూడా సూచిస్తుంది. ఎన్నో విధాలుగా అవి రెండు కూడా పర్యాయ పదాలు. ‘ఆదియోగి’ అయిన ఈ వ్యక్తి, ‘విశ్వానికి ఆధారమైన అస్తిత్వం లేని వాడూ’, ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే ఎవరినైనా ‘యోగి’ అనాలంటే, అతను ‘ఈ సృష్టి మొత్తం తానే’ అని అనుభూతి చెంది ఉండాలి. ఈ విశ్వాన్నంతా మీలో భాగంగా ఒక్క క్షణం అయినా అనుభూతి చెందాలంటే మీరు ఆ శూన్యమై పోవాలి. శూన్యమే అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుంది. ఇక వేరేదేదీ, అన్నింటినీ తనలో ఇముడ్చుకోలేదు. ఒక పాత్ర ఈ సముద్రాన్ని తనలో ఇముడ్చుకోలేదు. కానీ, ఈ గ్రహం సముద్రాన్ని తనలో ఇముడ్చుకోగలదు. మళ్లీ అదే గ్రహం ఈ సౌర వ్యవస్థను తనలో ఇముడ్చుకోలేదు. మళ్ళీ అదే సౌర వ్యవస్థ తనలో ఈ గ్రహాలను, సూర్యుడ్ని ఇముడ్చుకోగలదు కాని మిగతా పాల పుంతను తనలో ఇముడ్చుకోలేదు. ఇలా మీరు స్థాయిని పెంచుకుంటూ పోతే అన్నిటినీ తనలో ఇముడ్చుకోగలిగేది శూన్యం మాత్రమే. “యోగ” అనే పదానికి అర్థం “ఐక్యత”. ఈ ఐక్యతను అనుభూతి చెందిన వారే యోగి అవుతారు. అంటే కనీసం ఒక్క క్షణమైనా అతను శూన్యాన్ని అనుభూతి చెందాలి.
“ఏది కాదో అదే” అని మనం శివుని గురించి అన్నప్పుడు, శివుణ్ణి ఒక ‘యోగి’ అన్నప్పుడు, ఓ విధంగా అవి రెండు పర్యాయ పదాలే అయినా, అవి రెండు విభిన్నమైన అంశాలు. భారతదేశం తార్కిక సంస్కృతి కనుక దీన్నుంచి దానికి మనం తేలికగా మారిపోతాము. ఒక క్షణం మనం శివ అంటే పరమోన్నతమైంది అంటాము, మరు క్షణమే మనం శివ అంటే ఈ యోగా ప్రక్రియను మనకు అందించిన వ్యక్తి అని మాట్లాడుకుంటాము.
దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో అందరికీ శివుడంటే భారతీయ క్యాలెండర్ చిత్రపటంగా మాత్రమే పరిచయం అయ్యారు. ఆయన్ని బూరె బుగ్గల వానిగా, నీలవర్ణునిగా చూపిస్తారు ఎందుకంటే ఆ క్యాలెండర్ కోసం బొమ్మ గీసిన కళాకారుడికి ఒక్క ముఖం గీయటమే తెలుసు. కృష్ణుడ్ని గీయమని అడిగితే ఆ చేతిలో ఒక వేణువు పెడతాడు. రాముడ్ని గీయమని అడిగితే చేతిలో ఒక ధనుస్సు ఉంచుతాడు. శివుణ్ణి అడిగితే తలమీద ఒక చంద్రుణ్ణి ఉంచుతాడు, అంతే తేడా! ఈ కాలెండర్లు చూసిన ప్రతిసారి నేను ఎప్పుడూ, ఏ చిత్రకారునితోనూ పని చేయకూడదని అనుకుంటాను. ఫోటోగ్రాఫర్లు పర్వాలేదు – మీరు ఎలా ఉంటే అలా ఫోటోలు తీస్తారు. మీరు ఒక దెయ్యంలా ఉంటే అలానే కనిపిస్తారు. శివుడు లాంటి ఒక యోగి బూరె బుగ్గలతో ఎందుకు ఉంటాడు? ఆయన్ని సన్నగా, పీక్కుపోయినట్లు చూపిస్తే పర్వాలేదు కాని శివుడు బూరె బుగ్గలతో ఎలా ఉంటాడు?
యోగ సంప్రదాయంలో శివుణ్ణి ఒక దేవుడిగా చూడరు. ఆయన, హిమాలయ ప్రాంతంలో నివసించినవాడు, ఈ భూమి మీద నడచినవాడు. యోగ పరంపరకు మూలంగా ఆయన మానవ చైతన్యానికి చేసిన సహాయం అద్భుతమైనది, విస్మరించలేనిది! ఈ మానవ వ్యవస్థ ఎన్ని విధాలుగా పరమోత్తమ స్థాయికి తీసుకురావచ్చో ఆ సాధానాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే అణ్వేషించబడ్డాయి. అది నమ్మలేనంత అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలో వారు అంత నాగరికత ఉన్నవారా అనేది అసంబద్దమైనది, ఎందుకంటే ఇది ఒక నాగరికత నుండో, లేక ఒక ఆలోచనా విధానం నుండో వచ్చింది కాదు. ఇది ఆత్మసాక్షాత్కారం నుండి ఉద్భవించింది..! ఇది ఆయన చుట్టూ ఏం జరుగుతుందనే దాని ఆధారంగా వచ్చింది కాదు. అది ఆయన అభివ్యక్తీకరణమే. మానవ యాంత్రికతలోని ప్రతీదాని అర్థమేమిటి , దానితో ఏం చేయవచ్చో ఆయన ఎంతో వివరంగా చెప్పారు. దాంట్లోనుంచి నేటికి కూడా మనం ఒక్కటీ మార్చలేం ఎందుకంటే ఆయన చెప్పగలిగినదంతా ఎంతో అందంగా, తెలివైన విధంగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఓ జీవితకాలం గడపవచ్చు.