logo
logo

ఆదియోగి - మొట్టమొదటి యోగి

సద్గురు ఇస్తున్న ఈ స్పష్టమైన వివరణలో, మనం మానవాళికి యోగాను పరిచయం చేసిన మొట్టమొదటి యోగి అయిన ఆదియోగి గురించి తెలుసుకుందాం.

ఆదియోగి - మొట్టమొదటి యోగి



సద్గురు ఇస్తున్న ఈ స్పష్టమైన వివరణలో, మనం మానవాళికి యోగాను పరిచయం చేసిన మొట్టమొదటి యోగి అయిన ఆదియోగి గురించి తెలుసుకుందాం.

సద్గురు: యోగ సంప్రదాయంలో శివుణ్ణి ఓ దేవుడిగా చూడరు, ఆయన్ని యోగాకు మూలకర్త అయిన ఆదియోగిగా లేదా మొట్టమొదటి యోగిగా చూస్తారు. మానవజాతికి దీన్ని మొట్ట మొదట అందించినది ఆయనే. యోగా సాంప్రదాయం ప్రకారం, సుమారు 15 వేల ఏళ్ళ క్రితం, శివుడు పూర్తి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. తనలోని పారవశ్యం, ఆయనకి కొద్దిగా కదిలే అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఆయన తాండవం చేస్తాడు. అలా పరవశంతో హిమాలయాలలో తాండవం చేస్తూ తనని తాను మైమరచిపోతాడు. ఆయన పారవశ్యం కదలికకు అతీతమైనదైనప్పుడు, ఆయన పూర్తిగా నిశ్చలుడు అవుతాడు.

ప్రజలు, ఇదివరకు ఎవరికీ తెలియని దేన్నో, అలాగే వాళ్ళకసలు అంతుపట్టనిదాన్ని ఆయన అనుభూతి చెందుతున్నాడని గమనిస్తారు. ప్రజలలో ఆసక్తి పెరిగి, అదేంటో తెలుసుకుందామని వచ్చి వేచి చూస్తుంటారు. శివుడు, అయితే తీక్షణమైన తాండవం చేస్తుంటాడు, లేదంటే పూర్తి నిశ్చలతలో ఉంటాడు. మిగతా వారక్కడికి వచ్చారన్నది కూడా పట్టించుకోడు, తన చుట్టూ జరుగుతున్నదాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోడు. దాంతో కొంత కాలం వేచి చూశాక, అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు...



ఒక్క ఏడుగురు తప్ప.

ఈ ఏడుగురు మాత్రం, ఆయనలో ఉన్నది ఏంటో తెలుసుకోవాలనే పట్టు వదలరు, కానీ శివుడు వాళ్లని విస్మరిస్తాడు. వాళ్లు ఆయన్ని వేడుకుంటారు, ప్రాధేయ పడతారు, “దయచేసి తెలపండి, మీకు తెలిసినది మేం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం” అంటారు. అందుకు శివుడు, “మూర్ఖులారా, ప్రస్తుతం మీరు ఉన్న విధానాన్ని బట్టి, లక్ష సంవత్సరాలకైనా మీరిది తెలుసుకోలేరు. ఇది తెలుసుకోవాలంటే అందుకు కావాల్సిన సంసిద్దత ఎంతో ఉంది. ఇది వినోదం కాదు” అని వారిని విస్మరిస్తాడు.

ఇక వాళ్ళందు కోసం సిద్ధం అవ్వటం మొదలు పెడతారు. రోజులు, వారాలు, సంవత్సరాలు గడుస్తాయి, ఈ ఏడుగురు తమని తాము సన్నద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇలా 84 ఏళ్ళు సాధన చేసిన తర్వాత, సూర్యుడు దక్షిణాయణంలోకి ప్రవేశించిన తరువాత వచ్చిన పౌర్ణమి రోజున, ఆదియోగి ఈ ఏడుగురిని చూసినప్పుడు, వాళ్లు తెజోపాత్రులుగా, దాన్ని అందిపుచ్చుకునేందుకు తగినంత పరిపక్వత పొందిన వారిగా కనబడతారు. ఆయన వాళ్లని ఇక ఏమాత్రం విస్మరించలేకపోతాడు. వాళ్ళు ఆయన దృష్టి తమపై పడేలా తయారవుతారు.

కాంతి సరోవరం వద్ద ఉన్న సద్గురు



ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఆయన వాళ్లని నిశితంగా పరిశీలిస్తాడు. ఆ తర్వాతి పౌర్ణమి రోజున, ఆయన ఒక గురువుగా మారడానికి నిర్ణయించుకుంటాడు. ఆదియోగి తనని తాను ఆదిగురువుగా మార్చుకుంటాడు; మొట్ట మొదటి గురువు పుట్టిన ఆ రోజునే ఇప్పుడు మనం గురుపౌర్ణమి అంటాము. కేదార్నాథ్ కి కొద్ది కిలోమీటర్ల పైన ఉన్న కాంతి సరోవర తీరాన, మానవ జాతిపై తన అనుగ్రహాన్ని ప్రసరింపజేసేందుకు ఆయన దక్షిణానికి తిరుగుతాడు, ఇక అప్పుడు ఈ ఏడుగురికి యోగశాస్త్రాన్ని అందించడం అనేది మొదలవుతుంది. యోగ శాస్త్రం అంటే అది మీరు క్లాసులో తెలుసుకునే శరీరాన్ని ఎలా వంచాలన్నది కాదు - అది ప్రతి పిల్లాడికీ తెలుసు, లేదా ఊపిరి ఎలా బిగబట్టాలన్నది కాదు - అది ప్రతి గర్భస్థ శిశువుకీ తెలుసు. మానవ వ్యవస్థ పూర్తి యంత్రాంగాన్ని తెలుసుకోవడం కోసం, ఓ శాస్త్రం ఇది.

చాలా ఏళ్ళ తర్వాత, ఈ యోగాని అందజేయడమనేది పూర్తయ్యాక, అది పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందిన ఏడుగురిని తయారుచేస్తుంది - వారే నేడు మనం సప్త ఋషులుగా పూజిస్తాం ఇంకా ప్రశంసిస్తాం. శివుడు ఈ ఏడుగురిలోని ఒక్కొక్కరిలో వేరు వేరు యోగ అంశాలను పొందుపరుస్తాడు, ఇక ఈ అంశాలే యోగ యొక్క ఏడు ప్రధాన పద్ధతులుగా అయ్యాయి. ఈ రోజుకీ కూడా, యోగాలో ఈ ఏడు భిన్నమైన పద్ధతులనూ కొనసాగించడం జరుగుతుంది.

సప్త ఋషులకు యోగశాస్త్రాన్ని అందజేయడం



ఆ తర్వాత, మనిషికి తన ప్రస్తుత పరిమితులకు ఇంకా నిర్బంధతలకు అతీతంగా పరిణితి చెందిగలిగే సాధికారతనిచ్చే ఈ పార్శ్వాన్ని ప్రపంచానికి అందజేయడానికి, శివుడు ఈ సప్తర్షులను ఏడు వేరువేరు దిశలలో ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు పంపుతాడు. ఒక మనిషి ఇక్కడ స్వయంగా ఆ సృష్టికర్తగా ఉండడం ఎలానో తెలిపే ఈ జ్ఞానాన్ని ఇంకా సాంకేతికతను ప్రపంచానికి అందజేస్తూ, వాళ్లు శివునిలో భాగం అవుతారు. కాలం గడిచే కొద్దీ ఎన్నో విషయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, కానీ ఆయా ప్రదేశాల సంస్కృతులను నిశితంగా పరిశీలిస్తే, వీరు చేసిన పని తాలూకు అంశాలు ఇప్పటికీ సజీవంగా ఉండడాన్ని మనం చూడొచ్చు. అదెన్నో రంగులు, రూపాలు తీసుకుంది, దాని ఛాయ కొన్ని లక్షల విభిన్నమైన విధాలుగా మారింది, కానీ వీరు చేసిన పని తాలూకు అంశాలు ఇప్పటికీ కనబడతాయి.

ఒక మనిషి తన జాతికున్న నిర్ణీతమైన పరిమితుల్లోనే ఉండాల్సిన అవసరం లేదన్న ఈ సంభావ్యతను ఆదియోగి తీసుకువచ్చారు. భౌతికతలో ఉంటూనే, దానికి చెందని వారిగా ఉండేందుకు ఓ మార్గం ఉంది. ఈ శరీరంలో ఉంటూనే, ఈ శరీరంగా మాత్రమే జీవించకుండా ఉండేందుకు ఓ మార్గం ఉంది. మీ మనసుని వీలైనంత అత్యుత్తమ స్థాయిలో ఉపయోగించుకుంటూ కూడా, మనసు తాలూకు బాధలను ఏమాత్రం అనుభూతి చెందని వారిగా ఉండేందుకు ఓ మార్గం ఉంది. ప్రస్తుతం మీరు ఈ ఉనికిలోని ఏ పార్శ్వంలో వున్నా సరే, మీరు దానికి అతీతంగా - మరో విధంగా జీవించే మార్గం ఉంది. ఆయన, “మీపై మీరు తగినంత కృషి చేస్తే, మీరు మీ ప్రస్తుత పరిమితులకు అతీతంగా పరిణితి చెందొచ్చు” అన్నారు. ఆదియోగి ప్రాముఖ్యత అదే.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

మనకి తెలీని శివుడు : స్థూలం నుండి సూక్ష్మానికి