మానవ పరిమితులకు లోనై ఉండిపోనక్కరలేదన్న సంభావ్యతను ఆదియోగి మన ముందుకు తీసుకు వచ్చారు. భౌతికత్వంలో ఉండేదుకు ఒక మార్గం ఉంది, కానీ భౌతికానికి చెందాల్సిన పని లేదు. దేహంలో వసిస్తునే, మీరే దేహం కాకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అదే విధంగా మెదడును ఉన్నత స్థాయిలో ఉపయోగిస్తూనే, , మనస్సు పెట్టే బాధలు తెలియకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది.
మీరు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా, మీరు దానిని దాటి వెళ్లవచ్చని, అక్కడ మరొక రకమైన జీవన విధానం ఉందని ఆయన చెప్పారు. ‘మీరు సాధన చేస్తే, మీ ప్రస్తుత పరిమితులను దాటి వెళ్ళవచ్చని’ ఆయన చెప్పారు. మరి అలా పరిణితి చెందడానికి పద్ధతులను కూడా ఆయన ఇచ్చారు, అదే ఆదియోగి విశిష్టత.
నేను చనిపోక ముందే, మానవాళికి ఆయన చేసిన ఉపకారం ప్రపంచమంతా గుర్తించాలన్నది నా అభిమతం. వివిధ స్థాయిలలో మేము ఈ పనిని చేస్తున్నాము.. అందులో ఒకటిగా, మేము ఆదియోగి మందిరాలు కడుతున్నాము. 21 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం దాని ముందు ప్రతిష్టీకరింపబడిన లింగం ఉంటుంది. అది ఎంతో శక్తి వంతమైన స్థానము. అందులో మొదటిది అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో, మా ఆశ్రమంలో, ప్రతిష్ఠింపబడింది.
భూమి మీద ప్రతి ఒక్కరూ ఈ శాస్త్రాన్ని ప్రపంచానికి ఇచ్చింది ఆయనేనని తెలుసుకోవాలి. గత ఐదు, ఆరు ఏళ్లలో యూరోప్ లో నాలుగు పెద్ద పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. యోగా భారతదేశం నుంచి రాలేదని వారు అంటున్నారు. యూరోప్ దేశాలలో చేసే కొన్ని శారీరక కసరత్తుల పరిణామం అది అని అంటున్నారు. అలాగే మరో పది పదిహేను పుస్తకాలు వస్తే అదే వాస్తవంగా ముద్రించబడుతుంది. మీరు మీ పాఠ్యపుస్తకాలలో చరిత్ర గురించి ఏం చదివారో అదే మీరు వాస్తవం అని నమ్ముతారు. అది వాస్తవం కాదు అని నేను చెబుతున్నాను. అది కేవలం ఏదో చెడు ఉద్దేశం ఉన్నవారిచే చేయబడింది. అలాగే మరో ఇరవయ్యో, ఏభయ్యో పుస్తకాలు మరో పదిహేను ఏళ్ళలో వస్తే, ఆ తర్వాత అందరూ అది అమెరికాలోని, కాలిఫోర్నియాలోనే కనిపెట్టింది, లేక ‘మదొన్నా’ కనిపెట్టింది అంటారు. ఇదేమి హాస్యం కాదు, అది చాలా చాలా తేలిగ్గా చేయవచ్చు. ఎలాగైనా రాయటానికి సిద్ధపడిన రచయితలు కొందరున్నారు. కొన్ని చాలా ప్రసిద్ధమైన పుస్తకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. డాన్ బ్రౌన్ తన ‘ఏంజిల్స్ అండ్ డెమన్స్’ అనే పుస్తకంలో, యోగా ప్రాచీన బౌద్ధ కళ అని వ్రాశారు. గౌతముడు వచ్చి 2500 సంవత్సరాలయింది ఆది ఆదియోగి 15000 సంవత్సరాలకు పూర్వం వాడు.
మరి ఇప్పుడు మీరు బుద్ధుడు యోగా కనిపెట్టాడు అన్నారు. రేపు ‘మదొన్నా’ అని కూడా మీరు అనవచ్చు. మీరు అలా కొన్ని పుస్తకాలు రాస్తే అదే వాస్తవం అయిపోతుంది. అందుకే నేను చనిపోక ముందే, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యోగా తీసుకువచ్చింది ఆదియోగి అని, ఆయన తప్ప మరెవరో కాదని నిర్ధారణ చేయాలన్న సంకల్పంతో ఉన్నాను.
మనం ఇలా చేయాలి, ఎందుకంటే భారతీయ విధానం ఏమిటంటే మనం నమ్మేవారము కాదు, మనం అన్వేషించేవారము. ఆ ఒక్క విషయమే మనల్ని ఒకటిగా పట్టి ఉంచింది. ఈ దేశంలో మీరు ఒక వంద కిలో మీటర్లు ప్రయాణం చేస్తే ప్రజలు భిన్నంగా కనపడతారు. వారు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. తినే విధానం వేరుగా ఉంటుంది. అంతా భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు పాలనాపరంగా కూడా ఇక్కడ రెండు వందలకు పైగా దేశాలు ఉండేవి. అయినా బయటివారు దీనిని హిందూదేశము అనేవాళ్ళు లేక భారతదేశం అనేవాళ్ళు. దానికి కారణం ఇక్కడి వారిలోని వైవిధ్యం, ఎందుకంటే వారు అన్వేషకుల అంతేగాని నమ్మకస్తులు కాదు.
రాముడు ఏమి చెప్పాడో, కృష్ణుడు ఏమి చెప్పాడో, వేదాలు లేక ఉపనిషత్తులు ఏమి చెప్పాయో అదంతా ముఖ్యం కాదు. ఎవరు చెప్పారో ముఖ్యం కాదు, అయినా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషీ తన వాస్తవాన్ని, తానే తెలుసుకోవాలి. మీ ముక్తిని మీరే పొందాలి. ఎందుకంటే ఇక్కడి వారు అన్వేషకులు. ఎప్పుడూ యుద్ధాలు చేసి జయించిన వారు కాదు. మీరు ఈ భూమి మీద మానవాళినంతా, మీరు ఈ భూమి మీద వారందరినీ, నమ్మకస్తులుగా కాక అన్వేషకులకు చేస్తే, అప్పుడిక దండయాత్రలు ఉండవు. దండయాత్రలు చేసేందుకు అసలు విషయమే ఉండదు. ప్రజలు చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవచ్చు, కానీ పెద్ద పోరాటం ఉండదు. నేను ఇది నమ్ముతాను, నువ్వు మరొకటి నమ్ముతావు, అదే ఎడతెరిపిలేని ఘర్షణ.
మీకు ఈ విశ్వం యొక్క స్వభావం తెలియకపోతే, ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్న విధంగా, మీరుయుద్ధం చేసేది దేనికోసం? ‘‘లేదు, విశ్వంలో మా దేవుడు మీ దేవుడు కన్నా గొప్పవాడు’’ అదే సమస్య. అన్వేషకుడు అంటే తనకు తెలియదని ఎవరు తెలుసుకుంటారో అతని అన్వేషకుడు. మానవాళికి ఈ ఒక్కటి జరిగితే, యుద్ధానికి కారణాలు 90 శాతం వరకు సమసిపోతాయి. అందువల్ల దీనిని తిరిగి తీసుకురావడానికి ఆదియోగి నుంచి వచ్చిన స్ఫూర్తి కన్నా మిన్న మరోకటేమిలేదు.
అందుకే మేము ఆయనను అనేక రూపాలలో తీసుకు వద్దాం అనుకుంటున్నాము.