logo
logo
adiyogi

శివుని మూడవ కంటి కథ, ఇంకా ఆ చిహ్నం వెనుక దాగి ఉన్న విషయం

సద్గురు, శివుని మూడవ కన్ను దేనిని సూచిస్తుంది అన్న దాని గురించి వివరిస్తున్నారు. అలాగే మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు స్పష్టత ఇంకా అవగహానా సామర్ధ్యాలు జాగృతం అవుతాయని కూడా వివరిస్తున్నారు. శివుడు మూడవ కంటితో కామాన్ని ఎలా దహించాడో చెప్పే కథని కూడా వివరిస్తున్నారు.

సద్గురు:

శివుడు తన మూడవ కంటిని తెరవడానికి గల కారణం


శివుడు తన మూడవ కంటిని తెరవడం గురించి ఒక కథ ఉంది. భారతదేశంలో, ప్రేమ ఇంకా కామానికి ఒక దేవుడు ఉన్నాడు, అతని పేరు కామదేవుడు. కామ అంటే కామం. కామం గురించి, చాలా వరకూ ప్రజలు సూటిగా వ్యవహరించడానికి ఇష్టపడరు. మీరు దానిలో కొంత కళాత్మకత ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు దాన్ని ‘ప్రేమ’గా చేస్తారు. కథలో ఏం జరుగుతుందంటే, కామ దేవుడు చెట్టు వెనక దాక్కొని, శివుని హృదయంలోకి మన్మథ బాణాన్ని విసురుతాడు. దాంతో శివునికి కొంచం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శివుడు, జ్వలించే తన మూడవ కంటిని తెరిచి, కాముడిని కాల్చి బూడిద చేస్తాడు. సాధారణంగా అందరికీ చెప్పే కథ ఇది.

కానీ దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, కామం మీలో పుడుతుందా, లేదా ఒక చెట్టు వెనకాల పుడుతుందా? కచ్చితంగా అది మీలోనే పుడుతుంది. కామం అనేది వ్యతిరేక లింగం(స్త్రీ-పురుషుల) గురించే కాదు. ప్రతి కోరికా కూడా కామమే - అది శృంగారం గురించి అయినా, అధికారం గురించి అయినా, లేదా పదవి గురించి అయినా. కామం అంటే ప్రాథమికంగా ఏంటంటే, మీలో ఒక అసంపూర్ణ భావన ఉందీ అని. “నాకు అది లేకపోతే, నేను సంపూర్ణం కాదు” అనే భావనతో తపించిపోవడం అన్నమాట.

శివుని మూడవ కన్ను: యోగా కోణంలో


దీని ఆధారంగా, శివునికి ఇంకా కామ దేవునికి సంబంధించిన ఈ కథకి (యోగాకు సంబంధించిన) ఒక కోణం ఉంది. శివుడు యోగం దిశగా కృషి చేస్తూ ఉన్నాడు. అంటే అతను కేవలం పరిపూర్ణత్వం కోసం మాత్రమే కాదు, అతను అపరిమితత్వం కోసం కృషి చేస్తున్నాడు. శివుడు తన మూడో కంటిని తెరిచినప్పుడు, కాముడు, అంటే తన సొంత కామ వాంఛ పెరగడాన్ని చూసి, దాన్ని దహించాడు. మెల్లగా అతని శరీరంలోనుంచి బూడిద బయటకి వచ్చింది. లోపల ఉన్న ప్రతిదీ కూడా, మంచికే అంతమొందింపబడింది అని ఇది తెలియజేస్తుంది. మూడవ కన్ను తెరవడం ద్వారా, తాను తనలో భౌతికతకి అతీతమైన ఒక పార్శ్వాన్ని చూశాడు, ఇక భౌతికతకు సంబంధించిన నిర్బంధాలు అన్నీ పడిపోయాయి.

శివుని మూడవ కన్ను అంటే ఏమిటి ?


మూడవ కన్ను అనేది, భౌతికం కాని దాన్ని చూడగలిగే కంటిని సూచిస్తుంది. మీరు మీ చేతిని చూసినప్పుడు, అది కాంతిని అడ్డుకుని పరావర్తనం చెందిస్తుంది కాబట్టే మీరు దాన్ని చూడగలుగుతున్నారు. మీరు గాలిని చూడలేరు ఎందుకంటే అది కాంతిని అడ్డుకోదు. కానీ గాలిలో కొద్దిగా పొగ ఉంటే, మీరు దానిని చూడగలుగుతారు, ఎందుకంటే, మీరు కేవలం కాంతిని అడ్డుకునే దాన్ని మాత్రమే చూడగలరు. కాంతిని తనలోనుంచి వెళ్ళనిచ్చే దేన్నీ మీరు చూడలేరు. ఇంద్రియాలు అయిన ఈ రెండు కళ్ళ స్వభావం ఇది.

ఈ ఇంద్రియ నేత్రాలు భౌతికమైన దానిని చూడగలుగుతాయి. మీరు భౌతికమైనది కాని దానిని చూడాలీ అంటే, ఉన్న ఒకే ఒక్క మార్గం, అంతర్ముఖులు అవ్వడమే. మనం మూడవ కన్ను అన్నప్పుడు, మనం ప్రతీకాత్మకంగా, ఈ రెండు ఇంద్రియ నేత్రాలూ చూడలేని దానిని చూడడం గురించి మాట్లాడుతున్నాము.

ఇంద్రియ నేత్రాల దృష్టి బాహ్యం వైపుగా ఉంటుంది. మూడవ కన్ను అనేది మీ అంతర్గతాన్ని - అంటే మీ స్వభావాన్ని ఇంకా మీ ఉనికి స్వభావాన్ని- చూడడం కోసం. అదేదో మీ నుదుటి మీద మొలిచేదో, లేదా పొడుచుకు వచ్చేదో కాదు. భౌతికతకి అతీతమైన దాన్ని గ్రహించగలిగే ఈ దృష్టి కోణాన్నే మూడవ కన్ను అంటారు.

జీవితాన్ని మూడవ కంటితో చూడడం


మరొక అంశం ఏమిటంటే, ఇంద్రియ నేత్రాలు, కర్మ చేత చాలా కలుషితం చేయబడి ఉంటాయి. కర్మ అంటే గత చర్యల తాలూకు మిగిలిపోయిన జ్ఞాపకం. మీరు చూసే ప్రతిదీ కూడా ఈ కర్మ స్మృతులచే ప్రభావితం చేయబడుతుంది. మీరు అలా కాకుండా ఉండేలా చేయలేరు. మీరు ఎవరి వంకైనా చూస్తే, మీరు ఇలా ఆలోచిస్తారు, “అతను బాగున్నాడు, అతను బాగోలేదు, అతను మంచివాడు, అతను మంచి వాడు కాదు,” మీరు దేన్నీ కూడా అది ఉన్నట్టుగా చూడలేరు, ఎందుకంటే కర్మ స్మృతి, మీ దృష్టినీ ఇంకా చూడగలిగే మీ సామర్ధ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. అది అన్నింటినీ, మీ కర్మ ఉన్న విధంగానే చూపిస్తుంది. మీ గత స్మృతులు ఉన్న విధంగానే చూపిస్తుంది.

ప్రతిదాన్నీ, ఉన్నది ఉన్నట్టుగా చూడగలగడానికి, లోతుకి చొచ్చుకు పోగలిగేదీ, ఇంకా జ్ఞాపకాల చేత కలుషితం కాబడనిదీ అయిన ఒక కన్ను తెరువబడాలి. సాంప్రదాయ పరంగా, భారత దేశంలో జ్ఞానం అంటే, పుస్తకాలు చదవడం కాదు, ఎవరి మాటలనో వినడం కాదు, లేదా సమాచారాన్ని పోగుచేసుకోవడం కాదు. తెలుసుకోవడం అంటే, జీవాన్ని తెలుసుకోవడానికి కొత్త దృష్టిని లేదా అంతర్దృష్టిని తెరవడం. ఎంత ఆలోచించినా, ఎన్ని తత్వాలు అల్లుకున్నా, అది మీ మనస్సులో స్పష్టతని తీసుకు రాలేదు. మీరు సృజించే ఆ తర్క సంబంధమైన స్పష్టత చాలా తేలికగా చెదిరిపోవచ్చు. క్లిష్ట సమయాలలో అది పూర్తిగా గందరగోళంలో పడిపోతుంది.

సంపూర్ణమైన స్పష్టత వచ్చేది, మీ అంతర్దృష్టి తెరుచుకున్నప్పుడు మాత్రమే. మీలోని ఈ స్పష్టతని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ కూడా, ఏ పరిస్థితీ కూడా చెదరగొట్టలేదు. నిజమైన జ్ఞానం కలగాలంటే, మీ మూడవ కన్ను తెరువబడాలి.

    Share

Related Tags

శివ తత్వంమార్మికత

Get latest blogs on Shiva

Related Content

శివ పార్వతి కళ్యాణ ఘట్టం