సద్గురు: ఉజ్జయినిలోని మహాకాలేశ్వరాలయాన్నిగొప్ప శివ భక్తుడైన చంద్రసేనుడు అనే రాజు నిర్మించాడు. భక్తుల ఇంకా జ్ఞానాన్వేషకుల నగరంగా మారిన ఉజ్జయిని సంస్కృతిని నాశనం చేయాలనుకున్న వారు, చంద్రసేనుడిపై దాడి చేశారు. ఉజ్జయిని భారతదేశంలో మరో కాశీ లాంటిది; జ్ఞానం, విద్య ఇంకా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసరణ అనేవి పట్టణంలో ప్రధాన అంశాలుగా ఉండేవి. వాటి కోసమే జనం ఈ పట్టణానికి వచ్చేవారు. ఏ వాణిజ్య రవాణా మార్గాలు లేకపోయినా, అప్పట్లో అవంతికగా పిలువబడే ఉజ్జయిని, జ్ఞానం మరియు ఆధ్యాత్మికతలకు ప్రధాన కేంద్రంగా గొప్పగా అభివృద్ధి చెందింది. అయితే అది ఇష్టం లేని వ్యక్తులు, ఆ నగరాన్ని నాశనం చేయాలనుకున్నారు.
వారు దండెత్తి వచ్చినప్పుడు, చంద్రసేనుడు శివున్ని ప్రార్థించాడు. శివుడు మహాకాలుడి రూపంలో వచ్చి వారిని ఒక నిర్దిష్ట పద్ధతిలో అణిచివేసి, అతన్ని ఈ ఇబ్బంది నుంచి కాపాడారు - తద్వారా అతను ఆధ్యాత్మికతను ఇంకా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కొనసాగించగలిగేలా!
నేను సాధారణంగా గుళ్ళకు వెళ్ళనప్పటికీ, ఉజ్జయినిలోని మహాకాలేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్లాను. ఈ గుడిని ఎన్నో విధాలుగా ధ్వంసం చేశారు. ఆక్రమణదారులు గుడిని ధ్వంసం చేశాక, మళ్ళీ దాన్ని రెండు లేదా మూడు సార్లు పునర్నిర్మించారు, కానీ ఇప్పటికీ, మీరు అక్కడ కూర్చుంటే చాలు, వేల సంవత్సరాలుగా అక్కడే ఉన్న ఈ చిన్న రూపం, ఒక చిన్న విగ్రహం, మిమ్మల్ని విస్ఫోటనం చెందిస్తుంది అది నిన్నే తయారుచేసినట్టుగా ప్రకంపిస్తోంది. ఎలానో తెలిస్తే, అలాంటి లింగం సన్నిధిలో మీరు మీ వ్యవస్థ నిర్మాణాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించవచ్చు ఇంకా మీ వ్యవస్థను రీవైర్ (rewire) చేసుకోవచ్చు.
మహాకాల ఆలయం ఇంకా అక్కడ ప్రతిష్టించబడిన లింగం అత్యద్భుతమైనవి. ఇది మిమ్మల్ని, మీ మూలాల నుంచి కుదుపుతుంది. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ ఎంతో అద్భుతంగా జరిగింది, కోరుకునే వారిని ఏదో ఒక విధంగా విలీనం చేయగలిగే ఉద్దేశ్యంతో చేయబడింది. ఆయన వ్యక్తీకరణ కొంచెం భయానకంగా ఇంకా ప్రబలంగా ఉంటుంది. మీరు ఈ ఆలయంలోకి వెళ్లేందుకు బాగా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైనది ఇంకా ఇది పిరికి వాళ్ళ కోసం కాదు
స్మశానం నుంచి తెచ్చిన తాజా బూడిదనే, ప్రతిరోజూ మహాకాలుడికి నైవేద్యంగా నివేదిస్తారు, ఎందుకంటే అదే అతనికి ఇష్టం; అలాగే అదే దానిని ప్రస్తుతం అది ఉన్న విధంగా నడిపిస్తోంది. ఇది కేవలం సాంస్కృతిక అంశం మాత్రమే కాదు, దీని వెనుక విజ్ఞానం కూడా ఉంది. అనుభవపూర్వకంగా, స్మశానం నుంచి తెచ్చిన బూడిదకీ, ఇతర బూడిదకీ ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రక్రియను కొనసాగించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అదే మహాకాలుడి స్వభావం కాబట్టి.
ఈ మహాకాల రూపం సాన్నిధ్యం ఎలాంటిదంటే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ప్రతిదీ కాలి బూడిదైపోతుంది. అంటే మీరు భౌతికత నుండి విముక్తులవుతారు. ఇది మిమ్మల్ని పరమోన్నతమైన ముక్తి వైపు నడిపిస్తుంది.
కానీ అదే పనిని మీరు నెమ్మదిగా చేయాలనుకుంటే, ధ్యానలింగంలో మహాకాళ పార్శ్వం ఒకటుంది. కానీ అది అన్వేషించే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా, మరుగు చేయబడి ఉంటుంది. అయితే మీరు దీన్ని మరింత బలంగా చేయాలనుకుంటే, మీరు నిజంగా గట్టిగా నెట్టబడాలని కోరుకుంటున్నట్లైతే, అలాగే మీరు పిరికివారు కానట్లయితే, అప్పుడు మహాకాల దేవాలయం అందుకు అద్భుతమైన ప్రక్రియ.
శివుడికున్న అనేక రూపాల్లో, 'కాల' లేదా 'మహాకాల' అనేది ఒక ముఖ్యమైన అలాగే రౌద్ర రూపం. మహాకాలుడిగా, ఆయన కాలానికి అధిపతి. ముక్తి కోరుకునే వారికి, మనం మహాకాలుడిగా పిలుచుకొనే ఈ పార్శ్వం ఎంతో ముఖ్యమైనది.
ఒకసారి ఏమైందంటే, అసురుల గురువైన శుక్రాచార్యుడు అనే గొప్ప ఋషి, శివున్ని పూజిస్తూ ఎంతో కాలం పాటు ఘోరమైన తపస్సు చేయడంతో, శివుడు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆయన ప్రత్యక్షం కాగానే శుక్రాచార్యుడు అమరత్వం కోరాడు. శివుడు "అది కుదరదు. పుట్టిన ప్రతీది మరణించాల్సిందే. ఇంకేదైనా కోరుకో " అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, "ఎలాంటి గాయాన్నైనా లేదా రోగాన్నైనా నయం చేసి, పునర్జీవింపజేసే శక్తిని నాకు ఇవ్వండి" అని అడిగాడు. శివుడు, అత్యుత్తమైన వైద్యుడు, అన్ని మూలికలు మరియు ఔషధాలకు అధిపతి అయినందున, శుక్రాచార్యునికి సంజీవిని మంత్రాన్ని ఇచ్చాడు. ఎలాంటి రోగం లేదా గాయం నుంచైనా ప్రజలను పునరుజ్జీవింపజేయగల మంత్రం అది.
శుక్రాచార్యునికి ఈ సంజీవని మంత్రం లభించిన తర్వాత, అసురులంతా చాలా ధైర్యవంతులై, దేవతలతో వరుసగా యుద్ధాలు చేశారు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అసురులంతా, శుక్రాచార్యుని సంజీవిని మంత్రం చేత తిరిగి కోలుకున్నారు. అలా, అసురుల సైన్యం ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా యుద్ధం చేసేది.
దీంతో దేవతలు బాగా కలత చెందారు, వారు ఇది చాలా అన్యాయమైన యుద్ధమని భావించారు. ఎందుకంటే వారెంతగా పోరాడినా అసురులు చనిపోవడం లేదు, కానీ దేవతలు చనిపోయేవారు. వారు బ్రహ్మ వద్దకు వెళ్లారు, ఆయన శివునితో, "మీరు శుక్రాచార్యుడికి ఈ విధమైన శక్తిని ఇచ్చారు. మీరు అతన్ని చంపాలి. లేకపోతే, ప్రపంచంలో పూర్తిగా అసమతుల్యత ఏర్పడుతుంది. అసురులకు న్యాయ బద్దం కాని అదనపు బలం ఇవ్వబడింది" అన్నారు. అప్పుడు శివుడు, “అతడిని చంపాల్సిన అవసరం లేదు, నేను అతడ్ని అదుపులో పెడతాను” అన్నారు.
దేవతలకు మరియు అసురులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో, శుక్రాచార్యుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూ, అసురులను గాయాలు, దెబ్బల నుంచి పునరుద్ధరిస్తున్నాడు. అప్పుడు, దూరం నుంచి, భయానకమైన రూపంతో, కృతిక అనే రాక్షసి వచ్చింది. ఆమె శివుడి గణాలలో ఒకరు. ఆమె శుక్రాచార్యుడిని తన గర్భంలోకి పీల్చుకుంది, అక్కడ అతను పిండంగా మిగిలిపోయాడు. అతను అక్కడే ఉండిపోయాడు, దాంతో దేవతలు మరియు అసురుల మధ్య సమతుల్యత ఏర్పడింది.
అందుకు బ్రహ్మ చాలా సంతోషించాడు, మహాకాళుడు మాత్రమే ఇది చేయగలడు- మనిషిని చంపకుండా, అతని జీవితాన్ని పూర్తిగా అదుపులో పెట్టగలడు అని భావించాడు. శుక్రాచార్యుడు కృత్తిక గర్భంలో అలాగే ఉండిపోయాడు, సంజీవిని మంత్రం శక్తిని కోల్పోయింది. మరో మాటలో చెప్పాలంటే, మహాకాళుడు శుక్రాచార్యుని విషయంలో సమయాన్ని స్తంభింపజేశాడు, దాంతో అతను ముందుకు కదలలేడు.
బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి గ్రీన్‍విచ్ మీన్ టైమ్‌కి మార్చడానికి ముందు, సెంట్రల్ ఇండియాలో ప్రతిష్టించబడిన మహాకాలేశ్వర్ విగ్రహం ఎన్నో వేల ఏళ్ల పాటుగా కాలానికి కేంద్రంగా ఉండేది. ఇదే ప్రపంచంలో మీన్ టైమ్‍గా ఉండేది, ఎందుకంటే ఇక్కడే కాలం ప్రారంభమైందని భావించేవారు. అందుకనే, వారక్కడ ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని స్థాపించారు, దానినే మహాకాళ అని పిలుస్తున్నారు.
యోగ శాస్త్రాల ప్రకారం, కాలం మాత్రమే ఉంటుంది, స్పేస్ అనేది ఉండదు. స్పేస్ అనేది కాలం యొక్క పర్యవసానం. కాలం లేకపోతే స్పేస్ కూడా ఉండదు. స్పేస్ అనేది మనం మన భౌతిక స్వభావాలతో నిమగ్నమై ఉన్నందున సృష్టించబడిన భ్రాంతి. మీరు మీ భౌతిక స్వభావాన్ని పక్కన పెట్టగలిగితే, వెంటనే కాలమనేది ఉండదు, తత్ఫలితంగా దేశం (space) కూడా ఉండదు.
ఇక్కడ మనం దేశ కాలాలు రెండింటికీ ఒకే పదం వాడతాం. కాలా అంటాం. కాలా అంటే కాలం, అలాగే కాలా అంటే శూన్యత అని కూడా. శూన్యత అంటే ఖాళీ. హాల్ ఖాళీగా ఉందంటే, అక్కడ స్థలం ఉందని అర్థం. హాల్ నిండగానే అక్కడ ఖాళీ లేదు అంటాం. సరళంగా చెప్పాలంటే ఇలా చెప్తాం. కానీ ఒకే పదం దేశ కాలాలు రెండింటికీ ఉపయోగిస్తాం. ఎందుకంటే దేశం (space) కాలం ద్వారా సృష్టించబడుతుంది. కాలం లేకపోతే దేశం (space) కూడా లేదు.
యోగాలో, మనం కాలాన్ని రెండు విభిన్న పార్శ్వాల్లో చూస్తాం: కాల ఇంకా మహాకాల. మహాకాల అంటే మహా కాలం. రోజువారీ జీవితంలో, కాలం చక్రీయ కదలికలను బట్టి ఉంటుంది - భూమి ఒక భ్రమణం పూర్తి చేస్తే ఒక రోజు, చంద్రుడు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తే ఒక నెల, భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేస్తే ఒక సంవత్సరం, ఇలా ఉంటాయి. కానీ మహాకాలానికి చక్రీయ కదలికలు ఉండవు .
చక్రీయ కదలికలనేవి భౌతిక స్వభావం వల్ల ఏర్పడతాయి. భౌతిక స్వభావం కారణంగానే, జననం ఇంకా మరణం, ప్రతిదానికీ ప్రారంభం
ఇంకా ముగింపు దృష్ట్యా కాలమనేది ఉంటుంది. ప్రతి అణువుకి, ఎలక్ట్రాన్‍కి ఇంకా ప్రోటాన్‌కి ఒక వయస్సు ఉంటుంది. చాలా గ్రహాలకు, సౌర వ్యవస్థకు ఇంకా సూర్యుడికి కూడా ఒక వయస్సు ఉంటుంది. ఎప్పుడో మొదలయ్యాయి, ఇంకెప్పుడో ముగిసిపోతాయి. అవి బ్యాంగ్ అంటూ శబ్దం చేసుకుంటూ పోతాయా లేదా నెమ్మదిగా కనుమరుగైపోతాయా అనే దానిపై చర్చ చేయొచ్చు. అయితే భౌతికత అనేది ఎల్లకాలం ఉండదు. అది ప్రారంభమవుతుంది ఇంకా ముగుస్తుంది. అందువల్లనే మనం సాధారణంగా కాలాన్ని ఆ కోణంలోనే చూస్తాం. కానీ చక్రీయ స్వభావానికి అతీతమైన కాలం ఉంటుంది. దీనినే మనం మహాకాల అంటున్నాం.
ఆధ్యాత్మిక అన్వేషకుల లక్ష్యం ముక్తిని పొందడమే, అంటే భౌతికతను
అధిగమించాలనుకోవడం. మరోలా చెప్పాలంటే, సృష్టి యొక్క చక్రీయ స్వభావాన్ని అధిగమించాలనుకోవడం. సృష్టి యొక్క చక్రీయ స్వభావాన్ని అధిగమించడం అంటే జీవితపు పునరావృత ప్రక్రియను అధిగమించడం. జీవితపు పునరావృత ప్రక్రియను అధిగమించడం అంటే ‘ఇది నేను’ అనే నిర్బంధాన్ని అధిగమించడం. నిర్బంధత నుండి ఎరుక వైపు ప్రయాణం అన్నమాట.
మీరు నిర్బంధత నుండి ఎరుక వైపు ప్రయాణించాలంటే, భౌతికతకు సంబంధించిన చక్రీయ కదలికల మూలాన ఏర్పడ్డ, ‘కాలం తాలూకూ పరిమితమైన అనుభూతిని’ అధిగమించాలి. మీరు భౌతికత లేదా భౌతిక పరిమితులు అనేవి లేకుండా కాలాన్ని అనుభూతి చెందితే, ఆ కాలాన్ని 'మహాకాల' అంటాం. మహాకాల ఒడిలోనే సృష్టి విషయాలాను ఉద్భవింప చేస్తుంది. గెలాక్సీలు చాలా చాలా పెద్దవి, అయినప్పటికీ అవి సృష్టిలో సూక్ష్మమైనవే; మిగిలినదంతా శూన్యం. అణువులో తొంభై తొమ్మిది శాతం లేదా అంతకంటే ఎక్కువ శూన్యమే ఉంటుంది. అదే మహాకాల.
అణువు చక్రీయ కదలికల్లో ఉన్నప్పటికీ, దానిలో తొంభై-తొమ్మిది శాతానికి పైగా శూన్యం ఉంటుంది. ఈ విశాల విశ్వంలో, తొంభై తొమ్మిది శాతానికి పైగా శూన్యమే ఉంటుంది. భారీ గెలాక్సీలు చక్రీయ కదలికల్లో ఉన్నాయి, కానీ తొంభై-తొమ్మిది శాతానికి పైగా శూన్యమే ఉంటుంది. కాబట్టి, మహాకాల ఒడిలో సృష్టి ఏర్పడుతుంది. సృష్టిలోని పరిమితమైన రేణువులతో నిమగ్నమైతే, మీరు కాలాన్ని చక్రీయ కదలికగా అనుభూతి చెందుతారు. ఈ పార్శ్వాన్నే సంసారం అంటాం- అంటే చక్రీయ కదలికలు.
మీరు దీనిని అధిగమిస్తే, అప్పుడు దాన్ని 'వైరాగ్యం' అంటాం. మీరు పారదర్శకంగా మారారని దీనర్థం. మీరు పారదర్శకంగా ఉంటే, మీరు కాంతిని ఆపలేరు. మీరు కాంతిని ఆపకపోతే, జీవితపు నిర్బంధ ధోరణుల లేదా జీవితపు చక్రీయ కదలికల నుంచి విముక్తి పొందారని అర్థం. మీరు జీవితపు వృత్తాకార చక్రీయ నుంచి విముక్తి పొందినట్లయితే, 'మీరు ముక్తిని పొందారు' అని అంటాం. కాబట్టి, ముక్తిని ఆకాంక్షించే వారికి, మనం మహాకాలుడిగా పిలుచుకునే ఈ పార్శ్వం అత్యంత ముఖ్యమైనది.