శిల వంటి హృదయమిది
స్థిరమైనది, బలమైనదని బీరాలు పోయాను
ఇక అప్పుడు పిలవకనే వచ్చాడు అతడు
చేశాడు నా గుండె కొట్టు కొనగ
ప్రతి జీవి, ప్రతి రాయి కొరకు ద్రవింపగ
ఒక నూరు పన్నెండు రీతులట
మీటగానిటనీ మర్త్య తంత్రిని
కట్టేసినావు నన్ను కుట్ర చేసి
ఓ నిపుణ కపటీ, నీ మాయలో పడి మోసపోతి
ఇక నా కొరకు నేనేమి తలచలేను
నా అంత నేనేమి చేయలేను
మధుర నాదాలన్నీ చెవుల నిండాక
భవ్య దృశ్యాలన్నీ కళ్ళ చూశాక
రమ్యానుభూతుల జాడ తెలిశాక
తొలగిపోయాయి అతనికై నాలోని భావనలన్నీ
ఏది కాని వాడు, ఆతడు ఇంకెవరిలా లేనివాడు
అతడు కాదు ప్రేమ
కాదతడు కరుణ కూడా
సాంత్వన కోరి ఆతని చెంతచేర కు
ఆతడే పూరణము నీకు
రా తెలుసుకో ఆ
ఆ అరూపి అందించే పారవశ్యాన్ని
ఆనందాల పరిపూర్తి కాదు
ఇది ఆత్మలయా కేళి
మరి నీవు సిద్ధమా మరల తిరిగి రాని ఈ ఆటకు
నమ్మకు నమ్మకు ఆ స్థాణువుని
నిశ్చలుడై నను లాగాడు తనలోకి
అతని వైపే దారి అనుకున్నాను
అతడే అంతము - ఇదే హెచ్చరిక సుమా
నువ్వు ఉంటావా మరి
నీ ఆఖరి యాత్ర కి, గొప్ప
దహన కాండకి. ఆ బాణసంచా పేల్చేటి
కాటికాపరి, నా శివుడు.