సద్గురు: శివుడు ఓ విధంగా ఒక చోట నిలిచే భర్త కాదు. తనెప్పుడూ సంచరిస్తుండేవాడు. ఆ సంచారం తననెక్కడికి తీసుకెళితే అక్కడకెళ్ళి చాలా సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండిపోతుండేవాడు. ఆ రోజుల్లో సెల్ఫోన్లు, ఈమెయిల్ లు ఉండేవి కాదు. కాబట్టి ఆయన దూరంగా వెళ్ళినప్పుడు, పార్వతి దేవికి అతన్ని సంప్రదించేందుకు ఎటువంటి మాధ్యమమూ ఉండేది కాదు. తనలో ఒంటరితనం పెరుగుతుంది. అలాగే శివుడు మనుషులకి పుట్టిన వాడు కాదు, ఆయన్ని యక్ష స్వరూపుడు అంటారు - ఈ కారణంచేత పార్వతి శివుని బిడ్డకి తల్లి అయ్యే అవకాశం ఉండదు.
కాబట్టి తనలోని ఒంటరితనం వల్ల, తన కోరిక ఇంకా తనలోని మాతృభావన వల్ల, తను ఓ బిడ్డను సృష్టించి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంటుంది. తన శరీరంపై ఉన్న గంధాన్ని తీసి, అక్కడి మన్నుతో కలిపి, ఓ బిడ్డ రూపంలో చేసి, దానికి ప్రాణం పోస్తుంది. వినడానికి ఇది వాస్తవంగా జరిగే విషయం కాదని అనిపించవచ్చు, కానీ నేటి సైన్స్ అచ్చం ఇదే భాష మాట్లాడుతుంది. ఎవరైనా మీ నుండి ఒక ఎపిథీలియల్ కణాన్ని సేకరిస్తే, రేపటి రోజున, దాని నుండి మీకు సంబంధించిన దేన్నయినా తయారు చేయవచ్చు. పార్వతి దేవి, దానికి ప్రాణం పోసింది, ఆ విధంగా ఓ చిన్న బిడ్డ పుడతాడు.
కొన్నేళ్ల తర్వాత, ఈ పిల్లాడికి సుమారు పదేళ్ళ వయసున్నప్పుడు, శివుడు తన గణాలతో పాటూ తిరిగొస్తాడు. ఆ సమయానికి పార్వతి దేవి స్నానం చేస్తుంటుంది, తను ఈ పిల్లాడికి, అటుగా ఎవరూ రాకుండా చూడుమని చెప్తుంది. ఈ పిల్లాడు శివుణ్ణి ఎప్పుడూ చూడలేదు, కాబట్టి ఆయన వచ్చినప్పుడు, ఈ పిల్లాడు ఆయన్ని అడ్డగిస్తాడు. అప్పుడు శివుడు, ఎవరైనా తనని అడ్డగిస్తే, దాన్ని సమ్మతించేందుకు ఇష్టపడని స్థితిలో ఉంటాడు. కాబట్టి తన కత్తి బయటకి తీసి, పిల్లాడి తల తీసేసి, పార్వతి దగ్గరికి వెళ్తాడు.
ఆయన చేతిలోనే రక్తమోడిన కత్తిని చూడగానే, పార్వతీ దేవికి ఏం జరిగంటుందో అర్థమైపోతుంది. ఆ పిల్లాడు తల లేకుండా అక్కడ పడి ఉండటాన్ని చూసి ఆవిడ కోపంతో రగిలిపోతుంది. శివుడు, “మరేం పర్వాలేదులే, అతను నిజంగా నీ కొడుకు కాదు కదా, నువ్వు అతన్ని కల్పించావు, నేను అతన్ని ముగించాను. ఇప్పుడు వచ్చిన సమస్య ఏముంది?” అంటూ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె వినే పరిస్థితిలో ఉండదు.
ఈ సమస్యని పరిష్కరించడానికి, శివుడు తన గణాలలోని ఒకరి తలని తీసి ఈ పిల్లవాడికి పెడతాడు. ఈ తలమార్పిడి జరిగిన రోజునే మనం వినాయక చవితి జరుపుకుంటాము. గణాల నాయకుడి తలని తీసి ఈ పిల్లాడికి పెట్టాడు కాబట్టి, ఆయన, “ఇక ఇప్పటి నుండి నువ్వే గణపతివి, నువ్వే గణాల నాయకుడివి” అంటాడు. కాలం గడిచే కొద్దీ ఎక్కడో, క్యాలెండర్ లకి బొమ్మలు గీసే కళాకారుడికి, ఆ ఇతర జీవి ఏమిటన్నది అర్థం కాక, అతను ఓ ఏనుగు ముఖాన్ని గీశాడు. గణాలకు అవయవాలుంటాయి కానీ ఎముకలుండవు అని సాంప్రదాయంలో చెబుతూ ఉంటారు. ఈ సంస్కృతిలో ఎముకల్లేని అవయవం అంటే, అది ఏనుగు తొండమే. కాబట్టి ఆ కళాకారుడు దాన్ని ఓ ఏనుగు తలలా చిత్రించాడు. మానస సరోవర తీరాన ఏనుగులు కనబడే అవకాశమే లేదు ఎందుకంటే వాటికి అది అనువైన నివాసం కాదు. అక్కడ ఏనుగులు నివసించేందుకు తగినంత వృక్ష సంపద ఉండదు. అందువల్ల శివుడు ఏనుగుల తలలను నరుకుతూ తిరిగే అవకాశం లేదు. అందుకే ఆయన్ని - గణేశుడు, గణపతి, వినాయకుడు - ఇలా ఎన్నో అన్నారు, కానీ ఆయన్ని గజపతి అనలేదు.
ఈ గణాలు అనబడేవారు శివుని సహచరులు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో మనకు తెలీదు, కానీ సాధారణంగా సంప్రదాయంలో, వారు ఈ గ్రహానికి చెందని జీవులు కాదని చెబుతారు. వారి జీవ నిర్మాణం, మనకిక్కడ తెలిసిన జీవ నిర్మాణానికి చాలా భిన్నంగా ఉంటుంది.
ఈ రోజున, జీవం ఏకకణ జీవి నుండి మొదలై సంక్లిష్టమైన రూపాల వరకూ, మానవ రూపం వరకూ ఎంతో గొప్ప పరిణామం చెందిందన్న విషయంలో, ఆధునిక జీవ శాస్త్రం ఎంతో స్పష్టంగా ఉంది. కానీ జీవం యొక్క ప్రాథమిక స్వభావం మాత్రం అదే - అది మారలేదు. అది మరింత సంక్లిష్టంగా అవుతూ వచ్చిందంతే. కానీ గణాలు ఈ జీవ నిర్మాణానికి చెందినవారు కాదు. వారు ఈ భూమికి సంబంధించిన పదార్థంతో తయారైన వారు కాదు. వారికి ఎముకలు లేని అవయవాలు ఉన్నాయి.
మీరు శరీరాన్ని వివిధ రకాలుగా వాడేందుకు ప్రయత్నిస్తే, మీరు ఆసనాలు వేసేందుకు ప్రయత్నిస్తే, మీకు ఎముకలు లేకుంటే బాగుండేది అనిపిస్తుంది. నేను నాకు పదకొండేళ్ల అప్పుడు యోగ మొదలుపెట్టాను, 25 ఏళ్ల వయసప్పుడు నేను హఠ యోగా నేర్పించినప్పుడు, జనాలు నన్ను చూసి, “ఓహ్, మీకు ఎముకలే లేవు, మీరో బోన్లెస్ మనిషి” అన్నారు. ప్రతి యోగి కోరుకునే కలే ఇది; అదేంటంటే తనకు నచ్చిన ఆసనాలు వేయగలిగేలా, తనకి ఏదో ఒక రోజు ఎముకలు లేని అవయవాలు వస్తే బాగుండు అని.
కొన్ని వేల ఏళ్లుగా, వినాయక చవితి సజీవంగానే ఉంది, అలాగే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన దేవుళ్లలో, ఇంకా భారతదేశం నుండి ఇతర చోట్లకు చేరిన దేవుళ్ళలో గణపతి ఒకరు. ఆయనకెన్నో రూపాలూ ఇంకా ఎన్నో భంగిమలు వచ్చాయి. అలాగే ఆయన విద్యా దేవుడు కూడా. ఆయన ఓ గొప్ప పండితుడంటారు. అయిన పాండిత్య సామర్ధ్యాలను తెలపడం కోసం ఆయన్ని ఎప్పుడూ ఓ పుస్తకము ఇంకా పెన్నుతో ఉన్నట్టు చూపిస్తారు. ఆయన పాండిత్యము ఇంకా మేధస్సు సాధారణ మానవ సామర్ధ్యాలకు అతీతమైనవి.
ఆయన భోజన ప్రియుడు. ఎవరైనా పండితుడిలా కనిపించాలి అంటే ఆయనెంతో బక్కగా ఉండాలి . కానీ ఈయన, దిట్టంగా బాగా భుజించిన పండితుడు. సాధారణంగా ప్రజలు, ఈ రోజున మనం చేయాల్సిందల్లా మంచిగా తినటమే అని నమ్ముతారు. ప్రజలు కేవలం పెద్ద పొట్టను మాత్రమే చూశారు, కానీ అతని కొత్త తలలోని అంతకంటే పెద్దదైన మెదడుని విస్మరిస్తూ ఉంటారు. అదీ అత్యంత ముఖ్యమైన విషయం. ఆయన పొట్ట తరవాత పెరిగింది. బహుశా అంతటి పెద్ద తలతో ఆయనకి వాకింగ్ చేయాలనిపించలేదేమో! కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మేధస్సు ఎంతగానో పెరిగింది. కాబట్టి ఈరోజు కేవలం తినేందుకు మాత్రమే కాదు. ఇది మీరు మీ మేధస్సును పెంచుకోవాల్సిన రోజు, మీ పొట్టను కాదు.
ఓ విధంగా అన్ని యోగసాధనలూ దీని గురించే, మీ మేధస్సు, అది ప్రస్తుతం ఉన్న చోటనే ఉండి పోవాల్సిన అవసరం లేదు అన్న దాని గురించే. ప్రజలు సరళమైన ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టి, తమ మేధస్సును ఎన్నో భిన్నమైన విధానాలలో ఎంతగానో పెంచుకున్న ఉదాహరణలు వేలకొలదీ ఉన్నాయి. మీకు తొండం మొలవదు, కంగారు పడకండి, కానీ మీ మేధస్సుని పెంచుకోడానికి మీరు కృషి చేయవచ్చు.
మానవాళి ఎప్పుడూ కూడా మంచి మనుషులను తయారు చేయడం కోసం కృషి చేయటం అనే తప్పిదాన్ని చేస్తూనే వచ్చింది. మనకి మంచి మనుషులు అక్కర్లేదు. మనక్కావాల్సింది వివేకం గల మనుషులు. మీకు వివేకం ఉంటే మీరు సరైన పనులు చేస్తారు. ప్రజలు మూర్ఖమైన పనులు చేసేది కేవలం వారికి వివేకం లేనందువల్ల మాత్రమే.
మేధస్సంటే చురుకుదనం కాదు. మేధస్సనేది తెలివిగా ఉండటం గురించి కాదు. మీరు నిజంగా మేధస్సు కలవారైతే, మీరు ఈ ఉనికితో నూటికి నూరు శాతం సమన్వయంలో ఉంటారు, ఎందుకంటే మేధస్సు కలిగి ఉండేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదు. మేధస్సుని తెలిపే గుర్తు ఏంటంటే, మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి దానితోనూ సంపూర్ణ సమన్వయంలో ఉంటారు, జీవితంలో మీరు, మీ బాహ్యా-అంతరాలలో కూడా అతి తక్కువ ఘర్షణతో ఉంటారు.
వినాయక చవితి అనేది మీ మేధస్సుని పెంచుకునేందుకు కనీసం ప్రయత్నం చేయటం మొదలు పెట్టాల్సిన రోజు. పొద్దున్నే ఆసనాలు వేయడం ద్వారా మీరు ఓ ఎముకలు లేని అవయవం కోసం కృషి చేస్తే, బహుశా అది రావొచ్చేమో!
సంపాదకుని గమనిక: సద్గురు వినాయక చవితి గురించి మాట్లాడుతున్న వీడియోను చూడండి.