logo
logo

శివుని సాన్నిధ్యం

పరమశివుడు నాలుగు ముఖ్యమైన చోట్లలో సమయాన్ని గడిపారు. ఆ స్థల మహత్యం గురించి ఇంకా వాటి శక్తి గురించి సద్గురు మనకు వివరిస్తున్నారు.

శివుని సాన్నిధ్యం – మొదటి యోగి అడుగుజాడ



పరమశివుడు నాలుగు ముఖ్యమైన చోట్లలో సమయాన్ని గడిపారు. ఆ స్థల మహత్యం గురించి ఇంకా వాటి శక్తి గురించి సద్గురు మనకు వివరిస్తున్నారు.

Sadhguru: యోగ సంప్రదాయంలో శివుడిని, దేవునిగా చూడరు. ఆయన ఈ నేలపై నడిచిన ఒక జీవి, ఆయనే యోగ సంస్కృతికి ఆదిమూలం. ఆయన ఆదియోగి, ఇంకా ఆది గురువు కూడా కాంతి సరోవరం ఒడ్డునే మొట్టమొదటి సారిగా యోగ శాస్త్రాలను ప్రసాదించడం జరిగింది. కాంతి సరోవరం ఒక హిమ సరస్సు, అది హిమాలయాలలో కేదార్ నాథ్ కు కొంచెం పైన ఉన్నది. అక్కడ ఆదియోగి తన మొదటి ఏడుగురు శిష్యులకు అంతర్ముఖ విజ్ఞానం యొక్క క్రమబద్దమైన వ్యాఖ్యానం ప్రారంభించారు. ఆ ఏడుగురు శిష్యులనే ఇప్పుడు మనం సప్తరుషులుగా పూజిస్తున్నాం.


కాంతి సరోవరం – కృపా సాగరం

పురాణాల ప్రకారం, శివుడు పార్వతి ఆ సరోవరం ఒడ్డున, కేదార్నాథ్ ప్రాంతాలలో నివసించారు. అక్కడ అనేక మంది యోగులు కూడా నివసించే వారు. వారిని శివపార్వతులు కలుస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రితం, నేను ప్రతి సంవత్సరం ఒకటి, రెండు నెలలు హిమాలయ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడిని. నేను కాంతి సరోవరం మొట్టమొదటిసారి వెళ్ళింది 1994లో. ఈ కాంతి సరోవరమే, 2013 లో కట్టలు తెంచుకొని, కేదార్నాథ్ ను ముంచివేసింది. ఈనాడు దీనినే గాంధీ సరోవరం అని పిలుస్తున్నారు. నిజానికి ఇది కాంతి సరోవరం. కాంతి అంటే అనుగ్రహం, అంటే అది కృపా సాగరం.

నేను కాలినడకన కేదార్నాథ్ చేరినప్పుడు, కాంతిసరోవరం గురించి విన్నాను. ఒక రోజు మధ్యాహ్నం సుమారు రెండు, రెండున్నర ప్రాంతంలో, నేను అక్కడకు బయలుదేరాను. నేను బహుశా ఒక గంట తర్వాత అక్కడికి చేరి ఉంటాను. అక్కడ ఈ సరస్సు, దాని చుట్టూ మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఉన్నాయి.

ప్రకృతి పరంగా అది ఎంతో మనోహరంగా ఉన్నది. ఈ పెద్ద సరస్సు దానిలో నిశ్చలమైన నీరు, చుట్టూ ఎటువంటి చెట్టు, చేమా లేవు. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఆ నీటిలో ప్రతిబింబిస్తున్నాయి. అది ఒక అమోఘమైన ప్రదేశము.

కాంతి సరోవరం వద్ద సద్గురు

నేను అక్కడే కూర్చున్నాను. ఆ ప్రశాంతతని, ఆ నిశ్శబ్దాన్ని, ఆ పవిత్రత , నా చేతనలోకి ప్రవేశించాయి. అక్కడికి ఎక్కడం, ఆ ఎత్తు, నిర్జీవమైన అందము చూసి నాకు ఊపిరి ఆడనంత పని అయింది. నేను ఆ నిశ్చలతలో నా చుట్టూ ఉన్న ప్రతి దృశ్యాన్ని నాలో ముద్రించుకుంటూ ఒక చిన్న రాయిమీద కళ్ళు తెరుచుకుని కూర్చున్నాను. నా పరిసరాలు మెల్లగా తమ రూపాన్ని కోల్పోయాయి, అప్పుడు కేవలం నాదమే మిగిలింది. ఆ పర్వతం, ఆ సరస్సు, పరిసరాలు, నా శరీరంతో సహా అన్నీ తమ స్వరూపాన్ని కోల్పోయాయి. అంతా కేవలం శబ్దమే నాలో ఈ పాట ప్రకటితమయింది.




నాదబ్రహ్మ

నాదబ్రహ్మ విశ్వ స్వరూప
నాద హి సకల జీవారూప
నాదహి కర్మ నాదహి ధర్మ
నాదహి బంధన నాదహి ముక్తి
నాదహి శంకర నాదహి శక్తి
నాదం నాదం సర్వం నాదం
నాదం నాదం నాదం నాదం



నేను ఎప్పుడూ సంస్కృతం నేర్చుకోకుండా ఉండటానికే ప్రయత్నించాను. నాకు ఆ భాష అంటే ఎంతో ఇష్టం. దానిలోని లోతు నాకు తెలిసినదే. దానిని నేర్చుకోవటం ఏమార్చాను. ఎందుకంటే మీరు ఒకసారి సంస్కృతం నేర్చుకుంటే, మీరిక గ్రంధపఠనం లోనే మునిగిపోతారు. స్వతహాగా నా చూపు, నాదృష్టి, నన్ను ఎప్పుడూ ఒక్క క్షణం కూడా మోసం చేయలేదు. అందువల్ల నేను గ్రంథాలతో మునిగి పోదలచుకోలేదు. అందుకనే నేను సంస్కృత భాషను నేర్చుకోకుండా ఉంటానికే ప్రయత్నించాను. కానీ నేను అక్కడ కాంతి సరోవరం దగ్గర కూర్చున్నప్పుడు, నా కళ్ళు మూసుకునే ఉన్నాయి, నా నోరు కూడా ఖచ్చితంగా మూసుకునే ఉంది. నేను ఈ పాట చాలా పెద్దగా విన్నాను, అదీ నా స్వరంలోనే, ఆ పాట పాడింది నేనే, అది సంస్కృతంలోని పాట. ఈ పాట నేను చాలా స్పష్టంగా, ఎంతగా పెద్దగా అంటే, మొత్తం పర్వతమంతా పాడుతున్నట్లు. నా అనుభూతిలో అంతా శబ్దంగా మారి పోయింది. నేను అలానే అనుభూతి చెందాను. నేను పాడలేదు, నేను రాయలేదు, అది నా మీదకి ఆవహించింది అంతే. ఈ పాట మొత్తం సంస్కృతం లోనే ఉంది,ఆ అనుభూతి నన్ను ముంచెత్తింది.



ఆ తర్వాత మెల్లగా, కొంత సేపట్లో, అన్నీ అంతకుముందు ఉన్నట్లుగానే రూపుదిద్దుకున్నాయి. నా చేతనలో, అవి నాదం నుంచి రూపానికి పడిపోవటం, నా కళ్ళలో నీరు నింపింది. మీరు కూడా ఈ పాటను పూర్తి అర్ద్రతతో పాడితే, మీకు మీరు నిజంగా దానికి అర్పించుకుంటే, దానికి ఒక రకమైన శక్తి ఉన్నది, దానికి మీ వ్యక్తిత్వాన్ని కరిగించే శక్తి ఉన్నది.



కైలాసం – ఒక మార్మిక పర్వతం

హిందూ జీవిత విధానంలో కైలాసాన్ని శివుని ఆవాసంగా పేర్కొంటారు. అంటే దాని అర్థం ఆయన ఆ పర్వతం మీద కూర్చున్నాడు, అక్కడ నాట్యం చేస్తున్నాడు లేక ఆ మంచులో దాక్కున్నాడు అని కాదు. దాని అర్థం ఏమిటంటే, ఆయన తన జ్ఞానాన్ని అందులో నిక్షిప్తం చేశారు అని. ఆదియోగి జ్ఞానంలో, సప్తర్షులు ప్రతి ఒక్కరూ ఒక భాగాన్ని గ్రహించారు. ఆయన జ్ఞానంలోని మొత్తం ఏడు అంశాలూ గ్రహించగల ఏ ఇతర వ్యక్తీ ఆయనకు దొరకలేదు. అప్పుడిక ఆదియోగి, తన జ్ఞానాన్ని మొత్తం కైలాసంలో నిక్షిప్తం చేయ నిర్ణయించుకున్నారు. అంటే జీవితాన్ని నడిపే జ్ఞానం యొక్క అన్ని ఏడు అంశాలు, ఒకే చోట, ఒకే భాండారంలో నిక్షిప్తం చేయబడ్డాయి. కైలాసం ఈ భూమి మీద అతి గొప్ప మార్మిక గ్రంధాలయం అయ్యింది. అది కేవలం సమాచారం అందించే గ్రంథాలయం కాదు. ఒక సజీవ గ్రంధాలయం, జీవంతో ఉన్న గ్రంధాలయం.

కైలాసం యొక్క దక్షిణ ముఖం

ఒక వ్యక్తి ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు అతని గ్రహణ శక్తి మామూలు వ్యక్తి గ్రహణ శక్తి కన్నా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అతను గ్రహించినది తన చుట్టూ ఉన్న వ్యక్తులకు అందించడం అన్నివేళలా కుదరదు. ఆయన అందుకున్న దానిలో కేవలం చిన్న భాగం మాత్రమే అతను బహుశా తన చుట్టూ ఉన్నవారికి అందించ గలడు. ఒక గురువుకు తనకు తెలిసినదంతా అందించడానికి తగిన వ్యక్తి దొరకడం చాలా అరుదు.

మరి ఈ విజ్ఞాన్నంతా ఎక్కడ పెట్టడం? ఈ జ్ఞానాన్ని కోల్పోవాలనుకోము. అందువల్లనే, వేల సంవత్సరాలుగా ఆత్మ జ్ఞానం పొందిన వారు కైలసానికి పయనమై తమ జ్ఞానాన్ని ఒక రకమైన శక్తి రూపంలో నిక్షిప్తం చేశారు. దానికి ఈ పర్వతాన్ని ఆధారంగా చేసుకున్నారు. అందువల్లనే దక్షిణ భారత వ్యవస్థ తమ మార్మికతకు ఆదిపురుషుడైన అగస్త్యుడు, కైలాస పర్వత దక్షిణ ముఖంలో నివసిస్తాడని అంటారు. బౌద్ధులు తమ ప్రముఖ బుద్ధులలో ముగ్గురు ఆ పర్వతంలో నివసిస్తారని అంటారు. జైనులు తమ మొదటి తీర్థంకరుడు, ‘ఋషభ దేవుడు’ కైలాసంలో ఉంటాడని అంటారు.
ఆధ్యాత్మిక సాధకుడికి కైలాసం అంటే భూమి మీద సర్వోన్నతమైన మూల స్థానాన్ని అందుకోవడం లాంటిది. మార్మికత తెలుసుకోవాలనుకునేవారికి ఇదే సరైన స్థలము. ఇటువంటి స్థలం మరొకటి లేదు.

8 - 12 శతాబ్దాల మధ్య వెలసిన శివ, శక్తి దేవాలయాలు

ఈ దేశంలో, ప్రాచీన కాలంలో, చాలావరకు దేవాలయాలు శివునికే నిర్మించబడ్డాయి, అంతేగాని మరెవరికీ కాదు. గత 1000 సంవత్సరాల నుంచి మాత్రమే ఇతర దేవాలయాలు వెలిశాయి. శివుడు అనే మాటకు అర్థం ఏమిటంటే ‘ఏది లేదో, అది’ అని. అంటే ‘లేని దానికి’ దేవాలయాలు కట్టబడ్డాయి. ‘ఉన్నది అంటే’ భౌతికంగా ఉన్నవి అని. ‘లేని దానికి’ అంటే అది భౌతికానికి అతీతం, అని. మీరు ‘ఏది లేదో’ దానిలోకి ప్రవేశించడానికి దేవాలయం ఒక రంధ్రము లాంటిది. ఈ దేశంలో వేలాది శివాలయాలు ఉన్నాయి. వాటిలో ఏ విధమైన మూర్తి (విగ్రహ) రూపాలు లేవు. చాలా వరకు ఏ విధమైన ‘మూర్తి’ లేదు. వాటిలో ఉన్నది రూపానికి ప్రతీకగా ఒక ‘లింగం‘ మాత్రమే

A downloadable version of the below map is available here.

వెల్లియాంగిరి - దక్షిణ కైలాసం

దక్షిణ భారతదేశంలో మేమున్న ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నది. అక్కడ మరొక మార్మిక భండాగారం ఉన్నది. అదే వెల్లియాంగిరి పర్వతం, దీనిని దక్షిణ కైలాసం అంటారు. అది ఒక అద్భుతమైన ప్రదేశం. అది కైలాసం లాగా అతిపెద్ద భండాగారం కాదు కానీ, దక్షిణ భారతదేశంలోని అనేక మంది మార్మికులు, యోగులు తమ జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికి వెల్లియాంగిరిని ఎంచుకున్నారు. జ్ఞాన భాండాగారం విస్తీర్ణంలో కైలాసానికి ఏదీ సాటి కాదు. కాని స్వభావ పరంగా అది కైలాసానికి సరిపోలినది.

ఈ పర్వతాన్నిఏడుకొండలు అంటారు. ఎందుకంటే మీరు ఎక్కితే దానిలో 7 ఎత్తుపల్లాలు(ఎగుడు దిగుడులు) ఉన్నాయి. అందువల్ల మీరు ఏడుకొండలు ఎక్కుతున్నట్లు అనుభూతి చెందుతారు. ఆఖరి శిఖరం వద్ద పూర్తిగా ఈదురు గాలిగా ఉంటుంది. అక్కడ గడ్డి తప్ప ఇంకేమీ పెరగదు. అక్కడ మూడు పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. అవి ఒక గూడులా నిలబడ్డాయి. అది ఒక చిన్న లింగం ఉన్న గుడి లాగా కనపడతాయి. అది ఎంతో శక్తివంతమైన, అమోఘమైన ప్రదేశము. ఈ కొండ దిగివచ్చిన యోగులు, సిద్ధులు వేరే తరహా వారు. వారు ఎంతో తీవ్రమైన, ఉగ్రమైన వారు.

దేవతలకు గూడా వారంటే ఈర్ష్య పడేటట్లు, వారు ఎంతో హుందతనంతోను, కరుణతోను జీవించారు. ఎంతో ఠీవీ, ఎంతో దయ కలిగిన గొప్ప జీవులు, ఈ పర్వతాల మీద నివసించారు. ఈ జీవులు ఈ పర్వతం తాము తెలుసుకున్నది అంతా గ్రహించేట్లు చూశారు. అది ఎప్పుడు కోల్పోయేది కాదు.
మా గురువుగారు సంచరించిన స్థలం ఇంకా ఆయన తమ శరీరాన్ని వదిలి పెట్టడానికి ఎంచుకున్న స్థలం కూడా ఈ పర్వతమే. అందుకే ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, మాకు ఇది ఒక దేవాలయం.


కాశి – పరమ పావనమైన నగరం


ప్రజలు ప్రపంచ నలుమూలల నుంచీ, వేలాది సంవత్సరాలుగా కాశీ యాత్ర చేస్తున్నారు. గౌతముడు కూడా తన మొదటి బోధనను ఇవ్వడానికి ఇక్కడికే వచ్చారు. అతి గొప్ప విద్యా విశ్వవిద్యాలయంగా గుర్తింపబడిన నలందా విశ్వవిద్యాలయం కాశీనుంచి జాలువారిన ఒక జ్ఞానపు చుక్క మాత్రమే. ఆర్యభాట్టా ఇంకా మీరు విన్న అలాంటి ఎంతోమంది, ఈ ప్రాంతం నుంచే వచ్చారు... అందరూకాశీలో ఉన్న సంస్కృతితో సృజించబడ్డ వారే.

యోగులు విశ్వం యొక్క తత్వాన్ని పరిశీలించినప్పుడు, అది దానిలోనే ఎలా పరిణామం చెందుతోందని గమనించినప్పుడు, అనంతగా పరిణితి చెందగల దాని సామర్థ్యం చూసినప్పుడు, వారు కూడా సొంతగా అటువంటిదే చేద్దామని ఉత్సాహపడ్డారు. కాశీ నగర రూపంలో అటువంటి పరికరాన్ని తయారు చేశారు. అది సూక్ష్మండానికి, బ్రహ్మాండానికి జత కూరుస్తుంది. ఈ చిన్న మానవుడు, అతి బ్రహ్మాండమైన వాస్తవంతో జత కూడే అవకాశం ఉన్నది. దానిద్వారా సౌఖ్యం, హర్షాతిరేకం, బ్రహ్మాండంతో ఒకటయ్యే ఆకాశం ఉన్నాయి. రేఖా గణిత పరంగా కాశీ కూడా బ్రహ్మాండం యొక్క ఖచితమైన వ్యక్తీకరణ అ. ఇది సూక్ష్మాండం, బ్రహ్మాండంతో ఎలా కలవగలదో వ్యక్తీకరిస్తుంది. ఇటువంటి ఉపకరణాలు దేశంలో చాలా ఉన్నాయి. కానీ కాశీలాంటి నగరాన్ని నిర్మించడం ఒక పిచ్చి ఆకాంక్ష. మరి వారు ఈ పని, వేలాది సంవత్సరాల క్రితమే చేశారు.

అక్కడ 72 వేల మందిరాలు ఉన్నాయి. మనిషి శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయో అన్ని మందిరాలు ఉన్నాయి. మొత్తం ప్రక్రియ అంతా ఏమిటంటే, ఈ నగరాన్ని ఒక పెద్ద మానవ శరీరంగా మలచి, దానిని బ్రహ్మాండం తో జత చేయడమే. దీని మూలంగానే మన సంస్కృతిలో, ‘మీరు కాశి కి వెళితే, ఇక అదే సర్వం’ అనే వ్యాఖ్య వచ్చింది. మీరు బ్రహ్మాండంతో జత కడతారు కాబట్టి, మీరు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలనుకోరు. ఇక మీరు మరో ప్రదేశానికి వెళ్లాలని ఎందుకు అనుకుంటారు?

కాశీ పురాణం శివుడు అక్కడ నివసించాడు అనే ప్రాథమిక ప్రాతిపదిక మీదే నడుస్తుంది. ఇది ఆయన శీతాకాలం విడిది. ఆయన ఒకరి తర్వాత ఒకరిగా తన మనుషులను అక్కడికి పంపాడు. ఆ ప్రదేశం, ఆ స్థలం, బ్రహ్మాండంగా ఉండడంతో, వాళ్లు మళ్ళీ ఎప్పుడూ వెనక్కు తిరిగి రాకపోవడం గురించి అనేక కథనాలున్నాయి. కానీ బహుశా దాన్ని నిర్మించడానికే ఆయన తన మనుషులను అక్కడకు పంపారని మనకు కధ చెబుతోంది. దానివల్ల వారు ఎంతో కాలం అక్కడే ఉన్నారు, అదంతా పూర్తిగా నిర్మించాక, ఆయన అక్కడకు వచ్చి, అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. దండయాత్రలలో గత కొన్ని శతాబ్దాలుగా కాశీని మూడుసార్లు మొత్తం నేలకుల్చారు. అది ఇప్పుడు ఎంత వరకు సజీవంగా ఉన్నది అనేది ప్రశ్నార్థకమే, ఏది ఏమైనా, ఏదో కొంతైనా సజీవంగా ఉన్నది - అంతా పోలేదు. అది తన పూర్తి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనం ఇక్కడ జీవించిలేదు. అది మన దురదృష్టము. ప్రపంచం నలుమూలలనుండి ప్రజలు అక్కడకు ఆకర్షితులు అవుతున్నారంటే అది ఎంతో గొప్ప స్ధలం అయ్యుండాలి.

Wమనం గతాన్ని ఎలాగోలా నెగ్గుకు వచ్చాము, కాని మనం భవష్యత్తులో కూడా నెగ్గుకు రాగలమా? నేను మనం అన్నప్పుడు నేను ఫలానా మతం గురించి మాట్లాడడం లేదు. నేను ఈ భూమి మీద ఉన్న అనేకమంది గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే తమ అభిప్రాయాలను మరొకరి మీద రుద్దకుండా జీవాన్నిఉన్నది ఉన్నట్లుగా చూద్దామనుకుంటున్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచానికి అంధవిశ్వాసాలు, సిద్ధాంతాలు, నమ్మకాలు అక్కరలేదు., ఇప్పుడు ‘అతీతం’ అని దేన్నైతే అందరూ అనుకుంటున్నారో దానిని గ్రహించ గలిగిన మానవ సామర్థ్యం కావాలి. ఈ విధంగా మాత్రమే మానవచైతన్యం వికసించేది. ఈ ఒక్క విధంగానే మానవ చేతన విస్తరించేది. ఈ విధానంలోనే మానవుడు తమ సమాజాలలో ఉన్న సంకుచిత విభజనలకు అతీతంగా పరిణామం చెందగలడు.

    Share

Related Tags

మార్మికతశివ తత్వం

Get latest blogs on Shiva

Related Content

మహాశివరాత్రి అందించే లాభాలు