logo
logo

శివుని 10 రూపాల వివరణ

సద్గురు యోగ శాస్త్రంలోని శివుని 10 విభిన్న రూపాల గురించి చూస్తూ, అవి దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయో వివరిస్తున్నారు. క్రియాశీలమైన నటరాజుని గురించి, భయంకరమైన కాలభైరవుని గురించి, పిల్లవాడి వంటి భోళాశంకరుడిని గురించి, ఇంకా మరెన్నింటి గురించో తెలుసుకోండి!

సద్గురు: శివునికి, మానవ మనస్సు ఊహించగలిగిన ప్రతి గుణాన్నీ ఇంకా ఊహించలేని గుణాలనీ కుడా కలిగి ఉన్న అనేక రూపాలు ఉన్నాయి. కొన్ని విశృంఖలమైనవి ఇంకా ప్రచండమైనవి. కొన్ని నిగూఢమైనవి. మిగిలినవి మనోహరమైనవి ఇంకా సుందరమైనవి. అమాయక భోళాశంకరుడి నుండి భయంకరమైన కాలభైరవుడి వరకు, అందమైన సోమసుందరుడి నుండి భయంకరమైన అఘోరా వరకు - శివుడు అన్ని రూపాలను ధరించినా వాటికి వేటికీ ప్రభావితంగాని విధంగా ఉన్నాడు. వీటన్నిటిలో, ఐదు ప్రాథమిక రూపాలు ఉన్నాయి.

  • శివుని ఐదు ప్రాథమిక రూపాలు

  • యోగ యోగ యోగేశ్వరాయ

  • భూత భూత భూతేశ్వరాయ

  • కాల కాల కాలేశ్వరాయ

  • శివ శివ సర్వేశ్వరాయ

  • శంభో శంభో మహాదేవాయ

యోగేశ్వర రూపం


యోగ మార్గంలో ఉండడం అంటే, జీవితంలో మీరు ఏ దశకు చేరుకున్నారంటే, మీరు ఈ భౌతిక ఉనికి యొక్క పరిమితులను తెలుసుకున్నారు, పరాన్ని తెలుసుకోవాలన్న కోరిక మీలో కలిగింది - ఇంత పెద్ద విశ్వం కూడా మీకు ఒక నిర్బంధంలాగా అనిపిస్తుంది. ఒక చిన్న సరిహద్దు మిమ్మల్ని నిర్బంధించగలిగినప్పుడు, చాలా పెద్ద సరిహద్దు కుడా, ఒకానొక సమయాన మీకు నిర్బంధమే అవుతుంది. ఈ విషయం తెలుసుకోడానికి మీరు విశ్వాన్నంతా చుట్టి రానక్కర్లేదు. మీరు ఇక్కడ కూర్చునే, ఈ సరిహద్దు మిమ్మల్ని నిర్బంధిస్తుంది అంటే, మీరు విశ్వాన్నంతా చుట్టివస్తే, కొంతకాలానికి అది కూడా నిర్బంధంగానే అవుతుందని అర్థం చేసుకోవచ్చు - అది కేవలం దూరాలు

ప్రయాణించగల మీ సామర్ధ్యానికి సంబంధించిన ప్రశ్న మాత్రమే! ఒకసారి దూరాలు ప్రయాణించగల మీ సామర్ధ్యం గొప్పగా పెరిగితే, అప్పుడు ఎలాంటి సరిహద్దైనా సరే మీకు ఒక నిర్బంధంగానే అనిపిస్తుంది. మీరు ఇది తెలుసుకుని అర్థం చేసుకున్నప్పుడు, ఈ భౌతిక సృష్టినంతా జయించడం అనేది కూడా తీర్చలేని ఆ తృష్ణ మీలో కలిగినప్పుడు – అప్పుడు మీరు “యోగా” మార్గంలో ఉన్నటు. యోగా అంటే, ఈ భౌతికమైన పరిమితులను ఛేదిచడం. మీ కృషి అంతా, ఈ భౌతిక సృష్టి మీద నియంత్రణ సాధించడం కోసం మాత్రమే కాదు, దాని పరిమితులను ఛేదించి, భౌతికతకి అతీతమైన పార్శ్వాన్ని స్పృశించడానికి. మీరు ఈ పరిమితమైన దానిని, అపరిమితమైన దానితో ఐక్యం చేయాలనుకుంటున్నారు. ఈ పరిమితిని అపరిమితమైన దానిలో లయం చేయాలనుకుంటున్నారు.

శివుని భూతేశ్వర రూపం


మనం కళ్ళతో చూడగలిగే, వినగలిగే, రుచి చూడగలిగే, వాసన చూడగలిగే, ఇంకా స్పర్శించగలిగే ఈ భౌతిక సృష్టి అంతా కూడా - ఈ శరీరం, ఈ గ్రహం, ఈ విశ్వం, ఈ సృష్టి అంతా కూడా, కేవలం పంచభూతాల విన్యాసమే. కేవలం ఐదు పదార్థాలతో ఎంత గొప్ప సృష్టి! వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే ఐదు మూలకాలతో, ఎన్ని సృష్టించబడ్డాయి! ఈ సృష్టి ఇంతకంటే ఎక్కువ కారుణ్యం చూపించలేదేమో. ఒకవేళ ఐదు కోట్ల పదార్థాలంటే మీకు ఏం చేయాలో తెలిసేది కాదు.

పంచ భూతాలు అనబడే ఈ ఐదు మూలకాలపై మీరు ప్రావీణ్యాన్ని పొందితే, ఇక సర్వమూ అదే! - మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, ఈ ప్రపంచంలో మీ శక్తీ, మీకేమి కావాలో అది సృష్టించుకోగలిగే సామర్థ్యం – ఇవన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. తెలిసో, తెలియకో, ఎరుకతోనో, ఎరుక లేకుండానో వ్యక్తులు, వివిధ మూలకాలపై కొంత వరకు నియంత్రణని లేదా ప్రావీణ్యాన్ని సాధిస్తారు. వారికి ఎంతవరకు వీటిమీద నియంత్రణ లేదా ప్రావీణ్యం ఉంది అన్నదాన్ని బట్టి వారి శరీర తత్వం, వారి మానసిక స్వభావం, వారు ఎటువంటి పనులు చేస్తారు, అందులో వారు ఏ మేరకు సఫలత పొందుతారు, వారికి ఎంత దూర దృష్టి ఉంటుంది – ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.“భూతేశ్వరాయ” – అంటే ఈ పంచ భూతాలమీద పట్టు కలిగి ఉన్న వారు, తమ జీవన గతిని, కనీసం భౌతిక పార్శ్వపు గతిని నిర్ణయించగలరు అని అర్థం.

కాలేశ్వర రూపం


కాల అంటే సమయం. మీరు ఈ పంచభూతాల మీద ఎంత నియంత్రణ సాధించినా, మీరు ఈ అనంతమైనదానితో ఒక్కటైనా, లయమవ్వడం మీకు తెలిసినా - మీరిక్కడ ఉన్నంతవరకు కాలం నడుస్తూనే ఉంటుంది. కాలంపై పట్టు సాధించండం అనేది పూర్తిగా మరొక విభిన్నమైన పార్శ్వం. ‘కాల’ అంటే కేవలం సమయం మాత్రమే కాదు. ‘కాల’ అంటే అంధకారం అని కూడా. ‘కాల’ అంటే అంధకారం. కాలం వెలుగు అవ్వలేదు. ఎందుకంటే వెలుగు కాలంలో ప్రయాణం చేస్తుంది. వెలుగు కాలం యొక్క బానిస. మనం వెలుతురు అని దేనినైతే అంటామో దానికి ఒక మొదలు, ఒక అంతం ఉన్నాయి. కానీ కాలం అలాంటిది కాదు. హిందూ జీవన విధానంలో, కాలాన్ని ఆరు భిన్న పార్శ్వాలుగా చూసే అధునాతన అవగాహన ఉంది. మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మీరు ఇక్కడ కుర్చుని ఉండగా, మీ కాలం సాగిపోతూనే ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు – మరణాన్ని గురించి తమిళంలో ఒక మంచి పదం ఉంది -“ కాలం ఆయిటాంగ,” అంటే ‘అతని కాలం అయిపోయింది’ అని అర్థం.

ఇంగ్లీష్ భాషలో కూడా, గతంలో అటువంటి మాట వాడే వాళ్ళం - “He Expired.” అని. ఒక మందు లేదా మరే ఇతర విషయం మాదిరిగానే, ఒక మానవుడు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ తో వస్తాడు. మీరు ఎన్నో చోట్లకి వెళ్తున్నాం అని అనుకోవచ్చు. లేదు, మీ దేహానికి సంబంధించినంతవరకు మీరు నేరుగా శ్మశానం వద్దకే వెళ్తున్నారు. ఒక్క క్షణం కూడా ఆ దిశను మార్చడం లేదు. మీరు ఈ ప్రక్రియను కొద్దిగా నిదానించేలా చేయవచ్చు. కానీ మీరు ఈ దిశని మార్చలేరు. మీకు వయసు మీద పడుతున్నకొద్దీ ఈ భూమి మిమ్మల్ని తనలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోందని మీరు గమనించవచ్చు. జీవం దాని వృత్తాన్ని పూర్తి చేస్తుంది.

కాలం అనేది జీవం తాలూకు ఒక విశేషమైన పార్శ్వం. ఇది మిగతా మూడు పార్శ్వాలలో దేనిలోనూ ఇమడదు. ఈ సృష్టిలో అన్నిటిలోకెల్లా అంతుచిక్కనిది ఇదే. మీరు దానిని కనుగోనలేరు. ఎందుకంటే అది ఉన్నది కాదు. అది మీకు తెలిసిన సృష్టి రూపాలలో ఏ రూపంలోనూ లేదు. అది సృష్టి యొక్క అత్యంత శక్తివంతమైన పార్శ్వం. అది సృష్టినంతా ఒక్కటిగా పట్టి ఉంచే పార్శ్వం. ఇందువల్లే ఆధునిక భౌతిక శాస్త్రానికి, గురుత్వాకర్షణ శక్తి ఎలా పని చేస్తుందో ఏమాత్రం తెలియడం లేదు. ఎందుకంటే గురుత్వాకర్షణ అనేది లేదు. అన్నింటినీ ఒక్కటిగా పట్టి ఉంచుతున్నది కాలమే.

శివ – సర్వేశ్వర – శంభో


శివ అంటే, “ఏదైతే లేదో అది; ఏదైతే లయం అయిపోయిందో అది.” ఏదైతే లేదో, అదే ఈ సృష్టి అంతటికీ కూడా ఆధారం. ఆ ఆధారమే అనంతమైన ‘సర్వేశ్వర’. ‘శంభో’ అనేది ఒక తాళం చెవి లాంటిది. ఒక మార్గం. మీరు మీ శరీరం చీలిముక్కలైపోతుందేమో అనే విధంగా దీనిని ఉచ్చరించగలిగినప్పుడు, అది ఒక మార్గం అవుతుంది. మీరు ఈ అంశాలన్నింటిపై పట్టు సాధించి, అప్పుడు అక్కడికి చేరుకోవాలంటే ఎంతో ఎక్కువ కాలం పడుతుంది. మీరు నేరుగా దోవ చేసుకుని వెళ్ళాలని మాత్రమే అనుకుంటున్నట్లైతే, ఈ పార్శ్వాలపై పట్టు సాధించడం ద్వారా కాకుండా, మెల్లగా లోపలికి దూరడం ద్వారా మీరు ఈ అంశాలను అధిగమించవచ్చు.

నా చిన్నప్పుడు, మైసూరు ‘జూ’లో నాకు స్నేహితులు ఉండేవారు. ప్రతి ఆదివారం ఉదయం, నా రెండు రూపాయల పాకెట్ మనీతో, నేను చేపల మార్కెట్ కి వెళ్లేవాడిని. మార్కెట్లో చాలా లోపల, సగం కుళ్ళిన చేపలు అమ్మేవారు. రెండు రూపాయలకు ఒక్కోసారి నాకు రెండు, మూడు కేజీల చేపలు దొరికేవి. నేను వాటిని ఒక ప్లాస్టిక్ సంచీలో పెట్టుకుని, మైసూర్ జూకి వెళ్ళే వాడిని. నా దగ్గర ఇక వేరే డబ్బులు ఏమీ ఉండేవి కావు. ఆ కాలంలో, మీరు గేటు గుండా నిటారుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లాలంటే, టికెట్ ఖరీదు ఒక రూపాయి. అక్కడ భూమి నుండి రెండు అడుగుల ఎత్తులో ఒక అడ్డకమ్మి కూడా ఉండేది. మీరు దాని కిందగా పాకుతూ వెళ్ళగలిగితే, మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అది నాకేమీ సమస్య కాదు - నేను పాకుతూ వెళ్ళే వాడిని. నేను రోజంతా నా స్నేహితులకు కుళ్ళిపోయిన చేపలు పెడుతూ గడిపేవాడిని.

మీరు నిటారుగా నడవాలంటే, అది చాలా కష్టతరమైనది, ఎంతో శ్రమించాలి. మీరు పాకడానికి సిద్ధంగా ఉంటే, సులువైన దారులు ఉన్నాయి. పాకుతూ పోయేవారు దేనిపైనా ప్రావీణ్యం పొందడం గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కాలం కావాలంటే అంత కాలం బతకండి. మీరు చనిపోయినప్పుడు వెళ్లి సర్వోన్నతిని చేరుకోవచ్చు.

ఒక చిన్న విషయంపై ప్రావీణ్యం సాధించడంలో కుడా, ఒక విధమైన వర్ణించలేని అందం ఉంటుంది. ఉదాహరణకి ఒక బంతిని ఒక చిన్న పిల్లవాడు కూడా తన్నగలడు. కానీ దానిపై ఎవరైనా ప్రావీణ్యం సాదిస్తే, ఉన్నట్టుండి దానిలో ఒక కళాత్మకత ఉట్టిపడుతుంది. సగం ప్రపంచం కూర్చుని మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మీరు ప్రావీణ్యతని పొంది దాన్ని ఆస్వాదించాలంటే, కొంత కృషి చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ప్రాకడానికి సిద్ధపడితే, అది చాలా సులభం - ‘శంభో’.

యోగ సంప్రదాయంలో శివుని రూపాలు

శివుని భోళా శంకరుడి రూపం


శివుడిని ఎల్లప్పుడూ చాలా శక్తివంతమైన జీవిగా, అదే సమయంలో, అంతగా ప్రాపంచిక లౌక్యం లేని వ్యక్తిగా చూస్తారు. కాబట్టి, శివుని ఒక రూపాన్ని భోళా శంకరుడు లేదా భోలేనాథ్ అని పిలుస్తారు, ఎందుకంటే అతను పిల్లవాని వంటివాడు. భోలేనాథ్ అంటే అమాయకమైన లేదా అజ్ఞానియైన అని కూడా వస్తుంది. చాలా మంది తెలివైన వ్యక్తులు చాలా తేలికగా మోసపోవడాన్ని మీరు చూస్తూ ఉంటారు, ఎందుకంటే వారు వారి మేథాశక్తిని చిన్న చిన్న విషయాలకు వాడరు. ప్రపంచంలో ఒక మేథావిపైన, జిత్తులమారితనం ఇంకా నేర్పరి తనంతో ఉన్న చాలా తక్కువ స్థాయి తెలివి సులభంగా గెలవగలదు. అది డబ్బు లేదా సమాజ పరంగా కొంత విలువైనది కావచ్చు, కానీ జీవం దృష్ట్యా దానికి ఏ విలువా లేదు.

మేము మేథాశక్తి అన్నప్పుడు, మేము మాట్లాడుతున్నది కేవలం తెలివిగా ఉండండం గురించి మాత్రమే కాదు. మేము మాట్లాడుతున్నది, జీవితాన్ని తన పూర్తి స్థాయిలో ప్రవహించేలా చేసే ఆ పార్శ్వాన్ని గురించి. శివుడు కూడా అలాంటివాడే. అతను తెలివితక్కువవాడని కాదు, కానీ అతను, మేథాశక్తిని అల్పమైన విధానాలలో ఉపయోగించడం గురించి పట్టించుకోడు.

శివుని నటరాజ రూపం


నృత్య భగవానుడిగా, నటేశ లేదా నటరాజ రూపం అనేది, శివుని ముఖ్యమైన రూపాలలో ఒకటి. ఈ గ్రహం మీద అణువులను పగులగొట్టడం వంటివన్నీ జరిగే భౌతిక ప్రయోగశాల అయిన, స్విట్జర్లాండ్‌లోని CERN ని నేను సందర్శించినప్పుడు, ప్రవేశద్వారం ముందు నటరాజ విగ్రహం ఉండడాన్ని చూశాను, ఎందుకంటే ప్రస్తుతం వారు చేస్తున్నదానికి, మానవ సంస్కృతిలో ఇంతకన్నా దగ్గరగా మరేదీ లేదని వారు గమనించారు.

నటరాజ రూపం, శాశ్వతమైన నిశ్చలత నుండి తనను తాను సృష్టించుకున్న సృష్టి యొక్క, ఉత్సాహాన్నీ ఇంకా నృత్యాన్నీ సూచిస్తుంది. చిదంబర ఆలయంలోని నటరాజు ఒక చక్కని సూచిక, ఎందుకంటే మీరు దేనినైతే చిదంబరం అని పిలుస్తారో, అది ఒక సంపూర్ణ నిశ్చలత. అదే ఈ ఆలయ రూపంలో పొందుపరచబడింది. సాంప్రదాయ కళలు అనేవి, ఈ సంపూర్ణ నిశ్చలతను మనిషిలోకి తీసుకురావడం కోసమే. నిశ్చలత లేకుండా నిజమైన కళ ఉండదు.

అర్ధనారీశ్వర రూపం


సాధారణంగా, శివుడిని అత్యుత్తమ పురుషుడని అంటారు, కాని అర్ధనారీశ్వర రూపంలో, అతనిలో సగ భాగం, పూర్తిగా అభివృద్ధి చెందిన స్త్రీ. ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే, మీలోని అంతర్గత పురుషత్వం ఇంకా స్త్రీత్వం కలిస్తే, మీరు శాశ్వతమైన పారవశ్య స్థితిలో ఉంటారు. మీరు దాన్నే బయట చేయడానికి ప్రయత్నిస్తే, ఎప్పుడూ కూడా అది నిలిచి ఉండదు, అలాగే దానితో పాటూ వచ్చే ఇబ్బందులు, నిరంతరం కొనసాగే నాటకం వంటివి. పురుషత్వం ఇంకా స్త్రీత్వం అంటే మగ ఇంకా ఆడ అని కాదు. ఇవి ఒక విధమైన లక్షణాలు. ప్రాథమికంగా, అది ఇద్దరు వ్యక్తులు కలవాలనుకోవడం కాదు, అది జీవితం యొక్క రెండు పార్శ్వాలు కలవాలనుకోవడం - బాహ్యంలో ఇంకా ఆంతరంగికంగా కూడా. మీరు ఆంతరంగికంగా దాన్ని సాధిస్తే, బాహ్యం 100% మీ ఎంపికని బట్టి జరుగుతుంది. లేదంటే, బాహ్యం ఒక భయంకరమైన నిర్బంధం అవుతుంది.

“మీరు మీ సర్వోన్నత స్థితికి పరిణామం చెందితే, మీరు సగం పురుషుడు, సగం స్త్రీ అవుతారు - ఒక నపుంసకుడిగా కాదు, పూర్తి స్థాయి పురుషుడు ఇంకా పూర్తి స్థాయి స్త్రీగా అవుతారు” అని చూపించడానికి ఇది ఒక ప్రతీక. అప్పుడు మాత్రమే మీరు ఒక పరిపూర్ణమైన మానవుడు అవుతారు.

కాలభైరవ రూపం


శివుడు సమయాన్ని నాశనం చేసేవాడిగా అయినప్పుడు, అది - కాలభైరవుడు అనే అతని ప్రచండమైన రూపం. అన్ని భౌతిక వాస్తవికతలు కాల వ్యవధిలోనే ఉంటాయి. నేను మీ సమయాన్ని నాశనం చేస్తే, అంతా అయిపోతుంది.

శివుడు, భైరవీ యాతనని సృష్టించడానికి తగిన వేషధారణని ధరించి, కాలభైరవ అవతారం ఎత్తుతాడు. “యాతన” అంటే అత్యంత బాధ. మరణ సమయం (ఆ క్షణంలో) ఆసన్నమైనప్పుడు, చాలా జీవిత కాలాలు ఎంతో తీక్షణతతో జరిగిపోతాయి, మీకు కలగవలసిన నొప్పి ఇంకా బాధలు అన్నీ, ఒక్క మైక్రో సెకనులో కలుగుతాయి. ఆ తరువాత, గతం తాలూకూ ఏదీ కూడా మీలో మిగలదు. మీ “సాఫ్ట్‌వేర్” ను రద్దు చేయడం బాధాకరంగానే ఉంటుంది. కానీ ఇది మరణ సమయంలో జరుగుతుంది, కాబట్టి మీకు వేరే ఎంపిక ఉండదు. అతను దాన్ని ఎంత తక్కువ సమయంలో సాధ్యమైతే, అంత తక్కువ సమయంలో చేస్తాడు, బాధ అనేది త్వరగా ముగియాలి. మనం దానిని అత్యంత తీక్షణంగా చేస్తేనే అది జరుగుతుంది. అది కొంచంగా ఉంటే, అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది.

ఆదియోగి


యోగ సంప్రదాయంలో, శివుడిని దేవుడిగా ఆరాధించరు. అతను ఆదియోగి, మొదటి యోగి, ఇంకా ఆది గురువు. ఎవరినుండైతే యోగ శాస్త్రాలు ఉద్భవించాయో, ఆ మొదటి గురువు ఆయన. దక్షిణాయనంలోని మొదటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు, ఆ సమయంలోనే ఆదియోగి ఈ శాస్త్రాలను, తన మొదటి ఏడుగురు శిష్యులైన సప్త-ఋషులకు ప్రసారం చేయడం ప్రారంభించాడు.

ఇది మతాలనేవి పుట్టకముందే జరిగింది. ప్రజలు మానవాళిని విచ్ఛిన్నం చేసి, విభజించే మార్గాలను రూపొందించడానికన్నా ముందే, మానవ చైతన్యాన్ని జాగృతం చేయడానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన సాధనాలు గ్రహించబడ్డాయి ఇంకా ప్రచారం చేయబడ్డాయి. వారికున్న విజ్ఞానం నమ్మశఖ్యం కానిది. ఆ సమయంలో ప్రజలు అంత అధునాతనంగా ఉన్నారా అనే ప్రశ్న అసంబద్ధమైనది, ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట నాగరికత, లేదా ఆలోచనా ప్రక్రియ నుండి వచ్చినది కాదు. ఇది అంతర్గత సాక్షాత్కారం నుండి వచ్చింది. అది నేరుగా ఆదియోగి తనని తాను ప్రసరింపజేసారు. ఈ రోజుకీ కూడా మీరు ఒక్క విషయాన్ని కూడా మార్చలేరు ఎందుకంటే అతను చెప్పగలిగే ప్రతిదాన్ని కూడా అంత అందమైన ఇంకా తెలివైన విధానాల్లో చెప్పాడు. దాన్ని అవగతం చేసుకోవడంలోనే మీరు మీ జీవితకాలం అంతటినీ గడపవచ్చు.

శివుని త్రయంబక రూపం


మూడవ కన్ను ఉన్నందున శివుడిని ఎప్పుడూ త్రయంబక అని పిలుస్తారు. మూడవ కన్ను అంటే నుదిటిలో పగులు రావడం కాదు. దానర్థం ఏంటంటే, అతని అవగాహనా సామర్ధ్యం దాని అత్యుత్తమ సంభావ్యతకి చేరుకుందని. మూడవ కన్ను, దృష్టి కలిగిన కన్ను. ఈ రెండు భౌతిక కళ్ళు, కేవలం ఇంద్రియ అవయవాలు. అవి ఈ మనస్సుకి అన్ని రకాల అర్థంలేని విషయాలను అందజేస్తూ ఉంటాయి, ఎందుకంటే మీరు చూసేది వాస్తవం కాదు. మీరు ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని చూస్తారు, అతని గురించి ఏదో ఆలోచిస్తారు, కానీ మీరు అతనిలో శివుడిని చూడలేరు. కాబట్టి, మరొక కన్ను, లోతుగా చొచ్చుకుపోగల కన్ను, తెరవబడాలి.

ఎంత ఆలోచించినా, ఎన్ని తత్త్వాలు అల్లుకున్నా, అది మీ మనస్సులో స్పష్టతను కలిగించలేదు. మీరు సృష్టించే తార్కిక స్పష్టతను ఎవరైనా వక్రీకరించగలుగుతారు; క్లిష్ట పరిస్థితులు దాన్ని పూర్తిగా గందరగోళంలో పడవేయ గలుగుతాయి. దృష్టి తెరవబడినప్పుడు మాత్రమే, మీకు అంతర్గత దృష్టి ఉన్నప్పుడు మాత్రమే, ఖచ్చితమైన స్పష్టత అనేది ఉంటుంది.

మనం శివుడిగా పిలుస్తున్నది అత్యుత్తమ అవగాహనా సామర్థ్యం యొక్క మూర్తీభవించిన రూపాన్నే తప్ప మరొకదానిని కాదు. ఈ నేపథ్యంలోనే ఈశా యోగా కేంద్రం మహాశివరాత్రిని జరుపుకుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ అవగాహనా సామర్థ్యాన్ని కనీసం ఒక మెట్టు పెంచుకోవడానికి ఇది ఒక అవకాశము ఇంకా సంభావ్యత. శివుడు, ఇంకా యోగా అనేవి దీని గురించే. ఇది ఒక మతం కాదు; ఇది ఆంతరంగిక పరిణామ శాస్త్రం.

    Share

Related Tags

శివ తత్వం

Get latest blogs on Shiva

Related Content

మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలుకువగా ఉంచేందుకు నాలుగు శివుని కథలు