సద్గురు: యోగాలో, మనం మొత్తం సృష్టిని శబ్దాల యొక్క సంక్లిష్ట సముదాయంగా పరిగణిస్తాము. వివిధ పార్శ్వాలను అందుబాటులోకి తీసుకొచ్చే సామర్థ్యం గల కొన్ని శబ్దాలను మనం వాటిలో గుర్తించాము. కొన్ని శబ్దాలను ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో ఉపయోగిస్తారు – సాధారణంగా ఈ కీలక శబ్దాలనే మంత్రాలుగా పిలుస్తారు. మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. జయించడానికి అలాగే కావలసిన వాటిని పొందడానికి మంత్రాలున్నాయి. ఆనందం, ప్రేమను తెచ్చే మంత్రాలున్నాయి. ఇతర పార్శ్వాలను అనుభవంలోకి తీసుకురాగల మంత్రాలు కూడా ఉన్నాయి.
మంత్రాన్ని సరైన ఎరుకతో ఉచ్చరించడం అనేది ప్రపంచంలోని అనేక ఆధ్యాత్మిక మార్గాలలో ప్రాథమిక సాధనగా ఉంటోంది. చాలామంది వ్యక్తులు మంత్రాన్ని ఉపయోగించకుండా తమలో ఉన్న శక్తిని సరైన స్థాయికి పెంచుకోలేరు. తొంభై శాతం మందికి పైగా వ్యక్తులకు, తమని తాము ఉత్తేజపరచుకోవడానికి మంత్రం అవసరమని నేను గుర్తించాను. అది లేకుండా, వారు కుదురుగా ఉండలేరు.
యోగ సంప్రదాయంలో మహామంత్రంగా భావించబడే ప్రాథమిక మంత్రం "ఆమ్ నమః శివాయ."
“ఆమ్” అనే శబ్దాన్ని “ఓం” అని ఉచ్చరించకూడదు. మీ నోరు తెరిచి "ఆ..." గా ఉచ్చరించాలి, నెమ్మదిగా నోరు మూస్తున్నప్పుడు "ఊ..." అవుతుంది, చివరకు "మ్..." అవుతుంది. ఇది సహజంగా జరిగేది, మీరు చేసేది కాదు. మీరు నోరు తెరిచి శ్వాస వదులుతున్నప్పుడు, అది "ఆ..." అవుతుంది. మీరు నెమ్మదిగా నోరు మూస్తున్నప్పుడు, ఇది "ఊ..." గా, అలాగే మూసినప్పుడు, అది "మ్..." అవుతుంది. “ఆ..”, “ఊ..”, ఇంకా “మ్..” అనేవి సృష్టి యొక్క ప్రాథమిక శబ్దాలు. మీరు ఈ 3 శబ్దాలను కలిపి ఉచ్చరిస్తే, “ఆమ్” వస్తుంది. " ఆమ్" అనేది అత్యంత ప్రాథమిక మంత్రం. కాబట్టి, మహామంత్రాన్ని "ఓం నమః శివాయ" అని ఉచ్చరించకూడదు - దాన్ని "ఆమ్ నమః శివాయ" అని ఉచ్చరించాలి.
మంత్రం అనేది కర్మ బంధనాలను తొలగించి, తద్వారా మీ గ్రహణశక్తిని పెంపొందించి, మీరు సృష్టిలోని ఉన్నతమైన పార్శ్వాలకు అందుబాటులో ఉండేలా రూపొందించబడింది.
ఇది లయకారుడైన శివుని మంత్రం. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు, కానీ మీకూ, జీవితంలోని గొప్ప సంభావ్యతలకు మధ్య ఉన్న అడ్డంకులను నాశనం చేస్తాడు.
"న-మ-శి-వా-య" అనేవి పంచాక్షరాలుగా పిలువబడతాయి.ఈ మంత్రం కేవలం ఐదు అక్షరాల అద్భుతమైన కూర్పు, ఇది అద్భుతమైన ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. కాల చరిత్రలో, బహుశా గరిష్ట సంఖ్యలో ప్రజలు ఈ ఐదు అక్షరాల ద్వారా తమ అత్యున్నత సామర్థ్యాన్ని తెలుసుకున్నారు.
పంచాక్షరాలు మానవ వ్యవస్థలోని ఐదు ప్రధాన కేంద్రాలకు అనుగుణంగా ఉంటాయి మరియు వాటిని ఉత్తేజితం చేయడానికి ఒక మార్గం. మనం ఈ మంత్రాన్ని శుద్దీకరణ ప్రక్రియగానూ, అదే సమయంలో మనం పొందే అన్ని ధ్యానస్థితులకు పునాదిగానూ ఉపయోగించవచ్చు. లేకపోతే, చాలామంది వ్యక్తులు మంత్రాలతో ప్రకంపనలను సృష్టించకుండా వారి ధ్యానస్థితిని నిలుపుకోలేరు. మీ మానసిక ధోరణులు మరియు మీ శారీరక శక్తులు ఒక నిర్దిష్ట స్థాయికి మించి క్షీణించకుండా నిరోధించడానికి అవసరమైన మౌలిక ప్రకంపనాలను మీ జీవితంలోకి తీసుకురావడానికి మంత్రం చాలా ముఖ్యమైన ఒక సాధన.
ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తాయి. "న" భూమిని, "మ" నీటిని, "శి" అగ్నిని, "వ" గాలిని, "య" ఆకాశాన్ని సూచిస్తాయి. మీరు పంచాక్షరాలపై పట్టు సాధిస్తే, అవి మీ ఎరుకలో పంచభూతాల చేత ఏర్పడిన ప్రతిదాన్ని విలీనం చేయగలవు.
శివునిలోని అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, అతను భూతేశ్వరుడు - పంచభూతాలపై పట్టు ఉన్నవాడు. సృష్టి అంతా ఈ పంచభూతాల ఆట మాత్రమే. కేవలం ఐదు మూలకాలతో ఇంత గొప్ప సృష్టి! మీకు ఈ పంచభూతాల మీద కొంచెం పట్టు ఉంటే చాలు, అప్పుడు జీవన్మరణాలపై, మరియు మీ చుట్టూ ఉన్న ప్రతిదానిపై మీకు పట్టు ఉన్నట్టే, ఎందుకంటే ప్రతిదీ ఈ పంచభూతాలతో సృష్టించబడింది. యోగాలో అత్యంత ప్రాథమిక సాధన భూత శుద్ధి, లేదా మీ శరీర వ్యవస్థలోని పంచభూతాలను శుద్ధి చేయడం మరియు వాటిని ఆధీనంలోకి తెచ్చుకోవడం.
ఈ పంచభూతాలపై మీరు పట్టు సాధిస్తే, మీరు మీ భౌతికత మీద పట్టు సాధించినట్టే, ఎందుకంటే మీ భౌతికత మొత్తం ఈ ఐదు పదార్థాల ఆటే. ఈ పంచభూతాలు మీరిచ్చే సూచనలకు అనుగుణంగా ప్రవరిస్తే, ఆరోగ్యం, శ్రేయస్సు, విజయం మరియు జీవితంపై పట్టు సహజంగానే చేకూరతాయి.