logo
logo

కేదార్‍నాథ్ జ్యోతిర్లింగ ఆలయానికి శివునితో గల శక్తివంతమైన అనుబంధం

Discover Kedarnath Jyotirlinga Temple's spiritual significance and its connection with Shiva, as Sadhguru explores little known aspects of this ancient, powerful temple.
విషయ సూచిక

కేదార్‍నాథ్ జ్యోతిర్లింగం మరియు శివునితో గల  సంబంధం

సద్గురు: కేదార్‍నాథ్ ఒక బ్రహ్మాండమైన ప్రదేశం. ఇక్కడ “శివ” అనే శబ్దాన్ని ఉచ్చరించడం సరికొత్త పార్శ్వాన్ని అలాగే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఈ శబ్దం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన ప్రదేశం. ”మనం "శివ" అనే పదాన్ని ఉచ్ఛరించినప్పుడు, అది సృష్టించబడని దాని యొక్క స్వేచ్ఛ, సృష్టించబడని వ్యక్తి యొక్క విముక్తి. ఇలా అనడం సరి కాదేమో గాని, ఈ భూమ్మీద  “శివ” అనే శబ్దం కేదార్‍నాథ్ నుండే ఉద్భవించినట్లు అనిపిస్తుంది. ఎన్నో వేల ఏళ్ల పాటు, ప్రజలు ఈ ప్రదేశాన్ని ఆ శబ్దం యొక్క ప్రతిధ్వనిగా అనుభూతి చెందారు. 

మనం “శివ” అన్నప్పుడు, అది ఏదో ఇంకొక విగ్రహాన్ని లేదా దేవుణ్ని మరింత ఐశ్వర్యం కోసమో లేదా సౌకర్యాల కోసం అడగటానికి సృష్టించినది  కాదు. “శివ” అంటే, “ఏదైతే కానిదో అది” అని. ఇవాళ, ఆధునిక శాస్త్రం కూడా ఈ సృష్టి అంతా శూన్యం లోంచి వచ్చి, మళ్ళీ  శూన్యంలోకే వెళ్తుందని నిరూపిస్తోంది. ఈ సృష్టి యొక్క మూలం మరియు ఈ విశ్వం యొక్క ప్రాథమిక గుణం అనంతమైన శూన్యమే. ఈ నక్షత్ర మండలాలన్నీ చాలా చాలా చిన్నవి - ఒక చిలకరింపు అంతే . మిగిలినదంతా అనంత శూన్యం. దానినే  ‘శివ’ అని అంటారు.

కేదార్‍నాథ్ జ్యోతిర్లింగం, పంచ కేదార్ స్థల పురాణం

పురాణాల ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు తమ సొంత అన్నదమ్ములను, బంధువులను చంపాల్సి వచ్చినందుకు కలత చెంది ఉన్నారు. దీనినే గోత్రవధ అని అంటారు. వారెంతో అపరాధభావంతో కుంగిపోయారు, తమని తాము విముక్తుల్ని చేసుకునేందుకు వాళ్ళు మార్గం వెతకసాగారు, అందుకని వాళ్ళు శివుని కోసం బయలుదేరారు.

శివుడు, వాళ్ళు పాల్పడిన ఈ భయంకరమైన చర్య నుంచి వారికి అంత సులువుగా విముక్తిని కల్పించదలచుకోలేదు. అందుకు ఆయన ఒక ఎద్దుగా మారి అక్కడ నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆయన్ను అనుసరించి, పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు శివుడు భూమిలోకి దూరి, పైకి వచ్చేసరికి ఒక్కొక్క భాగం, ఒక్కొక్క చోట పైకి వచ్చింది. ఎద్దు మూపురం కేదార్‍నాథ్‍గా, ముందరి రెండు కాళ్ళు కేదార్ వెళ్ళే దారిలో వచ్చే తుంగనాథ్‍గా , నాభి భాగం భారతదేశపు హిమాలయాల్లోని మధ్య- మహేశ్వరుడు అనే శక్తివంతమైన మణిపూరక లింగంగా, జటాజూటం కల్పనాధునిగా , ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో అవతరించాయి.  

ఈ వివరణ అంతా మన శరీరంలో ఏడు చక్రాలకి సంబంధించింది. ఈ ఆలయాలన్నీ మానవ శరీరంలా అమర్చబడ్డాయి. ఇది ఒక భారీ శరీరాన్ని  సృష్టించేందుకు చేసిన ఒక గొప్ప ప్రయోగం. అలాంటిది ఒకటి భారతదేశపు  హిమాలయ ప్రాంతంలో జరిగింది. ఇంకొకటి పశ్చిమ దిశగా పయనించి, నేపాల్ ప్రాంతం మొత్తాన్ని అలాంటి శరీరంగా మార్చే ప్రయత్నం చేసారు.

కేదార్‍నాథ్ జ్యోతిర్లింగం - తన్మయంలో ముంచే శక్తుల మిశ్రమం

కేదార్‍నాథ్ చాలా తన్మయంలో ముంచే శక్తుల మిశ్రమం. ఇది వేలాది యోగులు ఇంకా  అన్ని రకాల మార్మికుల నిలయం. నేను అన్ని రకాలని అన్నప్పుడు, మీరు అలాంటి వారిని ఊహించనేలేరు. వీళ్లు ఎవరికీ ఏమీ నేర్పించడానికి ప్రయత్నించని వ్యక్తులు. ప్రపంచానికి తమను తాము  ఎలా అర్పించుకుంటారంటే - తమ శక్తులు, తమ మార్గం, తమ పని - అన్నింటినీ ఈ ప్రదేశంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో వదిలేస్తారు. 

మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు, ఒక నిర్దిష్టమైన ప్రవర్తన, బట్టలు లేదా మాటలతో కూడిన ఒక నిర్దిష్టమైన చట్రంలో వాళ్ళు ఉంటారని ఊహించుకుంటారు. కానీ ఇది కేవలం అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులతో నిండిన నేల కాదు. మీ అవగాహన విధానాలకు సరిపోయే వాళ్లూ ఉన్నారు. కానీ పూర్తిగా మొరటుగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారిని మీరు ఎప్పటికీ ఆధ్యాత్మికులుగా గుర్తించలేరు. అయితే వీళ్ళు సృష్టిలోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి ఉంటారు. మనం "యోగి" అని అన్నప్పుడు, ఒక నిర్దిష్టమైన ప్రవర్తన లేదా నైతికత కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పట్లేదు. ఒక యోగి జీవితంతో పూర్తిగా అనుసంధానంలో ఉంటాడు. ఎంత అనుసంధానంతో ఉంటాడంటే, అతను తన జీవాన్ని విచ్ఛిన్నం చేసి, తిరిగి మళ్ళీ యధాస్థితిలో పెట్టగలడు. ప్రాథమిక జీవం మీరే, మీరు దాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి, తిరిగి మళ్ళీ యధాస్థితిలో పెట్టగలిగితేనే, మీరొక యోగి అవుతారు. అలాంటి అద్భుతమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు.

కేదార్‍నాథ్ తీర్థయాత్ర

ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం పరితపించే వ్యక్తికి, కేదార్‍నాథ్ అనేది ఊహకి అందనంత గొప్ప వరం. దాన్ని వివరించడం చాలా కష్టం. చెప్పాలంటే, అది ఒక రాయి మాత్రమే. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది జ్ఞానులు ఇక్కడ నివసించి వారి శక్తితో దీన్ని ఇలాంటి ప్రదేశంగా మార్చారన్నదే  విశేషం. ఇక్కడ ఎంతోమంది యోగులు తమ శరీరాన్ని విడిచిపెట్టారు. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు అనుభూతి చెందాలి. భారతదేశంలో పుట్టినందుకు, వార్ధక్యం రాకముందే శరీరం సహకరిస్తునప్పుడే, మీరు కనీసం ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్ళాలి. 

కేదార్‍నాథ్ జ్యోతిర్లింగ మందిరం మరియు ఆది శంకరాచార్యులు

ఆది శంకరులు గొప్ప హేతువాది, భాషాశాస్త్ర మేధావి. ఆయన జీవించిన అతి తక్కువ కాలంలోనే, ఆయన దేశమంతటా కాలిబాటన తిరిగారు. శంకరులు కలడి అనే గ్రామంలో జన్మించారు, కలడి అంటే ‘పాదాల కింద’ అని అర్ధం. దక్షిణ భారతదేశంలో, మనం భారత మాత పాదాల చెంత ఉన్నాం. భారత్‍లో మనం ఎప్పటినుంచో, దైవం పాదాల చెంత ఎలా ఉండాలో నేర్చుకున్నాం. దేవుని పాదాల చెంత ఉండడం వల్ల మనం పరిణితి చెంది వికసించగలిగాం. మనది ఆడంబరాలకు పోయే సంస్కృతి కాదు. ఇది సహజ స్వభావంగా దైవభక్తి కలిగిన సంస్కృతి.

“అంతా మిథ్య” అన్నారు ఆది శంకరులు. మిథ్య అంటే మాయ అని, ఉన్నది ఉన్నట్టుగా చూడకపోవడం. ఇక్కడ మీరు ఒక దృఢమైన శరీరంగా ఉన్నాగానీ, రోజూ మీరు తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి వల్ల శరీరంలోని ప్రతీ కణం మార్పు చెందుతూనే ఉంది. అంటే కొంత కాలానికి మీకొక  కొత్త శరీరం వచ్చేస్తోంది. కానీ మీ అనుభూతి దృష్ట్యా, అది మునపటి శరీరంలాగే అనిపిస్తుంది- అదే మాయ. అదే విధంగా, మీరు పంచేంద్రియాల ద్వారా గ్రహించేది కూడా, పూర్తిగా వాస్తవానికి భిన్నమైనదే- అదే మాయ. ఇదే ఆది శంకరులు చెప్పినది.

కాశీలో ఒకనాడు, శంకరులు తెల్లవారుజామునే స్నానం చేసి, గుడిలోకి వెళ్తుండగా ఒక చెండాలుడు అడ్డు రావడం గురించి  ఒక కథ ఉంది. చెండాలులు అనేది ఒక కులం, వారు స్మశానవాటికల నిర్వహణ చేసేవారు.  వారిని  అతి  నీచ కులానికి చెందిన వారిగా , ఎదురొస్తే అశుభంగా చూసేవారు. వారిని చూస్తే మృత్యువు వస్తుందని ఒక మూఢనమ్మకం. ఎవ్వరూ వారితో కలవకుండా, వాళ్ళను దూరం పెట్టేవారు.

ఆ చెండాలుడు ఎదురు రాగానే, శంకరులు “జరుగు”, అన్నారు. దానికి అతను అక్కడే నిలబడి, “ఎవరు జరగాలి, నేనా లేక నా శరీరమా ”, అని అడిగాడు. ఆ మాట శంకరులకి సూటిగా తగిలింది. అప్పటిదాకా, తను అందరికీ “ఈ శరీరం మీరు కాదు, ఇదంతా మాయ” అని చెప్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఇతను ఆ ప్రశ్న వేయగానే, అది అతన్ని కట్టిపడేసింది. అంతే, ఆ తర్వాత అతను ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏ బోధనలు చేయలేదు. అక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళి పోయారు. ఇప్పటికీ కేదార్‍నాథ్‍లో ఒక గోడకి పాలరాతితో చెక్కబడిన ఆయన చెయ్యి మరియు దండం, ఒక స్మారక చిహ్నంగా ఉంది. ఇదే ఆయన చివరిసారి కనపడిన ప్రదేశం. శంకరులు అక్కడ నుంచి పైకి వెళ్ళి శివునిలో విలీనం అయిపోయారని అంటారు.

ఇది మన దేశ సంస్కృతి యొక్క ప్రాథమిక లక్షణం - మనం ఇంకొకరిని పక్కకి తోసి పైకి ఎదగము. తల వంచి నమస్కరించి, పైకి ఎదుగుతాము. అది దేవుడైనా, మగవారైనా, ఆడవారైనా, చిన్నపిల్లాడైనా, జంతువైనా, చెట్టు అయినా, రాయి అయినా, ఇలా ప్రతిదానికీ వంగి నమస్కరించడం మనం నేర్చుకున్నాం. ఇదే మన బలం, ఇదే మన మార్గం, ఇదే మన విధానం మరియు ఇదే మన పరిణితికి అలాగే ముక్తికి మార్గం.

బద్రీనాథ్ నుంచి కేదార్‍నాథ్‍కు శివుడు వెళ్లిపోవడానికి గల కారణం

బద్రీనాథ్ హిమాలయాల్లో 13700 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. బద్రీనాథ్ గురించి ఒక పురాణ కథనం ఉంది. ఇక్కడే శివుడు ఇంకా  పార్వతి ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ కలిసి విహారానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి గుమ్మం దగ్గర ఏడుస్తున్న చంటి బిడ్డ కనిపించింది. అది చూసి పార్వతీ దేవిలోని తల్లి మనసు బాధపడి, ఆ బిడ్డను ఎత్తుకోబోయింది. శివుడు ఆమెను ఆపి “ఆ బిడ్డను ముట్టుకోవద్దు” అన్నాడు. దానికి పార్వతి “ ఎంత క్రూరత్వం. అలా ఎలా అంటారు?” అంది.

అందుకు శివుడు, ”ఇది సరైన  బిడ్డ కాదు. తనంతట తాను ఎలా గుమ్మం దగ్గరకు వచ్చింది? చుట్టుపక్కల ఎవరూ లేరు, మంచులో ఎక్కడా తల్లిదండ్రుల అడుగుజాడలే లేవు. ఇది బిడ్డ కాదు” అన్నాడు. కానీ పార్వతి, “అదంతా నాకు తెలియదు, నాలోని తల్లి అలా బిడ్డను వదిలెయ్యలేదు” అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు ఆమె ఒడిలో హాయిగా సేదతీరుతూ, శివుని వంక ఉల్లాసంగా చూస్తున్నాడు. దాని పరిణామం ఏమిటో తెలిసినా, శివుడు “సరే, ఏం జరుగుతుందో చూద్దాం” అని ఊరుకున్నాడు. 

పార్వతి ఆ పిల్లవాడి కడుపు నింపి, ఇంట్లో పడుకోబెట్టి, శివునితో కలిసి స్నానానికి దగ్గరలోని వేడి నీటి సరస్సుకి వెళ్ళింది. వారు తిరిగి వచ్చేసరికి, తలుపులు లోపలి నుండి గడియ పెట్టేసి ఉన్నాయి. “తలుపులు ఎవరు మూశారు”, అని పార్వతి ఆశ్చర్యపోయింది. దానికి శివుడు, ”ఆ బిడ్డను తీసుకురావద్దని నేను చెప్పాను. వాడు ఇప్పుడు తలుపులు మూసేశాడు”, అన్నాడు.

పార్వతి, “ ఇప్పుడు ఏం చేద్దాం” అంది. 

శివుడికి రెండే మార్గాలే కనిపించాయి. ఒకటి, ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చెయ్యడం లేదా ఇంకొక  ప్రదేశానికి వెళ్ళిపోవడం. “ఇది నీకు ఎంతో ఇష్టమైన బిడ్డ. కాబట్టి దాని మీద చెయ్యి వేయను. మనం వేరే చోటికి వెళ్లి పోదాం పద” అన్నాడు శివుడు.

అలా శివపార్వతులు తమ ఇంటిని కోల్పోయి, అక్రమంగా సంచరిస్తున్న పరాయివారిగా తిరుగుతూ ఉన్నారు. సరైన ప్రదేశం కోసం తిరుగుతూ, ఆఖరికి కేదార్‍నాథ్‍లో స్థిరపడ్డారు. ఇలా జరుగుతుందని ఆయనకు తెలియదా అని  మీరు అడగవచ్చు. ఆయనకు అన్నీ తెలిసినా, జరగాల్సింది జరగనిచ్చారు.

శివుడు ఎంత మహిమాన్వితుడైనా, లౌకిక  విషయాల్లో అమాయకుడు, ఒక చిన్న పిల్లాడిలా. అందుకే ఆయనను భోలేనాథుడిగా కూడా పిలుస్తారు. అంటే తెలివితక్కువవాడని కాదు, అల్పమైన విషయాల్లో ఆయన తన మేధస్సును  ఉపయోగించడానికి ఆసక్తి చూపరు అని.

తెలివితక్కువ వాళ్ళే ఇంకొకరి కన్నా బావుండాలని నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. మేధస్సు, బ్రతకనేర్చిన తెలివి  రెండు వేరు వేరు విషయాలు. తెలివి అనేది ఇంకొకరితో పోల్చి మాత్రమే చెప్పగలం. కానీ మేధస్సు కలిగి ఉండడం అనేది సహజ స్వభావం, ఇంకొకరితో పోల్చలేనిది, అది ఎవరితోనూ పోటీ కాదు. అది ఒక జీవితం యొక్క అభివ్యక్తీకరణ.

కేదార్‍నాథ్ జ్యోతిర్లింగం, కాంతి సరోవరం - అనుగ్రహపు సరస్సు

పురాణాల ప్రకారం శివపార్వతులు కాంతిసరోవరం తీరప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. కేదార్‍లో ఉండే ఎంతోమంది యోగులను కలుస్తూ ఉండేవారు. 2013లో వచ్చిన వరదల కారణంగా, కాంతిసరోవరం సరస్సు పొంగిపొరలి కేదార్‍కు చేరుకుంది. ఇప్పుడు దాన్ని గాంధీ సరోవరం అంటున్నారు. కానీ అది కాంతిసరోవరం. కాంతి అంటే అనుగ్రహం, సరోవరం అంటే సరస్సు. అది ఒక అనుగ్రహపు సరస్సు. యోగ సంప్రదాయంలో శివుడ్ని ఒక దేవుడిలా చూడరు. ఆయన కూడా ఈ భూమ్మీద నడయాడిన వ్యక్తే, ఆయనే యోగ సాంప్రదాయాలకు ఆద్యుడు. ఆయన ఆదియోగి అలాగే ఆది గురువు. అంటే మొదటి యోగి, మొదటి గురువు అని. మొదటిసారిగా యోగశాస్త్రాల ప్రసరణ, కాంతిసరోవరం తీరంలోనే  జరిగింది. ఇక్కడే ఆదియోగి, ఇవాళ సప్తరుషులుగా కొనియాడబడుతున్న తన మొదటి ఏడుగురు శిష్యులకి ఆంతరంగిక సాంకేతిక జ్ఞానాన్ని ఒక క్రమపద్ధతిలో వివరించడం మొదలుపెట్టారు.  

చాలా ఏళ్ల క్రితం, నేను ప్రతి సంవత్సరం నెల లేదా రెండు నెలల పాటు  హిమాలయాలకు ఒక్కడినే వెళ్ళిపోయేవాడిని. అప్పట్లో లోకల్ బస్సులో వెళ్ళిపోయేవాడిని. ఆ పర్వతాలను మిస్ అవ్వకూడదని బస్సు పైకి ఎక్కి కూర్చునేవాడిని. అవి క్రేజీ బస్సులు!  అవి పొద్దున్నే 4 లేదా 4:30 కి హరిద్వార్ నుంచి బయలుదేరి డైరెక్ట్‌గా  గౌరికుండ్ లేదా బద్రీనాథ్‍లో ఆగేవి. మనుషులను ఎక్కించుకోవడానికి, దించడానికి తప్ప ఎక్కడా అవి ఆగేవి కావు- ఆఖరికి తినడానికి కూడా ఆపేవారు కాదు. వాటిని భూక్ హర్తాల్ బస్సులు , అంటే “నిరాహార దీక్ష” బస్సులు అని పిలిచేవారు. మనం ఆకలితో మండిపోతూ ఉంటే,  డ్రైవర్ మాత్రం చపాతీలు చుట్టుకుని  తింటూ నడిపేవాడు.

నేను గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ కేదార్‍కి వెళ్ళినప్పుడు, కాంతిసరోవరం గురించి విన్నాను. ఒకరోజు మధ్యాహ్నం 2 లేదా 2:30 కి బయలుదేరి, దాదాపు గంటలో చేరుకున్నాను. అక్కడ ఆ సరస్సు, దాని చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. ప్రకృతి పరంగా, అది అద్బుతంగా ఉండింది- నిశ్చలమైన నీరు అలాగే ఎలాంటి మొక్కలు లేని ఈ పెద్ద సరస్సులో, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల ప్రతిబింబం వలన. అదొక అపురూపమైన ప్రదేశం.

అక్కడ అలానే కూర్చుండిపోయాను. ఆ పవిత్రత, నిశ్శబ్దం మరియు స్వచ్ఛత నా అంతఃచైతన్యంలోకి చొచ్చుకుపోయాయి. ఆ అధిరోహణ, ఆ ఎత్తు, మరియు ఆ ప్రదేశంలోని అందమైన ప్రశాంతత  ఊపిరాడకుండా చేశాయి. నేను ఆ నిశ్చలతలో ఒక చిన్న రాతి మీద కళ్ళు తెరుచుకుని చుట్టూ ఉన్న ప్రతీ రూపాన్ని నాలో గ్రహించుకుంటూ కూర్చుండిపోయాను. ఆ పరిసరాలు నెమ్మదిగా రూపాన్ని కోల్పోయి, కేవలం నాదం (శబ్దం)తో ప్రతిధ్వనిస్తున్నాయి . ఆ పర్వతం, సరస్సు, పరిసరాలు, ఆఖరికి నా శరీరం కూడా వాటి రూపాన్ని కోల్పోయాయి. అంతా ఒక శబ్దం మాత్రమే. నాలో నుండి  ఒక  పాట ఉద్భవించింది: “ నాద బ్రహ్మ విశ్వ స్వరూప “

నాద బ్రహ్మ విశ్వస్వరూప 

నాద హి సకల జీవరూప 

నాద హి కర్మ నాద హి ధర్మ 

నాద హి బంధన నాద హి ముక్తి 

నాద హి శంకర నాద హి శక్తి 

నాదం నాదం సర్వం నాదం

నాదం నాదం నాదం నాదం

నేను ఎప్పుడూ సంస్కృత భాష నేర్చుకోవడానికి దూరంగా ఉండేవాడిని. నాకు ఆ భాష ఇష్టమే అయినా, దాని లోతు తెలిసినా కూడా, దానిని నేర్చుకోవడానికి దూరంగా ఉండేవాడిని. దానికి కారణం, సంస్కృతం నేర్చుకున్న మరుక్షణం, తప్పనిసరిగా గ్రంధాలు చదివి తీరుతాము. నా అంతర దృష్టి నన్ను ఏ క్షణం కుడా విఫలం చేయలేదు. అందుకే గ్రంధాలతో, సంప్రదాయాలతో నన్ను నేను అస్తవ్యస్తం చేసుకోదలుచుకోలేదు. అందుకే సంస్కృతాన్ని దూరం పెట్టాను.

నేను అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, నా నోరు మూసుకొనే ఉంది, నా కళ్ళు తెరిచే ఉన్నాయి. అప్పుడు ఈ పాట చాలా బిగ్గరగా నా గొంతులోనే వినిపించింది. పాడుతున్నది నా గొంతు, అది కుడా సంస్కృతంలో.  చాలా స్పష్టంగా, బిగ్గరగా వినపడుతోంది. ఎంత బిగ్గరగా అంటే ఆ పర్వతం అంతా పాడుతున్నట్టు అనిపిస్తోంది. నా అనుభవంలో ప్రతీదీ శబ్దంగా మారిపోయింది. అప్పుడే ఈ పాట నా అనుభూతిలోకి వచ్చింది. నేను దాన్ని సృష్టించలేదు, రాయలేదు - అది నాలోకి దిగి వచ్చింది. ఆ పాటంతా సంన్సృతంలో ప్రవహిస్తోంది. ఆ అనుభవం అనిర్వచనీయం.

నెమ్మదిగా, కొంతసేపటికి అన్నీ యధాస్థితికి  వచ్చాయి. నా చైతన్యం పడిపోవడం - నాదం నుండి రూపానికి పడిపోవడం, ఇదంతా చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి.

నాద బ్రహ్మ అంటే ఈ ప్రపంచాన్ని ఒక రూపంలా కాకుండా శబ్దంలా అనుభూతి చెందడం. ఆధునిక విజ్ఞానం కూడా ప్రతీ శబ్దానికి ఒక రూపం, ప్రతీ రూపానికి ఒక శబ్దం జోడించబడి ఉంటాయని చెప్తోంది. ఇది ఒక శాస్త్రీయ వాస్తవికత. ఇంకా ఇప్పుడు శాస్త్రపరంగా పదార్థం అనేది లేదని మనకి తెలుసు. ఎక్కడైతే ప్రకంపనం ఉంటుందో, అక్కడ శబ్దం ఉంటుంది. అందుకే యోగ పరిభాషలో, ఈ సృష్టి అంతా ఒక శబ్దమని అంటాము.

ఆ పాటకి మిమ్మల్ని మీరు అర్పించుకుంటే- దానికి ఒక విధమైన శక్తి ఉంది. నిజంగా మిమ్మల్ని మీరు దానికి అర్పించుకుంటే, దానికి ఒక వ్యక్తిని విలీనం చేసే శక్తి ఉంది.

    Share

Related Tags

శివ తత్వంశివుని కథలు

Get latest blogs on Shiva

Related Content

శివుడిని "భోళా శంకరుడు" అని ఎందుకంటారు?